శర్మ కాలక్షేపంకబుర్లు-శత్రువు

శత్రువు

”శత్రువంటే ఎవరు?” అని అడిగాడు మా సత్తిబాబు, ”శత్రువంటే శత్రువే” అన్నాడు మాసుబ్బరాజు. ”శత్రువును మట్టుపెట్టడం ఎలా?” అన్నాడు మా సుబ్బరాజు దానికి మా సత్తిబాబు ”కత చెబుతా విను” అని ఇలా చెప్పేడు.

అనగనగా ఒక రాజు కోట, కోటకి దగ్గరగా ఉద్యానవనం, దానిలో ఒక కొలను. దానికి దూరంగా ఒక చెట్టు, చెట్టు మీద కాకులు నివాసం ఉంటున్నాయి, చెట్టుకింద పుట్టలో ఒక నల్లతాచు చేరింది. పుట్ట కట్టుకున్న చీమలు పారిపోయాయి. ఈ నల్లతాచు, కాకులు ఆహారానికి పోయిన తరవాత చెట్టెక్కి కాకుల గుడ్లనూ, పిల్లలనూ తినెయ్యడం ప్రారంభించింది. కాకులకి ఏం చేయాలో తోచలేదు, గుంజాటన పడుతూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. సమస్య గురించి అందరూ చెప్పేరు, ఆవేశమూ పడ్డారు కాని దీనినుంచి తప్పించుకునే ఉపాయం మాత్రం ఎవరూ చెప్పలేదు, కాదు వారివల్ల కాలేదు. ఇంతలో ఒక ముసలికాకి లేచింది, ”మీ బాధ చూస్తున్నాను, ఎవరూ ఈ విషయంలో ఏం చేయాలో సూచనైనా చేయలేదు, శత్రువా చూస్తే చాలా బలవంతుడు, అందుచేత మీరు అనవసరంగా ఇబ్బందులు పడకండి, సమస్య నాకు వదిలేయండి, దీనిని నేను పరిష్కరిస్తా”నంది. అందులో కొన్ని యువకాకులు ఈ ముసలికాకితో ఏమవుతుందని ఈసడించాయి కూడా, కాని మరో మార్గం లేక ముసలికాకి మాటకి కట్టుబడ్డాయి. ముసలికాకి ఏమీ చేయటం లేదు, మిగిలిన కాకులు అడుగుతుంటే ”సమయం రావాల”ని మాత్రమే చెబుతోంది, కాలం గడిచింది, ముసలికాకి మాటా మరచాయి, మిగిలిన కాకులు. పాముతో బాధా పడుతున్నాయి, సమస్యా తేలలేదు.

ఒక రోజు రాజకుమార్తె చెలికత్తెలతో ఉద్యానవానానికొచ్చింది. బట్టలు నగలు అన్నీ తీసి గట్టునపెట్టి కొలనులో దిగారందరూ, జలకాలాటలకి. ఇది చూచిన ముసలికాకి నెమ్మదిగా రాజకుమార్తె బట్టలూ నగలదగ్గరకు చేరి తచ్చాడటం మొదలు పెట్టింది, ఇది చూచి ఒకటి రెండు సార్లు తోలేసేరు కూడా. ఇలా జరిగిన తరవాత ముసలికాకి నెమ్మదిగా రాజకుమారి రత్నాలహారాన్ని ముక్కున కరచుకుని దగ్గర్లో చెట్టెక్కి కూచుంది, ఆలగోల బాలగోలతో హడావుడి మొదలయ్యింది, సైనికులు కాకి వెంటపడ్డారు. కాకి సైనికులకి దొరకనంత ఎత్తులో ఎగురుతూ, వాళ్ళకి కనపడుతూ తన చెట్టు దగ్గరికి చేరి నెమ్మదిగా హారాన్ని సైనికులు చూస్తుండగా పుట్టలో పడేసి చెట్టెక్కి కూచుంది. కూడా వచ్చిన సైనికులు కాకి ఎదురుగా కనపడుతున్నా దానిని వదిలేసి పుట్ట తవ్వేసేరు, నల్లతాచు బయట పడింది, నాలుగు బాదేరు, తాచు చచ్చింది, సైనికులకి హారం దొరికింది, కాకుల సమస్య తీరింది. మరో కత చెబుతా విను అని ఇలా చెప్పేడు.

కోట దగ్గర ఉద్యానవనం దానిలో చెట్టు, చెట్టు మీద కొంగలు కాపరం ఉంటున్నాయి. నల్లతాచు చెట్టుకింద పుట్టలో చేరింది. కొంగలు బయటికిపోయినపుడు వాటి గుడ్లు, పిల్లలని తింటోంది, నల్లతాచు. ఏం చేయాలో తోచని కొంగలు నక్కని సలహా అడిగాయి. నక్క ఇలా చెప్పింది. ”ఒక రోజు మీరంతా చేపలు పట్టండి, వాటిని మీ చెట్టుకుదూరంగా ఉన్న చెట్టుమొదటిలో ఉన్న కలుగునుంచి, మీ చెట్టుదగ్గర పుట్ట దాకా వేయండి, తరవాతేం జరుగుతుందో చూడండి” అని సలహా ఇచ్చింది. సలహా తీసుకుని వచ్చేసిన కొంగలు మిగతావారికి చెప్పేయి. ”ఒక రోజు చేపలన్నీ ఇలా పడేస్తే కడుపుకాలదా? అలా చేస్తే ఏం జరుగుతుందో నక్క చెప్పలేదు, మీరు అడగలేదని” యువ కొంగలు ముసలి కొంగల్ని నిలదీశాయి. ముసలికొంగలు ”నక్క మనకు మిత్రుడు, చెప్పిన పని చేసి చూదా”మన్నాయి. తర్జనభర్జనల తరవాత మొత్తానికి కొంగలన్నీ ఒక రోజు చేపల్ని వేటాడి దూరాన ఉన్న చెట్టు కలుగునుంచి, తమ చెట్టుదగ్గరున్న పుట్టదాకా వేశాయి. కలుగులో ఉంటున్న ముంగిసకి చేప వాసన కొడితే బయటికొచ్చి చూస్తే ఒక దాని తరవాత ఒకటిగా చేపలు కనపడ్డాయి. ఒక్కొక చేపనే తింటూ పుట్ట దగ్గర కొచ్చిన ముంగిసకి పామువాసన తగిలి పుట్టలో దూరి, పామును కొరికి చంపి తన కలుగుకు చేరింది. ఇప్పుడు కొంగల సమస్య తీరింది అన్నాడు.

”రెండు కతలు చెప్పేవు, రెండూ ఒకలాగే ఉన్నాయికదా” అన్నాడు మా సుబ్బరాజు.

”మరదే! ఈ రెండు కతలలో ఉన్న తేడా చెప్పండీ” అన్నాడు మా సత్తిబాబు, ”నువ్వే చెప్పవయ్యా” అన్నా అంటే ఇలా అన్నాడు.

”సమస్య ఒకటే కాని సాధించిన విధానాలు వేరు. మొదటి కతలో విషయం, బాధ్యత ఒక్కరి మీదనే ఉండిపోయింది, మందితో పనిలేదు, కాని మందికి నమ్మకం కావాలి పనిచేసేవారి మీద, ఇదీ సమస్య. ఇక రెండవ కతలో సమస్యను సాధించడానికి మంది బలం కావాల్సివచ్చింది. అది అందరూ సవ్యంగా తోడ్పడితే మాత్రమే జరిగేది, వారని వీరు, వీరని వారు తప్పుకుంటే రాజుగారింట్లో పెళ్ళికి పాలు పట్టుకెళ్ళిన కతైపోతుంద”న్నాడు.

”రాజుగారింట్లో పెళ్ళేంటీ, పాలేంటి? కత చెప్పవా?” అన్నాడు మా సుబ్బరాజు, ”అది మరోరోజులే” అన్నాడు మా సత్తిబాబు.

సృష్టిలో సహజ శత్రువులున్నాయి. ఎలక,పిల్లి; పాము, ముంగి ఇలా కాని మానవులకు సహజ శత్రువులు లేరు, వారే వారిలో మరొకరిని సహజ శత్రువుగా తయారు చేసుకుంటున్నారు. సహజ శత్రులలో ఎలక ఎప్పుడూ చంపబడేదికాని, పారిపోయేదికాని అయి ఉంటుంది. ఈ పిల్లి కూడా మరొక చోట మరొకరికి సహజ శత్రువే. మానవులు సహజ శత్రువులను తయారు చేసుకుంటున్నారు, వారు ఆత్తకి,కోడలు; మామకి,అల్లుడు అంతెందుకు యాచకో యాచకః శత్రు, అదండి సంగతి….సహజ శత్రువులనే తయారు చేసుకుంటారో……అందరూ స్నేహంగా బతుకుతారో మీ……అంటూ వెళిపోయాడు మా సత్తిబాబు.

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శత్రువు

  1. మీ ముసలి కాకి సలహా చదివిన తరువాత నాకు మళ్ళీ మళ్ళీ వ్రాసే శ్రమ తప్పింది.రామజన్మభూమి సమస్యలో ఒక్కరే చేయవలసిన పని నేను చేసేసాను.ఇపుడు అదే సమస్యకి మందితో పని పడింది,మందిని నేను ఏకత్రాటిపైకి తీసుకురాలేకపోతున్నాను.ముస్లిం లను కదిపితే మోడీ అయితేనే మాట్లాడతానంటారు,హిందువులను కదిపితే టాఠ్ నీ సలహా నాకు నచ్చలేదు అంటారు.ముసలికాకి కబుర్లు కూడా బాగుంటాయి అంటే వినిపించుకోరు.

    • నీహారిక గారు,
      ”మీ ముసలికాకి సలహా” ఈ ఒక్క మాట తప్పించి మరో మాట అర్ధమైచావలేదనుకోండి. మీ ముసలికాకి సలహా శ్లేష గమనించాను
      ధన్యవాదాలు.

      • మిత్రులు శర్మగారు,
        నేనూ ఆ నాడే గమనించాను కాని, అక్షేపించలేదు ప్రయోజనం ఉండదని. అంతేకాక ఆవిడ మరికొన్ని మాటలను విసిరేందుకూ అవకాశం కల్పించి పెద్దలకు మరింత బాధ కలిగించటం దేనికని ఊరకున్నాను. కొందరు తమను తాము గౌరవించుకోవటమే కాని ఇతరులను, ముఖ్యంగా పెద్దలను, గౌరవించటంలోనే తమకు గౌరవమూ వృధ్ధీ అనేవి దాగి ఉన్నాయన్న సంగతిని గ్రహించలేరు. విశృంఖలవర్తనులను ఉపేక్షించటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు కద.

      • నలబై సంవత్సరాలు దాటిన వారందరూ ముసలి కాకులే ! అసలు కాకుల గోల మొదలయ్యేదప్పుడే ! మీకర్ధమైపోతే అది శ్లేష ఎందుకవుతుంది ? మీకర్ధమయ్యేట్లు చెప్పడానికి రాముడు దొరక్క నా చావు నేను చస్తున్నాను ?

      • >>>పెద్దలను, గౌరవించటంలోనే తమకు గౌరవమూ వృధ్ధీ అనేవి దాగి ఉన్నాయన్న సంగతిని గ్రహించలేరు. <<<<<

        ఎవరా పెద్దలు ? పండితులమని విర్రవీగేవారా ? ద్వంద్వార్ధాల పురాణాలు భోధించేవారా ? వయసులో పెద్దరికముంటే సరిపోదు,ధర్మాన్ని నిలబెట్టాలన్న తపన ఉండేవాడే గౌరవనీయులు.అసలు ధర్మమే తెలియనివాళ్ళు కూడా రాముని కీర్తించేవాళ్ళవడమే దౌర్భాగ్యం !

  2. కాలక్షేపం కబుర్లు అన్నారు గాని మీ కబుర్లు ఒంటబట్టించుకుంటే మాత్రం మరొకరి కాలక్షేప కబుర్లలో బలయ్యే అగత్యం రాదు. మీ పురాణ పఠణం అమోఘం. ప్రతి సూక్తినీ తగిన కథతో మనసుకు హత్తుకునేట్లు చెప్తున్నారు.

    • జ్యోతిర్మయి గారు,
      అనివార్య కారణాలవల్ల ఆలస్యం, మన్నించాలి,
      మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి