శర్మ కాలక్షేపంకబుర్లు- మిడతల దండు గుఱ్ఱాన్ని గుడి ఎక్కించింది.

locust

మిడతల దండు గుఱ్ఱాన్ని గుడి ఎక్కించింది.

మాలో ఒకడు “ఒరే! జానికిరావుడూ గుఱ్ఱం గుడెలా ఎక్కిందని అడిగితే ఎలా దిగిందో చెబుతావేంటిరా!” అన్నాడు. దానికి జానకి రావుడు “నీ ప్రశ్న తప్పు, గుఱ్ఱం దానంత అది గుడెక్కుతుందా? దొర గుఱ్ఱం కదా? ఎలా ఎక్కించారు? ఎవరు ఎక్కించారు? రాత్రికి రాత్రి,ఎవరికీ తెలియకుండా! ఎందుకెక్కించారని అడగాలి,” అన్నాడు. దానికి మరొకడు “లా పాయింట్ బాగానే లాగేవుకాని సంగతి చెప్పరా” అన్నాడు. అందుకు మా జానకి రావుడు

“మీరో సంగతి మరిచిపోతున్నారు.  కాలం మనలని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజులు, ప్రయాణ సాధనం అధికారులకే గుఱ్ఱంగా ఉన్నరోజులు. అంటే ఇప్పటికి వంద సంవత్సరాల కిందటి మాటనమాట. అప్పటికి ఇప్పుడున్నన్ని సాధనాలు లేవు. సరే దీనికేంగాని వినండి.

జమాబందీకి దొరవచ్చిన రోజే సూచనగా కరణం, మునసబూ పంటపోయిన సంగతి చెప్పేరు. దొర పెడచెవిని పెట్టేడు. మరుసటి రోజు రైతులూ చెప్పేరు. పిసికినకొద్దీ దొర గట్టి పడిపోయి ‘మీకొక్కళ్ళకే పోయిందా, పంట’ అన్న మాటకి వచ్చేసేడు. మూడవరోజు జమాబందీ అయిపోతే దొర వెళ్ళిపోతాడు, శిస్తు కట్టక తప్పదు. మునసబు కరణాలు గుంపుచింపులు పడుతున్నారు, కాని సమస్యకు పరిష్కారం దొరకలేదు. ‘తెల్లారితే దొరెళ్ళిపోతాడు, కరణం గారూ! సమస్య తేలలేదు! మన రైతులు శిస్తు కట్టక తప్పని పరిస్థితి,ఏదో ఒకటి చెయ్యాలి,మీరు చాణుక్యుని లాటివారు, ఏంచేద్దామో చెప్పండి,’ అని తన మనసు విప్పేడు.. కరణం యువకుడూ,మునసబు నడివయసువాడు, ఇద్దరికీ మంచి జోస్తీ ఉంది. ‘అదేనండీ! ఆలోచన ముడి పడటం లేదు, అపాయంలేని ఉపాయం కోసం చూస్తున్నా,అన్నాడు,’ ఇంటికి వెళుతూ. మునసబు ‘నేను ఇంటి దగ్గరే ఉంటానన్నాడు’, దేనికో సూచనగా.

ఇంటికి వెళ్ళే సందు మలుపు తిరుగుతుండగా అక్కడ అరుగు మీద కూచున్న ముసలాయన ‘ఏంటి! మనవడు కరణం గారూ! ఓడబోయిన కళాసులాగా మొహం వేలాడేసుకుని వస్తున్నార’ని పలకరించాడు. దానికి కరణం, ‘తాతా! సంగతి నీకు తెలుసుకదా! జరిగినది చెబితే దొర నమ్మనంటున్నాడు, రైతులకి ఉపకారం చేసేమార్గం కనపడటం లే’దంటూ, ‘తాతా! మనవాళ్ళు ఇంతంత పెద్ద గుడులు కట్టేరు కదా! అంత పెద్ద రాళ్ళు పైకి ఎలా తీసుకెళ్ళేరంటావ్!’ అన్నాడు, అసందర్భ ప్రలాపంలా. దానికి ముసలాయన ‘దుంగలపై రాళ్ళు దొర్లించుకు వచ్చేవారు, ఏనుగులు లాగితే. వాటిని దుంగలమీద ఉంచి ఇసక పోసేవారు తర్వాత వాటిని కదిపేవారు. ఇసక కిందకి దిగేది, అరాయి పైకి వెళ్ళేది’ అన్నాడు. ఏదో అప్పుడే తోచిన వాడిలా ‘వస్తా’ అని కంగారుగా, గబగబా అడుగులేశాడు,కరణం.

swarms

ఇంటికెళ్ళేలోపులో ఆలోచన రూపుదిద్దుకుంది, గుమ్మంలో పని మనిషి కనపడితే ‘మన గుఱ్ఱానికి గుగ్గిళ్ళు పెట్టేరా?’ అని అడిగాడు. ‘అదే పని మీద లోపలికెళ్తున్నాను’ అని చెప్పింది, పని మనిషి. ‘గుఱ్ఱానికి గుగ్గిళ్ళు పెట్టద్దు. వాటిని మూతి చిక్కం బుట్టలో పోసి ఉంచు, మనిషిని పంపుతా’ అనే లోగా ఇల్లాలొస్తే ‘నేను రావడం ఆలస్యమవుతుంది. గ్రామ నవుకరొస్తాడు, వాడికి దాణా బుట్ట ఇచ్చి కూచోమని చెప్పండి, నా దగ్గరనుంచి కబురొచ్చేదాకా’, అని వెళ్ళిపోయాడు, మునసబు ఇంటికి. అరుగుమీద కూచున్న మునసబు గబుక్కున లేచి వచ్చి చేతులు పట్టుకుని అరుగు మీదకు తీసుకువెళుతూ ఏదో మాటాడు కున్నారు. మునసబు వెంటనే మనిషిని పిలిచి, పేర్లు చెప్పి వాళ్ళని వెంటనే దగ్గరుండి తీసుకు రమ్మని చెప్పేడు. కబురు తెలిసిన వెంటనే జమా జట్టీలలాటి ఐదుగురు యువకులు వచ్చేరు. వాళ్ళలో నలుగురికి ఏదో చెప్పి పంపి, ఐదవవాడిని తొందరగా వెళ్ళి ‘గ్రామ నవుకరును వెంట పెట్టుకు రమ్మని’ పంపేరు. గ్రామనవుకరు రాగానే ‘మా ఇంటికెళ్ళి గుగ్గిళ్ళ బుట్ట తీసుకుని అక్కడ నీకు కబురు వచ్చేదాకా కూచో’, అని చెప్పి, రహస్యంగా ఏదో చెప్పి పంపేసి, ఇద్దరూ చెరువు గట్టుకు బయలు దేరేరు.

చీకటి ముదిరింది, ఒక్కొక ఇంటి నుంచి ఒక్కొక యువకుడు బయలుదేరేడు, మౌనంగా, నడిచిపోతున్నాడు, చెరువు గట్టుకి, వీరిలో కొందరి చేతిలో ఉప్పరి తట్ట, పలుగు, పార లతో బయలుదేరారు. కరణం, మునసబూ చెరువు గట్టుకు చేరిన కొద్ది సేపటికి ఒక్కొకరూ వస్తున్నారు. చూస్తుండగా వారు ఒకట్లనుంచి పదులు తరవాత వందల సంఖ్యకి చేరేరు. అంత మంది అక్కడ ఉన్నా అదే నిశ్శబ్దం. అవసరమయి మాటాడినా పక్కవానికి మాత్రమే వినపడే గొంతుతో. కొంత మంది ఎండిపోతున్న చెరువులో దిగేరు, గునపాలు, పారలు, ఉప్పరి తట్టలతో మరికొంత మంది చెరువు నుంచి గుడి దక్షణం గోడ వరకూ నిలబడ్డారు, తడి ఇసక తవ్వుతున్నారు, గంపలలో నింపుతున్నారు, ఆగంపలు చేతులలో లేస్తున్నాయి, గోడ దగ్గరకు చేరుతున్నాయి,చప్పుడు కూడా లేకుండా ఇసక పోస్తున్నారు. చూస్తుండగానె తడి ఇసుక గోడ ఎత్తునా ఏటవాలుగా పోశారు, నిశ్శబ్దంగా. ఈలొగా ఎండు గడ్డి తెచ్చారు, ఇసకమీద కప్పేశారు. కబురెళ్ళింది, కరణం గారి ఇంటి దగ్గర కూచున్న గ్రామ నవుకరుకు. కీలక దశకు చేరుకుంది వ్యవహారం. అందరిలోనూ ఆతృత, ఏం జరుతుందోనని, కరణం గారి ఇంటి దగ్గర దీపం క్రీనీడలో కూచున్న గ్రామ నవుకరు బయలుదేరాడు, గుగ్గిళ్ళ బుట్ట పుచ్చుకుని.రహదారి బంగళా చేరుకున్నాడు. నిశిరాత్రి అయిందేమో,వాచ్ మన్, దొర అందరూ మంచి నిద్రలో ఉన్నారు. రెండు రోజుల నుంచి మాలిమి అయివున్న గుఱ్ఱం దగ్గరకెళ్ళేడు, గ్రామ నవుకరు, వెంటనే గుఱ్ఱం సకిలించకుండా గుగ్గిళ్ళ బుట్ట మూతికి తగిలించేసేడు. అటూ ఇటూ చూసి దొర నిద్ర పోతున్నాడని రూఢి పరచుకుని గుఱ్ఱం కాలి తాడు విప్పి, చెవి పట్టుకుంటే కుక్క పిల్లలా నడచి వచ్చేసింది గుఱ్ఱం,కూడా…గుఱ్ఱాన్ని గుడి దగ్గరకు తీసుకొచ్చేడు, గుఱ్ఱాన్ని, గ్రామ నవుకరునూ చూసిన అందరిలోనూ ఆనందం, పైకి వెలిబుచ్చలేక చేతులు పిసుక్కున్నారు. నెమ్మదిగా గ్రామ నవుకరు తడి ఇసుక మీద వేసిన గడ్డి పైనుంచి గుఱ్ఱాన్ని గుడి మీదకి చేర్చేశాడు. వెంటనే గడ్డి తీసేసి, ఇసుకను మళ్ళీ పారలతోతట్టలలోకెత్తి,  చెరువులో పోసి ఎవరి మటుకు వారు ఇంటి దారి పట్టేరు. ఈ పని అయ్యేటప్పటికి, గుఱ్ఱం గుగ్గిళ్ళు తినడమూ అయింది, గుఱ్ఱం తో వున్న గ్రామ నవుకరు మూతికి ఉన్న బుట్ట తీసేసి, దానిని చంకకి తగిలించుకుని, గుడిగోడ పక్కనే ఉన్న చింత చెట్టుకొమ్మ పట్టుకుని కిందికి దిగివచ్చి, కరణంగారితో ఇంటికి వెళ్ళి బుట్ట ఇచ్చేసి ఇంటి కెళ్ళి గుఱ్ఱు పెట్టి నిదరపోయాడు. కరణం మునసబులు హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకున్నారు, తమ ధర్మాగ్రహం అలా తెలిపినందుకు. తెల్లారింతరవాత జరిగిన కధ నిన్న చెప్పేనుగా” అన్నాడు.

swarms in field

ఒకడు గుఱ్ఱాన్ని ఎందుకు గుడెక్కించేరని ప్రశ్నించేడు, ‘ఒరేయ్! ముందే చెప్పేను కదా ఆంగ్లేయుల పాలన, వారి దయ మీద రోజులు నడుస్తున్నాయి. ధర్మమైనది కోరితే దొర కాదంటున్నాడు, ధర్మాగ్రహం వెలిబుచ్చాలి, పనీ చేయించుకోవాలి, నొప్పి తగలకూడదు, అందుకే మిడతల దండు పంట పాడు చేస్తే, మిడతల దండులా ప్రజలు నిశ్శబ్దం గా తమ ధర్మాగ్రహాన్ని, గుఱ్ఱాన్ని గుడెక్కించడం ద్వారా తెలియ చేసేరు. అది గ్రహించుకున్న దొర శిస్తు రెమిషన్ ఇచ్చి మరే కదిలేడు’,అన్నాడు మా జానకిరావుడు. మాలో ఒకడు ‘అంటే మిడతలదండు గుఱ్ఱాన్ని గుడెక్కించిందనమాట’ అన్నాడు. దానికి జానకిరావుడు ‘అన్నమాట కాదు ఉన్నమాటే’ అన్నాడు.

విజ్ఞప్తి;- ఈ భాగం ముందుగా చదువుతున్నవారు దయుంచి మొదటి రెండు భాగాలూ చదవండి.

https://kastephale.wordpress.com/2013/06/11/  ఈ రోజు రెండు టపాలున్నాయి, గమనించగలరు.

https://kastephale.wordpress.com/2013/06/14/