శర్మ కాలక్షేపంకబుర్లు-అదే! ”పదివేలు”.

download

అదే! ”పదివేలు”.

అదే! ”పదివేలు” అనే ప్రయోగం చాలా సార్లే వింటుంటాం, కాని ఇలా ఎందుకంటారో, ఎలా వాడుకలోకి వచ్చిందో మాత్రం ఆలోచించలేదుకదా!. అదేపదివేలు, అంటే మహా ప్రసాదం, అదేచాలు సంతృప్తి,సెలగో సెలగ, (ఇదేంటంటారా? వీలుంటే తరవాత చూదాం) . ఇలా చాలా అర్ధాలలో ఈ నానుడిని ప్రయోగిస్తారు.

పెద్దవైన కుటుంబాలలో ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం ఉంటూనే ఉండేరోజులు, నాడు. మానవప్రయత్నం తో పాటు దైవబలం కోసం లలితా సహస్రనామాలు ఎప్పుడూ, నిత్యమూ పారాయణ చేసేవారు, ఇంటిపెద్దలు. ప్రత్యేక అవాంతరాలలో, ఆపదల్లో మాత్రం నిత్యకృత్యాల అనంతరం, ఉపవాస సంకల్పం చెప్పుకుని ఉదయమే లలితా సహస్రం పారాయణ చేసి నైవేద్యం పెట్టి, ఆ ప్రసాదాన్ని తీసుకుని మద్యాహ్న, సాయం సంధ్యలో కూడా అలాగే లలితా సహస్రం పారాయణ చేయడం, ఆ తరవాత రెండురోజులూ, ఉపవాసంతో పారాయణ చేస్తే తొమ్మిది సార్లు లలితా సహస్రం పారాయణ చేసినట్టవుతుంది, మూడురోజులికీ. నాలగవరోజు ఉదయమే లలితా సహస్రం పారాయణ చేసి మహానైవేద్యం పెట్టి, సాత్వికునికొకరికైనా భోజనం పెట్టి, దక్షణ ఇచ్చి సత్కరిస్తే అప్పటికి లలితా సహస్రం పదిసార్లు పారాయణ చేసినట్టవుతుంది, అనగా పదివేల సార్లు లలితాదేవిని స్మరించినట్లవుతుంది, ”అదే పదివేలు”, అవాంతరమూ దాటుతుంది. కామ్యార్ధం ఇలా చేయచ్చు, ఈ కామ్యం అనగా కోరిక కూడా ధర్మబద్ధమైనదై ఉండాలి. మరో మాటకూడా ”లలితా సహస్రం పారాయణ చేయనిదే ఉదయమే పచ్చి మంచినీళ్ళయినా తాగనూ” అన్నవారు, అంతెందుకు నాతో సహా అందరమూ చేసే పొరపాటు ఒకటుంది. లలితా సహస్రం మూడు అధ్యాయాలుగా ఉంటుంది. అందరం రెండవ అద్యాయం మాత్రం పారాయణ చేసి ”అయిందని”పిస్తాం. అలాకాదు మూడు అధ్యాయాలూ పారాయణ చేయాలి. ఇలా పది సార్లు పారాయణ చేస్తే కలిగే ఫలితాన్నే మహాప్రసాదం అంటాం, అదే! ”పదివేలు”, అదే అనంతం.ఇప్పటికి కొన్ని కుటుంబాలలో పెద్దలు దీనిని ఆచరిస్తున్నట్టు ఉంది.

అమ్మ గురించి ఎంతచెప్పినా తీరదు, ఈ నామాలు పారాయణ చేసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కోనామం చాలా పెద్దదిగా ఉంటుంది, దాన్ని మధ్యకి విరిచి చదితే అర్ధం మారిపోతుంది, తప్పు అర్ధం కూడా వచ్చే సావకాశాలున్నాయి. నామాలు అర్ధాలు తెలుసుకుని పారాయణ చేయడం మంచిది. ఈ కింద లింక్ లో నామ విభజన ఉంది, చూడండి. అలాగే పూర్వపీఠిక ఉత్తర పీఠికా ఇచ్చారు.

http://syamaliyam.blogspot.in/2013/10/blog-post.html

వారికి కృతజ్ఞత తెలుపుతున్నా. ఈ నామాలని కామ్య రహితం గా పారాయణ చేయడం మంచిది, కామ్యంతో నూ చేయచ్చు, తప్పులేదు. పారాయణ చేస్తే కొన్ని శక్తులు మనలో చేరుతాయి, గాలిలో ఎగరగలనా? అని ప్రశ్న వేస్తే చెప్పలేను, అమ్మ దయ ఉంటే శంకరులు చెప్పినట్టుగా ”మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిం”, సాధ్యం చేయగలది అమ్మ. ఏమో! ఎవరు చూడొచ్చేరు? నిన్నటిదాకా జులాయిగా తిరిగినవాడు అమ్మ దయతో కుదురుకుని విదేశాలకి ఎగిరిపోయాడేమో, గాల్లో…అమ్మ నామాలు నిష్ఠగా పారాయణ చేయండి, ముందు కలిగే శక్తి వాక్కు, అనగా విద్య, ఆ తరవాత మీ ఓపిక…..కొన్ని జాగ్రతలూ తీసుకోవాలిసుమా! పెద్దలనదగండి చెబుతారు.

ఇది నామాట కాదు అమ్మ మాట,  అదే పదివేలు మాట. మీరు మాట కలిపితే అదేపదివేలు….

 

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అదే! ”పదివేలు”.

వ్యాఖ్యానించండి