శర్మ కాలక్షేపంకబుర్లు-పిలుపులు-పేరంటాలూ

పిలుపులు-పేరంటాలూ

దక్షుడు నిరీశ్వర యాగం మొదలుపేట్టేరు, తనకి శివుడు గౌరవం ఇవ్వలేదనుకుని. దేవతలంతా ఆ యాగానికి వెళుతున్నారు. అమ్మకి ఒళ్ళు మండిపోతోంది, నిరీశ్వర యాగం జరగడం అమ్మకి ఇష్టం లేదు, అలా జరిపించేవారిని శిక్షించాలి, ఎవరు చేయగలరా పని? ఈశ్వరుడే చేయాలి, కాని ఆయన శివునిలా కూచున్నాడే, ఆయనని రుద్రుణ్ణి చేస్తేగాని ఆ యాగం ఆగదు, అందుకు అమ్మ,

”మా నాన్నగారింట యాగం జరుగుతోందిట వెళతానూ” అని మొదలెట్టింది.

”పిలవని పేరంటానికి వెళ్ళకు సతీ” అన్నారు ముక్కంటి.
అమ్మందీ ”ఏమండీ, పుట్టినింటికి, గురువుల ఇంటికి, స్నేహితుల ఇంటికి, పిలవకపోయినా వెళ్ళచ్చని కదా శాస్త్రం చెబుతోందీ” అంది. దానికి ముక్కంటి.
”నువ్వన్నది నిజమేనోయ్! కాని నీకు అక్కడ సన్మానం జరగదు, అవమానం జరుతుందని నా భయం, నువ్వా అవమానపడటం ఇష్టం లేక, వద్దంటున్నాకాని, నీ మాట మీద అభిమానం, ప్రేమా లేక కాదుసుమా” అని వివరించారు అయ్య. కాదనే చెప్పింది అమ్మ…
“సరే! నీ ఇష్ట”మని పరివారాన్ని తోడిచ్చిపంపేరు, ముక్కంటి. అమ్మ శివునిపై అలిగి వెళ్ళలేదు. అయ్యను ధిక్కరించీ వెళ్ళలేదు అమ్మ, తరవాత కథ తెలిసినదే, అమ్మ తను అనుకున్నది సాధించింది, పిలవని పేరంటానికి వెళ్ళి. తండ్రినే శిక్షించింది, శివుణ్ణి రుద్రుణ్ణి చేసి….ఇది పిలవని పేరంటం కత…

ఇక మానవ లోకపు  పిలుపులూ, పేరంటాలూ ఎలా ఉన్నాయి, ఎలా రూపాంతరం చెందేయీ చూదాం. పాత రోజుల్లో మేళతాళాలతో పిలుపులు, వివరంగా చెబుతూ. ఆ తరవాత కాలంలో ప్రతినిధులచేత కబుర్లూ, కాలం గడిచి ఉత్తరాలు శుభలేఖలుగా, రోజులు దొర్లితే శుభలేఖలు అచ్చు, కాలం మారితే ఎస్.ఎమ్.ఎస్ లు, నేటి కాలానికి మెయిల్లో, వెబ్ ల్లోనూ, బ్లాగుల్లోనూ ఆహ్వానాలూ అందుతున్నాయి.

ఇక పేరంటాల మార్పెలావచ్చిందో చూదాం. మొదటిరోజుల్లో పెళ్ళి అని పిలిస్తే ఒక రోజు కార్యక్రమం,వెళ్ళినవారికి, భోజనాలతో సహా. తదుపరి ముహూర్త సమయానికెళ్ళి అక్షంతలు చల్లి బయటపడటంగా మారింది. ఆ తరవాత ఒక ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్ళకెళ్ళాలి, ఆరు గిఫ్ట్ లు చేత పట్టుకోవడం బయలుదేరిపోవడం. అక్కడకెళితే పిలిచినవారుకాని, వారివారుగాని ఎవరూ కనపడరు. వీడియో తీసేవాడూ, ఎవరో తెలియనివారూ ఎదురవుతారు, వెర్రినవ్వు నవ్వుతూ, లోపలికి చెయ్యి చూపుతూ. చిప్పపుచ్చుకుని. అడుక్కుని, లైన్ లో నిలబడి, కొద్దిగా వేయించుకుని ముష్టిలా, మరో బకరా మనలాగే దొరికితే, కబుర్లాడుతూ మెతుకు కొరికి, వీలుకుదిరితే వధూవరులపై రెండు అక్షతలు జల్లి, (పెళ్ళికాకుండానే పక్కపక్క కూచోబెట్టి తతంగాలు నడిపేస్తున్నారుగా) పక్కనే ఉన్న పెళ్ళిపెద్దకి ఇంకా ఎన్ని ముహూర్తాలకి వెళ్ళాలో చెప్పి, చెయ్యూపివచ్చేయడం. అమ్మయ్య! పేరంటం అయిపోయింది. ఎన్ని మార్పులు. ఇక రేపెన్ని రానున్నాయో!

ప్రపంచమే మిధ్య, దానిలో నెట్టూ బ్లాగులు మరో మిధ్య. ఇక్కడ మనుషులు కనపడరు, మాటలూ వినపడవు. అక్షరాల వెంట కనులు పరుగెడతాయి, దాని వెంట మనసూ పరిగెడుతుంది , మనసు పులకరిస్తుంది,వారిని పలకరించాలనిపిస్తుంది,అభిమానంతో,ఆత్మీయతతో. రాసిన వారి మీద ఆప్యాయత, అభిమానమూ పెంచుకోడమూ జరుగుతుంది, ఇదేం తప్పూ కాదు. కొంతకాలానికి ’మిమ్మలని చూడాలనుకుంటున్నా, వస్తాను, అడ్రస్ చెప్పండి’తో ప్రారంభమవుతాయి, పిలుపులు. ఇది లోకసామాన్య పిలుపులకి భిన్నమైనది. కొందరు ’నాకిష్టం లేదు’ అని మొహమాటపడకుండా చెబుతారు, కొందరు సమాధానమే ఇవ్వరు, అలా అడిగినవారి ఉత్సాహాన్ని పరీక్షకి పెడుతూ. మరికొందరు ’రండి’ అని సాదరంగా ఆహ్వానమే ఇస్తారు. చివరగా, మరికొందరు వస్తానంటూ ఉంటారు, ఎంతకీ అది జరగదు, ఇవతలవారూ మనుషులేగా, వీరికీ ప్రతిస్పందించే మనసూ ఉంటుంది, అనుకోరు. నేనే వస్తానంటే ’అబ్బే వద్దండి, నేనే వస్తా’నంటారు, అంటే, మొదటగా వస్తానన్న రోజుకీ ఆ తర్వాత జరిగిన కాలంలో, వీరిపట్ల వారికి మక్కువ తగ్గిపోయి ఇలా చేస్తారనిపిస్తుంది. కొందరు బంధుత్వమూ కలుపుతారు. ఇలా నెట్ లో స్నేహితుల్నీ, బంధువులూ కలగి ఉండడం, కలవడం ఆనందించవలసిన విషయాలే. మనసులో దాచుకుని నెమరు వేసుకునే అనుభూతులే…

వీరి మనఃస్థితి విశ్లేషిస్తే మొదటివారు ఎవరితోనూ కలియలేరు, ఒంటిపిల్లి రాకాశి లాటివారు. వారిని వారే నమ్మలేరేమో! నిజానికి వీరు ఎవరినీ నమ్మరు. ఇక సమాధానం ఇవ్వనివారు తమ గొప్పను ప్రదర్శించుకున్నామనుకుంటారు. ఇక మూడవవారు జగమంత కుటుంబం నాది అనుకునేవారు, వీరికి మనసుంటుంది, అందరూ నావాళ్ళే అనుకుంటారు, అందుకే బాధలూ పడుతుంటారు. ఇక నాల్గవవారు మేధావులు ఏదీ జరగనివ్వరు,వీరు మనుషులతోనూ, మనసులతోనూ ఆడుకోగలరు, చెప్పేదొకటీ, చేసేది మరొకటీ ఉంటుంది, పైకి గంభీరంగా కబుర్లు చెబుతారు కాని. ఎటూ తేల్చుకోలేని ఉత్తి పిరికివాళ్ళు.

ఒకప్పటి ప్రముఖ బ్లాగర్లేమయ్యారు? చదువులు,పెళ్ళీ, పేరంటం, ఉద్యోగం, పిల్లలు, బాధ్యతలు ఇలా జీవితంలో ములిగిపోయారేమో తెలియదు. మాలాటివాళ్ళు కాలంతో జారిపోతారు. కొంతమంది బ్లాగులు మూసేశారు, కొందరు ఆహ్వానితులకు మాత్రమే అన్నారు, మరికొందరు బ్లాగును అలాగే వదిలేశారు. బ్లాగుల్లో ఉండే కాలం మహా ఐతే ఐదేళ్ళు, అదే చాలాఎక్కువ. ఆ తరవాతెవరికి గుర్తు? మన తాతపేరే మనకి గుర్తులేదే! పక్కనున్న వారిగురించే పట్టించుకోని నేటి రోజుల్లో, ఎవరికి ఎవరు? కనపడితే హాయ్! అంటారు, నాలుగు రోజులు కనపడకపోతే, ఎవరో తక్కువైనట్టుందనుకుంటారో సారి, మరి నాలుగు రోజులికి మరచిపోతారు. భూమి మీదున్న  రోజుల్లో,బ్లాగుల్లో ఉండే కొద్దికాలంలో, నాలుగు మంచిమాటలాడి ఉండలేకపోతున్నాం, కారణం……. ఎవరినైనా అభిమానించినా, కలిసినా, అదొక మథురానుభూతి . ఇంతకీ కావలసిందేంటో తెలుసా? మంచి మాట, మనసును పెనవేసే మంచి మాట, మనసును కదిలించే మాట…..ఎవరూ ఎవరికీ మడులూ మాన్యాలూ ఇవ్వక్కరాలేదు, ఒక్క మాటిస్తే అదే చాలు…..సరే! లోకో భిన్నరుచిః, ఎవరిష్టం వారిది, ఎవరినీ తప్పు పట్టలేం కదా! తప్పు పట్టక్కరలేదు కూడా…

మిత్రులు శ్రీ విన్నకోటవారు, మీరు ఎవరినైనా అంత ఆదరంగానూ పిలుస్తారే, రమ్మని అన్నారు, నిజమే. మానవ జన్మ మూడునాళ్ళ ముచ్చట, మానవ సంబంధాలూ సున్నితమైనవే.. మనల్ని కావాలనుకున్నవారు, అభిమానించేవారు జీవితంలో దొరకడం నిజంగానే అదృష్టం. చిత్రమైన విషయం, మనసు చేసేది, మనల్ని అభిమానించేవారితో మాటాడం, మనం అభిమానించేవారికోసం వెంపర్లాడతాం. ఇందులో మాలాటి పల్లెటూరి వారిని ఎవరేని చూడటానికి రావడమే గొప్పగా భావిస్తాము. మేము దేశాలు తిరిగినవారంకాదు, లౌక్యం అసలే తెలియదు,హోదాలు లేవు, తెలియదు కూడా, అందుకే మా పిలుపులు, మాటలు, చేతలు, అలాగే ఉంటాయి, కొద్దిగా మట్టివాసనతో.

ప్రస్థుతం నన్ను చూడాలని, పలకరించాలని,మాటాడాలనుకునేవారైతే, జాబితా చాలానే ఉంది, వారందరికి సాదర ఆహ్వానం. నా మెయిల్ అడ్రస్ నా బ్లాగ్ లో నాపేరు మీద నొక్కితే కనపడుతుంది, దానికో మెయిలివ్వండి, మీకిదే సాదర ఆహ్వానం…నేను కవినని తెలుసుకదా! అందుకే ఫోన్ నంబరివ్వను..మరేంలేదు….నేను బ్లాగుల్లో కనపడకపోయినా ఇబ్బంది పడకండి…అతిధి దేవోభవ….

రండి! రండి!! రండి!!! దయచేయండి….తమరిరాక మాకెంతో సంతోషం సుమండి….

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పిలుపులు-పేరంటాలూ

  1. శిశిర29 May 2015 at 10:17
    నేను మీరు విశ్లేషించిన మొదటి తరగతికి చెందినదాన్నండీ. 🙂 మీ ఈ పోస్ట్ వల్ల ఎన్నెల గారి ఉనికి తెలిసింది. శర్మ గారూ, మీ పేరు మీద క్లిక్ చేసి చూస్తే చివరి పేరాలో ఏమిటీ? సర్వేశ్వరుణ్ణి అలా అడుగుతున్నారు. 😦 ఇంకో పది కాలాలు ఈ పిల్లలందరికీ మరో నాలుగు మంచి మాటలు చెప్పగలిగే శక్తినీయవయ్యా అని అడగాలి కానీ!!!

    అన్నట్టు నిన్న వాట్సాప్ లో ఓ శుభలేఖ వచ్చింది. నేనూ అక్కడే శుభాకాంక్షలు చెప్పేశా. 🙂

    ReplyDelete
    Replies

    sarma1 June 2015 at 04:41
    శిశిర,
    ఎవరిష్టం వారిది, మరీ గిరిగీసుకోకూడదు కదా!
    ఎన్నెలగారు కనపడినందుకు ఆనందంకదా!!
    జీవితం నసపెడుతోంది, విసిగిస్తోంది కూడా, అందుకే ఆ మాట 🙂
    చెప్పాలని ఉంది మనసు విప్పాలని ఉంది, ఓపికే లేకపోతోంది.
    ఈ మధ్య శుభలేఖలు అలాగే వస్తున్నాయి కదూ, మరి శుభకామనలు కూడా అక్కడే చెప్పేస్తే సరిపోతోంది 🙂 వాళ్ళు కూడ మననుంచి అంతకుమించి ఆశించటం లేదేమో…
    ధన్యవాదాలు.

    Delete

  2. మట్టి వాసన బాగానే ఉంటుంది కదా శర్మ గారూ. అందులోనూ అప్పుడే వాన చినుకులకి తడిసిన మట్టి వాసన గురించి చెప్పనక్కర్లేదు. అందువల్ల మీరు మీ పిలుపుకి మట్టి వాసన అనే విశేషణం తగిలించవలసిన అవసరం లేదు. అదీకాక, పిలిచే వారి ఆత్మీయత గదా ముఖ్యం.

    • విన్నకోట నరసింహారావు గారు,
      అంతేనంటారా 🙂 పిలిచేవారి ఆత్మీయతే ముఖ్యం. అది కాస్త మోటుగా ఉంటుందేమోనని భయం.

      ధన్యవాదాలు.

  3. >>>30.05.2015

    మెరిసేదంతా బంగారం కాదని తెలిసినా భ్రమ బాధ పెడుతూ ఉంటుంది, ఇది సర్వ సహజం.

    అమ్మ పరమ దయాళువు. కొన్ని పనులు జరగలేదని బాధ పడతాం, మథనపడతాం. . అవి అలా జరగడం మనకి మంచిది కాదని తెలియక బాధ పడతాం కూడా. అలా జరగకపోవడం మన మంచికే అన్న సంగతి తెలిసినపుడు మాత్రం అమ్మ గొప్పతనాన్ని పొగడక ఉండలేం. అమ్మో! ఎంత పెద్ద ప్రమాదం తప్పిందీ

    ఏమయ్యిందండీ కష్టే ఫలే వారూ??

    జిలేబి

  4. నమస్తే మామయ్య గారు మన వాళ్ళకే మనం మట్టి కంపుకొడుతుంటే ఇతరుల గురించి ఆలోచింప పని యేమి.మనవీధిల్లో ఉంటూనే వాళ్ళకు అవసరం ఉంటే అక్కయ్యగారూ అంటుంటారు.లేనిచో మనం పిలిచినా వినబడనట్లు ముఖం చిట్లించుకొని తలుపులు వేసుకొని టీవీ పెద్ద సౌండు పెట్టుకొంటారు.మానవసంబంధాలు అలా ఉన్నాయి. లోగడ ఆదిత్య ౩౬౯ సినిమాలో చెప్పినట్లు మాఇంట్లో పెళ్ళి మీఇంట్లోటీవిలోచూడవలెను అనేరోజులు వచ్చేస్తున్నాయి.అదికూడా మనతరమే చూడవచ్చు

    • s.venkataramayya గారు,
      అల్లుడుగారు,
      మనం ఇంక మారలేం కదా! వారి అవసరానికి మాటాడతారు, ఆ తరవాత పలకరు, ఇది మామూలే. రకరకాల పీడ ముఖాలు నిత్యమూ చూడక తప్పదుకదండీ.
      ధన్యవాదాలు.

  5. >>>కొందరు సమాధానమే ఇవ్వరు, …. మరికొందరు వస్తానంటూ ఉంటారు, ఎంతకీ అది జరగదు,

    ఇక్కడ గుమ్మడికాయ దొంగ ఎవరో భుజాలు తడుము కుంటున్నారండోయ్ 🙂

    జేకే !

    జిలేబి

    • జిలేబి గారు,
      అమ్మకి దయలేదు, దర్శనమూ లేదు. భుజాలు తడుముకుంటేనైనా ఎప్పటికైనా దయ కలగదా అని ఆశ.
      ధన్యవాదాలు.

  6. ఇంతకీ కావలసిందేంటో తెలుసా? మంచి మాట, మనసును పెనవేసే మంచి మాట, మనసును కదిలించే మాట…..ఎవరూ ఎవరికీ మడులూ మాన్యాలూ ఇవ్వక్కరాలేదు, ఒక్క మాటిస్తే అదే చాలు…..సరే! లోకో భిన్నరుచిః, ఎవరిష్టం వారిది, ఎవరినీ తప్పు పట్టలేం కదా! తప్పు పట్టక్కరలేదు కూడా…
    ఇలాంటి మాటలు వినేరోజులా?శర్మగారు.మీరు బ్లాగులంటున్నారు,అసలు మనచుట్టూవున్న మనుషులే మనసువిప్పి మాట్లాడలేకపోతున్నారు.మాట్లాడితే ఒకరివి మరొకరికి రావు.మనసు తేలికబడటం తప్ప.అదే అరుదైనరోజుల్లో బతుకుతున్నాం.మీరన్నట్లు పల్లెల్లో కోంచెం మెరుగనుకుంటా.మంచి మాటలు అందించినందుకు ధన్యవాదాలు.

    • mallampalli swarajya lakshmi గారు,
      మనుషులు ఇలా ఎమ్దుకు( Introverts)అంతర్ముఖులైపోతున్నారో తెలీదు. దైవ చింతనలో అంతర్ముఖ్లైతే బాధ లేదు కాని నిత్య వ్యవహారం లో అయిపోతున్నారు. లోకో భిన్న రుచిః ఏం చేయలేములెండి, కోపాలొకటి బాగా వచ్చేస్తున్నాయి, అందరికీ. పల్లెల గురించి అనకండి, మరీ దారుణంగానే ఉన్నాం. పక్కవాడు చచ్చిపోతున్నాడంటే అర్జంటుగా సంచీ పుచ్చుకుని ఊరికెళిపోతున్నారు.
      మనుషులకి చదువులు పెరిగాయి, డబ్బు సంపాదన పెరిగింది, ఇంగిత జ్ఞానం తగ్గుతోంది.
      ధన్యవాదాలు.

  7. ఒకప్పటి బ్లాగర్లు ఏమయ్యారో.. నేను ఇక్కడే ఉన్నానండీ.. ఎక్కువ వ్రాయట్లేదు కానీ బ్లాగుల్లో తిరుగుతూ చదువుతూనే ఉన్నా..

వ్యాఖ్యానించండి