శర్మ కాలక్షేపంకబుర్లు-గట్టి పకోడి

గట్టి పకోడి.

మొన్న పకోడి కూర గురించి రాస్తూ గట్టి పకోడీ, మెత్తటి పకోడి అన్నా. మెత్తటి పకోడీ కూర చెప్పేరు,గట్టి పకోడీ గురించి చెప్పలేదేం అన్నారు, మిత్రులు విన్నకోట వారు, ఆకుకి అందని పోకకి పొందని సమాధానం చెప్పేసి తప్పించేసుకున్నా, అస్తమానం అందర్నీ బుట్టలో పడెయ్యడం కుదురుతుందా? ముందుకొస్తే డాక్టర్ సుమన్ లతగారు నిలదీశారు, తప్పించుకోడానికి దారిలేక ఇలా…..

మెత్తటి పకోడి వేసుకోడానికి శనగపిండి, కొద్దిగా వరిపిండి, బళ్ళారి నీరుల్లిపాయలు, పచ్చి మిర్చి ఏదయినా సరిపోతుంది, వేసేసుకోవచ్చు. మరి గట్టి పకోడీకి అలా కుదరదు.

నిజానికి కోడికాని కోడి ఈ గట్టిపకోడీ. గట్టిపకోడీ కి మొక్కజొన్నపిండి కావాలి, కొద్దిగా, వరిపిండి, కొంచం శనగపిండి చాలు, వీటిని కలిపేసుకుని, కొద్దిగా పసుపేసి, ఉప్పేసి, అందులో నీరుల్లిలో చిన్నపాయలు, గొల్లప్రోలు పాయలు తరుక్కుని, సన్నపచ్చి మిర్చి సన్నగా తరుక్కుని, పిండిలో కలిపేయాలి. గట్టి పకోడి ఇంకా బాగోవాలంటే, తోటకూర కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి.

నీరుల్లిపాయని ఎల్లియం సీపా అని, వెల్లుల్లిని ఎల్లియం సతీవా అని అంటారట. ఉల్లిపాయలు తరిగేటపుడు కళ్ళ నీళ్ళు తక్కువ కార్చాలంటే ఒక ఉల్లిపాయను కత్తిపీటకి సగం తరిగి కత్తిపీటని ఉంచేస్తే చాలు.నీరుల్లి పాయ తరిగేటపుడుటపుడు కళ్ళంట నీళ్ళొస్తాయి, ముక్కు చీదాలి, రొంప పట్టినట్టు ఉంటుంది, నిజంగా ఏడ్చినట్టే ఉంటుంది, రొంప పట్టేసిందా? వంటింటిలోకెళ్ళి ఇల్లాలికి ఉపకారం చేసినట్టు ఉల్లిపాయలు తరిగేయండి, రొంప దెబ్బకి పరార్, ఎల్లియం సీపా రొంపకి మంచి మందండీ, ఇది హోమియో మందు, దారి తప్పేసేను మన్నించండి, మళ్ళీ పకోడీల్లోకొచ్చేద్దాం.

బాగా కాగిన నూనెలో పిండి విదిపితే బంగారం రంగులో వేగిన తరవాత దేవుకుని పేపర్ మీద పోసుకుంటే నూనె పీల్చేస్తుంది, పేపరు. తింటే కరకరలాడుతూ, మధ్యమధ్య పచ్చిమిర్చి తగిలి, కళ్ళనీళ్ళొస్తే, వెంటనే ఉల్లిపాయ తగిలితే ఆనందం, పచ్చిమిర్చి తగిలితే “మంచినీళ్ళు తాగాలనికూడా చెప్పాలా? ఏంటోనమ్మా! ఏదీ గుర్తుండదంటే ఎలా చచ్చేదీ” అని దీర్ఘం తీస్తుంటే, అబ్బో అప్పుడు గట్టి పకోడీ రుచే వేరూ.

ఒక చల్లటి సాయంత్రం సన్నటి జల్లు కురుస్తుంటే, పడక కుర్చీ వేసుకుని కిటికీ దగ్గర కూచుని జల్లు చూస్తుంటే, ఇల్లాలు గట్టి పకోడీవేసి పళ్ళెంలో తెచ్చి పెడితే, చల్లని పిల్లగాలి వీస్తుంటే, ”తినండీ” అన్న మాట వినపడితే,
”నువ్వు తిన్నావుటోయ్” అంటూ ఒక పకోడీ అమె నోటికందిస్తుంటే,
”చాలు, ముదిమికి ముచ్చట్లు లావని, లేటు వయసులో ఘాటు ప్రేమా?”.. అని మూతి తిప్పుకుంటుంటె.
”అదేమోయ్! అన్యాయం!! మూడు పాతికలకే ముసలా?” అంటూ ఒక పకోడీ ఆమెకుపెడితే, “ఓహో! ఏమీ మా శ్రీవారి ప్రేమా!” అని ఇల్లాలు మురిసిపోతుండగా పకోడీల పళ్ళెం ఖాళీ చేస్తే, శ్రీమతి వారు పళ్ళెం పట్టుకెళ్తుండగా,
”ఏమోయ్! మాట,”
”చెప్పండి,”
”ఇలారా!”
”వినపడుతోందిగా!!”
”మరీ అంత దూరం ……”
”పిచ్చి వేషాలెయ్యక ఏంటో చెప్పండి” అని కొద్ది దూరానికొస్తే
”రాత్రికి ఉల్లిపాయ పులుసు పెట్టకూడదూ?”
”ఎందుకు పెట్టకూడదూ? పెట్టచ్చు, కోరికలు లావయిపోతున్నాయే!, ఉల్లిపాయలెవరు తరుగుతారు? మా ఆయనా?”
”ఓ! అలాగే,”
”చాల్లెండి, ఉల్లిపాయలు తరగడం పేరు చెప్పి, చెయ్యి తెగ్గోసుకోగలరు,ఇంకక్కడినుంచి ముక్కుచీదడం, తుమ్ములు, నానా రభసా చేస్తే వీధిలోవాళ్ళంతా, నాకేదో తవ్వి తలకెత్తుతున్నట్టు అనుకోవాలనా? మీ సంగతి నాకు తెలీదా! ఏభయి ఏళ్ళనుంచి చూస్తుంటే” అని ఆటపట్టిస్తే, ముసిముసినవ్వులు నవ్వుతూ లోపలికెళ్ళి రాత్రి బోజనానికి గట్టిపకోడీకి జోడీ ఉల్లిపాయపులుసు, అదికూడా ఇలాపెడితే.

నీరుల్లిలో బళ్ళారి రకం పెద్దవి, గొల్లప్రోలు ఉల్లిపాయలు చిన్నవి, చిన్నవి చాలా ఘాటుగా ఉంటాయి. వీటిని సన్నగ చిన్న ముక్కల్లా తరుక్కోవాలి. సన్న పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకోవాలి. చింతపండు పులుసు పిసుక్కుని,పల్చగా,ఉప్పేసి, కొద్దిగా పసుపేసి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చేర్చేసి, కొద్దిగా కొట్టు పిండి, (వరిపిండే వేసి,) సన్నటి సెగని మరగనివ్వాలి, కొద్దిగా పోపుపెట్టాలి. బాగా గట్టి పడనివ్వకుండా గరిట జారుగా ఉండేలా చూసుకోవాలి.

ఈ ఉల్లిపాయల పులుసు కొద్దిగా వేడిగా ఉండగా అన్నం లో కలుపుకుని కొద్దిగా నూనెవేసుకుని, గట్టి పకోడీ నంచుకుంటూ, ఇల్లాలితో కబుర్లాడుతూ భోజనం చేసి, ఒక్క వక్కపలుకు నోట్లో పారేసుకుని (లేకపోతే ఉల్లిపాయ వాసనని ఇల్లాలు గొడవ పెడుతుందికదా) భుక్తాయాసాన్ని తీర్చుకోడానికో వంద అడుగులేసి,
”ఏమోయ్! ఇంకా అవలేదూ?”
”మీకేం! మహరాజులా భోజనం చేసెళ్ళేరు, ఎంత దేవుకుంటే అవుతుంది? ఏంటిటా?”
“అబ్బే ఏంలేదోయ్! పనయితే వస్తావేమో కబుర్లాడుకుందామని, మిగిలిన పని రేపు పొద్దున చేసుకోవచ్చులే” అని నసిగితే
”రేపు పొద్దునెవరు చేస్తారుటా? మా ఆయనా?”
”ఆ అలాగే చేస్తాను, ఏం చెయ్యలేనా?”
”వద్దు మహప్రభో వద్దు, ఆ తరవాత నా తిప్పలెవరికెరుక, వస్తున్నా ఉండండి, ఆ కంప్యూటర్ దగ్గర కూలబడకూడదూ కాసేపు” అని మెత్త మెత్తగా వాయిస్తుంటే…
పని పూర్తి చేసుకొచ్చి ”చెప్పండి ఏంటిటా?” అని అడుగుతూ కూచుంటే
”ఇప్పటిదాకా ఎండ పేల్చేసి, చల్లబడితే హాయిగా ఉందికదూ” అంటే
”ఏ కాలానికి ఏది తప్పుతుంది?”
ఇలా కబుర్లాడుకుంటుంటే….
మధురం మధురం ఈ సమయం ,ఇక జీవితమే ఆనందమయం….

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గట్టి పకోడి

 1. ధన్యవాదాలు శర్మగారూ! గట్టి పకోడీ చాలా రుచిగ వస్తుందా అని భావించే
  దాన్ని.జొన్న పిండి వేస్తారని తెలియదు. తెలియజేసి నందుకు థాంక్స్.కోడి కాని
  కోడి రుచికి ఎల్లలు లేవు కదండీ———సుమన్ లత.

  • Sumanlata Rudravajhala గారు,
   ఆలస్యానికి మన్నించాలి. ఇంతకీ గట్టిపకోడీ వేయించుకు తిన్నారాలేదా? 🙂
   ధన్యవాదాలు.

 2. మాలాంటి వారి కోరిక మన్నించి ఇంత త్వరగా ఈ టపా వ్రాసినందుకు ధన్యవాదాలు శర్మ గారూ. గొప్ప పిండివంట.

  • విన్నకోట నరసింహారావు గారు,
   మరేంటనుకున్నారు, గట్టిపకోడీయా మజాకా!!! పకోడి గురించి మూడు లైన్లే, మసాలా దట్టిస్తే 🙂 సరదా కాలక్షేపం కదా 🙂
   ధన్యవాదాలు.

 3. ఆహా! ఇదేకదా మిధునం అంటే.మూడు పాతికలు కాదు మరో మూడు పాతికలు చూడాలి,పచ్చగా వర్ధిల్లాలి ఇలాంటి మిధునాలు.చాలా అందంగా అనిపించింది.భావన యొక్క దృశ్యరూపం మనోహరం.ఇక అంతే.

  • mallampalli swarajya lakshmi గారు,
   ఆశా జీవులం కదండీ, ”నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా” 🙂
   ధన్యవాదాలు.

 4. ఈ వంటల టపాలన్నీ మీరే వ్రాసారా? లేక అమ్మగారు చెపితే మీరు టైపు చేసారా?
  అన్నట్టు ఆ మధ్య మీరు పళ్ళు లేని పబోది అయిపోయానన్నారు. మరి “గట్టి” పకోడి ఎలా తింటున్నారు?

  • bonagiri గారు,
   నా గాలి తీసేశారు కదూ! 🙂
   చిన్నప్పటినుంచి వంట చెయ్యడం అలవాటు లేదుగాని అమ్మ కొంగుపట్టుకుని తిరగడం అన్న, అక్క, చెల్లెళ్ళకంటే నేనే హెచ్చు. అమ్మ చేసేది చూడటం బాగ అలవాటు. ఆ తరవాత పెంచుకున్నమ్మ చెయ్యనిచ్చేది కాదు, కూడా తిరిగి చూస్తుండటం అలవాటు పోలేదు. ఇల్లాలి హయాంలో మాత్రం వంటింటిలోకి రానివ్వనని బోర్డ్ పెట్టేసింది, అందుకు వంటిల్లు ఇప్పుడు మన్నా! 🙂 వంటలు చేయడం తెలీదుకాని, ఎలా చేయాలో బాగా తెలుసు, అన్నీ నేను రాసేవే, అప్పుడపుడు అనుమానమొస్తే ఆవిడని అడిగితే మొదటిలో ఎందుకూ అనేది. ఆ తరవాత కాలంలో చెప్పడం మొదలెట్టింది, ఇలా రాస్తానని చెబితే, అదనమాట సంగతి. 🙂
   పళ్ళున్నవాళ్ళు ఎదురుగా ఉండగా, గట్టి పకోడీ ఎలా తిన్నారని అడుగుతారేంటో! అర్ధం చేసికోరూ 🙂
   ధన్యవాదాలు.

 5. శర్మ గారూ ,

  నమస్తే . శుభోదయం . గట్టి పకోడీ టపాతో మీరు దర్శకులు అయిపోయారని తెలియవస్తోంది .

  దర్శకత్వం బాగా చెయ్యగలరనిపిస్తొంది . అయితే ఈ విజయం వెనుక మీ భార్యామణి గారి చెయ్యెంతైనా వుండి వుంటుందని కూడా తెలియ వస్తోంది .

  మీ టపాలు సామాజిక జీవనానికి అత్యవసరమైనవిగా పరిగణిస్తున్నాను .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s