శర్మ కాలక్షేపంకబుర్లు-తింటారా?/కావాలా?

తింటారా?/ కావాలా?

అన్నయ్య, అబ్బాయి ఇంట్లో రాజమంద్రిలో ఉన్నారంటే, కొద్దిగా అనారోగ్యం చేసి బాగున్నారంటే, నాకేమో నడుం నెప్పి బాధ పెడుతోంటే, అన్నయ్యను చూసినట్లూ ఉంటుంది, డాక్టర్ కి చూపించుకున్నట్లూ ఉంటుందని బయలుదేరా. గోదావరిలో దిగగానే, అదేనండి రయిల్వే స్టేషన్లో దిగగానే అమ్మ కనపడింది. అటునుంచి అటే వెళ్ళిపోయా. ఈ లోగా తీసుకెళదామని వచ్చిన అబ్బాయి, “బాబయ్యా! ఎక్కడున్నావ”ని పంపురాయిలో కేకేస్తే “పుష్కారాల రేవులో ఉన్నా”నని చెపితే అక్కడికొచ్చాడు. నేనేదో అక్కడ ఫోటోలు తీస్తూంటే “మళ్ళీ వద్దాం బాబాయ్” అని తీసుకుపోయాడు, మోటార్ సైకిల్ మీద. Courtesy C.R.Sekhar      Left First bridge          Right Third bridge

 ఇంటికెళ్ళి కాఫీ తాగి బయలుదేరేం, డాక్టర్ దగ్గరికి. అన్నయ్యకి చెకప్ అయిన తరవాత నన్ను చూసి మందులు రాసిచ్చేరు. మా ఊళ్ళో డాక్టర్ అరంగుళం మాత్రలు రాస్తే ఈయన అంగుళం మాత్రలు రాశారు. వెంటనే ఒకటి పారేసుకుని బయలుదేరేం. “ఎక్కడికెళదాం” అన్నారు అన్నయ్య, అంటూ కోటిలింగాల వెళదామన్నారు. సరే అక్కడికే బయలుదేరేం. గోదారమ్మ మళ్ళీ కనపడేటప్పటికి ఒళ్ళు తెలియలేదు. కాసేపు అలా తిరిగి కోటిలింగేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకుని,  గుడి కలియతిరిగి మళ్ళీ గట్టుమీద కొచ్చి కొన్ని ఫోటోలు తీసుకుని, పక్కనే శ్రీపందిరి మహదేవుడు గారన్న వితరణశీలి కట్టించిన సత్రవు,నూట పాతిక సంవత్సరాల పైబడిన చరిత్ర కల సత్రం, అందులోని వేద పాఠశాల చూసి, వినాయకుని దర్శించి, ఆటో ఎక్కితే తీసుకొచ్చి ఇంటి దగ్గర రోడ్ లో ఉన్న 

                                       కోటిలింగేశ్వరస్వామి ఆలయం

ఆలయం దగ్గర వదిలేశాడు. ఆటోలో కాలు కింద పెట్టకుండానే “ఇలా వచ్చేరేమీ?” అని ఒక మిత్రుడు పలకరించాడు. సొద చెప్పుకునేటప్పటి “మా ఇల్లు దగ్గరే” అని ఆలయం పక్క వీధినుంచి కొద్ది దూరం నడిచిన తరవాత “ఇదే మా ఇల్లని” ఆగిపోయాడు, బయటే. సంవత్సరం కితం, ఆయనా, భార్యా మోటార్ సైకిల్ మీద వెళుతుండగా ఎవరో గుద్దేసినది, భార్యకి మెడ ఎముక విరిగినది చెప్పుకొచ్చాడు,”ఇప్పుడెలా ఉందంటే?” “బాగుంద”న్నాడు. ఆయనని ఓదార్చి, మేం కదులుతున్నామని చెప్పి వచ్చేశాం. కొద్ది దూరం వచ్చేటప్పటికి ఒక చిన్న సోడా కొట్టు నుంచి ఒక యువకుడు వచ్చి “మాస్టారూ నమస్కారం! రండి!! ” అని సోడా కొట్టడానికి సిద్ధమయ్యాడు. అన్నయ్య అతనితో కబుర్లు చెప్పి సోడా కొట్టడం అపించి, కొద్ది సేపటికి బయలు దేరి ముందుకు సాగి కుడివైపు మలుపు తిరిగితే రెండే ఇళ్ళున్న సందులో రెండవ ఇంటి దగ్గర ఒక యువతి నిలబడి మేడమీది అమ్మమ్మ గారితో కబుర్లు చెబుతున్నది, అన్నయ్యని పలకరించి “రమ్మ”ని గేటు తీసి లోపల కుర్చీలలో కూచోమని చెబుతూ రెండు గ్లాసులతో మంచి నీళ్ళు పట్టుకొచ్చింది. అన్నయ్య వద్దన్నాడు కాని నేను రెండు గ్లాసుల నీళ్ళు తాగేశా. నాకా నీళ్ళు బాగ తియ్యగా అనిపించాయి, ఆ అమ్మాయి ఆతిధ్యంవల్లో, స్థల మహత్మ్యం వల్లో. మూడు చోట్ల మూడు రకాల ఆతిధ్యాలు ఒక రోజు, ఒక గంటలో

.ఇంటి కొచ్చాకా బుల్లి కోడలు కొసరి కొసరి వడ్డించి, పప్పు కలపండి మామయ్య గారు దగ్గరనుంచి, వడియాలు నమలలేకపోతే చప్పరించి పారెయ్యమన్నదాకా చెప్పి, పీకదాకా కూరపెట్టేసింది. ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి మా బుల్లి కోడలు వంట అద్భుతం. భోజనం తరవాత టపా ఏంరాయాలనుకుంటే ఇది రాస్తే పోలా అనిపించి, మొదలెట్టా.

ఈ మధ్య ఎవరింటికెళ్ళినా వారు ఎలకో, చిలకో పట్టుకుని ఉంటున్నారు. అదేనండి ఎలకంటే మౌస్, చిలకంటే రిమోట్. వారి చూపులు వచ్చిన శనిగాడెంత తొందరగా వదుల్తాడురా అన్నట్లే ఉంటున్నాయి. “కూచోండి” అన్న మాట నోటి చివరనుంచి వస్తూంది, కూచోడానికే ఏమీ కనపడవు. ఉన్నవాటినిండా ఎవో ఉంటాయి, బట్టలు వగైరా. ఎండ పడివచ్చాడు ముసలాడు,మనపని మీదే వచ్చాడు, మంచి నీళ్ళిద్దామనిపించదు, కాని కొద్దిసేపటికి స్పృహలో కొచ్చి రేపు మనపేరు కూడా బ్లాగులో అన్యాపదేశంగానైనా ఎక్కించేస్తాడని, “మంచినీళ్ళు తాగుతారా?” ప్రశ్న. నిజంగా దాహంగా ఉన్నా కూడా ఈ ప్రశ్నతో పారిపోయింది దాహం. అయినా తప్పదు కదా, “ఇవ్వమ్మా” అంటే వదిలేలా లేడనుకుని మంచి నీళ్ళ బాటిల్ పట్టుకొచ్చి, ఫ్రిజ్ లోంచి, అక్కడ పారేసింది, “తాగండ”ని. “ఈ నీళ్ళు తాగితే గొంతు పట్టేస్తుందమ్మా, మామూలు నీళ్ళంటే”, వింత జంతువుని చూసినట్లు చూసింది. “మా ఇంట్లో ఆన్నీ ఇవ్వే నీళ్ళండి” అంది, నవ్వుతూ.( నీ మొహానికి ఇవ్వెప్పుడేనా తాగేవా అన్నట్లు 🙂 ). తప్పక అవే తాగుదామనుకుంటే గ్లాసులేదు. బాటిల్ తో తాగడం చేతకాదు, బాటిల్ తో తాగడం సంస్కారం కాదనుకుంటా. గ్లాసడిగితే తిడుతుందేమోనని 🙂 బాటిల్ ఎత్తి రెండు గుక్కలు నోట్లో, ఒంటిమీదా, పోసుకుని వచ్చిన పని చెప్పి “మీ ఆయన నాకో పని చెప్పేడు, కనపడమన్నాడు, వీలు చూసుకుని నాకు కనపడమను” అని చెప్పి బయలుదేరేను. ఇలా ఆతిధ్యంలో తేడాలు చాలా కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నాయి. ఒకరింటికి తప్పక భోజనానికెళ్ళేం, వేసంకాలంలో, బలవంతం మీద ఇల్లాలితో. భోజనం దగ్గర మామిడికాయ పచ్చడి తింటారా? పప్పు వెయ్యనా? కూర కావాలా? అడుగుతూ ఉంటే, ఆకలి కోరిక చచ్చిపోయాయి. భోజనం దగ్గర పెరుగుతెస్తూ “పిన్నీ! మీ ఊళ్ళో పాలు దొరకడం కష్టమనుకుంటా” అంది. అంటే “మీ మొఖాలకి పెరుగు కూడానా” అన్నట్లనిపించింది నాకు. ఇల్లాలు నాకేసి ఓరగా చూసింది, నేను ముఖం తిప్పేసుకున్నా. 🙂 . ఇది ఒక్కొక ఇంటి అలవాట్లని బట్టి ఉంటూ ఉంటుంది. మా ఇంటి అలవాటు, అమ్మ దగ్గరనుంచీ వచ్చినది, కూర వేస్తున్నా! పచ్చడి కలుపుకోండి. పులుసు కలపండి, పులుసులోకి పప్పేస్తున్నా, అయ్యో! వడియాలు మరిచిపోయారు తినండి, ఇలా ఉంటుంది సంభాషణ భోజనాల దగ్గర. భోజనానికి లేవండి, భోజనం చెయ్యండి అనికాని,అన్నం పెడుతున్నా రండి అనికాని, భోజనాల వేళయిందనికాని, భోంచేసి మిగిలిన పని చూసుకోండనటం తప్పించి, భోజనానికొస్తారా? అన్నం తింటారా? అన్నం పెట్టనా? ఇలా ప్రశ్న రూపం లో మాట్లాడటం అలవాటులేదు. భోజన విషయంలో అలా మాట్లాడటం కూడా సభ్యత కాదని మా అభిప్రాయం, ఎవరితోనైనా సరే. అహారం దగ్గర వ్యవహారం దగ్గర మోమోటమి కూడదంటారు కాని ఇలా మాట్లాడితే, బాధ గానే ఉంటుంది. నాకయితే పై విధంగా మాట్లాడిన వారింట భోజనం చేయబుద్ధే కాలేదంటే నమ్మండి. కూచున్న తరవాత తప్పదు కనక వడ్డించినవి తిని లేవడమే. ఆ తరవాత “బాబయ్యగారు ఏంటో! మోమోట పడిపోయి భోజనమే చెయ్యలేదు సరిగా” అని సాగతీత. ఇలా ఉంటున్నాయి నేటి కాలపు అతిధి మర్యాదలు. ఎవరిబ్లాగులోనో చూశాను, ఎవరింటికయినా వెళితే వారు వచ్చిన వారికి భోజనం హోటల్ కి ఆర్డర్ ఇవ్వడానికి ఫోన్ దగ్గరకెళుతున్నారట. అటువంటి చోట భోజనం చెయ్యాలనిపిస్తుందా, ఆకలి ఉన్నా?

27 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తింటారా?/కావాలా?

  1. అలా పొడవైన జడకావాలి అనుకుంటే పెరగాలికదండి…..అది అందరికీ అందుబాటులోలేదు కాబట్టే బహుశా దానిపై మక్కువెక్కువేమో:-)
    ఇంక విరబోసుకోవడం, జడవేసుకోవడం అనేది ఫాషన్ కన్నా ఈ ఫాస్ట్ ఫుడ్ పిల్లలకదే సౌకర్యార్థం అనుకుంటే మిన్న:-)
    Mee latesr post కి కామెంట్ పెట్టడానికి కుదరక ఇక్కడ ఇలా…

  2. చాలా బాగా వ్రాసారు .
    నిజంగానే రోజులు మారాయి మరి.
    అమ్మాయి పెళ్లి కాగానే విదేశానికి వెళ్లి
    రెండేళ్ళ తరువాత ఇక్కడ కాపురం
    పెట్టిన రెండు నెలలుకు చూసి వద్దామనుకొని చిరునామా అడిగితే,
    వాళ్లింకా స్థిరపడలేదనే, జవాబు వస్తే ఏమి చెయ్యగలం?

  3. ఒకప్పుడు పొమ్మనలేక పొగపెట్టడం అనేవారు బహుశా ఇప్పుడది పొమ్మనలేక ప్రశ్నలు వేయడంగా మారిందేమో :-)మీ పోస్ట్ చాలా బాగుంది

  4. చాలా బాగా చెప్పారు. మాకే అలా అనిపిస్తుందేమో అనుకుంటూ ఉంటాం మేము.
    ఇలాంటి ఆహ్వానాలకి , భోజనాలకి ఒక నమస్కారం బాబొయ్….

  5. శర్మ గారూ!
    ఇలాంటి అనుభవాలు కోకొల్లలు…
    ఎవరింటికైనా వెడితే ఎందుకొచ్చాడురా!
    అనుకునే వాళ్ళే పెరిగి పోయారు.
    తిథి లేకుండా వచ్చేవాడే అతిథి…
    అప్పటి ఆప్యాయతలూ బంధాలూ ప్రేమలూ ఇప్పుడు
    కావాలనుకుంటే
    ఎడారిలో ఒయాసిస్సు వెదకటం లాంటిదే…
    కోటిలింగాల రేవు వద్దకి వేడుతుంటాను నేను.
    ఆ సత్రం దగ్గరే కృష్ణ శాస్త్రి గారని మా బంధువులున్నారు…
    ఓ సారి గోదావరిని చూపించేశారు మీ ఫోటోలలో…
    అభినందనలు మంచి పోస్ట్ కి…
    @శ్రీ

    • @శ్రీ గారు,
      జీవితం కదండీ, అన్నీ అనుభవించక తప్పదు.మీ బ్లాగు మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తోంది, మూడు బ్రౌజర్లలో చూశా. ప్చ్ ఉపయోగం లేకపోయింది. స్నేప్ అంటూంది.
      ధన్యవాదాలు.

  6. విచిత్రం ఏమిటంటే ఇంటికి వచ్చిన అతిథికి పచ్చడి మెతుకులు కూడా సరిగా పెట్టనివాళ్ళే, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి లక్షలు ఖర్చుపెట్టి వాళ్ళ హోదాని సమాజానికి చూపించుకుంటారు.

    • @మిత్రులు బోనగిరి గారు,
      పెళ్ళిళ్ళు, పేరంటాలప్పుడు ఆర్భాటంగా ఖర్చుపెడితే, చెప్పుకుంటారు, గొప్పవారిగా గుర్తిస్తారు. మరి ఇప్పుడు పెడితే 🙂
      ధన్యవాదాలు.

  7. రాకోయి అనుకోని అతిథి, అన్నారు అందుకే. :))
    ప్చ్.. కరువు కాలాలు శర్మగారు. ఆ కాలాల్లో చాలామందికి పొలాలు, పాడి వుండేవి. పెద్దగా ఆస్థులు, బంగళాలు కట్టాలనే ఆశలు అంతగా వుండేవి కావు. ఇప్పుడో… వుప్పు, పప్పు, బియ్యం ధరలు అందనంత ఎత్తులో వుంటున్నాయి. మధ్య తరగతి వారికీ గడవడం కష్టంగానే వుంటోంది, పిల్లల చదువులు, ఫోన్లు, టివిలు, వాహనాలు, ఇలా…
    ఇలాంటి అనుభవాలు, అర కడుపైనా నిండని స్నేహితుల విందులు ఓ రెండు సార్లు నేనూ మా ఆవిడ అనుభవించాక, తత్వం వంటపట్టింది. కొందరు ఏదైనా విందుకు రమ్మని బలవంతపెడితే, దారిలో మంచి హోటల్లో మందంగా టిఫిను లాగించి వెళ్ళేవాళ్ళం.
    విందు అంటే పంజాబీ, గుజరాతీలదే విందు, కడుపునిండా తినవచ్చు. తమిళ/కర్నాటక వాళ్ళ విందైతే ఇంట్లో తిని వెళ్ళాల్సిందే.

    • @ Snkr గారు,
      ఈ విషయంలో మీకు చాలా అనుభవం ఉన్నట్లుంది, చూస్తే. మన తెనుగువారి విందులే చాలండి, మా ప్రాణాలకి. ఏమైనా గుజరాతీలు అన్నిటిలోనూ గొప్పవారే! 🙂
      ధన్యవాదాలు.

  8. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

    బాగుందండీ. అతిధి దేవోభవ అని పెద్దలు చెప్పారు. అంటే అతిధి `దేవుడి’తో సమానమని అర్ధం. మీరే చెప్పండి దేముడికి నైవేద్యం పెడతామూకానీ, నిజంగా అన్నీ తినిపిస్తామా? ఊరికినే మర్యాదకి అంతే. మరి మీరు అతిధి-దేవుడిగా వెళితే, నైవేద్యం పెడతారుకానీ, నిజంగా అన్నీ దగ్గరుండి వడ్డిస్తారుటండీ?? రోజులు మారాయి, మనుషులు మారారు, మర్యాదలూ మారాయి.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    • @మిత్రులు మాధవరావు గారు,
      ఆ ఇదేదో బాగున్నట్లుందండి, నిజమే కదూ దేవుడికి నైవేద్యం పెట్టి మనమే తింటాం కదా! అతిధికి దేవుడికి పెట్టినట్లు పెట్టాలి కాని…:) 🙂
      ధన్యవాదాలు.

  9. ప్రశ్నల కాలమే ఇది. అది కూడా మొక్కు బడి ప్రశ్నలే!
    ప్రశ్నలకి ప్రశ్నలే సమాధానం చెప్పాలి మాస్టారు. 🙂
    మంచి విషయం ని చెప్పారు. మనలోకి మనం తొంగి చూసుకుని సిగ్గుపడే విధంగా..
    ధన్యవాదములు.

  10. ఎప్పుడైతే బాంధవ్యం కాదు స్నేహితుడు ముఖ్యం అయ్యాడో అప్పుడే ఇవి మొదలయ్యాయి.
    ఎందుకంటే స్నేహితుడుకి కావలసినది మన డబ్బు(మీకు నిజంగా తెలియాలి అంటే ఒకసారి Airtel Add చూడండి), బంధువుకు కావలసినది మన ఆప్యాయత, బాంధవ్యం………
    ఇప్పటికీ మా ఇళ్ళలో శుభకార్యం అంటే మా బంధువులు రాబందులుగా వాలరు తలా చెయ్యా వేస్తారు.

    • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
      జీవితంలో బంధువులెంత ముఖ్యమో స్నేహితులూ అంతే ముఖ్యం, సమతుల్యత లోపిస్తూ ఉంది, అదీ బాధ.
      ధన్యవాదాలు.

  11. అతిథిమర్యాదలే కాదండి, అన్ని రకాల మర్యాదలూ మట్టికొట్టుకుపోతున్నాయి అధునాతన సమాజసంస్కృతిలో. మనుష్యుల మధ్య అవసర సంబంధాలే కాని ఆత్మీయ సంబంధాల రోజులు కావు. పాతతరం వారికి బాధగానే ఉంటుంది మరి.

    • @మిత్రులు శ్యామలరావు గారు,
      కాలంతో మనమూ మారాలి, మారలేకపోతున్నాం, అదీ చిక్కు.వెళ్ళిన వాళ్ళు రోజుల తరబడి ఉండిపోతే భరించలేరు, నిజమే. ఒక పూటకే బాధ పడితే..
      ధన్యవాదాలు.

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి