శర్మ కాలక్షేపంకబుర్లు-బోసినోటి టిపిన్ సంబరం

బోసినోటి టిపిన్ సంబరం

”రోజూ ఇడ్లీయేనా?” గునిశాను ఉదయం టిఫిన్ చెయ్యడానికి.
”ఉండండి” అని ఏదో పట్టుకొచ్చి వేసి ”తినండి” అంది.
”ఏంటిదీ” అంటే ”పళ్ళు రాలుతున్నాయి కదా! ( ఇక్కద శ్లేష వాడిందా అని అనుమానమొచ్చిందనుకోండి) మామిడి చెట్టువి, అవి పళ్ళేగాని గట్టిగా ఉంటాయి, ముగ్గుతాయని వదిలేస్తే కుళ్ళిపోతాయి, అందుకుగాను వాటిని ముక్కలుచేసి మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పుకల్లు పడేస్తే అదిగో అదే ఇది,రెండవది మొదటిదానికి కొద్దిగా పోపు జేర్చి మిక్సీలో తిప్పినది” అంటే, తింటే అబ్బో ఆనందమే ఆనందం, అంతబాగుంది, ఇడ్లీ లాగించేశా.

మరోరోజు మళ్ళీ ఇటువంటి తగువే ”రోజూ ఇలా టిఫిన్ దగ్గర తగువుతో వేగలేకపోతున్ననమ్మా! ఉండడి ఇప్పుడే వస్తా” అని ఇడ్లీ ప్లేట్ పట్టుకుపోయింది. ”టిఫిన్ పెడుతుందా? పెట్టదా? ఇవేళ ఏదీ గతినాకూ అని పాడుకోవాల్సిందేనా” అని ఆలోచిస్తూ, చిస్తూ ఉండగా ప్లేట్ తో వచ్చేసింది. ”ఏంటీ” అన్నా. ”ఇడ్లీ చిదిపేశాను, కొద్దిగా పోపులో ఉప్పురాయి వేసి కొద్దిగా చింతపండు పులుసు చేర్చి, ఇడ్లీ చిదిపినదానిలో వేసి కలిపేను, బాగుందా” అంది, ”మరికొంచం పెట్టూ” అని లాగించేశా, చప్పరిస్తూ.

ఇలా రోజూ ఏదో ఒక తలనొప్పి పడుతూనే ఉంది, ఒక రోజు పట్టుకొచ్చిన టిఫిన్ పట్టుకెళ్ళిపోయింది, మొహం చిట్లించానని. ఈ రోజు టిఫిన్ యోగం ఉన్నట్టా లేనట్టా అని బొమ్మా బొరుసూ వేద్దామంటే రూపాయి లేకపోయింది, అసలు చొక్కా ఉంటేకదా ఒంటిమీద! రూపాయి కావాలంటే మళ్ళీ ఆవిడ దగ్గరకే వెళ్ళాలి ఓపికలేక కూచున్నా! చిన్నప్పుడు పుస్తకం పుచ్చుకుని పేజీలు తిప్పుతూ ”బొమ్మొస్తుందా రాదా” అని ఆడుకున్నది గుర్తొచ్చి పుస్తకం కోసం చూస్తే అటువంటి పుస్తకమే కనపడలేదు, ఏదీ గతినాకూ అని పాడుకుందామా అనుకుంటుండగా, ఒక గిన్నె తెచ్చింది, ఏమిదీ అని చూస్తూ తినడం మొదలెట్టాను. ”ఇంత తొందరలో ఎలా టిఫిన్ మార్చావూ” అన్నట్టు చూశా. ”వంటింట్లోకెళ్ళి నాలుగు గుప్పిళ్ళ అటుకులు పక్కనే ఉన్న పుల్ల మజ్జిగలో పడేశాను, చిటికెడు పసుపేశాను, ఉప్పూ పడేశాను. పోపులపెట్టిలోంచి ఒక మిరపకాయ నాలుగు ఆవాలు తీసుకుని ఒక గరిటెడు నూనెతో పోపు వేయించి మజ్జిగలో కలిపేశాను, అదిగో అదే మీ టిఫిన్” అంది, మెచ్చుకోలుగా చూశాను, మధ్యాహ్నం టిఫిన్ ఏమిటీ అన్నట్టు.

మధ్యాహ్నానికి ఇలా చేస్తా అని చెప్పింది. కొద్దిగా అటుకులు నేతి చుక్కవేసి వేయిస్తా, వాటిని మిక్సీ పట్టి ఉంచుతా, దానిలో చిటికెడు ఉప్పూ, పంచదార కలుపుతా. కొద్దిగా జీడిపలుకులు కూడా మిక్సీ పట్టేసి కలిపేసి కొద్దిగా నెయ్యేసి ఉండచుట్టేస్తా అని ముగించింది. ”తీపా” అని సాగదీశా.

కాకపోతే మరోటీ అని చెప్పింది ఇలా. అటుకులు వేయించుకుని నేతి చుక్కతో మిక్సి పట్టేస్తా. కొద్దిగా నువుపప్పు, వేరు శనగ గుళ్ళు, గుల్ల శనగపప్పు, జీడి పప్పు విడివిడిగా కొద్ది నేతి చుక్కతో వేయిస్తా, అలాతినలేరు కదూ అందుకు అన్నీ మిక్సీ పట్టేస్తా, అటుకులగుండలో కలిపేసి, కొద్దిగా ఉప్పూ కారం చేర్చి నేతితో ఉండ చేస్తా అంది. అమ్మబాబోయ్ ఎంత కష్టపడుతున్నవని నోటి చివర దాక వచ్చిన మాట చెప్పలేదు, కళ్ళతోనే చెప్పి ఊరుకున్నా. వస్తా పనుంది అని వెళ్ళిందండి, అదండి పళ్ళులేని బోసినోటి టిఫిన్ సంబరం.

మొన్నో రోజు పదిమంది మిత్రులు చూద్దామని వస్తున్నామని కబురు చేశారు, ఒక పావుగంటలో వస్తామన్నారు, నేను కుర్చీలు సద్దుతుంటే ఇల్లాలడిగితే చెప్పాను, వచ్చే వాళ్ళకి ఏమయినా పెడితే బాగోదూ అని, అలాగే వాళ్ళు రావడానికోపావుగంట పడుతుంది కదా! వాళ్ళొస్తే వాళ్ళ బుర్రలు మీరు తింటూ ఉండండి, ఈ లోగా నేను వాళ్ళు తినడానికి పంపుతానంది. ఇంత తొందరలో ఏం చేస్తుందబ్బా అనుకున్నా. వాళ్ళు వచ్చిన ఐదు నిమిషాలకి టిఫిన్ వచ్చేసింది, చూస్తినా అది అటుకుల పులిహోర, లొట్టలేసుకుంటూ తినేసి ఆవిడకి ధన్యవాదాలు చెప్పేసేరు మావాళ్ళు. ఇదండి అటుకులతో తక్కువ సమయంలో చేయగల టిఫిన్లు.

21 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బోసినోటి టిపిన్ సంబరం

  1. ఉఫ్ మని ఊదితే ఎగిరిపోయే అటుకులతో యెంత గట్టి పోస్టేరు బాబాయి గారు. ఓ నాలుగు రోజుల పాటు టిఫిన్ వెతుక్కోనక్కర్లేదు. మరచేపోయాను మీరు గొప్ప అదృష్టవంతులు సుమండీ!

    • అమ్మాయి జ్యొతిర్మయి,
      అటుకులు తేలికేగాని, అమ్మో చాలా పవర్ఫుల్ కదమ్మా. పచ్చి అటుకులు తింటే కడుపు నెప్పి ఖాయం 🙂
      జీవితంలో చేసిన ఒకే ఒక్క తెలివైనపనేంటో తెలుసమ్మా!…. మీ పిన్నిని చేసుకోవడం…అదృష్టవంతుడినే కదూ……. 🙂

      ధన్యవాదాలు.

    • శిశిర గారు,
      అదృష్టమో ఏమో తెలీదు గానండి…..ఆయ్ అలా బతికేస్తున్నామండి 🙂
      ధన్యవాదాలు.

  2. నూటికి నూటయాభైశాతం మీరు అప్పదాసైపోయారు.అమ్మచేసే అటుకులవంటల ప్రయత్నాలన్నీ బాగున్నాయ్,చాలా సులువుగావున్నాయ్.ముందుగా అమ్మగారికి ధన్యవాదాలు.

    • mallampalli swarajya lakshm గారు,
      మీ అమ్మగారి బలం బలగం ఎక్కువండి 🙂 ఒంటివాణ్ణి, ఎప్పుడో ఏభయేళ్ళకితం చెయ్యిపట్టుకున్నానండి..అంతేనండి…అప్పదాసు మా లాటి జీవితాల్లోంచే వచ్చేడండి…అప్పదాసయ్యానంటారా? ఏమో ఇదే ఆనందంగా ఉందండీ….
      ధన్యవాదాలు.

  3. భలే ఉంది మీ పొస్టు .. అచ్చు మిధునం సినిమాలో లాగా .. నాకు తిండికి సంబంధించిన టపాలు అంటే బహు బాగా ఇష్టం ..
    ఈ అటుకుల వంటలు చూసి నాకు మా అమ్మ గుర్తొచ్చింది .. మొన్న బుధవారం వరకు ఉండి నాకు బాగా వండి పెట్టీ ఇండియా వెళ్ళారు మా అమ్మ నాన్న .. ఇప్పుడు ఇది చుసాక నాకు బెంగగా ఉంది .. 😦

    • కావ్య గారు,
      బెంగ పడకండి, అటుకుల టపాలో చేసుకునేవన్నీ చిటుకూ చిటుకూ అయిపోయేవే కదా చేసేసుకోండి, అమ్మ మళ్ళీ వచ్చేస్తారుగా, ఆవిడ మాత్రం మిమ్మల్ని వదిలి ఉండగలరా? 🙂
      ధన్యవాదాలు.

  4. ఇట్లా వంటకాలు గట్రా గురించి టపాలు పెడితే దాంట్లో మస్తు గా ‘కలర్’ఫుల్’ ఫోటో లో పెట్టాలి బై డిఫాల్ట్ !
    అవన్నీ లేకుండా ఇట్లా ‘మాటల’ తో టిఫిను టపాలు పెడితే ఎట్లా !!
    ఇది నిజం గా బోసి నోటి టిఫిన్ సంబరమే ! జేకే !

    చీర్స్
    జిలేబి

    • Zilebi గారు,
      ఆకలేసి తినేసేనండి ఫోటో లు పెట్టలేదు, ఉత్తిత్తి మాటలే కాని టిఫిన్ పెట్టలేదంటారా? తమ దర్శనమేదీ?
      ధన్యవాదాలు.

      • వామ్మో కష్టే ఫలే వారు,

        బాణాన్ని మా మీదికే తిరగేసేరు ! మీరు సామాన్యులు కాదుస్మీ !!

        జిలేబి

      • జిలేబిగారు,
        తమ దర్శనమైతే పాదాభివందనం చేసుకుని అమ్మకి హారతిచ్చి ఫలహారమేమి,షడ్రసోపేతమైన విందు ఇచ్చేవాళ్ళమేగా, తమ దయే లేదు 😦
        ధన్యవాదాలు.

  5. ఇలా సమయానికి తగినట్లు చకాచకా రకరకాల రుచులు చేయటం నేర్చుకునేందుకు మీ ఇంటికి వచ్చేస్తానండీ.

      • “వచ్చేయండొచ్చేయండిడొచ్చేయండి, స్వాగతం”
        ——————–
        మా ఇంటికి రండని ఎంత చక్కగా నోరారా పిలుస్తారు మీరు శర్మ గారూ! మీ ఈ గొప్పమనసు నేను చాలా సార్లు గమనించాను. (నన్ను కూడా అలాగే ఆహ్వానించారు మీరు, థాంక్స్. వీలు చూసుకుని తప్పక వస్తాను). బ్లాగుల్లో పరిచయాలు అక్కడే ఆగిపోనక్కర్లేదని, కొంచెం ముందుకు వెళ్ళి స్నేహంగా మలుచుకోవచ్చనీ మీలాగే నేనూ నమ్ముతాను. కాని అందరూ మీలా ఉండరులెండి. కొంతమంది బ్లాగర్లు, మిమ్మల్ని కలుసుకోవచ్చా మీకు అభ్యంతరం లేకపోతే అని వారికి మెయిలిస్తే కనీసం జవాబు ఇవ్వని వారూ ఉన్నారు (ఒక రకంగా అదే వారి సమాధానమేమోలెండి 🙂 ). ఆశ్చర్యం లేదులెండి. లోకోభిన్నరుచిః గదా. ఎవరిష్టం వారిది. It takes all sorts to make this world. ఏమైనా మీలాంటి, ఫణిబాబు గారిలాంటి సహృదయులు, స్నేహాభిలాషులు అరుదు (ఫణిబాబు గారు కూడా నాకు బ్లాగు ద్వారానే పరిచయం). అలాగే బ్లాగుల ద్వారా నాకు స్నేహితులయినవారు ఇంకా ఉన్నారు. అది నా అదృష్టం.

      • మిత్రులు నరసింహారావుగారు,
        నాలుగు రోజులుగా నెట్ వస్తూ పోతూ ఉంది, నిలకడలేదు, వివరంగా టపా రాయించేస్తున్నారు. 🙂
        ధన్యవాదాలు

  6. అటుకులతో టిఫిన్లు చెయ్యడం పుణ్యం, పురుషార్ధం కూడా. కృష్ణపరమాత్ముడిని తలపించడంలో వెన్న తరువాత స్థానం అటుకులదే కదా!

  7. శర్మగారి టిఫెన్ తయారీ కోచింగ్ సెంటర్ లో సభ్యత్వం తీసుకోవాలనిపిస్తున్నది 🙂

    • కొండలరావుగారు,
      కోచింగ్ సెంటర్ కి స్వాగతం, చిన్న ఫీజండి, ప్రేమ, అభిమానం మాత్రమే అడుగుతాం. 🙂
      ధన్యవాదాలు.

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి