శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమయ్యారు?

ఏమయ్యారు?

రోజూ కనపడేవారు, ఇష్టులు హటాత్తుగా కనపడకపోతే వారి గురించి సంగతులు తెలియకపోతే ఉండే బాధ వర్ణించడం కష్టమే. లోకం లో ఇది సర్వ సాధారణం, బ్లాగు మరో వింతలోకం ఇందులో కూడా రాగ ద్వేషాలు, అనుభూతులు మనసుల్ని పట్టి ఉంచుతాయి, కొంతమంది చాలాతొందరగా పరిచయాలు పెంచుకుంటారు, అలాగే అంత తొందరగానూ మనుషుల్ని వదిలేసిపోతారు. వీరు నిజంగానే గొప్పవారు, బంధాలను చాలా తొందరగా వదిలించుకోగలరు. ఆ( అదేంలేదని ఎంత పైకి బింకం కబుర్లు చెప్పినా! కొంతమంది బ్లాగులు మూసేసేరు, కొంతమంది బ్లాగుల్లోకి రావడమూ మానేశారు, వీళ్ళకేమయింది? ఈ ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది, మనసుని,ఇటువంటిదే సందర్భం నాకొచ్చింది, ఈ మధ్య, అదెలాగంటే.

జూన్ ఒకటో తారీకు మన్మధనామ సంవత్సర జ్యేష్ట శుద్ధ చతుర్దశీ సోమవారం పెద్ద వర్షం కురిసింది,వేసవి తరవాత మొదటి వర్షం, కాలిన మట్టి మీదనుంచి వచ్చే కమ్మని వాసన, వర్షంలో ఆడుకోవాలనిపించింది, అమ్మో! ఇంట్లోవాళ్ళందరూ ఒకటే మాటగా గొడవ చేసేరు, ఏంచేస్తాం, మాటాడక కూచున్నా. ఆ వారంలో రాసిన టపాలుంటే మరుసటివారం సోమ,మంగళ,బుధవారాలకి వేసేసేను. ఏమయిందో తెలీదుగాని ఆదివారం కడుపులో గడబిడ చేసింది, అది మొదలు, ఆదివారమంతా అదేపని, కాళ్ళూ చేతులూ లాక్కొచ్చేయి, సెలైన్లు వగైరాలూ మామూలే. గురువారం దాకా ఆ గోలే సరిపోయింది. ఆ తరవాత బ్లాగొకటి ఉన్నట్టుందికదా అని గుర్తొచ్చి, అలవాటుగా లేప్ టాప్ ఆన్ చేశాను, నీరసంతోనే! ఏమో ఏమయిందోగాని పని చేయలేదు, భయపడుతూనే అబ్బాయికి చెప్పేను, ఖాళీ చేసుకుని మర్నాడు చూసి నెమ్మదిగా చెప్పేడు, చావుకబురు, ఆపరేటింగ్ సిస్టం పోయిందీ, అని. ఎన్నాళ్ళు పడుతుందన్నా? చెప్పలేను సమయం పడుతుందన్నాడు. ఆ తరవాత నిన్ననే తెలిసింది, ఇంక అది బాగుకావడం ఇప్పటిమాట కాదని. డెస్క్ టాప్ పిల్లలు వాడుకుంటున్నారు. దానిలో వాటాకి వెళ్ళలేకపోయా, దానికితోడు నీరసం తగ్గలేదేమో, ఆ ప్రసక్తే రాలేదు. అమ్మయ్య! ఇదేదో బాగున్నట్టుందే అనుకున్నా గాని కుక్క బుద్ధి ఊరుకోదుగా! పదమూడో తారీకున డెస్క్ టాప్లో ఒకసారి బ్లాగు చూదామని మొదలెట్టేను, రాత్రి వేళ. అలవాటుగా మెయిల్ చూడాలి ముందు, ఎందుకోగాని ఆగ్రిగేటర్ చూశా, ముందుగా, కత్తులును ఘంటములు కదనుతొక్కినవిచట, అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట, అన్నచోట, కత్తుల చప్పుడు, కవనాల జోరు, ప్రేమ ప్రవాహం జోరుగా కనపడింది. అంతా కొత్తవాళ్ళే, తెలిసిన మొహం ఒకటీ కనపడలా, కత్తుల చప్పుడుకి భయమూ వేసింది, మనం కానిచోటుకి వచ్చామా అనిపించింది. ఆగ్రిగేటర్ తలుపులేస్తేగాని దడ తగ్గలేదు. ఆ తరవాత మెయిల్ చూశా, అదో గడ్డిమేటిలా కనపడింది, అవసరమైనవి చూసే ఓపిక నశించి, కట్టేసి పడుకున్నా. మళ్ళీ కంప్యూటర్ దగ్గరికే రాలేదు. ఆ తరవాతెప్పుడో ఒక సారి ఖాళీ అయితే చూద్దామని మొదలెట్టా, డెస్క్ టాప్ కీ ఏదో వచ్చి పని చెయ్యడం మానేసింది. కరంటూ పోయింది, సోలార్ బేటరీ పోయిందిట. అమ్మో! మన రోజులు బాగోలేవనుకుని బుద్ధిగా ఉయ్యాలలో కూచున్నా. చేసేపని లేదు, చేయగలదీ లేదు,నీరసమూ తగ్గలేదు. లేప్ టాప్ బాగూ కాలేదు.

అబ్బాయి లేప్ టాప్ చూస్తే సర్వంమంగళం పాడేసిందిట. ఏంపోయాయంటే, మనువు స్థిరమనుకుని రాట్నం అమ్మేసిందిట, నాలాటిదే. అలా లేప్ టాప్ పోదనుకుని ఎనిమిదివందల టపాలు రాసినవి, అందులోనే ఉన్నవి, చెట్టెక్కేసేయి. పాతిక పై టపాలు సగం రాసినవీ అంతే సంగతులు. గత నాలుగేళ్ళుగా ఉన్న ఫోటొలూ స్వాహా! చివరగా నూట ఏభై పుస్తకాలు గంగాప్రవేశం. డ్రైవ్ లోకి ఎక్కిద్దాం అనుకుంటూ అశ్రద్ధ చేస్తే మరికనపడే సావకాశం లేకపోయింది. టపాలు బ్లాగులో దొరుకుతాయి. సగం రాసినవి మళ్ళీ రాసుకోవచ్చు. ఇక ఫోటో లు మళ్ళీ దొరకవు. పుస్తకాలు మళ్ళీ సమకూర్చుకోడం అసాధ్యమే. నష్టం పూడ్చలేనిదే. ఇలాటి పరిస్థితులలో మనం ఎవరికి గుర్తుంటాం అనిపించిందో సారి. బలవంతంగా మనసులోకి చొరబడినవారు కబురుకూడా చెప్పకుండా చెక్కేస్తే బాధ ఎలా ఉంటుందో తెలుసు, కనక ఓపిక చేసుకున్నా. ఇక ఎంతకంతే, మనసులో కుతూహలమున్నా, వయసు సహకరించేలా లేదు. ఒకప్పుడు రోజూ టపాలెందుకన్నారొకరు, అప్పుడు చెప్పేను, ఒక రోజొస్తుంది, టపా రాయాలని ఉన్నా రాయలేనిది, అందుకే ఈ తొందర అన్నా, అదే నిజమయింది కూడా. ఇది డెస్క్ టాప్ తో కుస్తీ పట్టినది, అలవాటు తప్పింది, దీనిమీద రాయడం…..

మళ్ళీ టపా ఎప్పటిమాటో! నా పరిస్థితి తెనాలిరామలింగని పిల్లి కథలో పిల్లిలాగా కంప్యూటర్ ల గురించీ, బాగున్నాను, ఉన్నాను…..

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమయ్యారు?

    • YJs గారు,
      ఆ టపా పబ్లిష్ అయిన వెంటనే చూశాను, బాగుంది, ఇక్కడ అవసరమూ కనపడి పది మందితో దాన్ని పంచుకున్నా, కాని దాని లింక్ నా బ్లాగులో ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు, ఆలోటు మీరు పూడ్చారు.ధన్యవాదాలు నేను చెబుతున్నా.
      ధన్యవాదాలు.

  1. ఆమధ్య నా లాప్ టాప్ కూడా పడయ్యింది. కానీ దాని హార్డ్ డ్రైవును మా కంప్యూటర్ సప్లయర్ పోర్టబుల్ డిస్క్ గా మార్చేసాడు. అందువల్ల అందులోవున్న ఫైళ్ళన్నీ భద్రంగానే ఉన్నాయి. హార్డ్ డ్రైవును C, D, E క్రింద పార్టీషన్ చేసుకుని మన ఫైళ్ళన్నీ D E లలో పెట్టుకుంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ పోయినా కానీ ఫైళ్ళు భద్రంగా ఉంటాయి.

    • దువ్వూరి వేణు గోపాల్ గారు,
      నాది చాలా పాతకాలపు కంప్యూటర్.దానిలో రెండే డ్రైవ్ లు ఉన్నాయి,C&D . నా కోసం మాత్రం వాడుతున్నా.Hard disk పోయిందేమోననే అనుమానం చెప్పాడు. నాకు కావలసినవి పోయి ఉండకపోవచ్చని ఆశ.Using only D Drive, ఇంక కబురు తెలియలేదు, ఎదురు చూస్తున్నాను, మీ వ్యాఖ్యకి
      ధన్యవాదాలు.

  2. సర్! నమస్కారం. దాదాపు రెండు వారాల తర్వాత మీ టపా చూసి సంతోషించాను. మీరు వడ్డించిన వంటకాల వల్ల కలిగిన భుక్తాయాసం ఇప్పుడిప్పుడే తీరుతోంది. _/\_ 🙂
    మీరు, లాప్ టాపు త్వరలో మళ్ళీ ఫాంలోకొచ్చెయ్యాలని కోరుకుంటున్నాను.

    • అం’తరంగం’ గారు,
      నమస్కారం.
      వాతావరణం లో మార్పు వచ్చింది కదండీ, పాంచభౌతికమైన శరీరంలో కూడా మార్పు తప్పదు కదా!
      భుక్తాయాసం తీరిందా 🙂
      లేప్టాప్ బాగు పడలేదు, అలవాటు తప్పిన,డెస్క్ టాప్ తోనే కుస్తీ! పిల్లలతో పోటీ 🙂
      ధన్యవాదాలు.

  3. పూజ్యులకు నమస్కారము. ఔను, మీరు క్షేమమేనా అని కంగారు పడ్డాను బ్లాగులు అలస్యమై.
    అనారోగ్యమో, యాత్రలొ అనుకున్నాను.
    మాస్టారు గారూ నిజమేనండి, మీ బ్లాగులు రాసి దాచినవి మళ్ళీ వెలికి తీయొచ్చు. కాని కొంత నిష్ణాతులైన వారి వద్ద నే ఆ పని చేయించండి. అషామాషీ గాళ్ళు ఆటలాదితే అతలాకుతలమై, లోకానికి అన్నమయ్య కీర్తనలు, వేమన పద్యాలు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ దివ్య నామ సంకీర్తన భజనలు కొన్ని కారణాల వల్ల అందకుండా పోయినట్టు అయ్యే ప్రమాదం వుంది. లోపల వుండే హార్డ్ దిస్కుని భద్రం చేయండి. తడవకుండా, కింద పడకుండా, దెబ్బ తగలకుండ జగ్రత్త చేయండి. రిపేరు అయ్యేవరకు ఎదన్నా చిన్నా డబ్బాలొ పెట్టి భద్రంగా బీరువాలో దాయండి. ఇప్పటి ప్రపంచానికి మీ పాఠాలు అందేలా చేయగలరు. మీరు నాకు ఒక రాష్ట్రం దూరం, లేదంటే నేనే మీకు ఉచితంగా డేటా రెకవరి చేయించేవాడిని. మా వద్ద ఒక నిపుణుడు వున్నాడు.

    • kumar గారు,
      కాలం లో అన్నిటి ఉనికీ సాపేక్షమే 🙂 మీ అభిమానానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా! నేనే చేయించి పెడుదును అన్న మీ మాట మనసు నింపింది.

      నా గురించి కూడా కొందరు ఎదురు చూసేవారున్నారని, వారిని నిరాశపరచకూడదనే ఓపిక చేసుకున్నా!
      దీర్ఘాయుష్మాన్భవ
      ధన్యవాదాలు.

      • నమస్తే. మీకు ధన్యవాదాలు. మీ ఉన్నతమైన సంస్కారానికి అభిమానినయ్యానండి.

      • కుమార్ గారు,
        అభిమానులకి చెప్పకపోవడం, వారిని బాధపెట్టినట్టే కదండి, చెప్పలేని పరిస్థితులొస్తే ఎలాగా తప్పదు కదా! మీ అభిమానానికి మరొక సారి ధన్యవాదాలు.
        ఉపాకారం చేయాలనే ఊహ రావడం కూడా గొప్ప విషయమే కదండి, కుదరచ్చు, కుదరకపోవచ్చు.
        ధన్యవాదాలు.

    • శ్రీనివాస్ జీ,
      ఏదీ శాశ్వతం కాదండి, అన్నిటి ఉనికీ సాపేక్షమే కాలంలో, కాని అన్నీ స్థిరంగా ఉండిపోవాలనుకుంటాం, కాలంలో ఏవీ ఉండవు. అదీ సంగతి 🙂
      ధన్యవాదాలు.

  4. >లేప్ టాప్ పోదనుకుని ఎనిమిదివందల టపాలు రాసినవి, అందులోనే ఉన్నవి, చెట్టెక్కేసేయి. పాతిక పై టపాలు సగం రాసినవీ అంతే సంగతులు. గత నాలుగేళ్ళుగా ఉన్న ఫోటొలూ స్వాహా! చివరగా నూట ఏభై పుస్తకాలు గంగాప్రవేశం.

    అయ్యో అంత విచారం అక్కర్లేదండీ.
    మీ లాప్ టాప్ లోని డిస్క్ డ్రైవ్ ఉందే దానిని విడదీసి, దానినో సాకెట్ లాంటిదానిలో దూర్చి హాయిగా డెస్క్ టాప్ కంప్యూటరుకు తగిలించవచ్చును. అప్పుడు ఆ డిస్కులో ఉన్న ఫైళ్ళను మీరు శుభ్రంగా చూడవచ్చును కాపీచేసుకోవచ్చును. ఇలా చేసిపెట్టమని మీ అబ్బాయికి చెప్పండి. మీ కృషి అంతా ఆ డిస్కులో భధ్రంగానే ఉండే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. కాని ఆపరేటింగ్ సిష్టం పోవటం అంటే దానికి ఏమి జరిగిందీ అన్నది విచారించాలి. అదేమైన కరప్ట్ కావచ్చును కాని ఫైళ్ళన్నీ పోకపోవచ్చును.

    లాప్ టాప్ చెడిపోవటంలో విశేషం లేదండీ అలా జరగటానికి శతకోటి కారణాల్లో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. జాయతే గఛ్ఛతే ఇతి జగః అన్నారు కదా – ఏవైనా ఈ లోకంలోకి వచ్చేవి పోకండా ఉండవుగా – లాప్ టాపెంత లెండి!

    మీనుండి టపాలూ వ్యాఖ్యలూ ఏమీ ఈ మధ్య కనబడక కొంత వ్యగ్రతకు గురైన మాట వాస్తవం.

    • తాడిగడప శ్యామలరావు గారు,
      అనుభవజ్ఞులకిచ్చి విషయం చెప్పేం. అవసరమైనవి సాధ్యమైన వరకు పోకుండా చూస్తామన్నారు, చూదాం ఏం జరుగుతుందో!
      లేప్ టాప్ చేడిపోదని ఒక విశ్వాసం, అన్నిటి ఉనికీ సాపేక్షమే కదా 🙂 ఇదిగో ఈ అనిత్యమైఅనదాని గురించి ఎంత తపనో 🙂
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి