శర్మ కాలక్షేపంకబుర్లు-ఉరుకుతా ఉరుకుతా

ఉరుకుతా ఉరుకుతా

”ఉరుకుతా ఉరుకుతానన్న సయితేగాని ఉరికినసయితిని జూడలా” అన్నదో జానపదురాలు. ఇది గ్రామ్యం, అసలుమాట “ఉరుకుతా ఉరుకుతానన్న సవతులని చూశాను కాని ఉరికిన సవతిని చూడలేద”న్నది అసలు మాట.

దీనికతేంటిటా? పాతరోజుల్లో బహు భార్యాత్వం బాగానే ఉండేది. ఒక మగవానికి, ఒకరుకంటే ఎక్కువమంది భార్యలే ఉండేవారు. నేనెరిగుండి ఒకాయనకు ముగ్గురు భార్యలుండేవారు, అప్పుడు మరీ చిన్నతనం. ఆ తరవాత కాలంలో, ఒకరికి ఇద్దరు భార్యలుండేవారు, అప్పటికి నా వయసు ఇరవై దగ్గరిమాట. అతను మామ వరుసవాడు. ”మావా! ఒకరితోనే వేగలేకపోతున్నారుకదా! నువ్వు ఇద్దరిని ఎందుకయ్యా కట్టుకున్నావ”న్నా! కొద్దిగా హాస్యప్రియుడాయన. నవ్వి ”ఒరే అల్లుడూ! ఒక అత్త ఇక్కడుంటే, మరో అత్త పుట్టింట్లో ఉంటుందిగదరా” అన్నాడు. ”ఎందుకూ?” అన్నా. ”పురిటికీ” అన్నాడు. ”బాగానే ఉందిగాని, ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరూ నీ దగ్గరే ఉంటారు కదా, అప్పుడేంటీ” అన్నా. పైకి చెయ్యి చూపించి నవ్వేడు. అర్ధం కాలా.! అసలు సంగతి వదిలేసి మరేదో చెబుతున్నారే అని కోప్పడకండి, వస్తున్నా….

ఇలా ఇద్దరు ముగ్గురు భార్యలున్నపుడు వారి మధ్య తగవులూ సహజంగానే ఉండేవి. ఒకరినొకరు కొప్పు పట్టుకుని బయటికి వీధిలోకి ఈడ్చుకొచ్చి, తిట్టిన, తిట్టుకున్న సంఘటనలూ ఉండేవి,కలబది కొట్టుకున్నవారినీ ఎరుగుదును కూడా. ఆ తిట్లలో పడకగది రహస్యాలు కూడా అలవోకగా దొర్లిపోయేవి. ఇలాటి సందర్భం లో ఒక సవతి మరో సవతితో నూతిలో ఉరికి చస్తానని బెదిరింపే పైమాట, ఉరుకుతా ఉరుకుతా అన్నది. దానికి మరో సవతి ”ఉరుకుతా ఉరుకుతానన్న సయితినే చూశానుగాని ఉరికిన సయితిని చూడలేద”న్నమాట. నూతిలో ఉరికి ఛస్తానని బెదిరించిన సవతులను చూశానుగాని నూతిలో ఉరికి చచ్చిన సవతిని చూడలేదంటే, నువ్వు నూతిలో ఉరికి ప్రాణం తీసుకుంటే నా పీడా పోయినట్టే అన్నది, ఈ సవతి మాట.

సవతుల తగువంటే గంగా గౌరిల సంవాదమే మొదటిది. నిన్ను నెత్తిమీదనే ఎక్కించుకున్నాడే అంటే నిన్ను సగం శరీరమే ఇచ్చి తనలో కలుపుకున్నాడని, ఒకరినొకరు దెప్పుకున్నారు కూడా.

కృష్ణుడు కొద్దిగా సవతుల కయ్యంలో చిక్కుకున్నాడేమోగాని రాముడు మాత్రం అందులో చిక్కుకోలేదు.

నాటి మాట సరదాగా చెప్పుకోడానికి చెప్పినదేసుమీ

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉరుకుతా ఉరుకుతా

  1. కన్నాశుల్కంలో ఓ సందర్భంలో గురజాడ అప్పారావు గారు గిరీశం చేత
    “” “పడు పడు అన్న సవితే గాని పడ్డ నాసవితి లేదంది” టెవర్తోను””
    అనిపిస్తారు 🙂

    • విన్నకోట నరసింహారావు గారు,
      నిజమే 🙂
      పడు పడు అన్న మాట ప్రోత్సాహం Instigation
      ఉరుకుతా ఉరుకుతా అన్నది బెదిరింపు 🙂

  2. ఉరుకుతా ఉరుకుతానన్న సయితేగాని ఉరికినసయితిని జూడలా 🙂

    ఇదేదో బాగుందే ! ఈ ఫార్ములా ఫాలో అయి పోతా 🙂

    జిలేబి

వ్యాఖ్యానించండి