దింపుడు కళ్ళం ఆశ….
దింపుడు కళ్ళం ఆశ అన్న మాట చాలాసార్లు వాడుతాం….కాని దాని కధాకామామిషూ చూద్దాం. ఒకప్పుడు జిలేబీ గారికి మరణం గురించి వ్రాయనని మాటిచ్చాను. ఇప్పుడు జిలేబి గారు సకృత్తుగా కనపడుతున్నారు, ఒట్టు తీసిగట్టున పెట్టేసి రాసేస్తున్నా! జిలేబిగారికి క్షమాపణలతో, “దాసుని తప్పు దండంతో సరికదా!”ఇది సామెతలెండి 🙂
మరణించారని, చేతినాడి (కాలిదగ్గర నాడి కూడా చూడచ్చు)చూసి,గుండె కొట్టుకోడం మానేసిందని, ఊపిరి నిలబడిపోతే, మరణించినట్లు నిర్ధారణ చేసుకుని, తరవాత మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడతారు. సాధారణంగా ఈ కార్యక్రమాలన్నీ మగవారే చేస్తారు. కొన్ని కొన్ని చోట్ల స్త్రీలు కూడా శ్మశానానికి వెళ్ళే సంప్రదాయం ఉంది. మానవులు పుట్టక ముందునుంచి సంస్కారాలు ప్రారంభమవుతాయి, తల్లి కడుపునుంచే. అవి మొత్తం పదహారు. ఈ చివరిదైన దానిని అంత్యేష్ఠి సంస్కారం అంటారు. అనేక మతాలవారు అనేక విధాలుగా ఈ సంస్కారం చేస్తారు,ఎవరెలా చేసినా చివరి సంస్కారం ఒకటే, పంచభూతాలలో ఈ పాంచభౌతిక శరీరాన్ని కలిపేయడం. ( నేను నాకు తెలిసిన ఎక్కువమంది చేసే సనాతన ధర్మ సంస్కారం చెబుతున్నా! మన్నించాలి). మొదటగా శరీరాన్ని తీసుకొచ్చి మూడు పీటలమీద పడుకోబెడతారు. (పీట మీద పడుకోవద్దంటారు పెద్దలు కారణం ఇదే) చనిపోయినవారి పిల్లలు బిందెలతో చల్లటి నీళ్ళు పోస్తారు ( ఒక్కొకచోట వేడి నీళ్ళు పోసే ఆచారం ఉంది). ఆ తరవాత అలంకారం చేస్తారు ( దీనినే ‘శవాలంకారం’ అంటారు, ఎందుకంటే ఇదంతా వ్యర్ధం కనక.) ఏడుకట్ల సవారి తయారు చేస్తారు. ఏడు కట్లే ఎందుకని ప్రశ్న రావచ్చు. ఒక్కొక కట్టుకు మధ్య దూరం ఒక అడుగుంటుంది. అలా ఆ వాహకానికి ఏడు కట్లు వేస్తే, అది ఆరడుగుల పొడుగొస్తుంది, సాధారణంగా సగటు మనిషి పొడుగంతే, ఇంతకు మించి ఏడు కట్లకి ప్రత్యేకత ఏం లేదని నా నమ్మకం. ఈ వాహకానికి ’పాడె’ అని పేరు. ‘నీ పాడె కట్ట’ అని తిడతారు కూడా. ఆ తరవాత పాడె మీద పడుకోబెట్టి గట్టిగా తడపలతో శవాన్ని బిగిస్తారు, ‘పడిపోకుండా’ అంటారు. నలుగురు వాహకులు పాడెను ఎత్తుకుంటారు. (అందుకే ‘నలుగురితోనయినా సఖ్యంగా ఉండు’ అంటారు. ఒక పెద్దాయన చనిపోతే, ఇలా వాహకులు అనగా మోసేవారు దొరక లేదట. అప్పుడు అక్కడున్న ఒకరు ‘మావాడు బతికీ నిర్వాహకుడే, చచ్చీ నిర్వాహకుడే’ అని చమత్కరించారట. నిర్వాహకుడు అంటే సమర్ధుడని, వాహకులు లేనివాడని అర్ధాలున్నాయి కదా). ఉత్తరాదివారైతే ’రామ్ నామ్ సత్య హై’ అంటూ ఊరేగింపు చేస్తారు. మనవారు తెనుగునాట ‘నారాయణ’ మంత్రం చెబుతూ పాడె లేవతీస్తారు. ఇప్పుడంటే ఏమీ లేవుకాని నేనెరిగుండగా, శ్మశానానికి తీసుకుపోయేటపుడు డోలు, సన్నాయి, బేండు మేళం కూడా పెట్టేవారు, ఈ ఊరేగింపుకి. ముందు వాద్యకారులు నడుస్తుంటే వెనక పాడె వెళ్ళేది. పాదెపై బుక్కా, చిల్లర డబ్బులు, పువ్వులు కలిపి చల్లేవారు. పల్లెలలో శ్మశానం ఊరికి దూరంగా ఉండే ఆచారం, ఈ పాడెను మధ్యలో దింపేవారు, కొద్ది కార్యక్రమం తరవాత కొడుకు తొడకొట్టుకుంటూ పాడెకు ప్రదక్షణం చెయ్యాలి. ( తొడ కొట్టుకోవద్దంటారు పెద్దలు, కారణం, ఇప్పుడు మాత్రమే కొట్టుకోవలసిన తొడ అప్పుడు కొట్టుకోవద్దని ) ఇలా మూడు సార్లు మూడు చోట్ల దింపి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. చివరిగా పుల్ల మీద పడుకోబెడతారు. అప్పుడు చనిపోయిన వారి కొడుకు సమంత్రకంగా గుండె దగ్గర నిప్పు పెడతారు.ఆ తరవాత నేను చెప్పక్కరలేదు.
మనవారు చేసే అన్ని పనులకూ పరమార్ధం ఉంది, అది మనం తెలుసుకుంటే బాగుంటుంది. మొదటి నుంచి చర్యలు చూడండి, ఇవన్నీ దింపుడు కళ్ళం ఆశలు, పొరపాటుగా బతికి ఉన్నవారిని శ్మశానానికి తీసుకుపోయి తగలపెడుతున్నామేమో అనే అనుమానంతోనూ, చనిపోయిన వారు మరలా బతుకుతారేమో అనే ఆశతోనూ, ఈ చర్యలన్నీ సంకల్పించారు. ప్రత్యేకంగా పాడెను కిందకి దింపి మరీ కొన్ని ఆచరిస్తారు. అందుకే దీనిని దింపుడు కళ్ళం ఆశ అంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో శ్మశానం దాకా తీసుకుపోయినవారు తిరిగి బతికిన సంఘటనలూ ఉన్నాయి.
నేడు మన రాష్ట్రంలో ఈ దింపుడు కళ్ళం ఆశ పనులు జరుగుతున్నాయంటారా?కులాల, మతాల, ప్రాంతాల కుమ్ములాటలతో ప్రజలను విడతీసి, ఓట్లు, సీట్లు, స్వార్ధం, అధికారమే పరమావధిగానూ, డబ్బు సంపాదన, అక్రమంగా పోగేసుకున్నదానిని రక్షించుకోడానికి మీరు పాట్లు పడుతూ, ప్రజలను మభ్యపెడుతూ, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేసిన రాజకీయనాయకులందరూ, నేటి పరిస్థితికి కారకులే… కాదంటారా?
సంతాపం.
ఇప్పుడే తెలిసింది ఎ.ఎన్.ఆర్ మరి లేరని. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియచేస్తున్నా.
శర్మగారు ,నిజానికి ఇవన్నీ ఇంత వివరంగా తెలియదు …తెలిపినందుకు ధన్యవాదములు . దింపుడు కళ్ళెం సంగతటుంచి ఈ మధ్య బ్రతికి ఉన్న వృద్ధ తల్లిదండ్రులను శ్మశానంలో వదిలి వెళ్ళి పోయిన వారిని గూర్చిన వార్తలు కూడా వచ్చాయి , అంతటి ఘనులుండగా ఇక దింపుడు కళ్ళెం సంగతి అవసరం గూర్చి ఆలోచించే వారు ఉంటారా ? దింపుడు కళ్ళెంతో తిరిగి లేచి వస్తారేమో అనే భయంతో మొత్తానికి ఆ చాప్టరే మూసేసారేమో ,మన వారు సాంప్రదాయ విరుద్ధమైనా తెగించేస్తారు . మోడ్రన్ జమానా కదా ఎంతైనా .
@శ్రీ దేవి గారు,
పాతకాలం వాడిని కదా! ఆ కాలంలో నే ఉండిపోయా!! నేటివారు దేనికయినా తగుదురు.!!!
ధన్యవాదాలు.
శర్మగారూ! నమస్కారం. భారతంపై ఒక సందేహం. కొద్దిరోజులనుంచి ఒక హిందీ ఛానల్‌లో రాత్రి 8.30గంటలకు భారతం సీరియల్‌గా వస్తోంది. దీనిలో ద్రుపదుడు కేవలం దృష్టద్యుమ్నుడినే యజ్ఞంద్వారా కోరుకున్నట్లుగానూ, ద్రౌపదికూడా యజ్ఞంనుంచి రావటం ఆయనకు ఇష్టంలేనట్లు, ద్రౌపదిని ఆయన ద్వేషిస్తున్నట్లు చూపుతున్నారు. కానీ వ్యాసభారతంలో ఇలా లేదని నేననుకుంటున్నాను. మీరు నిర్ధారణ చేయగలరు. కృతజ్ఞతలు.
@తేజస్వి గారు,
రామాయణ,భారత,భాగవతాలని సినిమా,టీ.వీ వారు చేసినంత కంగాళీ మరెవరూ చేయలేదండి.
దృష్టద్యుమ్నుడు ఒకడే కావాలని ద్రుపదుడు యజ్ఞం చేయలేదండి. ఏమైనా ఒక సారి ఆఘట్టం మరొక సారి పరిశీలన చేస్తాను. ద్రౌపది జననం లేకపోతే భారత కధ నడవదు కదండీ!
ధన్యవాదాలు.
తేజస్వి గారు,
భారతంలో ఆ భాగం చూశాను, అందులో ద్రోణుని చంపే కొడుకు అర్జునునికి భార్యగా కూతురు కావాలని యజ్ఞం చేసినట్టు చెప్పబడింది.
కష్టే ఫలే వారు,
మీరు ఈ టపా రాసాక అక్కినేని వారి వార్త చూసారా ? లేక ఆ వార్త ఈ టపా కి ఆలోచన కలిగించిందా ?
టిబెట్ దేశాచారం లో మృతుల ని మాంసపు ముద్ద గా కోసి పక్షులకి ఒక నిర్దేశించ బడ్డ ప్రదేశం లో అర్పించే ఆచారం ఉన్నది . (మహా భూతాలకి అర్పణం – ఆకాశ ఖననం )
ఉత్తర భారత దేశం లో గంగార్పణం .
ఇక వర్మ గారి తొడ కొట్టే ఆచారానికి అర్థం అన్న ప్రశ్నకి నాకు అర్థమైనది – సరియో లేదో తెలీదు – గుండె కి తొడకి ఉన్న లంకె . ఇది నా ఊహ మాత్రమె .
జిలేబి
@జిలేబి గారు,
ఈ టపా ఇరవై మూడుకి వెయ్యాలనుకున్నా, నేటి రాష్త్ర పరిస్థితి గురించి. ఎందుకో ఇరవై రెండునే టపా వెయ్యాలనిపించి ఇరవై ఒకటి రాత్రి షెడ్యూల్ చేసి పడుకున్నా. ఉదయం లేచేటపటికి టపా వెళిపోయింది. కబురు తెలిసి చివర సానుభూతి కలిపేను.
చాలా చోట్ల చాలా రకాలుగా చేస్తారు.
ధన్యవాదాలు.
ఇచ్చిన ఒట్టు గట్టున పెట్టీ,
చావు కబురు చల్లగా చెప్పారండి.
ఆయన ఆత్మ సద్గతి పొందాలని కోరు కుందాము.
@మోహన్జీ,
చావు కబురు చల్లగా చెప్పమన్నారు కదండీ!.ఒట్టు తీసి గట్టున పెట్టేముందు అమ్మ జిలేబి తల్లికి దండం పెట్టేను కదండీ 🙂
ధన్యవాదాలు.
శర్మగారూ,
నమస్కారం. కొడుకు తొడగొట్టుకుంటూ ప్రదక్షణం చెయ్యడం వెనుక ఉన్న అర్ధం ఏమిటో కాస్త వివరిస్తారా?
భవదీయుడు,
వర్మ
@వర్మాజీ,
నాకూ తెలియదు కాని జిలేబి గారన్నట్టు తొడకి గుండెకి సంబంధం ఉంది. బహుశః పాడెమీద వారి తొడపై చరిచే అలవాటు ఇలా రూపాంతరం చెందిందేమో.
ధన్యవాదాలు.