శర్మ కాలక్షేపంకబుర్లు-అభిమానధనుని ఆత్మవేదన

అభిమానధనుని ఆత్మవేదన.

గాంధారీ పుత్రా! అభిమానధనా!!సుయోధనా!!! ఏమి? అటుల చింతాక్రాంతుడవైయుంటివి, మా సోదరి గాంధారి మరల ఏమైనా నీమనసు కలచెనా?

మామా! శకునీ!! ఏమంటివి ఏమంటివి, మదీయ మాతృమూర్తి ఎన్నడును అటుల నా మనసును కలగింపచేయలేదే! ఆమెకు కనులున్నను కబోదివలెనే బతికినదిగదా! అస్మత్ పితృదేవులకు కనులులేకున్ననూ బాధ కలుగలేదు కదా! నా పరితాపమంతయు నాగురించి కాదు మామా!

నా భావ వారసులు, నా మెచ్చు చెలికాండ్రయిన తెనుగువారిటుల భావ దారిద్ర్యముచే కొట్టుమిట్టాడుచున్నారేలాయని కదా నా వ్యధ. నాడు పాండవులను హతమార్చు ప్రయత్నమున వీరు మన సేనలో భాగమే కదా! మన భావ వారసులుగారా!! మరేల వీరికీచింత? అంతర్జాలమున మనవారిదే కదా ప్రభ, ప్రతిభ. అందున వ్రాయువారందరునూ తెనుగు బిడ్డలే కదా. మన భావజాలమునకున్నూ లోటులేదుగదా! మనమెవ్వరిని భూషింపలేదే, మనకు పెద్దలు, గురువులు అను తేడాలేదే, చిన్నవారనిన తిరస్కారమూ, పెద్దలనిన పురస్కారామున్నూ లేదే! మన భావస్వామ్యమునకు ఎదురు నిలుచువారందరికీ తిరస్కారమే మన పురస్కారము, సత్కారముగదా! పెద్దలను భూషించిన ఎవరు చెప్పుకొందురు? ఎంతకాలము చెప్పుకొందురు? దూషించిన మనలను కలకాలమూ గుర్తుంచుకొనుటలేదా? మనవలన వారు పేరు ప్రఖ్యాతులు బడయుటలేదా? మన భావజాలమును కాదని బతుకనేర్తురా?దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకేగాని ఆత్మకుకావని వీరికి తెలియదా!

జాలమున కొందరర్భకులు వ్రాయమని భీష్మించుచుండిరా? తలుపులు మూసికొనిరిగాని, తలపులు మూసుకొనలేదే! మరొకచోట గిలుకుట మానినారా? ఇదియొక కండూతి గాదా! దీనినుండి తప్పించుకొనగలరా? గజతామర గోకినకొలది పెరుగునను మాట వీరికి తెలియదందునా? దీనికి ఔషధము ఉష్ణోదకము పోసి గోకుకొనవలెనని తెలియదా! అటులనే వీరుకూడా వ్రాసి కండూతి తీర్చుకొనవలనేగాని, తలుపులు మూయుట భావ్యముగాదే! మరికొందరు గోడపై బిడాలములవలె ప్రవర్తించుచుండిరా? గాలివాటు చూసి దూకుట/మానుట చూచుచున్నారా? మరికొందరు ఉరుకుదును,ఉరుకుదును అని బెదిరించుచుండిరా? కొందరు గుంభనగా యుండి ఏదో ఒక దినమున కనుపింపకుండా పోవలయునను దురాలోచన/దూరాలోచన చేయుచున్నారా?తలుపులు బిగించుకొనుటకు కారణము, అంతర్గత కలహములా, చూపోపమియా, ఇసీ! మేమెన్నిటిని వహింపలేదు. మూడుగాళ్ళ ముదుసలుల నస ఎప్పుడునూ ఉండినదేగదా! ఇటుల వ్రాయుట మానినవారంతా ఏదో ఒక దినమున మానసిక వైద్యులను సందర్శించవలసి వచ్చునేమోగదా! వీరింత సున్నిత మనస్కులేల?

అహో! చూడుము, కొందరు వ్రాయుట మానివేసి, ఎన్నడో వ్రాసినవాటిని ప్రచారము నిమిత్తము, ఈ నాటికీ ప్రతిదినమూ అజ్ఞాత రూపముతో వ్యాఖలు ప్రచురించుకొనుటలేదా? మరికొందరు ఎవరు వీక్షించిననూ లేకున్ననూ వ్రాయుటలేదా? కొందరదేపనిగ వ్రాయుటలేదా? మరి వీరికేల ఈ వ్యధ. మరి ఏలనయా వీరికీ దైన్యము?ముడుచుకొనిపోవుచున్నారా? మానసిక కృంగుబాటా? ఎన్నడును మనమేడ్చినదిలేదే, ఎవరినైన ఏడ్పించుటేగాని ఏడ్చుట మనయలవాటుగాదే

సిగ్గు, లజ్జ? వీటికి అర్ధములే తెలియవే, అటువంటివేమైనా ఉండియున్న చిన్ననాడే వదలివేసితిమే! భయమా మనకు ఏ కోశమున లేదే! ఆత్మన్యూనత, అదెన్నడును మనదరిజేరలేదే, మరేల వీరికీదైన్యము? భావ దారిద్ర్యమా? అదేల సంభవించెను. వ్రాయుటకు కారణమే కావలయునా! ఎవరినేని యధేఛ్ఛగా తప్పుబట్టవచ్చు గదా! ఇది భావ ప్రకటనా స్వాతంత్ర్యముగాదా?   మరేల చింత?

లెమ్ము సోదరా లెమ్ము ( నిదురలేదందువా?)
నడుము బిగించుము (వానపామువలె నడుము నిలుచుటలేదందువా?)
కలము ఝుళిపించుము (కత్తిని, కలమునూ కూడా ఝుళిపించు అలవాటు తప్పెనందువా?)
పగతుర గుండెలో నిద్రపొమ్ము. ( ఇప్పుడిక్కడనే నిదురపోతివే)

ఔరా! ఔరా!! ఔరౌరా!!!ఎందులకు వ్యధాభరితుడనగుచున్నాను? మస్తకము వ్రయ్యలగుచున్నదే! ఇదియంతయూ పాండవ హతకులకుట్ర గాని ఆ మాయలమారి కుట్రగాని కానోపుగదా!
ఎవరురా అచ్చట?
చిత్తము దొరా!
ఏమిరా దొరా యందువు ‘చిత్తము దేవరా యనలేవా?’భానుమతి దేవేరివారికి మా రాక విన్నవించుమురా!
ఆజ్ఞ ! దేవరా!!

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అభిమానధనుని ఆత్మవేదన

  1. నవరసాలలో హాస్య రసాన్ని ఆస్వాదించనిదెవరు?శర్మగారూ రుచులనుంచి హాస్యరసాన్ని ఆస్వాదిస్తున్నట్లున్నారు…ఇది ఏకపాత్రభినయమైతే ఎలా వుంటుందో ఊహించుకుంటున్నా…

    • mallampalli swarajya lakshmi గారు,
      మొన్న శనివారం రాత్రి, అకస్మాత్తుగా దుర్యోధనుడు ఆవహించాడో పావుగంట, అదండి సంగతి 🙂 ఇంకా చాలా చెప్పేడండి, ఆ అతరవాత, నేనే తీసేసేను 🙂
      ధన్యవాదః

  2. కామన్ మ్యాన్ లాగ ఉండే కష్టేఫలే మాస్టారు కూడా క్యామెడీకి దిగిపోయారేంటి!
    నవ్వితే నవ్వండి బులుసును మించి నవ్వులు పూయిస్తున్నారు,యేమిటి కధ?

    • kinghari010గారు,
      హరికాలం హరిబాబుగారేనా?
      ఏంలేదూ తినితొంగుంటే మనిసికీ గొడ్డుకీ తేడా ఏటీ? కూసంత కలాపోసనుండాలో అన్నారు రావు గోపాలరావుగారు, అందుకని 🙂
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి