శర్మ కాలక్షేపంకబుర్లు- వ్యసనాలు ఏడు కాదు పద్ధెనిమిది

వ్యసనాలు ఏడు కాదు పద్ధెనిమిది

agegagei

ఇప్పటిదాకా వ్యసనాలు ఏడే అనుకుంటున్నా, కాదుట చూడండి.

దశ కామ సముత్థాని తథాష్టౌక్రోధజానిచ
వ్యసనాని ప్రయత్నేన విసర్జయేత్

కామజములైన వ్యసనములు పది,క్రోధజములైన వ్యసనములు ఎనిమిది- ఈ వ్యసనములకు లోనుకాకుండ ప్రయత్నపూర్వకముగా వీటిని విసర్జించవలెను.

మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః
తౌర్యత్రికం వృధాట్యాచ కామజో దశకోగణః
పైశున్యం సాహసం ద్రోహ ఈర్ష్యాసూయార్ధ దూషణేః
వాగ్దండనంచ పారుష్యమ్ క్రోధజోఽపి గణోఽష్టకః….మనుస్మృతి

వేట,జూదము,పగలు నిద్రించుట,నిందించుట,స్త్రీలౌల్యము,గర్వపడుట,నృత్య,గీత,వాద్యములందు విపరీత ఆసక్తి,వ్యర్థముగా తిరుగుచుండుట-ఈ పది కామజనక వ్యసనములు.చాడీలు చెప్పుట,దుస్సాహసము,ద్రోహచింత,అసహనము,ఇతరుల గుణములందుదోషములు ఆరోపించుట, ధనము కొరకై నీచముగా మాటాడుట, కఠినముగా మాటాడుట అను ఈ ఎనిమిది క్రోధజములైన వ్యసనములు.

వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు పల్లదనంబును, దండంబు బరుసదనము,
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత, యనెడు సప్త వ్యసనముల జనదు తగుల.

పై పద్యం భారతం లోది విదురుడు చెప్పినది. ఇందులో స్త్రీ పురుష సంబంధము, జూదం, తాగుడు, వేట, దంభాలు పలకడం, సొమ్ము అనవసరంగా ఖర్చు పెట్టడం,ఇలా సప్తవ్యసనాలు చెప్పేడు.మనువు చెప్పినదానిలో ఇవన్నీ ఉన్నాయి, కాని ఒకటిలేదు అదే వారుణి అనగా తాగుడు. మరి మనువు కాలానికి అది నిషిద్ధమో లేక వ్యసనం దాకా పోలేదో తెలియదు.

మరొక సంగతి,పానము,స్వతంత్రం రాక ముందు కూడా ప్రభుత్వాలు తాగుడు మీద ఆదాయం తోనే బతికినట్లు అనిపిస్తూ ఉంది. స్వతంత్రం వచ్చాకా గాంధీ పేరు చెప్పి తాగుడు రద్దు చేసేరు, దేశంలో. అప్పుడు పెద్దలే సొమ్ము చేసుకున్నారు,దొంగ తనంగా లిక్కర్ దేశం లో కి తెచ్చి, దేశంలోనే దొంగతనంగా తక్కువరకం తాగుడు తయారు చేసి ప్రజలకి అమ్మి. ప్రజలని తాగుడుకి బానిసలను చేస్తున్నారు.వీరు మానెయ్యచ్చు కదా అని ప్రశ్నించవచ్చు, అంత మనోసంకల్పం లేకనే కదా తిప్పలు.ఇప్పుడు బహిరంగంగానే తాగుడుకి లైసెన్స్ ఇచ్చేసేరు. మందుకొట్టులేని వీధి లేదు. కావలసినంత రాబడి. ఈ దుకాణాలెవరివీ, పెద్దలవే. వారెవరూ పార్టీ ల అధ్యక్షులు, లేదా పదవిలో ఉన్నవారు, లేదా మంత్రులు, లేదా ఎమ్.ఎల్.ఎ లు లేదా రాజకీయ పలుకుబడిగల పెత్తందార్లు. వీరు సమాజాన్ని ఇలా దోచుకుని తింటూనే వున్నారు.నేడు గాంధీ, బ్రాందీ మాటలు తప్పించి మరో మాట వినపడటం లేదు 🙂 మళ్ళీ పాపం పుణ్యం దేవుడు భక్తి మొక్కులుఅంటూనే ఉన్నారు.ఈ వ్యసనానికి జనాలని బానిసలని చేస్తున్నారు.  గుడికెళ్ళిన పుణ్యం ఇలా సంపాదించిన పాపాన్ని పరిహరించలేదు. 

 సొమ్ము సంపాదించడం వ్యసనమైపోయింది..ఎన్నివేల కోట్లు అక్రమంగా సంపాదించినా, కూడా ఒక్క పైసా తీసుకుపోలేడు. ఆ సత్యం తెలిసేలా ఉదాహరణ చూపించి చెబితే సరిపోదంటారా?ఎన్నివేల కోట్లు అక్రమంగా తిన్నా, నూరు గొడ్లను తిన్న రాబందుకి ఒకటే గాలిపెట్టు.అంటారు కొందరు. ..దేవుడా వీళ్ళని మార్చు అని గోల పెట్టినంత కాలం వీరు మారరుగాక మారరు…కిం కర్తవ్యం….దండం దశగుణం భవేత్.అంటున్నారు, కొంతమంది. దానివల్ల మారతారా? కష్టమే కాని, సత్యాగ్రహానికి తెల్లవాడే లొంగేడు! వీళ్ళనగా ఎంతంటారు?ఆంఆద్మీలని ఎంతమందిని చంగలరంటారు? భయపడితే విభజించి పాలించడాన్ని పూర్తిగా నేర్చుకున్నవారు ఏమయినా చేయగలరు. భయం వదిలేద్దాం, నిలతీద్దాం, పరువు తీద్దాం, అప్పుడు లొంగి వస్తారు. సుప్రీమ్ కోర్ట్ తీర్పులలాటి వాటిని ఉపయోగించుకుందాం.అంటారు కొందరు.. …ఏమో ఈ వ్యసనం నుంచి మరలి భారతీయ సంస్కృతికి ఎప్పుడు మళ్ళుతారో…ఏమో..అంతవరకు.. తస్మాత్ జాగ్రత.

ccdgbcie

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- వ్యసనాలు ఏడు కాదు పద్ధెనిమిది

  1. ” నాకే గాదు . ఆయనకూ అలవాటుంది ” అని ఒకరంటే , ” నాకూ మితంగా అలవాటు . తప్పేముంది ” అని ఇంకొకరుగా – నిన్న, ఇవాళ మన నేతలు తాగుడును వ్యసనం లిస్టు లోంచి తొలిగించేశారు . మీడియాలో రసవత్తరమైన వాదనలు ఇంకా
    కొనసాగుతూనే ఉన్నాయి . ఇకపోతే – పెజా సేవ కోసం ఆరాటం , బ్లాగుల్లో తిట్టుకోవడం మొదలైన అనేక కొత్త వ్యసనాలు లిస్టులో చేర్చవలసి ఉంది .

    • @మిత్రులు లక్కాకుల వేంకట రాజారావు గారు,
      >>>” నాకే గాదు . ఆయనకూ అలవాటుంది “>>> ఇకపోతే – పెజా సేవ కోసం ఆరాటం , బ్లాగుల్లో తిట్టుకోవడం మొదలైన అనేక కొత్త వ్యసనాలు లిస్టులో చేర్చవలసి ఉంది .

      నేను చెప్పలేకపోయినది మీరు పూర్తి చేసేరు.
      ధన్యవాదాలు

  2. మద్యం సేవించిన వారు మరణానంతరం నరకానికి వెళ్ళినప్పుడు , అక్కడ యమభటులు వారితో సలసలమరిగే ద్రవాన్ని త్రాగిస్తారని గ్రంధాలలో చదివినట్లు గుర్తు.
    చిత్రమేమిటంటే మద్యం అమ్మే షాప్స్ వాళ్ళు కొందరు తమ షాపుకు దేవుని పేరు పెడుతున్నారు. త్రాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఇదంతా దేవునికి ఇష్టం ఉండదు కదా ! దైవానికి ఇష్టం లేని పనులు చేస్తూ తమకు మందు వ్యాపారంలో లాభాలు రావాలని పూజలు చేసే చిత్రమైన భక్తుల సంఖ్య పెరిగిపోయింది.
    మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజాసంక్షేమం అనటమే విచిత్రం. వందల కోట్ల ప్రజాధనాన్ని విదేశీబాంకుల్లో దాచుకునే వారిని ఏమీ చేయ్యకుండా ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు డబ్బు లేదు అంటున్నారు.
    మనది ప్రజాస్వామ్యం , ప్రజలే ప్రభువులు కదా ! మనల్ని మనమే తిట్టుకోవటం తప్ప, ఇప్పుడు ఎవరిని అని ఏం లాభం లేదండి. యధాప్రజా తధారాజా అన్నట్లు ఉంది పరిస్థితి.

    • @అనురాధ,
      మరో చిత్రం మీకు తెలుసో, తెలియదో, కంపెనీకి దేవుని పేరు అందులో ఆయనకి ఐదు పైసలవాటా కూడా ఉంటుంది.
      ధన్యవాదాలు

  3. శర్మ గారూ ,

    నమస్తే ,

    స్వార్ధం పై చేయిగా ఉన్నంతకాలం , ఏ కాలం బాగుపడదు . ఆ స్వార్ధం విడనాడిన నాడు మాత్రమే బాగుపడ్తుంది . దానికి మన పూర్వీకుల నుడివిన ఆ కృత( సత్య ) యుగం రావాల్సిందే . అందాకా ఈ మందు కొనసాగుతూనే వుంటుంది . మనవాళ్ళు అరువు తెచ్చుకున్నది వ్యసనమే గాని ఆ తెల్లదొరల మందు మాత్రం కాదు . ఎందుకంటే ఆ తెల్లవాళ్ళు అనుక్షణం ఆ మందు తాగుతూనే వుంటారు . ఒక్కడు తూలినవాడు లేడు , అనవసరంగా వాగినవాడు లేడు , అర్ధరహితంగా నేల పడినవాడూ లేడు .

    • @శర్మాజి,
      అవి చలి దేశాలు. వారికి అవసరం కావచ్చు. మనది సమశీతోష్ణమయిన ప్రాంతం 14 N to 19 N. మరి ఇక్కడ వ్యసనం కాదా?
      ధన్యవాదాలు

వ్యాఖ్యానించండి