శర్మ కాలక్షేపంకబుర్లు- పారుబాకీ వసూలు (అప్పులమ్ముకోడం)

పారుబాకీ వసూలు…………

చెప్పులమ్ముకోడం విన్నాం, కాని అప్పులమ్ముకోడం వినలేదన్నారా! ఆగండి!! గుర్రాన్ని కట్టెయ్యండి…. ఇదేం కొత్తకాదుగాని విశేషం అవధరించండి…..

ఈ మధ్య ఒక బేంక్ తనకు రావలసిన అప్పుల్ని మరొకరికి అమ్మేసిందిట, ఇదెందుకు బయటికొచ్చిందంటే, అలా అమ్మేసిన అప్పుల్లో, రైతుల అప్పులూ ఉన్నాయట. రైతుల అప్పులు ప్రభుత్వం మాఫీ చేస్తోంది కదా, అదీ సంగతి, ఇదెలాగంటారా? చట్ట ప్రకారం ఇది చెల్లుతుంది. ఈ అప్పులు మొత్తం కోటి అయితే, ఏభయి లక్షలకి కొంటాడు, కొనేవాడు, ఆ తరవాత బాకీదార్ల వెంటపడి వసూలు చేస్తాడు, అడక్కండి ఎలాగని. రకరకాల పద్ధతుల ద్వారా! ఇలా ఎందుకు చెయ్యడం అంటే అప్పిచ్చినవారు తమ పేరుపోగొట్టుకోకుండా ఉండేందుకే అనీ, బాకీ వసూలు కష్టమనీ, ఇది పారుబాకీ కింద రాసేసుకుని, ‘చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్న’మని ఇలా కొంతయినా సొమ్ము చేరుతుందన్న దు(దూ)రాలోచన.

పాతరోజుల్లో సొమ్ము అప్పు కావాలంటే కలిగినాయన ప్రామిసరీ నోట్ రాయించుకుని సొమ్మిచ్చేవాడు. వడ్డీ తీసుకునేవాడనుకోండి. దీనికి మరొక లంకె ఉండేదనుకోండి. ఆ రైతు తననకు వచ్చిన పంట ఇతనికే అమ్మాలి.. అదీ రాయబడని షరతు…ఎక్కువ సొమ్ములు కావాలంటే తనఖా,ఏదయినా స్థిరాస్థి…మళ్ళీ ఇందులోనూ రకాలు..అస్వాధీనపు తనఖా…స్వాధీనపు తనఖా వగైరా.. ఈ ప్రామిసరీ నోట్ కి కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లించాలి, లేదా వడ్డి అయినా కట్టాలి, చెల్లురాయాలి, నోట్ మీద, లేకపోతే నోట్ కాస్తా చస్తుంది, చెల్లుబాటుకాదు..ఈ చెల్లు కూడా నోట్ మీద రాసిన తరవాత అప్పు తీసుకున్నతను సంతకం చేయాలి…. అప్పు తీర్చిన తరవాత ఈ నోట్ మీద చెల్లు రాయించి, సొమ్ము ముట్టినట్టుగా అప్పిచ్చినతను సంతకం తీసుకుని నోట్ వెనక్కి తీసుకోవాలి. సొమ్ము ఇచ్చేసేం కదా అని నోట్ వెనక్కి తీసుకోకపోవడమూ, చెల్లు రాయించకపోవడమూ ప్రమాదానికి దారి తీయచ్చు.

ఈ అప్పులు, తీసుకోవడం, చెల్లు రాయడం, నోట్ రాయడం అన్నీ చిన్నపుడు ఇరవైలోపు వదిలేశాను, అమ్మ చెప్పింది, ”మంచం ఉన్నవరకే కాళ్ళు జాపుకోవాలి, అప్పు చేసి పప్పు కూడు తినడం మంచిదికాదూ..” అని. అది మొదలు ఎప్పుడూ ప్రయివేట్ వ్యక్తుల దగ్గర అప్పు చేయలేదు, కలిగినదానితోనే సద్దుకు బతికేం, లేకపోతే….మానెయ్యడమే…అప్పు చేయలేదు…. అప్పులు చేయడం కొంతమందికి ఒక హాబీ అనిపిస్తుంది… అప్పులమ్ముకోవడం అంటే, చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. జీవితం ప్రారంభించిన మొదటి రోజులలో ఒక షావుకారు గారి దగ్గర పని చేశా… ఆయన అప్పులిచ్చేవాడు, చాలా మంది అప్పు పట్టుకు వెళ్ళేవారు, అదెంతలా ఉండేదంటే… ఈ అప్పు ఇచ్చిన నోట్ లని సంవత్సరం, నెల వారీగా సద్దేవాడిని, ఆరు నెలలలో, మూడేళ్ళు నిండే నోట్ లన్నిటిని ఏరోజు కారోజు తీసి వడ్డీలు కట్టి,షావుకారుగారికి చెప్పేవాడిని, ఆయన విని, మరెవరికో వీటి మీద పని పురమాయించేవాడు…అప్పు తీసుకున్నవాళ్ళొచ్చి, వడ్డీ కట్టడమో, బాకీ తీర్చడమో, చేసి నోట్ బతికించి పోతుండేవారు….

ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక బాకీదారు గురించి చెప్పగా ”పంతులుగారు ఈ నోట్ ని వెంకన్నబాబుకి పంపెయ్యండి, అర్జంటుగా” అన్నారు షావుకారుగారు. సరేనన్నా! అదేమో తెలియలేదు, దిక్కులు చూస్తూ కూచున్నా! అది చూసిన ఆయన ”ఏం! ఏం చేశారూ?” అన్నారు. మీరు నోట్ ని వేంకన్నబాబుకి పంపమన్నారు, వివరాలు చెబుతారని చూస్తున్నా అన్నా. ఆయన నవ్వి ”వేంకన్నబాబుకి పంపడమంటే ఈనోట్ ని తిరుపతిలో ఉన్న దేవునికి పంపమని” అన్నారు. ఎలా చెయ్యాలన్నా. నోట్ వెనక ఇలా రాయండి, ”దివి…తేదీని…. తూగోజిల్లా….గ్రామ కాపురస్థుడనైన నేను తూగోజిల్లా..గ్రామ కాపురస్థుడయిన శ్రీ…..గారికి….. దివి తేదీని ఈ నోట్ బాపతు సొమ్ము అసలు రు…అప్పుగా ఇచ్చి ఉన్నాను. సదరు అప్పును శ్రీ వేంకటేశ్వరస్వామికి బదిలీ చేస్తున్నాను, కనుక వసూలు చేసుకోవలసినదిగా కోరుతున్నాను..’’ రాసి నాకివ్వండి సంతకం పెడతా నన్నారు. అలాగే రాసిచ్చా. సంతకం పెట్టేరు.. దానిని తిరుపతి వేoకన్నబాబుకి టపాలో పంపేసేను….సంగతీ మరిచిపోయాను.

ఒక రోజు ఆయన ఖాళీ గా ఉంటే అడిగాను, తిరుపతికి ఆ నోట్ అలా ఎందుకు పంపేరని. దానికాయన, ఇతను ఇలా అప్పు తీసుకుని ఎగ్గొట్టడం లో సిద్ధహస్థుడు, ఇప్పటికి ఇతను ఈ నోట్ ని రెండు సార్లు తిరగ రాశాడు, అంటే ఇప్పటికి దగ్గరగా తొమ్మిదేళ్ళయింది సొమ్ము పట్టుకెళ్ళి, పోనీ తీర్చలేనివాడా కాదు..ఇదొక దురలవాటు… అన్నారు. అదేమో నాకు అర్ధం కాలేదు, కాని మరసటి నెల అప్పు తీసుకున్నతను నా దగ్గరకొచ్చి బాకీ తీర్చేస్తాను ఎంతయిందో లెక్కకట్టండి పంతులుగారూ అన్నాడు. దానికి నేను ”నీ బాకీ మాదగ్గరేంలేదయ్యా” అని చెప్పేసాను. అప్పుడు ఒక నోటీసు బయటికి తీశాడు నాదగ్గర, అది తిరుపతి నుంచి వచ్చింది, ఫలానా తారీకులోగా ఫలానా తాలూకు నోట్ బాపతు సొమ్ము అసలు వడ్డీలు తీర్చి రశీదు తీసుకోవాలనీ లేకపోతే దావా చేస్తామనీ దాని సారాంశం, ”ఇలా చేసేరేం?” అన్నాడు, ”ఏమో నాకేం తెలుసు, ఆయన లేరు వచ్చేకా అడగమని …… ” ”ఇదంతా మీరు చేసిన నిరవాకమే నాకు తెలుసు, నీ అంతు చూస్తా”నని సణుక్కుంటూ పోయాడు. షావుకారుగారొచ్చాకా జరిగినది అతను నన్ను అన్నమాటలూ చెప్పేను. ”మీకేం భయంలేదు” అని నన్ను ఓదార్చేరు. ”బాకీ దేవునికి చచ్చినట్టు తీరుస్తాడు, చూడండి” అనారు. అలాగే అతను మరువారం రోజులలో అప్పు మొత్తం,వడ్డీతో వేంకన్నబాబుకి చెల్లించినట్టు తెలిసింది…మరెప్పుడూ మా దగ్గరికి అప్పుకి రాలేదు..

మొన్నటి దాకా బేంకులు కూడా వసూళ్ళ కోసం దౌర్జన్య పద్ధతులుపయోగించాయని కొన్ని ఫిర్యాదులూ వచ్చిన సందర్భంగా, ఈ ఇబ్బందులనుంచి దూరమవడానికి అప్పుల్ని అమ్మేస్తున్నాయి, పారుబాకీగా రాసుకుని కొంత మొత్తానికి, మరొకరికి. వాడు అప్పు తీసుకున్నవారి పై జులుం చేస్తున్నాడు, వసూలుకు, అది వేరు సంగతనుకోండి. మరి అందుకే ఇప్పుడు అప్పులిచ్చే సంస్తలన్నీ కలిసి ఒక సంస్థని పెట్టుకున్నాయి దానిపేరే  CRISIL (Credit rating information services of India )క్రిసిల్, పొరపాటుగా మీ పేరు దానిలోకి ఎక్కిపోయిందనుకోండి, ఏ బేంకు మీకు అప్పు ఇవ్వదు, ఆ మాటా చెప్పదు, ఇవ్వనని, అందుచేత బేంక్ ల్లో తీసుకున్న అప్పులు చెల్లు వేయడం జాగ్రతగా గమనించుకోవాలి, తీర్చిన తరవాత మనం రాసిచ్చిన కాగితాలు కూడా వెనక్కి తీసుకోవాలి, లేకపోతే తిప్పలే సుమా.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- పారుబాకీ వసూలు (అప్పులమ్ముకోడం)

  1. ఎటొచ్చీ , సామాన్యుడికే అన్నీ బాధలు !
    అప్పుల్లో కూరుకు పోయిన అనేక బ్యాంకు లకు , మిలియన్ల కొద్దీ అప్పులు ఇచ్చి , నిలబెడుతున్నాయి , ప్రభుత్వాలు !
    అట్లాగే , నష్టాల్లో కూరుకు పోయినా కూడా , ఆ యా బ్యాంకు మేనేజర్ల కు కూడా మిలియన్ల కొద్దీ బోనస్ లు కూడా , ప్రతి సంవత్సరమూ ఇస్తున్నారు !
    విదేశాలలో , క్రెడిట్ కార్డు ద్వారా, నెల నెలా జమ చేయవలసిన ఇన్ స్టాల్ మెంట్ డబ్బు, ఒక్క నెల జమ చేయక పోయినా కూడా , క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది !మళ్ళీ అప్పులు పుట్టవు, సామాన్యులకు !
    మన దేశం లో , అప్పుల్లో కూరుకు పోయి , పెళ్ళాం , పిల్లలతో సహా యజమాని కి, తర తరాలు గా , వెట్టి చాకిరీ చేస్తున్న పేద కుటుంబాలు ఎన్నెన్నో !
    పేదల అజ్ఞానాన్ని ఆసరా గా చేసుకుని ,మోసం చేస్తున్న , వడ్డీ వ్యాపారులు ఎందరెందరో !

    • సుధాకర్ గారు,
      ఒక అజ్ఞానమే కాదు, చాలా విషయాలు వీటిని ప్రభావితం చేస్తున్నాయి. బాధలు సామాన్యులకేగాని మాన్యులకు కాదు. సామాన్యుడు బాధ కలిగినపుడు బరుక్కుని ఆ తరవాత మరచిపోతున్నాడు.
      ధన్యవాదాలు.

  2. శ్రీ శర్మగారూ,

    “I had my money and my friend
    I gave my money to my friend
    I asked my money to my friend
    I lost my money and my friend”
    ​ ఫేస్ బుక్ లో ఒక స్నేహితుడు పెట్టిన వ్యాఖ్య

    • మోహన్జీ,
      నిజమే కాని, అన్నివేళలా కుదురుతుందా? ఇల్లు కట్టుకోవాలి, బేంక్ ఋణం తప్పదుగా!
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి