శర్మ కాలక్షేపంకబుర్లు-పాపం! అహల్య.

పాపం! అహల్య.

”అహల్య” టపా రాయాలని చాలా కాలంగా అనుకున్నదే కాని ఇదుగో, అదుగో అంటూ జరుపుకొచ్చేసేను.

అహల్య గురించి మూడు రకాల అభిప్రాయలున్నాయి. ఇవి నేటివేకాదు, సనాతనంగా వస్తున్నవే. ఇక అహల్య గురించి సినిమావారి పైత్యానికి అంతే లేదు. నా టపాకి స్పందించినవారికి ధన్యవాదాలు. మూడు రకాల వారెవరు?.

1.అహల్య, వచ్చినవాడు సంక్రందనుడే అని తెలిసి సంగమించి తప్పుచేసింది, శిక్షింపబడటం లో తప్పులేదు, అనేవారు.
2. పాపం! అహల్య ఏపాపమూ ఎరుగదు, అనవసరంగా నింద పాలయింది,శిక్షింపబడింది, అనేవారు.
3.రామాయణం రాసిన వాల్మీకి అబద్ధం ఆడడు కాని నిజం చెప్పడు అనేవారు.

మొదటి ఇద్దరిలోనూ, మొదటివారికి అహల్య తప్పు చేసిందనడానికి ఏమి కారణం కనపడిందో చెప్పలేను. పెద్ద పెద్దవారే అహల్య తప్పుచేసిందనే అన్నారు. వాల్మీకి రామాయణం ఆది కావ్యం, వాల్మీకి చెప్పినదానిని యధా తథంగా ఆమోదిస్తాము, మరి ఆ తరవాత వచ్చిన చాలా రామాయణాలను పక్కనపెడతాము అనేవారికి, పై సందర్భంలో అహల్య తప్పుచేసిందనడానికి సావకాశం లేదనే అనుకుంటా, నా బుద్ధికి తోచినవరకు, పెద్దలను వ్యతిరేకించడం కాదు, అక్కడ ఉన్న మాటలు, సందర్భం చూస్తే, ఈ వర్గం వారికి అంత పట్టు లేనిమాట వాస్తవం. ‘దేవరాజ కుతూహలాత్’ అన్నచోట అహల్య సంక్రందనునిపై కుతూహలపడింది, అందుకే సంగమం తరవాత ‘కృతార్ధేనంతరాత్మనా’ అంది అంటారు. నేను సంతృప్తి చెందాను, ఇక నువ్వు కదులు, అది ఇద్దరికీ మంచిది, అంది అంటారు, ఇదెంతవరకు సబబు?

ఇహపోతే రెండవవారు, ‘దేవరాజ కుతూహలాత్’ అంటే దేవతలరాజయిన ఇంద్రుడే ఇటువంటి పనికి పూనుకుని అసభ్యంగా మాటాడేడా?, సంగమం తప్పని తెలిసీ అడుగుతున్నాడా? నన్ను పరీక్షిస్తున్నాడా? అని విస్తుపోయిందీ అంటారు. ఆ తరవాత నేను సంతృప్తి చెంది ఉన్నాను, అనడం అనేది ఆమె స్వవిషయంలో భర్తతో, అనేది చెబుతారు, నిజానికి ఇది వాస్తవికతకు చాలా దగ్గరలో ఉందనుకుంటా. అటువంటి సందర్భం కనక తటస్థపడితే, వచ్చిన వారిపై కోరిక లేకుంటే, సామాన్య స్త్రీ మాటాడే మాటలే అవి.  భర్తతో సంతృప్త కాని స్త్రీ, మరొక పురుషుడిని కోరుకుంటుంది, అనుకుంటాడు, పరపురుషుడు.  అందుకే అలా మాటాడింది, తప్పించి సంగమానికి సంతృప్తి చెందాను, అన్నమాట కాదని మనవి. వెలిచవులు కోరేవారిద్దరూ ”సంతృప్తి చెందాను,సంగమం చాలా బాగుంది” అన్నారు, అని అనడం, అందునా స్త్రీ అనడం, ఎబ్బెట్టుగానే కనపడింది.

ఇక మూడవవారు పాపం వాల్మీకికే అక్షంతలు చల్లేశారు! అబద్ధం ఆడడు కాని నిజం చెప్పడు అని, వారికి నమస్కారం పెట్టడం తప్పించి మరేమి చేయగలను?

నేటికాలానికి ఆ సందర్భాన్ని అన్వయించుకుంటే, నేటికి ఇటువంటి అహల్యలు,గౌతములు చాలా మంది కనపడుతూ ఉన్నారు. నేటి అహల్యా గౌతముల మధ్య ఇంద్రుడు మాయగౌతమ, అహల్యల రూపంలోనూ లేదా ఇరువురికి చెరొక రూపంలోనూ కనపడే ప్రమాదాలూ, సావకాశాలూ ఎక్కువగానే ఉన్నాయి. నాడు జరిగిన తప్పొప్పులగురించి ఆలోచనకంటే, నేడు దీనినుంచి పాఠం నేర్చుకోవలసిందేమైనా ఉందా అని ఆలోచిస్తే, నేడు కూడా అహల్య,గౌతముల మధ్య ఇంద్రుడు చేరుతూనే ఉన్నాడు. ఇంద్రుణ్ణి చేరకుండా చూసుకోండి. ఇది ఒకపక్క చెప్పిందే అనుకోకండి. ఇందులో మాయ గౌతములూ కనపడతారు, నిజ జీవితంలో, మాయా అహల్యలూ ఉన్నారు, తస్మాత్ జాగ్రత. మెరిసేదంతా బంగారం కానట్టు, కనపడేదంతా నిజమూ కాకపోవచ్చు. ఆలోచించండి, మాటాడండి, ఏమి జరిగినదీ నిజం తెలుసుకోండి, తప్పు ఎవరు చేసినా వీలుంటే మన్నించండి, నిజంగా పశ్చాత్తాపపడండి, విషయం వీధికి ఎక్కనివ్వకండి, లేకుంటే శిక్ష అనుభవించాల్సిందే.తప్పు చేసి తప్పించుకుంటానంటే, అనుభవించనంటే కుదరదు. తొందరపడి చర్యలు తీసుకోకండి ఇరుపక్కలా, సంయమనమే అవసరం. నేటికీ చాలామంది అహల్యలు నోరు విప్పరు, బాధ అనుభవిస్తారు తప్పించి.నాటి గౌతముడు సంయమనం కోల్పొయాడు, ఏమి జరిగినదీ తెలుసుకోలేదు, తెలుసుకోడానికీ ప్రయత్నం చేయలేదు, సాధారణ మానవుడు కోపంలో ప్రవర్తించినట్లే ప్రవర్తించాడు. అహల్య కూడా తను చెప్పినా వినే సావకాశం లేదనుకుని నోరు విప్పలేదనే అనుకుంటా. నేటి అహల్యలూ నోరు విప్పండి, అనవసరంగా నోరు వాడుకోడం కాదు,హక్కుల గురించి ఊరకనే మాటాడటం కాదు. అవసరం వచ్చినపుడు సందర్భోచితంగా నోరు వాడుకోవడమే తెలివయిన పని. ఇటువంటి సందర్భాలు నేటికీ కలుగుతున్నాయి, ఇద్దరూ విజ్ఞతతో ప్రవర్తించకపోతే ఫలితాలు దారుణంగా ఉండి బతుకు నిస్సారమే అవుతుంది. జరిగినదాని మంచి చెడ్డలను నేడు నిర్ణయించుకుని ఉపయోగం ఉండకాపోవచ్చు, కాని అటువంటి సందర్భాలలో ఏం చేయాలీ?, ఆలోచన చేయమన్నదే నా విజ్ఞప్తి, అహల్యలూ నోరు విప్పండీ.

జనవరి నెల చివరలో ఒక పిలిచిన పేరంటానికెళ్ళేం, రాజమంద్రి. వెళ్ళేం అంటే ఇల్లాలూ, నేనూనూ. అక్కడో ముఫైఏళ్ళలోపు అమ్మాయి? కలిసింది, మాటలలో ”పెళ్ళెప్పు”డంటే ”అప్పుడే పెళ్ళా?” అని గునిసింది. ఆ తరవాత ”ఎన్నేళ్ళబట్టి ఈయనతో ఉంటున్నారూ?” అని అడిగింది, ఇల్లాలిని, నన్ను చూపిస్తూ. ”ఈయనతో ఉండడమేంటమ్మాయి, మా పెళ్ళయి ఏబయి ఏళ్ళ పైమాట” అని చెప్పింది ఇల్లాలు. ”ఏంటీ? ఈ ముసలాయనతో ఏభయి ఏళ్ళ పైబడి కాపరం చేస్తున్నారా! Barbarious, it is nothing but servitude. తాళి తెంపేయండి, తాళి కట్టించుకోడమంటే బానిసత్వానికి చిహ్నం. ఈయన్ని వదిలేయండి, బానిసత్వం నుంచి బయటపడండి, ఇదే నేడు మహిళల ఉద్యమం, మీలాటి పెద్దవారు ముందుండాలి, మరో యువకుణ్ణి చూసుకోండి” అని చెబుతోంది ఇల్లాలికి. ఇల్లాలి మొహంలోకి చూశా! కందగడ్డలా ఉంది, వామ్మో! ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడ్డా! ఇంద్రుడా ఇలా మా మధ్యలో చొరబడ్డావా అని వాపోయా! ఎందుకేనా మంచిదని నా అహల్యను చంకనేసుకుని వచ్చి బస్ స్టాండ్లో పడ్డా. ………….”నేటి కాలం ఆడపిల్లలంతా ఇలా తయారవుతున్నారు, వీళ్ళకేమయిందీ” అడిగింది ఇల్లాలు, ఏం చెప్పాలో తోచలేదు…ఆ తరవాత కథ బుల్లి తెరపై చూడండి….

వ్యాఖ్యానించండి