శర్మ కాలక్షేపంకబుర్లు-దుర్యోధన ఊరుభంగం-నిజం.

దుర్యోధన ఊరుభంగం-నిజం.

పద్దెనిమిదవనాటి యుద్ధ చివరి విశేషాలు చెప్పడానికి ఉపక్రమిస్తూ సంజయుడు ఇలా అన్నాడు

పలపలనిమూకలో కాల్ నిలువకగుఱ్ఱంబుడిగ్గి నీ కొడుకు గదా
కలితభుజుండై యొక్కడు దొలగి చనియె నేమి చెప్పుదుం గురునాథా! !

”కురురాజా! ఏమని చెప్పమన్నావు, యుద్ధరంగంలో కాలు నిలవక నీకొడుకు గుఱ్ఱం దిగిఒక్కడూ గద భుజం మీదవేసుకుని నడచి వెళ్ళిపోయాడయ్యా, యుద్ధ రంగం నుంచి” అన్నాడు.

పదకొండు అక్షౌహిణీల బలమంతా మడసిపోగా దుర్యోధనుడొక్కడూ యుద్ధరంగానికి ఈశాన్యంగా ఉన్న మడుగు దగ్గర కెళ్ళాడు. ఆ సమయం లో దుర్యోధనునికోసం పాండవులు వెతుకుతుండగా నేను కనపడ్డాను. దృష్టద్యుమ్నుడు నన్ను పట్టుకుని ”వీడేం చేస్తాడో” అని నరికేయడానికి కత్తి దూస్తే వేద వ్యాసులు ప్రత్యక్షమై నన్ను విడిపించారు. ”బతికిపోయావు పో” అని పంపేరు. నేను మడుగు సమీపానికి వెళితే నీ కొడుకు కనపడ్డాడు. నన్ను చూసి బుర్రవంచుకున్నాడు. నేను ఏడుస్తూ నేను ఎలాబతికినది చెబితే ”మన పక్క బతికినవారున్నారా?” అని ప్రశ్నించాడు. ”కృపాచార్యుడు,కృతవర్మ, అశ్వద్ధామ మాత్రం మిగిలారు” అని చెప్పేను. ”మరో మనిషిలేకుండా అందరిని చంపేరు, వాళ్ళకి దొరకకుండా బతికేను, అంతే చాలు” అనుకున్నాడు. ”ఇప్పటికి ఈ మడుగులో దాకుంటా. ఆ తరవాత ఎక్కడికైనాపోయి బలం సమకూర్చుకుని పగ తీర్చుకుంటా”నంటూ జలస్థంభన విద్యతో ఆ మడుగులో దాక్కున్నాడు,ధర్మరాజు వస్తున్న అలజడి వస్తే నేను పొదలో దాక్కున్నా.

ధర్మరాజు తన పరివారంతో వచ్చి వెతికి దుర్యోధనుడు దొరకకపోతే వెళ్ళిపోయాడు. వెళుతూ అక్కడున్న పల్లెకారులకు ”ఇక్కడే ఎక్కడో, దుర్యోధనుడున్నాడు, మీకు కనపడితే కబురు చెప్ప”మన్నాడు. ఈలోగా కృప,కృతవర్మ,అశ్వద్ధామలు వచ్చారు, దుర్యోధనుడు పైకి వచ్చాడు, వారు యుద్ధం చేద్దామన్నారు. ”అలసిపోయాను, యుద్ధం చేయాలని లేదు, విశ్రాంతి తీసుకుని తరవాత చూద్దా”మన్నాడు, దుర్యోధనుడు. ఈలోగా పల్లెకారులవల్ల కబురు తెలిసిన ధర్మరాజు మళ్ళీ వస్తున్న అలికిడి విని వీరు తప్పుకున్నారు. దుర్యోధనుడు జలస్థంభన విద్యతో మడుగులో దాక్కున్నాడు, నేను ఒక పొదలో దాక్కున్నాను. ధర్మరాజు బలగంతో తమ్ములతో, కృష్ణునితో వచ్చినవాడు, కృష్ణునికి మడుగు చూపించి ”ఇక్కడే దాక్కున్నాడ”ని తగ్గు స్వరంతో చెబితే, కృష్ణుడు, ”మాయలు చేసేవాళ్ళని మాయతోనే చంపాలి, వాడి దగ్గరకు చేరలేమంటున్నావు కనక వాడు బయటకు వచ్చే మార్గం చూడ”మంటే, ధర్మరాజు దుర్యోధనుని ఉద్దేశించి పొటుకు మాటలు, ఉల్లికుట్టుమాటలు,మాట్లాడితే దుర్యోధనుడు మడుగునుంచి బయటికి వస్తూ ”మీ అందరిని గదతో చంపేస్తా రండి, ఒక్కొకరూ,” అంటుంటే పాండవులు, మిగిలినవారు చప్పట్లు చరుస్తూ నవ్వేరు. పౌరుష పడ్డ రారాజు ”నవ్వండి, నవ్వండి ఒక్కఒకళ్ళని చంపేదాకానే నవ్వుతా”రని ఈసడించాడు.

అప్పుడు ధర్మరాజు ”నీకు కావలసిన ఆయుధం తీసుకో, మాలో ఎవరో ఒకరితో నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు గెలిస్తే రాజ్యం ఏలుకో, మా వాడు గెలిస్తే మేము రాజ్యాం ఏలుకుంటా”మన్నాడు. ఇది విన్న కృష్ణుడు ”ఇదేం తెలివితక్కువమాట, ఇలాగే ఆ నాడు ద్యూతంలో నూ ఓడిపోయినది. దుర్యోధనుడు ఉద్ధతి మీద ఉన్నాడు. భీముడు కూడా అతనిని ఓర్చలేడని తగ్గు స్వరంతో చెప్పి, మొత్తానికి భీముని యుద్ధానికి సిద్ధం చేస్తాడు, మాటలతో. శిష్యులిద్దరూ తలపడుతున్నారన్న వార్త తెలిసి తీర్థయాత్రల కెళ్ళిన బలరాముడు వచ్చారు. అందరూ మళ్ళీ యుద్ధ రంగానికి చేరేరు. దుర్యోధన, భీముల మధ్య భీకరమైన గదా యుద్ధం మొదలయింది, అందరూ చుట్టు చేరి చూస్తున్నారు. ఈ సందర్భం లో అర్జునుడు కృష్ణునితో బావా! ”ఈ ఇద్దరిలో ఎవరి విద్యా ప్రదర్శన బాగున్నది” చెప్పమన్నాడు. అందుకు కృష్ణుడు ”దుర్యోధనుడు పదమూడేళ్ళుగా సాధన చేస్తున్నాడు, అతని దగ్గర కౌశలముంది, భీముని దగ్గరున్నది భుజబలం, ఈ సందర్భంలో ఇతనిని ఎదుర్కోవడం భీమునివల్ల కూడా కాదు. ఇతనిని మాయోపాయం చేతనయినా మట్టు పెట్టకపోతే కొద్ది సేపటిలో భీముడు పడిపోతాడు” అన్నాడు. అప్పుడు అర్జునుడు విషయం గ్రహించి తొడలు చరుచుకుని సైగ చేస్తాడు. ఇది చూసిన భీముడు తనలో వితర్కించుని సమయం కోసం చూస్తుండగా, రారాజు ఎగిరి దూకుతూ గదతో మోదబోయిన సందర్భంలో, రారాజు తొడల మీద కొట్టేడు, భీముడు. దుర్యోధనుడు పడిపోయాడు. అధర్మ యుద్ధమని బలరాముడు భీమునిపైకి వెళుతుంటే పరమాత్మ ఆపేరు, పాత కాలంలో జరిగిన శపధాలు,శాపాలు గుర్తు చేశారు.

పడిపోయిన దుర్యోధనుని తల ఎడమకాలితో తన్నేడు, భీముడు. ఇది చూసిన ధర్మరాజు తప్పని వారించాడు.దీనికి ప్రతిజ్ఞను గుర్తుచేసేరు పరమాత్మ.

చాలా వివరంగా చెప్పాలి. ఓపిక తగ్గి చాలా సంక్షిప్తం చేశాను. సినిమాలలో చూపిస్తున్నట్లు కృష్ణుడు సైగ చేయలేదు. కృష్ణుడు, భీమునికి త్రాణ సరిపోదని చెప్పేరు తప్పించి తొడలు విరగగొట్టమని చెప్పలేదు., శపధం గుర్తుచేసినది అర్జునుడు, కార్యం నెరవేర్చినది భీముడు. ఇక్కడ త్రికరణాలు మనో,వాక్కు,కాయ కర్మలు కృష్ణ, అర్జున,భీములు నెరవేర్చారు. మనో వాక్కాయ కర్మలు ఏకోన్ముఖంగా ఉన్నపుడే ఫలితాలుంటాయి.

జనతా జనార్దనుడు గుర్తొస్తే నాకేం సంబంధం లేదు 🙂

యదాయదాహిః ధర్మశ్చ
గ్లానిర్భవతిః భారతః
అభ్యుత్థాన మధర్మశ్చ
తదాత్మానాం సృజామ్యహం

ఈ సందర్భంగా దుర్యోధనుని మనో విశ్లేషణ, అధికారం పోయేముందు, చావు ముందు మాటాడిన మాటలతో మరో సారి మరో టపాలో కలుద్దాం.

DSCN4606

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దుర్యోధన ఊరుభంగం-నిజం.

  • AtaljI,
   పొరబడ్డారని చెప్పడాని చింతిస్తున్నా.ఇప్పటికి ఇంకా బతికే ఉన్నాడు.
   ధన్యవాదాలు.

   • from Syamaleyam
    అశ్వత్థామ సంహారకారుడైన శివుణ్ణి ఉపాసించాడు తగిన శక్తియుక్తులకోసం. శివుడు మహాభూతాకృతిలో ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని ఇచ్చి అదృశ్యం‌ అయ్యాడు. ఆ కత్తితో‌నే అశ్వత్థామ దృష్టద్యుమ్నుణ్ణీ, ఉపపాండవులనీ చంపేసాడు – అదీ, సుఖనిద్రలో ఉన్నవాళ్ళని.

    http://mahabhagavatam.blogspot.in/2013/08/09.html

    i read in few more references also. అశ్వత్థామ దృష్టద్యుమ్నుణ్ణీ చంపేసాడు.

   • AtaljI,అనుమానం తీరింది కదా! ఈ సంఘటన తరవాత అశ్వత్ధామ దృష్టద్యుమ్నుడిని చంపినది
    ధన్యవాదాలు.

 1. ఏమండీ ‘దీ’ ‘అక్షితులు’ గారు,

  ఈ జనతా జనార్ధనుడు ఎవరుస్మీ ???

  చీర్స్ సహిత
  జిలేబి

 2. పలపలని కలనిలోపల కాల్ నిలువకగుఱ్ఱంబుడిగ్గి నీ కొడుకు గదా
  కలితభుజుండై యొక్కడు దొలగి చనియె నేమి చెప్పుదుం గురునాధా!

  లోపల కాదు లో అనే. లేదా గణం తప్పుతుంది కందంలో!

  చివరన నాథా అని ఉండాలి నాదా అని టైపో.

  విమానానికి సమయం అవుతున్నది. క్లుప్తంగా రెండు మాటలు.

  కాలు నిలుస్తుంది కాని కాల్ నిలువదు కదా, పక్కమాట మీదబడి సంధి చేసుకోవాలి చచ్చినట్లు!
  ఇదొక మంచి చమత్కారం!

  మరొక ఐతిహ్యం. తిక్కనగారు కుమ్మర గురునాథుడి గంటం ఆగకుండా చెబుతూనే ఉంటానని శపథం చేసి మొదలు పెట్టారట. ఈ పద్యంలో తొలగి చనియె అనటంతోనే నిజానికి పద్యంలో విషయమూ వాక్య,మూ కూడా పూర్తయ్యాయి! కాని పధ్యంలో ఇంకా ఇంకా కొన్ని గణాల భాగం మిగిలే ఉంది .

  అందుచేత ఆయన నిర్వేదంగా “ఏమి చెపుదుం గురునాథా!” అన్నారట, గుర్నాథుడు బుధ్ధిగా అదే వ్రాసాడు పద్యంలో.
  పద్యం సరిగ్గా కుదిరి పూర్తయ్యిందండీ గురువుగారూ, “ఏమి చెప్పుదున్ కురునాథా ” అని అతడు చెప్పటం జరిగింది. తిక్కనగారు అలా తన ప్రతినకు భంగం కలక్కుండా ఉండటంతో ఆశ్చర్యమూ ఆనందమూ పొందారట.
  ఇది మరొక మంచి చమత్కారం.

  • రావు గారు,
   ఈ టపా రాయలని కూచున్నా, ఓపిక లేకపోయినా! తప్పులు చేశా మన్నించాలి.
   తప్పు చెయ్యడం ఒకందుకు మంచిదయింది. నాకీ కుమ్మరి గురునాధుని సంగతి తెలిసింది.
   అసలు పద్య భాగ మిలా ఉంది.

   పలపలనిమూకలో కాల్ నిలువకగుఱ్ఱంబుడిగ్గి నీ కొడుకు గదా
   కలితభుజుండై యొక్కడు దొలగి చనియె నేమి చెప్పుదుం గురునాథా! !
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s