శర్మ కాలక్షేపంకబుర్లు-అల్లుని మంచితనంబును……

అల్లుని మంచితనంబును………….

అల్లుని మంచిదనంబును
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

అల్లుడు మంచివాడయి ఉండటం, గొల్లవానికి సాహిత్యం తెలిసి ఉండటం, ఆడవారు నిజం చెప్పడం, వడ్లు దంచితే పొల్లు లేకుండా బియ్యం దొరకడం, తెల్లగా ఉండే కాకులూ లేవు అన్నారు, బద్దెన.

అల్లుడు మంచివాడు కాడుట, ఇది అందరూ ఒప్పేసుకున్న నిజంట. ఏం? ఎందుకు మంచివాడు కాడుటా? పెళ్ళికి కట్నం కావాలంటాడట, ఆ తరవాత పండగలూ, పబ్బాలూ అంటాడట, ఆ తరవాత పురుళ్ళూ, పుణ్యాలూ అని ఖర్చు చేయిస్తాడట, అందుకు అల్లుడంటే అందరికీ అలుసే, కోపమే, కాని ఎవరూ అల్లుని దగ్గరీమాట అనరు, అదో చిత్రం. నాకు తెలియకడుగుతానూ, తెలిస్తే ఎందుకడుగుతావులే అంటారా? ఇలా అల్లుడు మంచివాడు కాదన్న నేటి మహిళామణుల నుంచి బద్దెనగారిదాకా ఒక మాట మరచిపోతున్నారు. అల్లుడికి ”ఇది కావాలి, అదికావాలి, కట్నం ఇస్తే కాని పుస్తి ముడెయ్యడు” నాకొడుకు అని చెబుతున్నది, ”ఆడపిల్లని కన్నావు” అని ”ఇంట్లోంచి తరిమేస్తాను, నాకొడుక్కి మళ్ళీ పెళ్ళి చేస్తాను, నిన్నొదిలేయమంటాను” అని, ఆ ఆడపిల్లని కనడం లో తన కొడుకూ కష్టపడ్డాడన్న సంగతి మరుస్తున్న, ఆ తరవాత కోడల్ని రాచి రంపాన పెడుతున్నదెవరుటా? మరి ఆవిడెవరు? ఆడది కాదా? 🙂 ఆడవాళ్ళు ఇలా చేసి, మగాడయిన అల్లుడిని ఆడిపోసుకోడమేంటో అర్ధం కాలేదు. మరోమాటా, బద్దెనగారు కూడా ఒకప్పుడు అల్లుడే అయి ఉంటాడు కదా 🙂 మరి ఆయన మాట ఆయనకే వర్తిస్తుందా? మరో చిన్న అనుమానం, ఇన్ని ఆరళ్ళు పడి, కొడుకుని కన్న ఈ కోడలూ ఆతరవాత అత్తపాత్రని ఇలాగే నిర్వహిస్తుందష కదా! మరదేంటొ! లోకంలో ఎవరూ మంచివాళ్ళు లేరుష, మగాళ్ళంతా చెడ్డవాళ్ళేష….అంటే ఆడాళ్ళే మంచివాళ్ళుష……. అస్తు…..

గొల్లని సాహిత్యవిద్య, పాపం ఆ అకాలంలో వాళ్ళలా ఉండి ఉంటారు, ఇప్పుడు ఎవరిని కులం పేరుతో అనకూడదట, వీరిని యాదవులు అనాలట. పాపం బద్దెన గారికి తెలియదు లెండి, ఉద్యమం చెయ్యక్కరలేదు.

కోమలి నిజమున్ అన్నారే!, మగాడు అబద్ధమాడితే దడి కట్టినట్టూ, ఆడది అబద్ధమాడితే గోడ కట్టినట్టూ ఉంటుదంటారు, మనవాళ్ళు, నిజమేనా?  🙂 మగవాళ్ళ అబద్ధంలో కంతలుంటాయి, దడిలో ఉన్నట్టు, ఆడవాళ్ళ అబద్ధం లో కంతలుండవు, అందుకే గోడకట్టినంత బలంగానూ, అవతలివారికి నిజం కనపడ కుండానూ దాచేయగలరుట. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్యట, భగంతుడిచ్చిన వరమనుకుంటా, మగ సన్నాసికి అబద్ధం ఆడటం కూడా చేత కాదుష 🙂 . సీతమ్మతల్లి అబద్ధం ఆడింది, ఆపదలో, నేటి మహిళలు కొందరు, ఆపదలు తెచ్చిపెట్టడానికే అబద్ధాలాడుతున్నారా? సీతమ్మనుంచి వారసత్వం తెచ్చుకున్నామని బొంకుతున్నారా? బద్దెనగారూ భార్యాబాధితుడేమో, ఆడవాళ్ళు కారణం లేకుండా దెబ్బలాడగలరు, బోడి గుండుకీ బొటనవేళ్ళకీ ముడి పెట్టగలరు, 🙂 ఈ పని మగాడు చెయ్యగలడా? శుకసప్తతి కథలు చదివారా? వాటిలో ఒక చిలక, ఆడవాళ్ళు ఎంత చక్కగా బొంకగలరో వైన వైనాలుగా చెప్పింది. ”రోజూ నేను లేనపుడు ఇంటికొస్తున్నాడు, ఎవరే?” అంటే, ”మా పింతల్లి కొడుకు కదూ, నీకు మావాళ్ళంటే లెక్కలేదు, మా వాళ్ళని గుర్తుపెట్టుకోవూ!” అని దెబ్బలాటకిరాదూ? ఆడవారిలో కూడా ప్రత్యేకతలున్నాయి, కొంతమంది మహిళలు ఎంతమంది తోనైనా ఒంటి చేత్తో దెబ్బలాడగలరష, బుకాయింపుతో, తెలుసా….చెప్పినమాట చెప్పకుండా, చెప్పింది తప్పనకుండా, తప్పకుండా….చివరికేమైనా తేడా వస్తే మాత్రం ”అమ్మో! ఆడకూతుర్ని ఎంతంత మాటలనేసేరూ, మీ మొహాలీడ్చా”, అని బుడి బుడి దీర్ఘాలూ తీయగలరుష….అందుచేత ఆడాళ్ళకి దూరంగా ఉండాలా? ఉండండి ఎందుకేనా మంచిది 🙂 రాజకీయనాయకుడికి ముందూ గాడిదకి వెనక ఉండకూడదన్నారు, నేటి నీతి వేత్తలు. బద్దెనగారి మాట నిజమేనా?

పొల్లున దంచిన బియ్యము అన్నారు, నిజమే పొల్లు దంచితే, ఎంతసేపు దంచినా బియ్యం రావుకదా! ఇలాగే అనుకున్నా ఈ రోజుదాకా, కాని అదికాదుట. బియ్యం దంచితే, అదేనండి వడ్లు దంచితే బియ్యంతోపాటుగా పొల్లు కూడా వస్తుంది, పొల్లు లేకుండా బియ్యం రావూ, అనిట కవిగారి హృదయం. ఏమోనండి, నేటి కాలంలో పొల్లు దంచి బియ్యం ఇస్తామనే అంటున్నారుష, అటువంటివారి మాటలకే గిరాకీట. బద్దెనగారిని కొంతమంది మంత్రి అన్నారు, కొంతమంది రాజు అన్నారుట, మరి మాకమ్మీలు మాత్రం, ఎవరైనా వర్గ శత్రువే అన్నారుట. అది సరేగాని, ఎన్నాళ్ళు ఇలా ఊకదంపుడు కబుర్లు చెప్పండి?

తెల్లనికాకులును… ఆ రోజుల్లో తెల్ల కాకులు లేవుట, అన్నీ నల్ల కాకులే…అందుకే విచిత్రంగా తెల్లని కాకులునులేవన్నారు, బద్దెన. నాటి కాకులన్నీ నల్లనివే అయినా తెలివయినవీ, ప్రపంచం గుర్తించినవీట.కాలం మారి తెల్లకాకులు బయలుదేరాయిట, నల్లకాకుల్ని అస్వతంత్రం లోకి నెట్టేశాయి. అదెందుకు జరిగిందీ, నల్లకాకుల్లో కొన్నిటికొచ్చిన దొమ్మ తెగులుతో. కాలం గడిచి నల్లకాకులు స్వాతంత్ర్యం సంపాదించుకున్నా, నల్ల కాకుల్లో కొన్ని కాకులు, ఇప్పటికీ తెల్లకాకులకి ఊడిగం చెయ్యడానికే సిద్ధపడుతున్నాయిట. చరిత్రని తిరగరాసేసి నల్లని కాకులును లేవు దెలియరసుమతీ అని చదువుకోమంటున్నాయిట, ఇప్పటికీ, స్వతంత్రం వచ్చాకా కూడా. ఇంత చేసినా ఆ తెల్లకాకులు ఈ, మానసికంగా, భావదారిద్రంతో కొట్టుకుంటున్న కాకుల్ని నల్లకాకులనే అంటున్నాయిట. మరి ఈ నల్లకాకులికి బుద్ధి ఎప్పటికొచ్చేనో, అసలొచ్చేనా?

నిజంగానే ఇది పొల్లు, సొల్లు టపా, లేప్ టాప్ బాగుపడి, అందులో సమాచారమంతా సురక్షితంగా ఉన్న ఆనందంలో దూసుకొచ్చింది.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అల్లుని మంచితనంబును……

  1. అల్లుడు శనిగ్రహం అనే మాట ఎప్పటినుంచో ఉంది, కాని ప్రస్తుత ట్రెండ్ ఏమిటంటే మా అల్లుడు చాలా మంచివాడు తల్లిదండ్రులే కడు దుర్మార్గులు అని ప్రచారం చెయ్యటం. అలా చెప్తూ చెప్తూ ఉంటే కూతురి అత్తామావల్ని త్వరగా దూరం చెయ్యచ్చు కదా.

    2. < " ఆడవాళ్ళు కారణం లేకుండా దెబ్బలాడగలరు, బోడి గుండుకీ బొటనవేళ్ళకీ ముడి పెట్టగలరు, 🙂 ఈ పని మగాడు చెయ్యగలడా? " అన్నారు మీరు.
    కరక్ట్, ఖచ్చితంగా మగాడు ఈ పని చెయ్యలేడు. ఎందుకంటే మాట్లాడేముందు మనం కొంచెమయినా లాజిక్, కారణం ఆలోచిస్తాం కదా :). అయినా జిలేబీ గారే ఒప్పుకున్నారు కదా – "ఇట్లా జాడించటం అన్నది మాకు వెన్నతో బెట్టిన విద్య 🙂 అర్ధమున్నా లేకున్నా జాడిస్తాం ! " – అని తన మొన్నటి బ్లాగ్ పోస్ట్ "విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః" లో (June 22, 2015). తాము అర్ధం లేని అకారణ కజ్జాలు పెట్టుకుంటామని వాళ్ళకీ తెలుసన్నమాట 🙂 ఆనందం :))

    • నరసింహారావు గారు,
      ఇదీ నిజమేనండోయ్!
      బోడి గుండుకీ బొటనవేళ్ళకీ ముళ్ళెట్టడం తేలికేం కాదండి,అబ్బో! దానికెన్ని తెలివితేటలు కావాలండి, మగపురుగులికి ఆ తెలివితేటలేవీ? జిలేబీ గారంటారా మనెవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయారు 🙂 వారి బ్లాగులో అడుగెడితే ఝాడు ఝుళిపిస్తామంటున్నారు 🙂 ఏం చెప్పినా జిలేబమ్మగారే చెప్పాలి లెండి. 🙂
      ధన్యవాదాలు.

      • కష్టే ఫలే వారు,

        అదేమి అందనంత ఎత్తో గాని , బ్లాగు వైపు, అదిన్నూ నా బ్లాగు వైపు కాళ్ళు పెడితే కామింట్ల తో కొట్టేస్తాం అని బెదిరిస్తున్నారండోయ్ ! ఓ వారం గా నా బ్లాగు వైపు వెళ్ళ కుండా ఉంటున్నా 🙂

        జిలేబి

  2. ఉ. అల్లుడు మంచివా డనుచు నందరు బల్కెద రాది యందు నా
    యల్లుని మంచి బుధ్ధి దెలియంగ నగుం బదినాళ్ళు బోవ గా
    పిల్లను గన్నవారలకు వేలును లక్షలు కార్లు భూములున్
    కొల్లలు ధారపోసినను కోర్కెల కంతము లేకపోవుటన్.

వ్యాఖ్యానించండి