శర్మ కాలక్షేపంకబుర్లు-సర్ప, రజ్జు భ్రాంతి న్యాయం.

సర్ప, రజ్జు భ్రాంతి న్యాయం.

తప్పుగా రాయలేదు,నిజమే, మొన్న రజ్జు సర్ప భ్రాంతి న్యాయం గురించి అనుకున్నాం కదూ. అందులో చీకటిలో తాడుని చూసి అజ్ఞానంతో పామనుకుని భయపడి, వెలుగనే విజ్ఞానంతో అది తాడని తెలుసుకుని, నిర్భయం పొందాము కదా! మొన్న నొక అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయితో నాలుగేళ్ళ కితం ప్రస్థుతం జరిగిన సంభాషణ సర్ప రజ్జు భ్రాంతి న్యాయమని చెప్పుకోవచ్చేమో, నేటి రోజుల్లో అనిపించింది. ఆ సంభాషణ ఈ విధంగా జరిగింది, అవధరించండి.

అయ్యో! అయ్యో!! దానిని పట్టుకున్నావేంటి తల్లీ వదిలెయ్యి.

ఎందుకంత కంగారు?

నీ చేతిలోది పాము తల్లీ!, అది నిన్ను కాటేస్తుంది, విజ్ఞానవంతురాలివి,చదువుకున్నదానివి, పాముని పట్టుకున్నావేంటి, తెలిసి, తెలిసి?

ఓహ్! అదా భయం, ఇది పాము కాదు,ప్రేమ, పసుపుతాడు.

కాదుతల్లీ! అనుభవం మీద చెబుతున్నా, అది పసుపుతాడు కాదు, పామే సుమా!

అయ్యో! ఇది తాడే, మీరు అజ్ఞానంతోనూ, మూఢనమ్మకంతోనూ ఇది పామనుకుంటున్నారు. దానికి తోడు మీరు కవి కదా! (కనపడదు, వినపడదు) తాడును చూసి మీరు పామని భ్రమ పడుతున్నారు, భయపడుతున్నారు.నేను దీనిని మెడలో వేయించుకోబోతున్నా, తెలుసా?!

అయ్యో! చిట్టితల్లీ, నీది అనుభవరాహిత్యం, లోకం పోకడ తెలియని దానివి, అది పాము కాని, పసుపుతాడు కాదు, నన్ను నమ్ము. అయినా దీనిని ఎప్పుడు వేయించుకుంటున్నావు, మెడలో?

మూడేళ్ళ తరవాత.

తల్లీ వద్దు కాక వద్దు,ఇదింకా ప్రమాదం, ఇప్పుడు నీకు ప్రమోదంగా కనపడచ్చు, నీ కన్నవాళ్ళని, నీ బాగుకోరుకున్నవాళ్ళని బాధ పెట్టకు, నిన్ను బతిమాలుతున్నా, అది నిజంగా పాము, తాడనుకుని పట్టుకుని ఆడుకుంటున్నావు, కాటేస్తుందన్నా విన లేదు, వెళిపోయింది, సర్ప, రజ్జు భ్రాంతిలో ఉందనుకున్నా.

ఆ తరవాత అనగా మూడేళ్ళ తరవాత మొన్న కనపడింది. సంభాషణ ఇలా సాగింది.

చిట్టి తల్లీ మెడలో పసుపుతాడేదీ?

అది పసుపుతాడు కాదు, పలుపుతాడూ కాదు, పామే, నాకు మీరు చెప్పిన రోజు ప్రేమ మైకంలో, విజ్ఞానాన్ని, మోహమనే చీకటి కమ్మేసి, తాడుగానే కనపడింది, ఆ పాము. నిర్దయగా కాటేసింది, మొన్న పది రోజులకితం, మరో అమ్మాయికి పసుపుతాడు కట్టి.

మోసపోయావా? హక్కుల కోసం పోరాడవచ్చు కదా! చిత్రాలు, అధారాలున్నాయి కదా?

మోసగింపబడ్డాను. హక్కులకోసం పోరాడచ్చు, మనసులేని చోట మనువా? ఒక వేళ పోరాటం తరవాత మనువు కుదురినా, విరిగిన మనసుతో మనువా? ఇంతయిన తరవాత మనసులేని మనువు సంసారం కాదు, వ్యభిచారం.

(మరి ఇప్పటి దాకా జరిగిందేమిటి? ప్రశ్న, నాలుక చివర దాకా వచ్చినది గొంతులోనే మింగేశాను.)

ఫలితం?,చిత్రాలు, ఆనవాళ్ళు, గుర్తులు,అనుభవాలు, కిం కర్తవ్యం?

తనువునూ, మనసునూ గాయం చేసిన ఆ పాముని ఏమీ చెయ్యలేకపోతున్నా!

ఇది క్షమా! దయా!! చేతకాని తనమా?

………….

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సర్ప, రజ్జు భ్రాంతి న్యాయం.

వ్యాఖ్యానించండి