శర్మ కాలక్షేపంకబుర్లు-సిరిగలవానికి జెల్లును

సిరిగలవానికి జెల్లును

తరుణుల బదియారువేల దగ పెండ్లాడన్

తిరిపెమున కిద్దరాండ్రా?

పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్.

భావం:- డబ్బున్నవాడు పదహారువేలమందిని పెళ్ళాడినా బాధుండదు కాని ముష్టి ఎత్తుకునే నీకు ఇద్దరు పెళ్ళాలెందుకయ్యా! పరమేశ్వరా! గంగను వదిలెయ్యి, పార్వతి ఒకతే చాలులే. 


ఈ పద్యాన్ని శ్రీనాధ మహాకవి చాటువుగా చెప్పినదంటారు. ఆయఒక సారి పల్నాడులో పర్యటిస్తుండగా స్నానానికి నీళ్ళు లేకపోయాయట, ఆ సందర్భంగా ఈ పద్యం చెప్పేరూ అంటారు. కవి ఎక్కడనుంచి ఎక్కడకి లంకె పెట్టేరు.. 🙂

సిరిగలవాడు అన్నారు, సిరి వక్షస్థలం మీదే కలిగినవాడు మహా విష్ణువు. మరి ఆయనకీ ఈ పదహారు వేలమందిని చేసుకున్నాయనకీ తేడా లేదుగా.  ఆయన ఎందుకు చేసుకోవలసివచ్చింది? కథలోకి వెళదాం. నరకాసురుడు మొదటి అవతారమైన వరాహావతారానికి భూమికి కలిగినవాడు, అమిత బల సంపన్నుడు, ప్రపంచంలో ఉన్న రాజులను జయించి పదహారువేలమంది రాచకన్నెలను  చెఱపట్టేడు. రాజలోకం గగ్గోలు పడిపోయింది. శ్రీ కృష్ణుని ఆశ్రయించి నరకాసురుని బెడద తీర్చమని వేడు కున్నారు. పరమాత్మ యుద్ధానికి బయలుదేరుతుంటే, నేనూ వస్తానని వెంటపడింది, ఎవరూ సత్యభామాదేవి. ఈమె చిన్నప్పుడు విలువిద్య వగైరాలన్నీ నేర్చేసుకుందిట, వీరనారి. కృష్ణుడు అది పూలబాణాలు వేసేచోటుకాదు సుమా అని హెచ్చరిస్తారు, ఆమె మరీ మొండికేస్తే యుద్ధానికి తీసుకెళ్ళేరు. ఆమె కొద్దిసేపు నరకాసురునితో యుద్ధమూ చేసింది, హేలగా. ఆ తరవాత కృష్ణుడే నరకాసురుని సంహరించారు, పదహారు వేలమంది రాచకన్నెలనూ విడిపించారు. ఇప్పుడో సమస్య వచ్చిపడింది. వీరంతా కన్నెలే కాని ఇప్పుడు వీరిని వివాహం చేసుకునేవారెవరు? ముందుకొచ్చేవారెవరు? మరి వీరి గతేమి, సంఘం లో వీరికుండే స్థానమేంటి? ఎవరూ ఆదరించకపోవడమా? ఇది వీరు చేసుకున్నపాపమా? ఆ కన్నెలు కూడా కృష్ణునే వేడుతారు తమను భార్యలుగా చేసుకోమని. అప్పుడు పరమాత్మ వీరందరిని ఒకే సారి వివాహం చేసుకున్నారట.శ్రీకృష్ణుడు వారిని భార్యలుగా స్వీకరించి వారికి సంఘం లో ఒక స్థానం కల్పిస్తే, పదహారు వేల మందిని పెళ్ళి చేసుకున్నాడు, కాముకుడు అనడం బాగుందా? ఒక్క పెళ్ళాంతోనే వేగలేక ఛస్తుంటే  పదహారు వేలమందితో….అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది కదూ! మరి పరమాత్మకి అసాధ్యమేముంది, ఆయన అందరిదగ్గరా అన్నివేళలా ఉన్నారట. అలా సాధన సంపత్తి ఉంటే పదహారు వేలమందిని చేసుకున్నా సరిపోతుంది, ఇదీ పదహారు వేలమందిని చేసుకోడం కథ, కాని,


శంకరుడు బిచ్చగాడినంటాడు, పుఱ్ఱె చేత పట్టుకుంటాడు, శ్మశానం లో నివాసం,అవును ఆయన బిచ్చమే అడుగుతాడు, సర్వజ్ఞుడు కదా, ఆయన ఈశానః సర్వవిద్యానాం  ఈశ్వరఃసర్వభూతానాం, బ్రహ్మాధిపతి……కదా మరి. ఆయనడిగేదేంటి, మన మనసు. ఓరే నాయనా నీ మనసును నాకు బిచ్చమెయ్యరా! నిన్ను నేను సర్వ విధాలా కాపాడతానంటాడు. మనం అన్నీ చేస్తానంటాం కాని మనసు మాత్రం ఆయనకివ్వనంటాం. ఇటువంటి వింత బిచ్చగాడివైన నీకు ఇద్దరు పెళ్ళాలా? మొదలు బిచ్చగాడివా, నీకే తిండానికి తిండిలేదా, బిచ్చమెత్తుతావా! నీకు ఇద్దరు పెళ్ళాలెందుకయ్యా బాబూ! పోషించగలవా?కలిగినవాడు చేసుకున్నాడంటే అదో అందం.  వారెవరూ? ఒకరు శివః శక్తాయుక్తో….. ఎవరు కూడా లేకపోతే శంకరుడు కూడా జడత్వం తో ఉండిపోతాడొ, సర్వ చరాచర జగత్తు నిస్తేజమైపోతుందో, అంతటి తల్లి, జగజ్జనని ఆమె, రెండవారు ప్రాణికోటికి జీవనాధారం గంగమ్మతల్లి. కవిగారు చూడండి గంగమ్మని వదిలెయ్యవయ్యాబాబూ అని కరాఖండిగా చెప్పేసేరు. కవిగారు చూడండి బలే చమత్కారులు. నీళ్ళు కావాలి శంకరా అని అడగచ్చుగా ఇంత నిందా స్తుతి చెయ్యాలా! ఏంటో లోకం….ఏమిటిలోకం పలుగాకులలోకం అన్నారు మరోకవి.పలుగాకులేంటండీ? 

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సిరిగలవానికి జెల్లును

  1. ఒక్క పెళ్ళంతోనే వేగలేక చస్తుంటే …..”

    హన్నన్నా ! ఏమంటిరి !
    చిన్నగ మాటాడవయ్య ! శ్రీమతి వినినన్
    అన్నానికి గోవిందా
    పన్నుగ రుచులారగించు భాగ్యము వలదా ?

వ్యాఖ్యానించండి