శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన

వాసన

వాసన,గంధం; సువాసన,సుగంధం; దుర్వాసన,దుర్గంధం; ఇవన్నీ తెనుగు సంస్కృత పదాలు. వాసనకి ముందు విశేషణం చేరిస్తే… ఇది ఘ్రాణేంద్రియం ద్వారా తెలుసుకునేది. ఇదీ ఒక మానసిక స్థితే! ముక్కులో ఆలిఫేకటరీ నాడులు సెన్సర్ల లాగా పని చేసి వాసన కనుక్కుని మనసుకు చెబుతాయి. మనసు బుద్ధికి చెబితే వారు ఇది మల్లెవాసన, మొల్లకి వాసనుండదు, ఇది పారిజాతపువాసన, బాగా పీల్చు అనో, ఇది కుళ్ళు కాలవ వాసన, ఘాటువాసన ముక్కు మూసెయ్యి అనో చెబుతుంది. చెయ్యి ఆపని చేస్తుంది. ఆడస్త్రీలు వేసుకునే తాంబూలపు వాసన, మగపురుషులు వేసుకునే తాంబూలవాసన వేరుగా ఉందిట. ప్రవరుడు హిమాలయాల్లో దారి తప్పిపోయి అక్కడ ఆడస్త్రీలు వేసుకునే కర్పూరతాంబూలపువాసన పీల్చి ఇక్కడ ఆడస్త్రీలున్నారని వెతకటం మొదలు పెడితే వరూధిని కనపడిందిట. మగపురుషులు వేసుకునే తాంబూలం కస్తూరివాసనేస్తుందిట, ఇప్పుడు తాంబూలం వేసుకునేటైమెక్కడ? భోజనానికే చిప్ప పుచ్చుకు తింటుంటే. అసలు మనుషుల ముక్కు వాసన చూడటం మరిచిపోయినట్టే ఉంది. జంతువులు వాసన బాగ పసికడతాయి, అందుకు కుక్క సాక్షి, దొంగలని వాసనతోనే పసికడుతుంది. మరో సంగతి పులి, సింహం తన రాజ్యపు ఎల్లలలో మూత్రం వెదజల్లి ఆ ప్రాంతం తనదిగా ప్రకటిస్తుంది. ఇందులోకి మరొక పులి, సింహం ప్రవేశిస్తే ఎదుర్కొని పోరాడి తరిమేస్తుంది. స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు ఆకర్షించడానికిగాను వారి ఒంటినుంచి ఫెరొమోన్స్ విడుదలవుతాయట. ఈ ఫెరొమోన్స్ ని ఒకరి వాసన మరొకరు ఇష్టపడటమే ప్రేమగా పరిణమిస్తుందిట. మగ ఫెరొమోన్స్ వేరుగాను ఆడ ఫెరొమోన్స్ వేరు వాసనల్లో ఉంటాయట. మనం అలవాటుగా ఒక కొట్టుకు వెళ్ళి సామానులు కొనడం లో వెనక ఆంతర్యం ఈ ఫెరొమోన్స్ అంటారు, అనగా మనం ఆ కొట్లో ఉండే ఆడ లేక మగవారి ఫెరొమోన్స్ ని ఇష్టపడి మనకు తెలియకనే అక్కడకు చేరతామట. ఇదో చిత్రం కదా! తీసుకునే ఆహారాన్ని బట్టి ఫెరమోన్స్ వాసన ఉంటుందిట. ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్న దంపతులలో ఇది కూడా ఒక కారణమేమో! అందుకే దంపతులలో ఒకరికి ఇష్టమైనవాటిని మరొకరు తినడం అలవాటు చేసుకుంటే వారి ఫెరమోన్స్ ని ఎదుటివారు ఇష్టపడే సావకాశం ఎక్కువా, విడాకులు తగ్గే సావకాశం ఎక్కువా ఉన్నట్టుంది.

సువాసన, దుర్వాసన చెప్పేరు కాని అసలు వాసన గురించి చెప్పలేదని కదా! ఒక చిన్న కత,

సముద్ర తీర ప్రాంతపు బెస్త స్త్రీలిద్దరు ఎండు చేపల్ని తట్టలనిండా తీసుకుపోయి పక్క పట్నపు సంతలో అమ్మడం అలవాటు. ఇలా జరుగుతుండగా ఒక రోజు ఎండు చేపల అమ్మకమయిపోయింది, ఒక్క సారిగా గాలి వీచింది, మేఘం కమ్మింది, వర్షం రాబోతోంది. ఈ స్త్రీలిద్దరు కూడబలుక్కుని , రాత్రికి ఇంటికి చీకటిలో, రాబోయే వర్షం లో  వెళ్ళడం కష్టం కనక దగ్గరలోనే ఉన్న ఒక పువ్వుల దుకాణదారుడిని రాత్రికి ఉండేందుకు ఆశ్రయమడిగారు. ఆ దుకాణదారుడు పువ్వులన్నిటినీ గంపలలో సద్ది పక్కగా పెట్టి, ఆ పక్కనే ఈ బెస్త స్త్రీలకి పడుకోడానికి చోటిచ్చాడు. వీరు పడుకున్నారు కాని ఎంతసేపటికి నిద్ర రావటం లేదు, ఇంతలో ఒకామె తనకు తలనొప్పి కూడా వస్తున్నట్టు ఉందని చెప్పింది. కారణం ఆలోచిస్తే, పక్కనే ఉన్న పూల గంపల నుంచి వచ్చే వాసనవలన అని తేల్చుకున్నారు. ఏమి చెయ్యాలి? బయట వర్షం బాగా ఉంది, మరోచోటు చూసుకునే సావకాశమా లేదు, అప్పుడు ఒకామె తటాలున లేచి, తాము తెచ్చిన ఎండు చేపల గంపలను బయట వర్షం లో కొద్దిగా తడిపితే చేపల వాసన గుప్పుమని కొట్టింది. ఇద్దరూ వాటిని పక్కన పెట్టుకుని హాయిగా నిద్రపోయారు. ఇదేమంటే వాసన బలవత్తరమైనది కదా! వారికి నిత్యమూ అలవాటయినది కాక పూలవాసన సువాసనే అయినా తలనొప్పి కలగచేసింది.

రెండేళ్ళ కుర్రాడు, అన్ని రాగాలూ గుర్తుపడతాడు, ఆలాపన కూడా చేయగలడు, అమ్మాయికి మూడో ఏడు పెద్ద పెద్ద లెక్కలు నోటితో చెప్పేస్తుంది. పోనీ చూదామంటే ఈ పిల్లల తల్లితండ్రులు కాని, వారి ఇద్దరి వంశాలలో కాని, ఈ విషయాలుగా కొద్దిగానైనా పరిచయమున్నవారే కనపడరు, మరి వీరికెలా వచ్చిందీ, ఇంత చిన్నవయసులో? అదీ ప్రశ్న. వీరికి పూర్వజన్మ వాసన వల్ల వచ్చినదీ విద్య. బాగా చదువుకున్న వారున్న కుటుంబం, అందరిలో చిన్నవాడు, తెలివైనవాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో ఉద్యోగం చేసినవాడు, ఆడవారి మెడలో బంగారు వస్తువులు అపహరించడం మొదలు పెట్టేడు, ఏందుకు? సొమ్ము కోసమా? కానే కాదు, మరి ఇదో పూర్వ జన్మ వాసన. ఈ శరీరం విడచిపోయేటపుడు జీవుడు  వాసన కూడా తీసుకుపోతాడు, అవి వారు నిత్యం మననం చేసుకుంటున్నవై ఉంటాయి. సాధారణం గా వీటిని గుర్తించడమూ కష్టమే. అందుకే చివరిదాకా నేర్చుకుంటూనే ఉండమన్నారు. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసనుకున్న క్షణం లో, నేను నేర్చుకోవలసినది లేదనుకున్న క్షణంలో, మానవుడు మరణించినట్లే.అందుకే చివరివరకు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతివారు నిత్య విద్యార్ధులై ఉండాలి, అదీ వాసనంటే.

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన

    • సుధాకర్ జీ,
      ఈ మధ్య వంటలో పాళ్ళు సరిగా పడక ఘుమఘుమలు తగ్గినట్టున్నాయి, మళ్ళి దారిన పడుతోందేమో 🙂
      నెనరుంచాలి.

  1. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

    చక్కటి టపా. ఎవరికి ఏ వాసన ఇష్టమో, అయిష్టమో తెలుసుకోవటములో ప్రత్యేక శిక్షణని పురుషులకు, స్త్రీలకు ఇచ్చినట్లైతే, చాలావరకూ కుటుంబాలలో సమస్యలు సమసిపోతాయి. దీనిని ఒక క్రొత్త, ప్రత్యేక పరిశ్రమగా గుర్తించి, ఎవరైనా ముందుకువస్తే బాగుంటుంది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    • మిత్రులు మాధవరావు గారు,
      తినే భోజనం నుండే మనిషి సత్వ, రజస్, తమో గుణాలు మనసు ఏర్పడుతున్నాయి అలాగే ఫెరమోన్స్ కూడా, ఆహారం మార్పు చేసుకుంటే ఆనందమే మన సొత్తు, అనుమానం లేదు, దీని గురించి పరిశోధన జరిగితే బాగుణ్ణు.
      నెనరుంచాలి.

    • మిత్రులు శ్యామలరావు గారు,
      పొరపాటున బహువచనం వాడేసేను. కూడా వచ్చేవి చేసుకున్న ధర్మం, కూడగట్టుకున్న వాసన మాత్రమే కదా!
      నెనరుంచాలి.

  2. శర్మగారు వివిధ రాకాల వాసనల గురించి అందరికీ అర్థం అయ్యేలా చాలాచక్కగా వివరించారు, వాసన అనేది సామాన్య విషయంగా అనిపించినా అందరూ అవగాహన ఏర్పరచుకోవలసిన విషయలివి. మీరుచెప్పిన పూలు-చేపలకథ బొబ్బిలిపులి సినిమాలోని ఎన్ టి ఆర్ డైలాగ్ ని గుర్తుకు తెస్తుంది, “మాకందరికీ కనిపించని కుళ్ళు మీకొక్కరికే కనిపించిందా? అని లాయర్ శ్రీదేవి అడిగితే, “మురికి కాలవపక్కన కాపురం చేసే వాళ్లకి, వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించుకుపోతుంది, కొత్తగా వచ్చినవాళ్ళే ఆవాసన భరించలేక పారిపోతారు” అని అంటాడు బోనులొని బొబ్బిలిపులి. మీరు చెప్పింది అక్షరసత్యం. ఇక పూర్వజన్మ వాసన అనేది పాత కాలంలో ఎంతో వాడుకలో ఉన్నట్టిది. తత్వశాస్త్రాలు తిరగేస్తే ఈ విషయమై చాలా విషయాలు భోదపడతాయి. అప్పట్లో ఈ విషయమై కొన్ని ప్రత్యేక గ్రంధాలు వెలువరించబడ్డాయి కూడా. మంచివిషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.

    • స్వామీజీ,
      నేను చెప్పిన కథ చిన్నపుడు బాలమిత్ర, చందమామలలో చదువుకున్నదే.వాసనే మన కూడా వచ్చేదండి, ధర్మంతో పాటు.
      నెనరుంచాలి.

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి