శర్మ కాలక్షేపంకబుర్లు-ఆరోగ్య రహస్యం.

ఆరోగ్య రహస్యం.

పంతులుగారు మీ ఆరోగ్య రహస్యం ఏంటండీ అన్నాడు మా సత్తిబాబు.

ఏం లేదయ్యా! మితంగా తింటాను, వేళకి పడుకుంటాను, తెల్లవారుగట్ల నాలుగుకే లేస్తాను, ఉదయించిన సూర్యుని చూస్తాను.

ముఖ్యంగా సినిమాలు చూడను,టి.వీ చూడను, ఎవరితోనూ దెబ్బలాడను, వాదించను.

బాగానే ఉందికానండి, మీ ఆరోగ్యం పాడవుతున్నట్టుంది, ఈ మధ్య, ఏంటి కారణం.

నువ్వన్నది నిజమేనయ్యా, దీనికి కారణాలు రెండు,బ్లాగులో రాయడం, బ్లాగులు చదవడం, రెండవది అప్పుడప్పుడు పేపరు చదవడం.

అవీ మానెయ్యండి, సుఖపడిపోతారంటూ వెళిపోయాడు, మా సత్తిబాబు, నిజమ ంటారా?

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆరోగ్య రహస్యం.

  1. కష్టే ఫలే వారు,

    ఆరోగ్యం బయట లేదండీ ! అంతా మనలో నే ఉందండీ 🙂

    బ్రేవ్ !

    బ్రేవ్

    ఇంతకీ ఏమి జేబ్తున్నా ?

    ఆ ఆ రోగమే’ మహా భాగ్యమూ : ఏ రోగము ? బ్లాగు రోగము ; కావున బ్లాగు ని విడిచి వెళ్లి న బ్లాగు రోగము బట్టును :

    బ్లాగు లోకములో కొనసాగి పోయిన సర్వ రోగములు దయ్యాలూ మన చెంత రావు

    ఏదీ చెంపలేసు కోండీ ఇట్లాంటి ఆలోచనలు ఇక మీదట రాకుండా ఉండటాని కి !

    అదీ మంచి బాలుర ఆరోగ్య ‘లక్షణం’ !

    టెక్ కేర్ ! ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి 🙂

    జిలేబి

    • జిలేబిగారు,
      ఎనభైలలో ఇరవై వయసు ఆలోచనలో దూకుడు, ఇరవైలలో ఎనభై వయసు నిదానం అవసరమే. శరీరం కూడా సహకరించాలి కదా! పాసిటివ్ తింకింగ్ గా బాగున్నాం అనుకుంటూ కాలం గడుపుతున్నాం. రోజు రోజుకు బాధలు పెరుగుతున్నాయి, సహించడం కష్టమవుతోంది 🙂 మీమాటెప్పుడు కాదన్నది? మంచిబాలుడెప్పుడూ చెప్పిన మాట వింటాడట కదూ! వరసగా వర్షాలు, అపై ఎండలేకున్న వేడి పెరిగి, ఇబ్బందులూ….ఇదో వృత్తం….ఉరుకుతానన్న సయితెప్పుడూ ఉరకలేదు…ఉరికే సయితి చెప్పదు, ఉరికేస్తుంది…..
      ధన్యవాదాలు.

  2. ఒకప్పుడు ‘యువ’ అని ఒక మాసపత్రిక వచ్చేది. డబ్బైల మొదట్లో నేను హైదరబాదుకు ప్రవాసం రావటంతో, మరలా ‘యువ’ నా కంటబడినది లేదనే అనుకుంటాను. అప్పట్లో సీతాఫలమండిలో ఉండేవాడిని, అక్కడి గ్రంథాలయానికి తరచుగా వెళ్ళేవాడిని. కాని ‘యువ’ను చదివిన గుర్తు లేదు. ఒక వేళ మరచిపోయానేమో, అంత స్పష్టంగా గుర్తులేదు. పెద్దవాణ్ణైపోయాను కదా మరి. ఐతే ఈ క్రిందవ్రాసిన చిన్నకథమాత్రం అలనాటి ‘యువ’ సంచికల్లో ఒకదానిలో చదివినదే.

    ఒక రామారావు అనే కాస్తమందకొడి వ్యక్తి ఉన్నట్లుండి ఎంతో హుషారుగా మారిపోయాడు. ఈ మార్పుకు కారణం తెలుసుకోవాలని అతడి మిత్రబృందం ఎంతో బ్రతిమాలి, ఒక గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చి బెలిపించిన తరువాత తన ఆనంద, ఆరోగ్యరహస్యం కాస్తా రామారావు చెప్పేస్తాడు.

    “వినండి మిత్రులారా ఆరునెలల క్రిందటే నేను రేడియో వినటం మానేసాను” అప్పటినుండి ఎంతో బాగుంటోంది నాకు.

    క్లుప్తంగా ఇదీ కథ. రేడియో మీద క్రూరమైన సెటైర్ అనుకోండి. కాని ప్రాపంచిక విషయాలు అన్నీ వినీవినీ మనస్సునిండా ఆందోళనతో అనారోగ్యంగా కనిపించే రామారావు రేడియో వినటం మానేసి తన బ్రతుకేదో తన బ్రతుకుతూ హాయిగా ఉన్నాడట!

    అప్పట్లో ఇలా కక్షలూ కుట్రలూ నేరాలూ ఘోరాలూ తిట్లూ కేకలూ వంటి వికృతమైన ఆడియో విజువల్స్ మన మీద విసిరి వినోదించే టెలివిజన్ లేదు. వార్తలతో రకరకాల వంటలూ మంటలూ మనమీద చల్లే పేపర్లు లేవు. అన్నిటికి రేడియోనే గతి. అది పాపం బాగానే ఉండేది కాదు, చాలా బాగా ఉండేది. ఐనా సున్నితమనస్కులు రామారావులాంటి వాళ్ళని అనారోగ్యం పాలు చేసేది అన్నమాట, ఇప్పుడు మనసంగతి ఘోరంగా ఉంది. ఋషీశ్వరులకైన గంగవెఱ్ఱులెత్తించే దారుణమైన మీడియా విస్ఫోటనంతో అందరం ఎంతో అనారోగ్యాన్ని ఉదయాస్తమానపర్యంతమూ వినోదం పేర కొనుక్కొని బాధపడుతున్నాం అన్నమాట.

    • మిత్రులు శ్యామలరావు గారు,
      ఆకాశవాణి అనే ఆల్ ఇండియ రేడియోతో సామాన్యునిగా గత అరవై సంవత్సరాల అనుభవాలూ ఒక టపాయే రాయచ్చు. కొన్ని మెరుపులు, కొన్ని మరకలు ఉన్నమాట సత్యం.
      ఒకప్పుడు ఆ ఆకాశవాణి అవకాశవాణిలాగానూ, ఆల్ ఇండియా రేడియో కాస్తా ఆల్ ఇందిరా రేడియోలా పని చేసినప్పటిదే ఆ కౄరమైనదనుకున్న జోక్ అనుకుంటా. ఇప్పుడు యువ వస్తోందో లేదో తెలియదు.
      ధన్యవాదాలు.

    • నీహారికగారు,
      మీకేం కాకూడదన్నదే పెద్దవాళ్ళ తపన. చిన్నవాళ్ళది వచ్చేకాలం, వయసు మళ్ళిన వాళ్ళదిపోయే కాలం, చివరిరోజుల్లో కూడా శరీరం, మనసు విశ్రాంతి కోరటం తప్పు కాదేమోనండి? పాత నీరు కదలాలి, కొత్త నీరు రావాలి ఇది సృష్టి ధర్మం.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి