శర్మ కాలక్షేపంకబుర్లు-హామీ….

హామీ….

హామీ, ఇది తెనుగు పదం కాదుట,హిందీ నుంచి దిగుమతి అయి తెనుగులో తిష్ట వేసుకు కూచున్నది. దీనికి అర్ధం పూచీ, జామీను,బాధ్యత అన్నారు నిఘంటుకారులు….

కైకమ్మ యుద్ధంలో సాయం చేసిందిట, ఏం వరం కావాలని అడిగారు దశరథుడు, రెండు వరాలు, నాకు కావలసినపుడు అడుగుతానంటే, సరేనని హామీ ఇచ్చేశారు దశరథుడు. అదిగో ఆ హామీ పీక పట్టుకుంది, రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయడానికి మొదలుపెట్టగానే. నా వరాలు రెండూ ఇప్పుడు అడుగుతున్నాను, ’ఒకటి రాముణ్ణి వనవాసం పంపడం రెండవది భరతునికి పట్టం కట్టడం’ అని అడిగింది. దశరథునికి పచ్చి వెలక్కాయ గొంతులో పడింది, తరవాత జరిగింది తెలిసినదే కదా! ఇలా హామీ ఇచ్చి చిక్కులో పడినవారు దశరథుడు, చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నారు.

శిబి చక్రవర్తి, సభలో ఉండగా ఒక డేగ పావురాన్ని తరుముతూ వచ్చింది. పావురం చక్రవర్తి శరణు కోరింది, ప్రాణ రక్షణకు హామీ పొందింది. డేగ ”రాజా పావురం నా ఆహారం, దానికి మీరు రక్షణ ఇవ్వడం నా ఆహారాన్ని కాదనడం కాదా” అని నిలదీసింది. అప్పుడు శిబి ”నీకు ఆహారం నేనిస్తాను, పావురాన్ని వదిలెయ్యి, నేను ప్రాణానికి హామీ ఇచ్చాను, నీకు పావురం బరువుకు సరిపడిన మాంసం ఇస్తానని” పలికేరు. దానికి డేగ ”నేను పావురాన్ని వేటాడుకున్నా, నాకు పావురమే కావాలి కాని మీరిచ్చే మాంసం వద్దూ” అని అడ్డం తిరిగింది. ”అలాగైతే, నా శరీరం నుంచి పావురానికి తగు మాంసం ఇస్తాను, తీసుకుని పావురాన్ని వదిలేయ”మన్నారు. ”సరే” నని డేగ ఒప్పుకుంటే, శిబి తన తొడనుంచి మాంసం కోసి తక్కెడలో పావురాన్ని తూస్తుండగా,ఎంతకూ మాంసం సరిపోక, చివరికి చక్రవర్తి తక్కెడలో కూచుంటారు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై రాజా నీ గొప్పతనం విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానని చెబుతారు, ఇదిగో హామీ ఇస్తే వచ్చిన తంటా ఇది.

వామనుడు ”మూడడుగుల నేల దానం ఇవ్వవయ్యా! చాలు” అని అడిగాడు దానికి బలి చక్రవర్తి, ”చిన్న వాడివి, ఏం కావాలో తెలిసినట్టులేదు,జందెమో,గొడుగో,మణులో,మాన్యాలో, కన్నెలో, ఇవి అడగాలి కాని, ఇంత చిన్న దానం అడగడం బాగోలేద”న్నాడు. ”కాదు అదే కావా”లంటే సరేనని హామీ ఇచ్చేశాడు, బలి. కూడా ఉన్న గురువు ”రాజా! వద్దు, రాజా! వద్దు, దానం ఇవ్వద్దు, వచ్చినవాడు మహావిష్ణువు,” అని నెత్తీ నోరూ కొట్టుకున్నా వినలేదు, పైగా ఏమన్నాడూ!

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై సంసోత్తరీయంబుపై
బాదాబ్జంబులపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే ల్గాదే
రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే

లక్షీ దేవి కొప్పు మీద, శరీరం మీద,కొంగుపైన,కాళ్ళమీద,బుగ్గలమీద, పాలిండ్లమీద నర్తించిన శ్రీ హరి హస్తం పేదదిగా, నా దగ్గర దానం తీసుకోడానికి కింద ఉండటం, నా చెయ్యి పైన ఉండి దానం ఇవ్వడం కంటే గొప్ప సంగతేం ఉంటుంది, ఈ రాజ్యం, సిరి సంపద శాశ్వతమా? ఇస్తా దానం అని హామీ ఇచ్చేడు, తరవాత కథ తెలిసినదే….

ఇలా హామీ లిచ్చినవారు నాటి రోజుల్లో స్వంతానికే హామీ లిచ్చేరు, కష్టమో,సుఖమో, నష్టమో తామే అనుభవించారు. కాని నేటి రోజుల్లో హామీ అనే మాట వింటేనే గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్న రోజులు. జీవితం లో జరిగిన ఒక సంఘటన…

చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట “అప్పు చేయకు, అప్పు ఇవ్వకు” దీనిని చాలా చక్కగా అమలు చేశాను కాని, జీవితంలో కొత్త, అందరూ నావాళ్ళే అనే భావం, అందరికి కష్టాలే ఉంటాయి, అందరూ సత్యవంతులే అనే నమ్మకం చాలా ధృడంగా ఉండే రోజులు, వయసు ఇరవై, ఉరవడి కదా!

ఒకరోజో మిత్రుడు కాగితాలట్టుకుని వచ్చేసి ”శర్మా! సంతకం పెట్టరా” అన్నాడు, ఎక్కడా? అన్నానే తప్పించి ఎందుకూ? అని అడిగే తెలివికాని అనుభవం కాని లేకపోయాయి. సంతకాలు పెట్టేసేను. అప్పుడు చెప్పేడు, అది ఒక చీటి పాడుకున్న తాలూకు హామీ పత్రమని, వాడు పాడుకున్న చీటి కదా, వాడే కట్టుకుంటాడు, ఆ మాత్రం సాయం చేయలేమా, డబ్బు తీసుకున్నాడు కదా అని ఊరుకున్నా. లోపల కొద్దిగా భయంగా ఉన్నా.డబ్బులు తెచ్చుకున్నాడు, అయిపోయాయి, వాయిదాలు కట్టడం మానేసినట్టున్నాడు, ఒక రోజు నాకు ఒక నోటిస్ వచ్చింది. ఫలానా చీటిలో మీరు హామీదారు, చీటి సొమ్ము చెల్లించాలి అని. ముందుగా ”నేనెందుకు కట్టాలి, పాడుకున్నవాడి దగ్గర వసూలు చేసుకోండి” అని ఆ కంపెనీ వాళ్ళకి చెబితే, వాళ్ళు, ”మేము ఎవరి దగ్గరైనా వసూలు చేసుకోవచ్చండి, మీరిచ్చిన హామీ లో అదిరాసి ఉంటుంది, మీరు కోర్ట్ కెళ్ళినా ఉపయోగం లేద”ని ఆ కాగితాలు చూపించాడు. అందులో  “We ………., and…….. are jointly and severally responsible and undertake to repay the amounts due.  The company is at liberty to collect the amounts due either from the borrower or from the surity or bth.”అని ఉంది. ఇప్పుడు నోరు వెళ్ళబెట్టడం నా వంతు అయింది. మిత్రుడిని అడిగా, ”ఇదేం పని, సొమ్ము కట్టుకోవా” అని. దానికతను ”కట్టాలనే ఉందికాని సొమ్ములేదు, నువ్వు కట్టు తరవాత నేనిచ్చేస్తా నీకని” హామీ ఇస్తే నిజమని నమ్మేను. ఏం చేస్తాం హామీ ఉన్నందుకుగాను, కంపెనీవాడితో మాటాడి, అంత సొమ్మూ ఒక సారిగాక కంతులలో కట్టి ఆ బాధ విరగద చేసుకున్నా, బతుకు జీవుడా అనుకున్నా.ఆ తరవాత ”సొమ్మెదిరా అంటే” కాళ్ళు చాపేశాడు,మరో సారి హామీ నమ్మి మోసపోయాను. సొమ్ము కట్టడం పూర్తి అయిన తరవాత అమ్మకి చెప్పి, ఇలా జరిగిందంటే, ఇక ముందు జాగ్రత్త పడు ఒకసారి చెయ్యి కాలింది కనక నేను చెప్పక్కరలేదంది. ఇలా హామీ ఉండకు అనేదాన్ని నేర్చుకున్నా. ఆ తరవాత కాలంలో చాలా ముఖ్యమైన మిత్రుడికి కూడా సంతకం పెట్టక కొంత నిష్ఠురం కూడా పడ్డాను. అతనికి చెప్పేను, అంత్య నిష్టురం కంటే ఆది నిష్ఠురం మేలని సంతకం పెట్టలేదని.

రాష్రం విడతీస్తే కష్టాలున్నాయంటే ”మీకు మేము హామీ” అన్నారు అధికారం లో ఉన్నవారు, అందుకు చట్టం లో చేర్చటం లేదన్నారు, నాడు ప్రతి పక్షం లో ఉన్నవారు ”మేమే కదా రేపు అధికారం లోకొచ్చేది, అమలు చేస్తా”మని హామీ ఇచ్చారు. చట్టం లో చాలా చేర్చలేదు, ఇప్పుడడిగితే ”అప్పుడధికారం లో ఉన్నవారు, ఇప్పుడు మేం అధికారం లో లేముగా” అంటున్నారు, ఇప్పుడధికారం లో ఉన్నవాళ్ళనడిగితే ”హామీలు చట్టం లో చేర్చలేదు, మేమేం చేస్తా”మంటున్నారు. ”మీరు తొమ్మిది నెలల్లో హామీ లు అమలు జరపలేదంటే,” ”మీరు తొమ్మిదేళ్ళు సమస్య నానబెట్టేరు, ఇప్పుడు మమ్మల్ని అని ఉపయోగంలేదు, మీకంటే మేము మేలేగా, చట్టం లో ఉన్నవి అమలౌ చేస్తున్నాం” అంటున్నారు. మధ్యలో ‘ఉభయభ్రష్టత్వం ఉపరి సన్యాసం’ అయిపోయింది, మన బతుకు. వారు మాత్రం మీరంటే మీరు అనుకుంటూనే ఉన్నారు.. అదండి నేటి హామీ చిత్రం..

రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు హామీలే అమలు జరగనటువంటి రోజులు, నోటి మాటలకి కట్టుబడేవారెవరు? గట్టిగా మాటాడితే ”తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టమని” అనచ్చు. ఈ ”ఉభయ భ్రష్ఠత్వం ఉపరి సన్యాసం” ఏంటీ? ”తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టడమేంటని” మాత్రం అడగద్దు, టపా రాస్తానని హామీ మాత్రం ఇవ్వను.  🙂

మూడేళ్ళ కితం ఇదే రోజుల్లో ఓ మనవరాలికి ఓ హామీ ఇచ్చాను, ఇప్పుడా మనవరాలి జాడ లేదు. ఇచ్చిన హామీ అమలుచేయాలా మానెయ్యచ్చా? హామీ కాలదోషం పట్టలేదా? ధర్మ సందేహం… తీర్చండి…

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-హామీ….

  1. చేతి కందించవలసివస్తే మనిషిజాడ కావాలి కానీ, టపావ్రాసి హామీ‌నిలబెట్టుకోవటానికేం? మీరు వ్రాయండి. ఆ మనవరాలు వీలున్నప్పుడు చదువుతారు. ఈ లోగా మేమూ చదివేసుకుంటాం. ఉభయతారకంగా ఉంటుంది.

  2. తూర్పుకే ఎందుకు తిరగాలి? ఎందెందు వెతికి జూచిన అందందే కలడు కదా? మీరు దీని గురించి వ్రాయాలిసిందే!
    పురాణ కాలంలో మాటేఇచ్చారేమో, అప్పటికి హిందీ,హామీలు లేవేమో?

వ్యాఖ్యానించండి