శర్మ కాలక్షేపంకబుర్లు-అర్ధం

అర్ధం

అర్ధం అంటే సగం, ద్రవ్యం,భావం అని నానార్ధాలున్నాయి. మనకేంటీ స్వేఛ్ఛాజీవులం కదా అన్నిటిగురించి వరసగా చెప్పుకుందాం. ఊ… అన్నారా? మౌనంగా ఉన్నారా? ఊ…. అంటే ముక్కుతో ఒప్పుకోలుట, మౌనం అర్ధాంగీకారం అన్నారు. అంటే పూర్ణాంగీకారం లేదాండీ అనద్దు. అర్ధాంగీకారం అంటే చెప్పిన విషయం మీద అభిప్రాయం లేదనీ, కొంత ఒప్పుకున్నట్లు లెక్కన మాట.

రెండు అర్ధాలు కలిస్తే ఒకటి. దీనికి మానం కూడా ఉంది. మానం రాకపొతే అవమానంరా అనేవారు, మా లెక్కల మాస్టారు. ఇప్పుడు ఈ మానం లేదు, అన్నీ దశాంశ పద్దతే. చిత్రమేమంటే, శూన్యాన్ని కనుక్కున్నది భారతీయులు, కాని దీన్ని ఫ్రాన్స్ వారు స్వంతం చేసుకున్నారు. ఇలా చాలా విజ్ఞానం మనది పశ్చిమదేశాలవారిదిగా చెలామణీ అవుతోంది.
2గిద్దలు = అరసోల
2 అరసోలలు =సోల
2సోలలు = తవ్వెడు
2తవ్వలు =మానిక లేక శేరు.
2మానికలు = అడ్డ ( వాడుకలో అర్ధ కాస్తా అడ్డగా మారింది).
2అడ్డలు = కుంచెడు.

ఇలాగే ద్రవ్య మానం చూడండి

2దమ్మిడీలు=ఏగాణీ
2ఏగానులు=కాణీ
2కానులు= అర్ధణా
2అర్ధణాలు=అణా
2అణాలు=బేడ
2బేడలు=పావులా
2పావులాలు=అర్ధ రూపాయి
2అర్ధ  రూపాయలు= ఒక రూపాయి

తులామానం చూడండి.
3తులాలు= ఒక ఫలం
5ఫలాలు=ఒక పంపు
2పంపులు=ఒక ఏబులం
2ఏబులాలు=ఒక పదలం
2పదలాలు=ఒక వీశ లేక 120 తులాలు.(ఈ మానం లో భారతీయ ఆత్మ ఉంది జాగ్రత్తగా పరిశీలించండి. )

ఈ సృష్టి సమస్తం అర్ధనారీశ్వర తత్వం. రెండు అర్దాలు కలిస్తేనే ఒకటి. దానినే “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అన్నారు. అంటే, ఒకటే అయిన భగవంతుని తెలిసినవారు వివిధ రకాలుగా చెప్పేరు, అని. అదేo, ఒకలాగే చెప్పచ్చుగా, కాదు, ఎవరికి ఎలా చెబితే భావం చేరుతుందో అలా చెప్పేరనమాట. ఒకరికి తీపి, మరొకరికి కారం, మరొకరికి పులుపు ఇష్టం, కాని అవన్నీ ఆహారమేకదా! అలాగనమాట. అందుకే ఒకరికి రాముడిగా కనపడితే, మరొకరికి కృష్ణుడిగా కనపడతాడు, మరొకరికి అమ్మగా, ఇలా అనేక రూపాలు, కాని వస్తువు ఒకటే. అన్ని ఆభరణాలలోనూ ఉన్నది ఒకటే, అది బంగారం, కాని ఒకదానిని చూచిగాజులంటే,మరొకటి కంటె, మరొకటి కాసులపేరు. అలాగే శక్తినిచ్చే ఆహారం, నోరు దాటితే రుచి తెలుస్తుందా? అప్పుడు సర్వం జగన్నాధం, అంతా ఒకటే, అందుకే మందు గొంతుకలో పోసుకోమన్నారు, రుచి తెలియకుండా ఉండటానికే. 🙂 రుచికాదు ముఖ్యం వ్యాధి నివారణ ముఖ్యంకదా.

రెండు సగాలు, శివుడు, శక్తి, రాత్రి ,పగలు,  పురుషుడు, స్త్రీ, అన్ని రెండే చూడండి. ఎత్తు, పల్లం, నీరు, నిప్పు, సిరి, దరిద్రం, భూమి, ఆకాశం, మానవ మస్తిష్కం రెండు భాగాలు, రెండు విరుద్ధాలు కలసి ఒకటి.  సైన్స్ లో కూడా శక్తిని రెండనే చెబుతారు. స్థితి శక్తి, గతి శక్తి. ఇవి ఒక దానికొకటి సంపూరకాలు. శివుడు జడుడు, శక్తి చేరితే, చైతన్యవంతుడు. మనం కూడా భార్య/భర్తతో కూడి ఉంటే శక్తివంతులం, బలవంతులం, లేకపోతే, నిర్బలులం, నిర్భాగ్యులం.  ఇది గమనించుకోక ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని పోట్లాడుకోవడం తెలివయిన పనా? అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థ లో మూల సూత్రం, అందరికోసం ఒక్కరు, ఒక్కరికోసం అందరు. ఇది ఎంత గొప్ప సూత్రం, అయితే దీనికి మనసు జోడింపు జరిగితేనే కావలసిన ఫలితాలుంటాయి, లేకపోతే అది ఉత్తి వ్యర్ధవాదమయిపోతుంది.  స్త్రీని శక్తిగా కొలుస్తాం, శక్తి చేరని శివుడు జడుడేగా,.అందుకే అమ్మని, అమ్మాయిని పూజించాలి, గౌరవించాలి, గుడులు గోపురాలు కట్టద్దు, వారిని సాటివారిగా గుర్తించి, గౌరవించి, వారి పట్ల మన కృతజ్ఞత తెలియచేద్దాం. అమ్మ స్త్రీ, చెల్లి స్త్రీ, భార్య స్త్రీ, వారు లేనిది నిమిషం జీవితం లేదు.ఇతరులు మనకు ఏం చేస్తే అప్రియమో అవి మనం మరొకరికి చేయకుండటమే ధర్మం కదా! అటువంటపుడు మరో తల్లిని, చెల్లిని పాడు దృష్టితో చూడటమే పాపం కదా! మరి దీనికెందుకుఒడి కడుతున్నారు? మానవ జనాభాలో సగమైన స్త్రీని ఎందుకు బాధలపాలు చేస్తున్నారు? ఇది మన పట్ల మనం చేసుకుంటున్న ద్రోహం కాదా. ఆలోచించండి.

ఈ వేళ ఒక చిన్న సంఘటన. బేంకుకి వెళ్ళేను, మగవారెవరూ సరిగా పట్టించుకున్నట్లు లేదు, కౌంటర్లో ఇద్దరమ్మాయిలున్నారు, ఒకమ్మాయి దగ్గరకెళ్ళి చెక్ బుక్, పాస్ బుక్ కావాలమ్మా, ఇదిగో మేనేజర్ గారిచ్చిన ఉత్తరం అన్నా. ఒకమ్మాయి చూసి “తాతగారు ఒక గంట కూచోగలరా?’ అంది. “మళ్ళీ వస్తానమ్మా,కూచోలేను, ఎప్పుడు రమ్మన్నా”వన్నా.” మీరు మధ్యాహ్నం మూడున్నరకి రండి, మీ పని చేసి పెడతా”మన్నారు. సరేనని వచ్చేశా, మధ్యాహ్నం వెళ్ళా,””తాత గారు! ఈ వేళ కొన్ని వందల శూన్య కాతాలు మొదలుపెట్టేం, అది హడావుడి ఒక్క ఐదు నిమిషాలేం” అన్నారు.  ఇద్దరూ చకచక చేతిలో ఉన్న పని పూర్తిచేసి, నా పని చేసి ఇచ్చేశారు. “అమ్మలూ! మీ ఇద్దరిగురించీ అబ్లాగులో రాస్తానేం” అన్నా.ఇద్దరూ నవ్వేశారు, నాకు ముచ్చటే అనిపించింది, వారి పని చూసి, గౌరవం ఇవ్వడం చూసి. మరి మగవాళ్ళకేమొచ్చింది, దొమ్మ తెగులు. అదే మగవాళ్ళయితే నా పని ఈవేళ గోవిందా.

మన శరీరంలో ఇంద్రియాలు,చెవులు,ముక్కు, కళ్ళు,కాళ్ళు, చేతులు , ముఖ్యమైనవి ఇవన్నీ రెండుగా ప్రసాదించాడు భగవంతుడు. మరో రెండు ఇంద్రియాలకి సంబంధించి ఒక్కొకటే పెట్టేడు, ఎందుకంటే మానవులు భోగలాలసులు, ఒక్కొక ఇంద్రియంతోనే, తప్పుదారి పడతారని భగవంతుడు దయతో ఒక్కొటే ప్రసాదించాడు.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అర్ధం

  1. మా మామ గారు 1980 లో సీనియర్ స్టేషన్ మాస్టర్ గా SC RLY నుంచి రిటైరయ్యారు
    1989లో చని పోయారు. మా అత్తా గారికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది .
    ఈ మధ్య జరిగిన మార్పు (రివిషన్) వల్ల ఎంత వస్తుందో ఎలా తెలుస్తుంది?
    అడిగినందుకు ఏమి అనుకోరని ఆశిస్తాను .

  2. చాలా చాలా విలువైన విషయాలు. తూనికలు కొలతలు తెలుసుకుంటుంటే బాల్యం లోకి నానమ్మ -తాతయ్య లెక్కలలోకి వెళ్ళిపోయాను.

    నాలుగు విషయాలు కలిపి ఒకే పోస్ట్ వ్రాయడం ఎలాగో..మీ నుండి . నేర్చుకోవాలి మాస్టారూ..

  3. 2గిద్దలు = అరసోల
    2 అరసోలలు =సోల
    2సోలలు = తవ్వెడు
    2తవ్వలు =మానిక లేక శేరు.
    2మానికలు = అడ్డ ( వాడుకలో అర్ధ కాస్తా అడ్డగా మారింది).
    2అడ్డలు = కుంచెడు.
    ఈ లెక్కలు చక్కగా తెలియజేశారు. వ్రతకధలలో సోలెడు బియ్యము, కుంచెడు ధాన్యం ….ఇలా లెక్కించి చెబుతుంటారు. వ్రతాలను చేసేటప్పుడు ఈ లెక్కలు తెలుసుకోవటం ముఖ్యం.
    …………
    బంతి పువ్వులు బాగున్నాయండి.

    • @అమ్మాయ్ అనూరాధ!
      మొన్న కడియంలో తీసిన ఫోటోలు రోజూపెడుతున్నా బ్లాగులో, టపాతోపాటు. నచ్చినందుకు
      ధన్యవాదాలు

  4. Reblogged this on Gpvprasad's Blog and commented:
    మన సంఖ్యా శాస్త్రానికి ప్రామాణికాలు మన దేహమే, రెండు చేతులు నుంచీ మొదలు పెట్టి ౧౦ వెళ్ళు మరియు ద్వాదశ(౪X౩) మాసాలు.

వ్యాఖ్యానించండి