శర్మ కాలక్షేపంకబుర్లు-అరటి దూట పెసరపప్పు,/ దూట పచ్చడి./అరటి పువ్వు మెంతులు కూర.

అరటి దూట పెసరపప్పు,/ దూట పచ్చడి./అరటి పువ్వు మెంతులు కూర.

అరటి దూట అంటే గెలవేసిన అరటి చెట్టును నరికేస్తాం. నరికేసిన చెట్టు పై డిప్పలు వలుస్తూ పోతే లోపల తెల్లగా రూళ్ళ కఱ్ఱలాగా ఉండేదే దూట. దీనిని చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు.

దూటని మొదటగా చక్రాల్లా తరుగుకోవాలి. ఇది కూడా పల్చటి మజ్జిగలోకి తరుగుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. తరిగేటపుడు పీచు వస్తుంది దానిని వేలుకు చుట్టుకుంటూ తరగాలి. ఇలా తరిగిన చక్రాలను మరల చిన్న ముక్కలుగా చేసుకోవాలి, వాటినీ మజ్జిగలోకే తరుగుకోవాలి. దూటని ఏరకంగా వాడుకున్నా మొదట చేయవలసినది. ఇప్పుడు పచ్చడి చూద్దాం. పళ్ళ గెల వేసిన చెట్టు దూట మెత్తగా ఉంటుంది, కాయల గెల చెట్టు దూట కొంచం గట్టిగా ఉంటుంది.
==================================================================
1.దూట పచ్చడి

తరిగిన అరటి దూట ముక్కలకి కొద్దిగా పసుపు, తగిన ఉప్పు, వేయించినకారం, పులుపుకు చింతపండు పులుసు కలుపుకుంటే అరటి దూట పచ్చడి తయార్.పచ్చి ముక్కలే వాడాలి,ఉడకపెట్టకూడదు.
==========================================================
2. అరటి దూట పెరుగుపచ్చడికి

దూట ముక్కలని ఒక సారి ఉడకపెట్టండి, పసుపు,పోపు, ఉప్పు, వేసి ఉంచిన పెరుగులో దూట ముక్కలని కలపండి. అరటి దూట పెరుగుపచ్చడి తయార్.
=========================================================
3.అరటి దూట పెసరపప్పు కూర.

పెసరపప్పు ఉడికించండి దానికి ఉడికించిన దూట కలపండి. దూట ఉడికించేటపుడే పచ్చి మిర్చి చీరి వేసి ఉడికించండి, కొద్ది మిరియాలు, కూరవడియాలు నేతితో వేయించండి, అందులో ఇష్టాన్ని బట్టి ఇంగువ వేయండి.. వీటిని కూడా చేర్చి కొద్దిగా పోపు,పసుపు వేసి ఒక్కసారి మూకుడులో వేసి వెచ్చబెట్టండి, నీరు ఇగిరిపోతుంది. మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన అరటిదూట పెసరపప్పు ముద్ద కూరరెడీ.
=========================================================

అరటి దూట ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఉన్నదంతా పీచే. దీనిని తినడం మూలంగా ప్రేవులని తుడిచేసి అన్న వాహికను శుభ్రం చేస్తుంది. అదేగాక రోజూ అరటి దూట రసం తాగితే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి. ఈ వైద్యం చేసేటపుడు టమాటా తినకండి.అరటి దుంప రసం విషాన్ని హరిస్తుంది.

=========================================================

4.అరటి పువ్వు మెంతులు కూర.

అరటి పువ్వును కూరకి తయారు చేసుకోడమే పెద్ద పని. పువ్వు పై డిప్ప తీయండి, కింద చిన్న చిన్న పువ్వులు కనపడతాయి. వాటన్నిటిని ఒకచోట చేర్చండి. ఈ చిన్న పువ్వులలో కాడల్లాగా కేసరాలుంటాయి, వాటిని లాగేయండి, ఆ తర్వాత ప్లాస్టిక్ డిప్పలలా ఉన్నవాటినీ తీసేయండి. వీటిని పారేయకండి. వీటి ఉపయోగం చివర చెబుతా. అప్పుడు చిన్న పువ్వులని రోటిలో వేసి దంచాలి, నీళ్ళు పోసి కడగాలి. ఇలా మూడు సార్లయినా చేయాలి. అప్పుడు అరటి పువ్వు ముద్ద తయారుగా ఉంటుంది. ఈ ముద్దకి తగిన మెంతులు పొడిచేసి కలపడి, ఇవి కొద్ది ఎక్కువగానే కావాలి. వీటిని మూకుడులో వేసి ఉడికించండి, వీటికి పచ్చి మిర్చి చీరి వేసుకోవచ్చు, పసుపు, పులుపు కోసం చింతపండు పులుసు చేర్చండి, అన్నిటిని ఉడికించండి.. ఆ తరవాత కొద్దిగా పోపు, వేయించిన కూర వడియాలు కలపండి. పోపులో ఇష్టాన్ని బట్టి ఇంగువ వేయండి. అరటిపువ్వు మెంతికూర తయారు. ఇది చాలా రుచిగా పనసపొట్టు కూరలా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం లో వగరు చాలా తక్కువగా తీసుకుంటాం. ఈ కూరలో తినేది వగరే. తొక్కి కడిగితే చాలా వగరుపోతుంది, పోవాలి కూడా.

ఇక పారేయద్దన్న డిప్పలు కాడలని కొద్ది నూని వేసి వేయించి కొద్దిగా ఉప్పు చేర్చిన కారం చల్లండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.