శర్మ కాలక్షేపంకబుర్లు-బ్రహ్మచారి శతమర్కటః

coutesy you tube ………     వట పత్ర శాయికి…

బ్రహ్మచారి శతమర్కటః

ఈ మాట ఎందుకన్నారో తెలియదు కాని దీని మీద నా చిన్నప్పటి అల్లరి జ్ఞాపకం వచ్చింది. మొన్న నా బ్లాగులో చాతకంగారు కామెంటు రాస్తూ బ్రహ్మచారి= ౧౦౦౦ మర్కటః అన్నారు. కాదండి బాబు శత మర్కటమే అంటారు, సహస్రం కాదు, సున్నయే కదా అని మరొకటి తగిలిచినట్లున్నారన్నా.

నిజంగానే బ్రహ్మచారిగా ఉన్నపుడు బుద్ధి మగ ఆడపిల్లలకి, మర్కట బుద్ధికి పోలిక ఉంటుందనుకుంటా, గుంపుగా ఉన్నపుడు. ఒక్కళ్ళూ ఉంటే చాలా బుద్ధిగా ఉంటారు. కారణం, తప్పు వాళ్ళది కాదండీ! నిజం వయసుది. బాగా చిన్నప్పటి అల్లరి గుర్తులేదు కాని, కొద్ది వయసు అనగా ఎనిమిది సంవత్సరాల వయసునుంచి అల్లరి బాగా గుర్తు. ఈ రోజులలో అన్నీ కొత్తగా, వింతగా కనపడేవి, వయసొస్తూ ఉందికదా. మా పక్కింటిలో జామ చెట్టు, కరివేప చెట్లు ఉండేవి. జామ కాయలు, పచ్చి కటిక కాయలు కోసి తినేవాళ్ళం. ఇక్కడితో అల్లరి ప్రారంభం. అప్పుడు దొడ్లలో మొక్కలుండేవి. కరివేప, జామ చెట్లు ఎక్కువగా ఉండేవి. అమ్మ “పక్కింటి అత్తయ్యగారింటికెళ్ళి కరివేపాకు పట్టుకురా” అనడం పాపం, పరుగెట్టుకెళ్ళి, “అమ్మ కరివేపాకు కావాలంద”ంటే “కోసుకో”మనేవారు. దొడ్డిలోకి పోయిన తరవాత మనిష్టం. కరివేపాకు కోసేసి, ఆ తరవాత జామ చెట్టు ఎక్కేసి కాయలు కోసేసి, లాగూ జేబులో పెట్టేసుకుని వస్తూ వుంటే పట్టేసుకుని, తిట్టేవారు. “వెధవల్లారా, కటిక కాయలు కోసి పాడు చేస్తున్నారు,”అని. మానేవాళ్ళం కాదు, పాపం వాళ్ళు తిట్టడం మానేవారు కాదు. హైస్కూల్ లో ఉన్నపుడు ఒక్కళ్ళం ఉంటే అల్లరి తక్కువ కాని నలుగురు చేరితే బలే అల్లరి చేసేవాళ్ళం. మాది ఎనిమిది మంది బేచి. మా అన్నదమ్ములు నలుగురం, పెదనాన్నగారి అబ్బాయిలతో కలిపి, ఇద్దరు ఇంగువవారి అబ్బాయిలు, ఇద్దరు శింహాద్రి వారి పిల్లలు. ఊళ్ళొ పెద్ద బేచ్ మాదే. వీళ్ళందరిలోకీ నేనే చిన్న వాణ్ణి,బలహీనుణ్ణీ కూడా. ఊరి దగ్గరలో నాలుగు కిలోమీటర్లలో కొండ ఉండేది. అది ఎక్కి దిగివస్తూ, వాక్కాయలు కోసుకొచ్చేవాళ్ళం,మొదటి సారి కొండ మీదకి వెళ్ళినపుడు ఉదయం పోయి సాయంత్రం వచ్చాము, రాగానే ఇంటి దగ్గర ధూపదీపాలిచ్చేశారు. ఊరు ఊరంతా గగ్గోలయిపోయిందిట, పిల్లలు కనపడటం లేదని. వాక్కాయలు తెస్తే ఇంట్లో తిట్టిపోసేవారు, “దగ్గులొస్తాయి,వెధవల్లారా, అవి తింటే” అనేవారు. అప్పటికే పూర్తిగా తిని, మిగిలినవి ఇంటికి తెచ్చేవాళ్ళం. వద్దంటూనే వాక్కాయ పప్పు, పచ్చడి చేసేవారు, బాగుండేది. అలాగే ఆకాకరకాయలు, నల్లేరు తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆకాకరకాయలు కె.జి వందపెట్టి కొనుక్కుంటున్నామనుకోండి. అక్కడే కొండ మీద బలుసు కూర అని దొరికేది, చిన్న పొద దానికి ముళ్ళు, ఆకు మాత్రం మంచిది ఇనుము ధాతువున్నది. అది పచ్చడి చేస్తే తినేవాళ్ళం.బలుసు ముల్లు గుచ్చుకుంటే చాలా బాధ పెట్టేసేది.

మా ఊరుకి ఒక వైపు గోదావరి మరొక వైపు కొవ్వాడ కాలవని ఒక కొండవాగు ఉంది. అది వర్షాకాలమే పారుతుంది. దానినుంచి నీరు చెరువులో పట్టేవారు. ఆ చెరువులో కలవ పువ్వులుండేవి. వినాయక చవితికి చెరువులో దిగి ములిగి ఈత కొడుతూ కలవ పూలు కోసేవాళ్ళం. గోదావరిలో ఈత కొడితే ఏమీ అనేవారు కాదు కాని, చెరువంటే వద్దని తిట్టేవారు. కారణం తెలిసేదికాదు. తరవాత తెలిసింది. చెరువులో మొసలి ఉందనేవారు. మేము చాలా సార్లు దిగేము కాని మాకు కనపడలేదు. అది కనపడితే మేము కనపడేవాళ్ళం కాదనుకోండి. 🙂 మరొక కారణం ఉండేది, గోదావరి అయితే ఎవరో ఒకరు చూడటానికి సావకాశం, అది చెరువుకి లేదు.ఒక సారి అలా చెరువులో దిగినందుకు మా హెడ్ మాస్టారు పెళ్ళి చేసేరు, నలుగురికి ఒకసారి. కొద్దిగా సాగేము ఇప్పుడు వీటినుంచి అల్లరీ పెరిగింది. ఒక పక్క గోదావరి ఉన్నా నీరు వచ్చే సావకాశం లేదు కనక మెట్ట పంటలు పండించేవారు. అందులొ ముఖ్యం జొన్న. జొన్న లేత కంకులు విరిచి ఎండు జొన్న ఆకులు దగ్గరికి చేర్చి మంట పెట్టి దానిపై జొన్న కంకి కాల్చి, దానిని వేడిగా ఉండగా తువ్వాలు లో పెట్టి ఒక జొన్న కర్రతో కొట్టి, తువ్వాలు లో రాలిన గింజలు పొట్టు ఏమైనా ఉంటే ఊదుకుని తినేవాళ్ళం. వీటిని ఊచబియ్యం అంటారు. వీటిని తువ్వాలులో పెట్టి కొట్టడం కూడా ఒక కళ. తేడా జరిగితే చెయ్యి వాచిపోతుంది జొన్న కర్ర దెబ్బకి. రైతుకి కనపడితే కర్ర పుచ్చుకుని వచ్చేవాడు. మేమెవరమో చెబితే “ఏంటీ అల్లరి, నాన్నగారితో చెబుతా” అనేవాడు. “చెప్పుకో” అని పరిగెట్టి పారిపోయేవాళ్ళం. ఒక సారి పట్టుకుంటే నేను దొరికిపోయాను, మిగిలినవాళ్ళు పారిపోయారు. రైతు చెయ్యిపట్టుకుని నడిపించుకొస్తున్నాడు. నడవలేకపోతూ ఉంటే మెడల మీద ఎక్కించుకుని తీసుకొచ్చి, ఇంటిదగ్గర దింపి, “చెల్లెమ్మా! కుర్రాడు, చేల గట్లంట తిరుగుతున్నాడు. మిగిలిన కుర్రోళ్ళు పారిపోయారు. ఈడు నాకు దొరికిపోయాడు, చూడమ్మా” అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ ఏమీ అనలేదు. రాత్రి భోజనం దగ్గర మాటాడలేదు, మర్నాడు కూడా మాటాడలేదు, అప్పటిదాకా బింకంగానే ఉన్నా. మూడవరోజు కూడా అమ్మ మాట్లాడక పోయేటప్పటికి ఏడుపొచ్చేసింది. అమ్మ దగ్గరకెళ్ళి ఏడిచి “వాళ్ళు తీసుకుపోయారు” అని చెప్పేను. “నీ బుద్ధేమయిందిరా” అంది. మాటాడలేదు. “ఇంకెప్పుడూ వెళ్ళనమ్మా” అన్నా. అమ్మ నవ్వేసింది. కుక్క బుద్ధి మామూలేననుకోండి. ఇంకొంచం పెరిగాము,ఇప్పుడు రేవు నావ దాటి ఇసుక తిప్పలో పండిస్తున్న పుచ్చకాయలు, దోసకాయలు కోసి అక్కడే పట్టుకెళ్ళిన కొడవలితో కోసుకుని తినేసేవాళ్ళం. ఎవరేనా పట్టుకుంటే పెద్దవాళ్ళ పేర్లు చెప్పి తప్పించుకునే వాళ్ళం. ఒక సారి ఆ ఎత్తు పని చేయక ఒక రైతు పట్టుకుని మమ్మల్ని ఇళ్ళకు తీసుకొచ్చి అప్పచెప్పి, సంగతి చెబితే ఇళ్ళలో వాళ్ళు మా నలుగురికి పేకావారమ్మాయితో పెళ్ళి జరిపించేసేరు.

ఇలా అల్లరిచేస్తూ, బుద్ధిగా చదువుకోడం మూలంగా ఎక్కువగా తిట్టేవారుకాదు, ఊరులోవాళ్ళు. ఇలా అల్లరి చేసినా చదువుకోడానికి మళ్ళీ మళ్ళీ డబ్బులిచ్చేవారు. ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ముందు వాలిపోయి, మేము చేయగలపని చేసివచ్చేవాళ్ళం. దానితో మా అల్లరి కొంత భరించేవారు. మరీ ఎక్కువయితే ఇంట్లో చెబితే పేకావారమ్మయితో పెళ్ళి తప్పదు కదా. అందుకు కొంచం ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాళ్ళం. అలా హైస్కూల్ చదువు పూర్తి చేసేం. ఇక తరవాత….

 

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్రహ్మచారి శతమర్కటః

    • మన్నించాలి, అశక్తుడిని. గత ఆరునెలలుగా కుడికాలి పాదం ఎముక విరగడంతో బయటకు తిరగడం లేదు. గూగుల్ లో దొరకచ్చు,ప్రయత్నించండి.

  1. మీ ఆకతాయి అల్లరాటలు బాగున్నాయండి. మీరన్న ‘బలుసు’ ఆకుని మేము బలురక్కసి అంటాము. ఇదికాక, బలుసాకు అని కాస్త మందంగా చిన్న ఆకులతో ఉండే ఆకుకూర తో చేసిన పప్పు వరంగల్ ప్రాంతీయులైన ఒకరింట్లో తిన్నాను. మాకు మీ అంత స్వేచ్ఛ లేదు గానీ వేసవి లో అమ్మమ్మ గారింట ఉన్నపుడు పొలం వెళ్ళినపుడు పుల్లరేగి పొదల్లో దూరటం, బియ్యం ఇచ్చి దుద్దీ పళ్ళు (చెర్రీల్లా ఉంటాయి ఎర్రని పళ్ళ గుత్తులుగా) కొనేవాళ్ళం. మీరు తిన్న ఆ పళ్ళన్నీ కాక సీమ చింత, కంది, వరి కంకులు ఇలా చాలానే అరుదైన రుచులు అలా తెలిసినవే! అప్పటి స్నేహితాలు అలాగే అమాయకంగా బావుండేవి. మేము దొరికితే గతించినా తాతగారి పేరు, ప్రెసిడెంటు గారి మేనకోడళ్ళు పదవి కాపాడేవి. 🙂

    • ఉష గారు,
      ప్రాంతాల్ని బట్టి వాడుకమాటలు తేడా ఉండచ్చు.మీరు చెప్పినది నేను చెప్పినది ఒకటే. పల్లెలలో ఆ రోజులలో బియ్యం పెట్టి ఈ పళ్ళుకొనుక్కోవడం అలవాటు కదా. బార్టర్ సిస్టమ్.చిన్నపుడు కదండీ! మాయలు తెలియవు కదా.మరి అలా చెప్పకపోతే వదలరు కదా. పెద్దవాళ్ళ పేరు అలా ఉపయోగించుకున్నాం, అప్పుడు.
      ధన్యవాదాలు.

  2. వాక్కాయల,నల్లేరు కాయల,బలుసు,షీకాయి,గార్జర(ఇది పేరు సరిగా గుర్తులేదు) ఫోటో తీసి పెట్టగలరా?

  3. మంచి పోస్ట్ శర్మ గారూ!
    వెన్నెల రాత్రుల్లో కబాడీ ఆటలు…
    మోకాలి చిప్ప పగుళ్ళు…
    ఇంట్లో చెప్పలేక తరవాత దొరికిపోయి..
    చేయించుకున్న పెళ్లిళ్ళు…:-)
    ఆ చపలత్వం చంచలత్వం…అన్నీ మధురానుభూతులుగానే
    ఉండిపోయాయి ఇప్పటికీ…
    @శ్రీ

  4. నేను చిన్నప్పుడు ఇలాంటివి చెయ్యలేదు, ఎందుకంటే నాకు భయం అనే ఒక అస్త్రం ఉంది. ఏ సాహసం చెయ్యలేదు.

    • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
      ఎప్పటి వయసుకు చేసే పనులు అప్పుడు చేస్తేనే అందం.
      ధన్యవాదాలు.

  5. బ్రహ్మ, చారి ఇద్దరూ శత మర్కటాలే అండి !

    అందుకే బ్రహ్మచారి శత మరకతం,శత మర్కటం అయ్యేడు !

    ఇంతకీ పెకావారమ్మాయి అంటే ఎవరండీ ? నలుగురికి ఒకమ్మాయి తో పెళ్ళా ? పేకా చతూరీ అనాలేమో మరి !

    చీర్స్
    జిలేబి.

వ్యాఖ్యానించండి