శర్మ కాలక్షేపంకబుర్లు-భట్టువారి రావిచెట్టు.

భట్టువారి రావిచెట్టు.

పెద్దాపురం సంస్థానాన్ని శ్రీశ్రీశ్రీ శ్రీవత్సవాయి తిమ్మ జగపతి ప్రభువుగా పరిపాలిస్తున్నకాలం. శ్రీవారి సంస్థానం లో నవరత్నాలుగా కవులు ఉండేవారట, కళలకు కాణాచి పెద్దాపురం. ఆ నవరత్నాలలో అప్పటికే వృద్ధులైన శ్రీ షణ్ముఖి వీరరాఘవ కవిగారొకరు, వీరిని ప్రభువు తాతగారు అని సంబోధించేవారట,ఇతరులు భట్టువారనేవారు.. రాజ్యం సుభిక్షం కాని ప్రభువులకొకటే చింత, సంతాన భాగ్యం లేకపోవడం. రాజదంపతులను పీడిస్తున్న బాధ, ఇది గమనించిన రామ మంత్రోపాసకులైన కవిగారు మండల కాలం దీక్షవహించి, తదుపరి రాజదంపతులను పుత్రుడు కలిగేలా ఆశీర్వదించేరు. రాజదంపతులకు మగబిడ్డ కలిగేడు, ఆ శుభ సందర్భం లో రాజదంపతులు కవిగారికి నూరు ఎకరముల భూమిని బహుమతిగా, కవిగారి స్వగ్రామం అనపర్తిలో, ఊరికి పశ్చిమంగా ఒక కిలో మీటర్ దూరంలో,పట్టా ఇచ్చారు. ఈ పొలం మధ్యలో కవిగారొక రావి మొక్క నాటారు, రాక్షస నామ సంవత్సరంలో, 17వ శతాబ్దంలో. కవిగారు గతించారు కాని రావిచెట్టు పెరుగుతోంది. కాలం గడిచింది.

DSCN0111

తెల్లదొరల పరిపాలనొచ్చింది, కాటన్ గోదావరి మీద ఆనకట్టు కట్టేరు, 1852 లో, ఆ తరవాత కాలవలూ తవ్వడం ప్రారంభించారు. తూర్పు ప్రధాన కాలవ ధవళేశ్వరం దగ్గర ప్రారంభమై వేమగిరివద్ద రెండుగా కాకినాడకాలవ, కోటిపల్లి కాలవగా విడింది. కాకినాడ కాలవ కడియం రైల్వే స్టేషన్ దాటిన తరవాత మరలా రెండుగా చీలి ముందుకుసాగుతున్నాయి. అలా ముందుకు సాగే దక్షణం వైపుకాలవని నల్లకాలవని, ఉత్తరం వైపుకాలవని ఎర్రకాలవని అనడం మొదలైంది. ఈ నల్లకాలవ ముందుకుతవ్వుకుంటూ వస్తున్నారు, ఈ భట్టువారి రావిచెట్టు సరిగా నల్లకాలవ మధ్యకి వచ్చింది, చెట్టు తీసెయ్యాలి లేదా కాలవ మళ్ళించాలి, చెట్టు తీసేసి కాలవని ముందుకు అలాగే తవ్వితే అనపర్తి ఊరిలోని ముఖ్యమైన వీధిలో ఇళ్ళన్నీ కాలవలో కలిసిపోతాయి. కవిగారి వారసులు తవ్వకాన్ని ఆపుచేశారు, కాటన్ స్వయంగా వచ్చారు, కాటన్ కి తెలుగురాదు, వీరికి ఇంగ్లీషురాదు, దుబాసీ మాటాడుతున్నాడు ఇరుపక్కలా. చెట్టు తీసేద్దామంటాడు కాటన్, కుదరదంటారు భట్టువారు, చెట్టు తీసేసి ముందుకువెళ్ళినా ఊరుపోకుండా కాలవ మళ్ళించక తప్పదు,ఆ మళ్ళించడం ఇక్కడే చేస్తే, ఊరూ చెట్టూ కూడా రక్షింపబదతాయన్నది భట్టువారి వాదన. చెట్టును ఏమైనా తీసెయ్యడానికి భట్టువారికి ఒప్పుదలలేదు, అందుకు ఇక్కడే కాలవని మళ్ళించి చెట్టునూ, ఊరినీ రక్షించాలన్నది భట్టువారి కోరిక. చివరికి కాటన్ ఒప్పుకున్నారు, కాని అలా చేయడం వలన భట్టువారిదే పన్నెండు ఎకరముల భూమి కాలవలో పోతోంది, దానికి ఒప్పుదలేనా అన్న కాటన్ ప్రశ్నకు వెంటనే భట్టువారిచ్చిన సమాధానం, ”చెట్టుకోసం, ఊరికోసం ఏమైనా చేయడానికి సిద్దమే”. ఈ మాట విన్న కాటన్ నోటివెంట మాట రాలేదు, ఒక రావి చెట్టుకోసం, ఆ తరువాత ఊరి క్షేమంకోసం,ఇళ్ళుపోకుండా ఉండేందుకు, పన్నెండు ఎకరముల భూమిని వదులుకోడానికి సిద్ధపడినవారిని చూసి నిర్ఘాంతపోయాడు, వారి ఔదార్యానికి మురిసిపోయాడు, కాలవను మళ్ళించాడు. నాడు ఔదార్యం చూపిన మహరాజు గతించారు, కవిగారూ గతించారు, కాటనూ గతించాడు కాని చరిత్ర ఉండిపోయింది, చేసిన పని నిలిచిపోయింది..చెట్టు మిగిలింది, ఊరు మిగిలింది. నేటికి కాలవ మళ్ళించినదీ కనపడుతుంది, చెట్టూ కనపడుతోంది, ఊరిలో వీధీ కనపడుతోంది.

DSCN0108
ఇదిప్పుడెందుకొచ్చిందీ? మొన్న ఈ రావిచెట్టు గురించి ఒక కరపత్రం వేశారు, అది నాదృష్టికి వచ్చింది. వెతుక్కుంటూ భట్టువారింటికి చేరాను. వారు ఆదరంతో ఆహ్వానించారు, రావి చెట్టు వివరమూ చెప్పారు. అనుమానం అడిగితే, ”భట్టువారు= కవిగారు,కవిరాజు( కాలంలో, ప్రజలనోట భట్టురాజు కాస్తా భట్రాజు అయింది ) భట్టురాజు అంటే కవిరాజు అని అర్ధం కదా!” అన్నారు. రాక్షసనామ సంవత్సరం, 17వ శతాబ్దం, తిమ్మ జగపతి మహారాజును పోల్చుకుంటూ, చెట్టు వయసుపోల్చుకుందామనుకున్నా.
రాక్షసనామ సంవత్సరం క్రీస్తు శకంలో వచ్చిన సంవత్సరాలు.

1555
1615
1675
1735
1795
1855
1915
1975

ఇక పరిపాలన చేసిన వారు.http://www.maganti.org/chitraindex/pics/raja/peddapuram.pdf
1555-1607 తిమ్మ జగపతి
1607-1646  రాయ జగపతి
1649-1688 తిమ్మ జగపతి (పిల్లలు లేరు)
1688-1714  ఉద్దండరాయ జగపతి.
1714-1734 రాగమ్మ
1760-1797 విద్వత్ తిమ్మ జగపతి.

చరిత్ర చూస్తే 1760 సంవత్సరంలో పరిపాలన కొచ్చిన తిమ్మజగపతి మహరాజుగా తేల్చుకున్నాను. రాక్షస నామ సవత్సరం 1795  లో వచ్చింది. వీటిని బేరీజు వేసుకుంటే ఈ రావి చెట్టు వయసు 220 సంవత్సరాలన్నది నిజమే అనిపించింది. ఈ చెట్టు చుట్టుకొలత సుమారుగా పదిహేనడుగులుంటుంది. నేటికాలానికీ ఆ రావిచెట్టు సంరక్షణా భారం ఈ భట్టువారి కుటుంబమే చేస్తున్నది,స్వంత ఖర్చుతో, కవిగారి తరవాత గంగరాజు, పిమ్మట వనమరాజు నేడు సూర్యనారాయణరాజు, వీరినే అబ్బాయిరాజు అనికూడా అంటారు. వారికి ఇప్పుడు అక్కడ ఒక సెంటు భూమి కూడా లేకపోయినా, ఈ రావిచెట్టుతో అనుబంధం మాత్రం ఉండిపోయింది.ఒకప్పుడు తెనుగునాట నాటక రంగంలో శ్రీకృష్ణ పాత్రలో ప్రజలను ఉర్రూతలూగించిన పాట ”చెల్లియో చెల్లకో!!” అలవోకగా పాడి ప్రజలను తన్మయత్నం లో నింపిన శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజుగారు ఈ కవిగారి వారసులే.

ఈ రావిచెట్టు దగ్గర స్నానాలరేవు ఉంది. ఆ నాడు కవిగారి వారసులు చూపిన ఔదార్యాన్ని గుర్తు చేసుకుంటూ మా ఊరి ప్రజలు పుష్కరాలు ప్రారంభం రోజున కవిగారు వంశీకులు స్నానం చేసిన తరవాతనే స్నానాలు చేశారు. అది కవిగారికి వారి వారసులకు మా ఊరి ప్రజలిచ్చిన గుర్తింపు, గౌరవం. నాడు దగ్గరగా రెండు వందల సంవత్సరాలకు ముందు పర్యావరణాన్ని రక్షించుకోవాలనె వారి తపన ఎంత గొప్పది? స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి సాయపడవోయ్ అన్నది చేతలలో చూపిన వీరు చిరస్మరణీయులే కదా!

చివరగా ఒకమాట,మా ఊరువారంతా మా గోదావరి కాలవలోనే నిత్యం స్నానాలు చేస్తారు, పుష్కర స్నానాలకు కూడా మరో ఊరుపోరు, పిండప్రదానాలూ ఇక్కడే చేస్తారు. ఈ విషయాలు కనుక్కోడానికి నేను 14th  నాడు అబ్బాయిరాజు గారి ఇంటిని సందర్శించినపుడు వారు చూపిన ఆదరం మరువలేనిది. తిరిగి వచ్చేటప్పుడు, నాకు వీరి కుటుంబం నూతన వస్త్రాలతో సత్కరిస్తే వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వచ్చా. అదీ వీరి గొప్పతనం….

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భట్టువారి రావిచెట్టు.

 1. చాలా బావుందండీ. _/\_కవిగారి దైవ విశ్వాసం, ప్రకృతిపై అప్పటి ప్రజల మమకారం, కాటన్ ఔదార్యం, ప్రజలకి ఆయనపై ఉన్న అభిమానం – చిన్న ఆర్టికల్లో చాలా విషయం ఇమిడ్చారు. బ్రిటన్ లో ఉన్న కాటన్ గారి వారసులని ఇప్పటికీ గోదావరి ప్రాంతవాసులు కొందరు రెండుమూడేళ్ళ క్రితం కలిసారని చదివాను. ఉద్యోగవశాత్తు కలిసిన కొందరు ఇంగ్లీషువాళ్ళతో ఆ విషయం, సి.పీ. బ్రౌన్ తెలుగు భాషా సేవా చెప్తే నమ్మలేకపోయారు, అఫ్-కోర్స్! వాళ్లకి బ్రిటిష్-రాజ్ నాటి విశేషాలు తెలిసే అవకాశం, ఇంటరెస్టు తక్కువే అనుకోండి. వాళ్ళ సంగతి అలావుంచితే, ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ వార్త చూసి నమ్మలేకపోవటం నా వంతయ్యింది ప్పుడు 🙂 –
  quote
  “ఈ ప్రాంత బ్రాహ్మణులు చాలామంది గోదావరీ స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, “కాటన్ దొర స్నాన మహం కరిష్యే” అని చెప్పుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు…
  నిత్య గోదావరీ స్నాన పుణ్యదో యో మహామతిహి:, స్మరా మ్యాంగ్లేయ దేశీయం స్మరామి ఆంగ్లేయ కాటనుం తం భగీరధం! (మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము… అని ఈ శ్లోకానికి అర్థం)
  గోదావరీ తీరవాసులు చాలామంది నేటికీ ఈ శ్లోకాన్ని వల్లె వేస్తూ కాటన్ దొరకు అర్ఘ్య ప్రదానం చేస్తున్నారు.”
  unquote

  నిజమే? ఇప్పటికీ చేస్తున్నారా?

  • అం’తరంగం’ గారు,

   ఆ రోజులలో కొంత కాకపోతే కొంతయినా మంచి ఉండేదేమో! రెండు మూడేళ్ళ కితం కాటన్ మునిమనవడు ధవళేశ్వరం వచ్చారు, వారి ముత్తాతగారు నివసించిన భవనం చూశారు, ఆ తరవాత కాటన్ కుమార్తె ఒకరు ఇక్కడ కాలం చేస్తే వారి సమాధి కూడా దర్శించారు. ఇవన్నీ పేపర్ వార్తలే. కాటన్, బ్రౌన్, చివరగా మెకంజీ వీరు తెనుగువారికి చేసిన సేవ మరువలేనిదే. వారి పట్ల అభిమానం చూపుతూ మొదటగా మా ఊళ్ళో విగ్రహం కాలవ ఒడ్డున పెట్టుకున్నాం, దుళ్ళలో. ఆ తరవాత ధవళేశ్వరంతో సహా చాలా ఊళ్ళలో ఇప్పుడు కాటన్ విగ్రహాలున్నాయి.

   ఇలా స్నానం చేసేటపుడు సంకల్పం చెప్పుకోవడం మాట నేనూ విన్నదే!
   ధన్యవాదాలు.

 2. మీ పోస్ట్ ముందు శ్రీపాదవారిని, అటుపైన చిప్కో ఆందోలన్ ను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగేందుకు తోడ్పడింది.కవిగారి కుటుంబానికి , వారి గురించి తెలియజేసిన మీకు కనీసం ధన్యవాదాలయినా చెప్పుకుంటే పుణ్యం వస్తుందేమో ! ఇదీ స్వార్థమే నేమో ! —————-డా.సుమన్ లత

  • డా.సుమన్ లత గారు,
   పెద్దవారిని గుర్తుకు తేగలిగినందుకు ధన్యుడను. నేనూ మీలాగే ఆశపడి కవిగారి కుటుంబాన్ని కలసివచ్చానండి. 🙂
   ధన్యవాదాలు.

 3. మంచి సమాచారం అందించారు శర్మ గారూ.
  ప్రజోపకరమైన పనులు చెయ్యడానికి పట్టుదల ఉండాలని భట్టు గారు నిరూపించారు. దానికి తోడు వారి త్యాగబుద్ధి – తన 12 ఎకరాల పొలం వదులుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి కాటన్ గారి మంచి మనసు కూడా సహకరించింది. భట్టు గారి వంశీకుల్ని కలిసి మీరు మంచి పని చేశారు.
  చాలా …. చాలా సంవత్సరాల క్రితం ఓ మాగజైన్ లో (బహుశా “నేషనల్ జియొగ్రాఫిక్” National Geographic అనుకుంటాను, సరిగ్గా గుర్తు లేదు) చదివాను – దక్షిణ అమెరికాలోనో, ఉత్తర అమెరికాలోనో ఓ దేశంలో హైవే నిర్మాణంలో ఇలాగే ఓ మహావృక్షం దారిలో తగిలితే, దాన్ని కొట్టివెయ్యకుండా ఆ చెట్టు దగ్గర హైవేని రెండుగా చీల్చి ఆ చెట్టు దాటాక రెండు రోడ్లనీ తిరిగి ఒకటిగా కలిపి హైవే నిర్మాణాన్ని కొనసాగించారట ఇంజనీర్లు. ఇప్పుడు వెదికాను గానీ లింక్ దొరకట్లేదు.
  చెట్లని సునాయాసంగా కొట్టేసే ఈనాటి మన బిల్డర్లకి, కాంట్రాక్టర్లకి అడ్డూ ఆపూ లేకుండా తయారయింది మనదేశంలో ప్రస్తుత తీరు. దానికి తోడు అధికారుల అలసత్వం. మేవుండే కాలనీలో కొన్నేళ్ళ క్రితం రోడ్డు వెయ్యడానికి 30, 40 ఏళ్ళనాటి చెట్లని ఇలాగే కొట్టేస్తుంటే ఆపుచెయ్యమని అడిగాను, అలాగే మరికొంతమంది కాలనీవాసులు కూడా అడిగారు – ఏమీ ఫలితం లేకపోయింది.

  • విన్నకోట నరసింహారావుగారు,
   ఒకానొక సమయంలో చెట్టు వేళ్ళు బయటపడిగాలికి పడిపోతుందేమో అని అనుమానపడి, కాలవలో మట్టి తవ్వించి, చెట్టు చుట్టూ నాలుగడుగుల ఎత్తున మట్టి పోయించి గోడ కట్టి చప్టా చేయించారు, కవిగారి కుటుంబీకులు. అదీ చెట్టును బతికించాలనే దీక్ష.
   ధన్యవాదాలు.

 4. ఒక మంచి సంగతి చదివితే అనందంతో మనసు నిండుతుంది. దొడ్దమనసులకు మౌనసాక్షిగా నిలచిన ఆ మహావృక్షస్వరూపుడైన అశ్వత్థనారాయణమూర్తికి నమస్కారం. ఆ దొడ్దవారిరికి, వారిని ఇంకా ఆదరపూర్వకంగా చూసుకొంటున్న ఆ ఊరివారికీ నమస్కారం. సంస్కారం అన్నది కబుర్లలో లేదు క్రియలో ఉంది. నేటి కాలం వారు పర్యావరణ రక్షణ అంటారు. మాటలు. మనస్సుల్లో అంత శ్రధ్ధాభక్తు లుండవు. ఒక ప్రక్కన పచ్చదనం పర్యావరణం గట్రా అంటూ ఉపన్యాసాలూ ఫోటోలో వీడియోలూ హడావిడీ – మరొక ప్రక్క కరెంటుతీగలకు అడ్డొస్తున్నాయంటూ రెమ్మలకు బదులుగా కొమ్మలూ కొమ్మలకు బదులుగా ఏకంగా చెట్లూ నరికివేస్తూ విధ్వంసకాండ.

  • తాడిగడప శ్యామలరావు గారు,
   పాతకాలం వారికి పని చేయడమే తప్పించి ప్రచారాలు తెలియవు, నేడు ప్రచారమే తప్పించి….
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s