శర్మ కాలక్షేపంకబుర్లు-పోట్లాట

పోట్లాట

పోట్లాట అంటే ముందు గుర్తొచ్చేది గజకఛ్ఛపాలదే,గజము అనగా ఏనుగు, కఛ్ఛపము అనగా తాబేలు, ఎందుకంటే అవి అంత దీర్ఘకాలం, భీకరంగా పోట్లాడుకున్నాయి, చివరైకేమయ్యాయో చూదాం, కరి మకరిపోరుకదా అని అనుమానం రావచ్చు, అది వేరు,ఈ కతేంటో చూదాం.
(భారతం నుంచి)

వినత, కద్రువ, కశ్యపుని భార్యలు, ఆయన ప్రజాపతి. సంతానం కావాలని కశ్యపుని కోరేరు, అందులో కూడా వినత ఇద్దరు బిడ్డలనూ, కద్రువ అనేక మందిని కోరింది. అలాగే అనుగ్రహించారు, కశ్యపుడు. వినత రెండు గుడ్లు పెట్టింది, కద్రువ అనేక గుడ్లు పెట్టింది. కద్రువ పెట్టిన గుడ్లు పగిలి పిల్లలు సర్పాలుగా వస్తున్నాయి. వినత గుడ్లు అలాగే ఉంటే, ఒక గుడ్డు చిదిపితే తొడలు లేకుండా కుర్రవాడు జన్మించాడు. సమయం పూర్తికాకుండా అండాన్ని చిదిపినందుకు తల్లిని ” సవతికి దాసివవుతావని శపించి, రెండవాదానిని అలాగే ఉంచితే బలవంతుడైన కొడుకు, దాస్య విముక్తి చేసేవాడు కలుగుతాడని” చెప్పి, తాను అనూరునిగా, సూర్యునికి రథ సారథిగా వెళిపోయాడు.

వినత, కద్రువలు ఒక రోజు సముద్రపు ఒడ్డుకు వెళ్ళేరు. అక్కడ ఉఛ్ఛేశ్వరాన్ని చూశారు. అది ఇంద్రుని గుర్రం, చాలా తెల్లగా ఉంటుంది. కద్రువ వినతతో ‘ఆ గుర్రం అంతా తెల్లగానే ఉందిగాని తోక నల్లగా ఉంది’, అంది. వినత ‘కాదు, గుర్రం అంతా తెల్లగానే ఉంది’ అని చెప్పింది. ఇది విన్న కద్రువ, ‘కాదు తోక నల్లగా ఉంది, పందెం’ అంది. ఇద్దరికి పంతం వచ్చేసింది. మరునాడు మళ్ళీ చూద్దామనీ, తోక నల్లగా ఉంటే వినత కద్రువకి దాస్యంచెయ్యాలని, లేక తోక తెల్లగా ఉంటే కద్రువ వినతకి దాస్యం చెయ్యాలని పందెం కాచుకున్నారు. మర్నాడొచ్చారు, చూశారు, గుర్రం తోక నల్లగానే కనపడింది. వినత కద్రువకి దాస్యం చెయ్యాల్సి వచ్చింది.

తెల్లగా ఉండవలసిన తోక నల్లగా ఎలా కనపడిందని కదా అనుమానం కదా, ముందురోజు రాత్రి ఇంటికిపోయిన తరవాత కద్రువ, తన కొడుకులైన పాములతో పందెంగురించి చెప్పి, గుర్రం తోక నల్లగా కనపడేలా చేయమని కోరింది. బుద్ధిమంతులైన కొడుకులు ’అలా కూడదని’ తల్లికి చెబితే, కద్రువ కోపించి, కొడుకులను, ’జరగబోయే సర్పయాగంలో పడి నశిస్తార’ని శాపం ఇచ్చింది. నాగులలో ఒకడైన కర్కోటకుడు పోయి ఆ గుర్రం తోక కి చుట్టుకుని ఉండగా, వినత కద్రువలు చూశారు. గుర్రం తోక నల్లగా కనపడింది. వినత కద్రువకు దాసి అయింది. వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలి గరుడుడు జన్మించాడు. గరుడుడు తల్లితో పాటుగా కద్రువకి, ఆమె సంతానానికి దాసుడైపోయాడు. కద్రువ సంతానాన్ని రెక్కలపై ఎక్కించుకుని విహారానికి తీసుకు వెళుతుండేవాడు.

వినత సంతానం, అనూరుడు (సూర్యును సారథి ), గరుడుడు. ఇక కద్రువ సంతానం పాములు, కర్కోటకుడు, తక్షకుడు మొదలైనవారంతా.

తమ దాస్య విముక్తి ఎలా అని, ఏంచేస్తే దాస్య విముక్తి కలుగుతుందని గరుడుడు కద్రువ సంతానన్ని అడిగితే, అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముకులవుతారంటే, తల్లికి చెప్పి, అమృతం తేవడానికి ఈ బలం చాలదు కనక, నాకు బలమైన ఆహారం చెప్పమన్నాడు. వినత, ‘నిషాద గణాలు చాలా ఉన్నాయి, అవి అన్నీ, లోకానికి అపకారం చేస్తున్నాయి, వాటిని తిని బలం చేకూర్చుకో’మని చెప్పింది. ‘నువ్వు ఇలా తింటుంటే బ్రాహ్మణుడెవడేనా తగిలితే మాత్రం తినకు సుమా’ అని చెప్పింది. ‘మింగబోయేవాడెవరో ఎలా తెలుస్తుందని’ అడిగాడు గరుడుడు. ‘నువ్వు మింగబోయేవాడు గొంతులో చేరినపుడు మంటపుడితే వాడు బ్రాహ్మణుడు, వాడిని మింగకూ’ అని చెప్పింది. గరుడుడు నిషాదుల్ని తినడం ప్రారంభించాడు, ఒకసారి గొంతు మండింది, ‘ఎవర్రా నీవూ’ అని అడిగితే ‘నేనొక బ్రాహ్మణుడిని’ అని చెప్పేడు, ‘ఐతే బయటికిరా’ అంటే, ‘నాతోపాటు నా నిషాద భార్య కూడా ఉంది’ అన్నాడు. ‘సరే ఐతే ఇద్దరూ బయటికి వచ్చేయండని’ వారిని వదిలేశాడు. నిషాదుల్ని తిన్నా గరుడునికి ఆకలి తీరక తండ్రి తపస్సు చేసుకుంటుంటే అక్కడికిపోయి, ‘అమృతం తేవడానికి వెళుతున్నాను, దాస్య విముక్తికి, నిషాదుల్ని తిన్నా ఆకలి తీరలేదు, నాకు బలమైన ఆహారం ఏదో చెప్పు తండ్రీ’ అని అడిగాడు. దానికి కశ్యపుడు గరుడునితో

విభావసుడు, సుప్రతీకుడు అన్నదమ్ములు. అన్న పిత్రార్జితం ఆస్తి పాస్తులు అనుభవిస్తుంటే తమ్ముడు నాకు భాగం పంచి పెట్టమని అడిగాడు. కోపించిన విభావసుడు తమ్ముని (గజము)’ఏనుగవు కమ్మని’ శపించాడు, తమ్ముడు ప్రతిగా ‘నీవు కఛ్ఛపమగుదువుగాక’ అని శాపమిచ్చాడు. వీరిద్దరూ దగ్గరలోని అడవిలోనూ, నీటి కొలనులోనూ ఉంటూ, పూర్వ వైరాన్ని మరువక నిత్యమూ కలహిస్తూనే ఉండేవారు. ‘వారిద్దరిని ఏకకాలంలో పట్టుకుని భుజించ’మని చెప్పేరు కశ్యపుడు.

గరుడునికి సంబరమైంది. మడుగు దగ్గరకిపోతే గజము, కఛ్ఛపము పోట్లాడుకుంటున్నాయి. గరుడుడు ఒక కాలితో ఏనుగును, మరొక కాలితో తాబేలును పట్టుకున్నాడు, రివ్వున ఎగిరిపోయాడు. ఒక మహా వృక్షం కొమ్మ మీద కూచున్నాడు. ఆ కొమ్మ పెళ ఫెళా విరిగింది. ‘అమ్మో’ అని కంగారుపడ్డాడు, కారణం, ఆ కొమ్మని ఆశ్రయించుకుని వాలఖిల్యులు తపస్సు చేసుకుంటున్నారు. వాలఖిల్యులు అంగుష్ట మాత్రులు, అనగా బొటనవేలంత ఉంటారు. వీరు తపశ్శాలులు, ఆకొమ్మకి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరికి తపోభంగం కాకుండా ఉండేందుకు, గజ కఛ్ఛపాలను కాలి గోళ్ళతో పట్టుకుని, విరిగిన కొమ్మను కింద పడనివ్వకుండా ముక్కున పట్టుకుని, గరుడుడా కొమ్మతో కశ్యపుని వద్దకు వచ్చాడు. చూసిన కశ్యపుడు వాలఖిల్యులను, ఆ కొమ్మను వదలి వెళ్ళమని కోరాడు. వాలఖిల్యులు కశ్యపుని కోరిక మన్నించి హిమాలయాలకు వెళ్ళేరు, కొమ్మ వదలి. అప్పుడు గరుడుడు ఆకొమ్మను హిమాలయాలలో ఒక చోట సురక్షితంగా దించి, గజ కఛ్ఛపాలను ఒక కొండకొమ్మున ఉంచి, కూచుని భోజనం చేసి, ఇంద్రుని పైకి యుద్ధానికిపోయి, చిత్తుగా ఓడించి, అమృతం తెచ్చి, దర్భలపై ఉంచి, కద్రువకి అంద చేశాడు. కద్రువ తన సంతానాన్ని స్నానం చేసివచ్చి అమృతం తాగమంది. వారు స్నానానికిపోగా, ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని పట్టుకుపోయాడు. పట్టుకొచ్చి ఇవ్వడం దాకానే షరతు కనక, ఆ షరతు తీరింది కనక, వినత స్వతంత్రురాలయింది. స్నానం చేసి వచ్చిన వారికి అమృతం కనపడలేదు, అక్కడ దర్భలపై కొద్ది బిందువులు పడితే వాటిని నాలుకతో నాకేరు, కద్రువ సంతానం, అందుకే పాముల నాలుక చీలి రెండుగా ఉంటుందంటారు.

కథ చాలాపెద్దది, ఉప కథలతో. మరిప్పుడు ఫలశ్రుతి చెప్పుకుందాం 🙂

1.అసూయచే, వినత తన అండాన్ని తనే చిదుపుకుని, శాపం పొందింది, కొడుకుచేతనే.
2.సవతిని దాసిని చేసుకోవాలనే కోరికతో కొడుకులకే శాపమిచ్చింది కద్రువ, దురాశ ఎంత చెడ్డది!
3.దాస్యం ఎంత హీనంగా ఉంటుందో గరుడుడు చెబుతాడు.
4. కార్య సాధనకు పూనుకునేవాడు ఎలా చేయాలో గరుడుని చూసి తెలుసుకోవచ్చు,పని చేసేందుకు తగిన బలం చేకూర్చుకోవాలనుకుని ప్రయత్న పూర్వకంగా సంపాదించుకున్నాడు, కష్టాలను ఓర్చి.
5.ఉప కథలో బ్రాహ్మణుడితో పాటు అతని ప్రియురాలు కూడా కాపాడబడింది. మంచివాడితో ఉంటే మంచి జరుగుతుంది, ఒకప్పుడు కష్టం వచ్చినా.
6. వాలఖిల్యులకి బాధ కలగకుండా తండ్రి వద్దకు తెచ్చి వారిని ఆకొమ్మ విడిచిపొమ్మని తండ్రి చేత చెప్పించగలిగిన చతురత గరుడునిది.
7. ఏ గొడవకైనా మూలాలు కాంతా కనకాలలోనే ఉంటాయి. అన్నదమ్ములిద్దరూ పిత్రార్జితం పంచుకుతింటే బాధ లేకపోయేది, అన్న దురహంకారం ఇద్దరికి చేటు తెచ్చి, శాపాలిచ్చుకుని మరుజన్మలో కూడా దెబ్బలాడుకున్నారు, చివరికి గరుడునికి ఆహారమయ్యారు. దీర్ఘకాలపు కోపమూ, శత్రుత్వమూ పనికిరావు. అలా చెస్తే ఇద్దరూ నాశనమవుతారు కదా!
8. తనపని అయిపోయిందని ఆ కొమ్మను ఎక్కడపడితే అక్కడ వదిలేయలేదు గరుడుడు, తన చర్యలవల్ల ఇతరులకు హాని జరగరాదనే గరుడుని ఆలోచనా, ఆచరణా గొప్పవి, అనుసరించతగ్గవి.
9.ఇంద్రునితో యుద్ధం చేస్తే, యుద్ధంలో ఇంద్రుడు లొంగి అమృత కలశం ఇచ్చాడు, కలశం తెచ్చి కద్రువకిచ్చి, దాస్యం విముక్తి పొందాడు. రక్షణలేని అమృత కలశాన్ని ఇంద్రుడు మరలా పట్టుకుపోయాడు, మోసంతో వినతను దాసిగా చేసుకుంటే మోసంతోనే విముక్తీ పొందినట్లయింది., అందుకే మోసంతో సంపాదించినదేదీ నిలవదు!

ఈ కథ ఇప్పటికి నిత్యనూతనమే! దీనిని ఎప్పుడు, ఎక్కడ,ఎలా,ఎందుకు కావాలంటే అలా అన్వయించుకోవచ్చును, ఫలితాలతో సహా 🙂  ఇదీ ఒక ఆటే, దీనికీ నియమాలున్నాయన్నారు,పెద్దలు. నేటి కాలంలో నియమాలతో పనిలేనిదే పోట్లాటట……

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పోట్లాట

  1. “విచికిత్స” అంటే అర్ధం సంశయం / సందేహం అని కదా? వేరే అర్ధాలు కూడా ఉన్నాయా?

    • విన్నకోటవారూ,

      విచికిత్స అంటే సందేహం అనేనండీ అర్థం.

      విచికిత్స అంటే గురుతుకు వస్తోంది. శ్రీనాదుడు దమయంతిని ఉద్దేశించి అస్తినాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్ అని అన్నాడు.

    • నరసింహారావు గారు, శ్యామలరావు గారు,
      ”అప శబ్ద భయం నాస్తి అప్పనాచార్య సన్నిధౌ” అని శ్యామలరావు గారు చెప్పేకా మళ్ళీ విచికిత్స ఏల? 🙂
      ధన్యవాదాలు.

  2. ఈ కథలో ఒక బ్రాహ్మణుడి ప్రసక్తి వస్తుంది. కాని దాని గురించిన విచికిత్స ఇక్కడ చేయటానికి వలనుపడదు. అది ఒక విస్తారమైన విషయం. ఎలా సుళువుగా చెప్పాలో అన్నది ఇబ్బంది. బహుశః ఒక కథారూపంగా మలచి చెప్పితేనే అందులోని సారస్యమూ మిగతా కథా కమామిషూ మన తలలకు బోధపడుతాయి. కాని దురదృష్టవశాత్తు ఆ విషయంలో ఇప్పుడు వ్రాయటానికి నాకు తీరటం లేదు.ఆఫీసుపని సమయం కదా! అందువలన అన్నమాట. దైవానుగ్రహం ఉంటే ఈ రాత్రి ఆ పని చేయాలని భావిస్తున్నాను.

  3. శర్మ గారూ, మీ సీరియస్ టపాకి నా సరదా వ్యాఖ్య 🙂
    గరుత్మంతుడు అమృతం తీసుకు వస్తే సర్పాలకి నాలుక చీరింది గాని మనుష్యులకి మాత్రం ఓ ప్రయోజనం కలిగింది. అదే కన్యాశుల్కంలో చెప్పినట్లు “ఖగపతి యమృతము తేగా, భుగభుగమని పొంగి చుక్క భూమిన వ్రాలెన్, పొగచుట్టయి జన్మించెను, పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్” 🙂
    అన్నట్లు గజ కచ్ఛపాల పోట్లాటలు ఇప్పటికీ బ్లాగుల్లో ( ఆస్తులేం లేకపోయినా 🙂 ) కనిపిస్తూనే ఉన్నాయిగా 🙂

    • నరసింహారావు గారు,
      నిజమండోయ్!
      దున్నపోతయి పుడతానేమోనని నేనూ ఒక నలభై ఏళ్ళు స్వేత కాష్ఠాలు తగలేసేనండి. పదేళ్ళయి మానేసేననుకోండి. 🙂
      అసలువాళ్ళు బాగానే ఉన్నారండి, కొసరువాళ్ళకే…..
      ధన్యవాదాలు.

  4. మిత్రులు శర్మగారు,

    ఊరువులు అంటే తొడలు కదా. తొడలు లేకుండా జనించి నందువలన వినతాదేవి పెద్ద్దకుమారుడు అనూరుడు అయ్యాడు.

    నిషాదశబ్దం యొక్క అర్థం గురించి ఒకరు అడిగిట్లున్నారు. నిషాదుడు అంటే వేటగాడు. మరికొన్ని సమీపవర్తి అర్థాలున్నా అప్రసిధ్ధాలు. ఇలా వేటకాడు అన్న అర్థంలోనే, రామాయణప్రాతిపదికగా శ్రీప్రాచేతసులవారి నోట వచ్చిన శ్లోకంలోనూ కనబడుతోంది. అందరికీ పరిచయమైనదే ఆశ్లోకం.

    మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః ।
    యత్ క్రౌంచ మిధునా దేకమవధీః కామమోహితమ్॥

    ఇక్కడ రతికేళీవినోదంలో ఉన్న క్రౌంఛపక్షుల జంటలో ఒకదానిని ఒక వేటగాడు క్రూరంగా కొట్టినందుకు పరితాపంతో వాల్మీకులు ఆ వేటగాడిని ఉద్దేశించి అన్న పలుకులే ఇవి.

    లోకాపకారులయ్యారు కాబట్టి నిషాదగణాల పీడనుండి లోకోద్ధరణం చేయించింది వినత.

    మహాభారంతంలో ఈ అమృతాపహరణమ్ చాలా రమ్యమైన ఉపాఖ్యానం. ఇందులో

    ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగా
    జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
    బాయక వీపునం దవడుబాముల మోవను, వారికిం బను
    ల్సేయను నేమి కారణము సెప్పుము దీని బయోరుహాననా!

    అన్న పద్యం ఉంది. ఇది తమకు చుట్టుకున్న ఈ దాస్యానికి కారణం చెప్పమని గరుడుడు తల్లిని అడిగుతున్నట్లుగా నన్నయ్యగారు వ్రాసినపద్యం.

    సారస్వతంలో స్త్రీసంబోధనాపరంగా లెక్కకు మిక్కిలిగా పదాలున్నాయి. ఏమాట కామాట చెప్పుకోవాలి. పురుషసంబోధనలకు ఆట్టే విస్తృతంగా పదాలు కనబడవు! పయోరుహము అంటే పయస్సులనుండి పుట్టినది అని అర్థం. పయస్సు అంటే పాలు అనే కాక నీళ్ళు అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ అదే తీసుకోవాలి. నీటినుండి పుట్టినది అంటే పద్మము. అంటే ఓ పద్మము వంటి ముఖం కలదానా అని సంబోధన చేయటమన్న మాట. ఐతే ఇక్క్డడో చిక్కు వచ్చింది. ఒక తల్లిని సంబోధిస్తూ చెప్పిన పద్యంలో ఈ మాట పడింది. ఠాఠ్ తల్లిని కొడుకు పయోరుహాననా అనటం ఏమంత బాగుంటుందీ అని చెప్పి ఈ ప్రయోగం చాలా మందికి అభ్యంతరకంగా తోచింది. ముఖ్యంగా ఇటువంటి పయోరుహాననా, సరసిజాక్షీ వంటి పదాలు శృంగారపరమైన సంబోధనలుగా మనవాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు తల్లిని కొడుకు అలా సంబోధించటం బాగులేదు అని అనేకమందికి కించ కలిగిందన్నమాట, సమర్థనలు ఉన్నాయనుకోండి. అది వేరే సంగతి. కుశ్శంక కుశ్శంకయే కదా.

    అన్నట్లు ఈ అమృతాపహరణోపాఖ్యానం మాకు డిగ్రీ తెలుగులో పాఠ్యాంశంగా ఉండినది. ఇంతమంచి ఘట్తాన్ని మరొకసారి తలచుకొనే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. గరుత్మంతుని స్మరణం సాక్షాత్తూ వేదపారాయణఫలప్రదాయకం, పాపాపహం!

  5. @ శర్మ గారూ,

    (బ్రాహ్మణుడితో వైరం పెట్టుకోకూడదన్నమాట ! మంచివాడు = బ్రాహ్మణుడు !)

    నిషాద అంటే తెలుగులో అర్ధం ఏమిటండీ ?

    @జిలేబి గారు,
    చ ! అన్ని ట్విస్టులున్న కధని టీ వీ సీరియల్ తో పోల్చారేమిటండీ ? సాగతీత సీరియల్ ని భారతంతో పోల్చితే భారతానికే అవమానం.

  6. త ల ఝాటార్ డమాల్ గా తిరిగి పోయింది కథ చదివితే !

    వామ్మో ఇన్ని మెలికలు పడ్డ కథా వస్తువు వీళ్ళకి ఎట్లా తోచి ఉంటుందండీ ? కాకుంటే ఆ కాలం లో నే సీరియల్ కథా వస్తువు తీసుకుని వేరు వేరు కథకులు ‘చైన్’ కథలు గా వ్రాసేరా వీటిని ? (ఈ కాలం లో టీ వీ సీరియళ్ళ ను తల దన్ను తోంది 🙂 )

    జిలేబి

    • జిలేబిగారు,
      కలుపులు, మలుపులు నావేం కాదండి, భారతంలో కథ అంతే. సీరియళ్ళు నేను చూడను, నాకు తెలియదు. 🙂
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి