శర్మ కాలక్షేపంకబుర్లు-విజ్ఞానమయ కోశం

విజ్ఞానమయ కోశం                                                వివేక చూడామణి-6

అన్నం నుండి పుట్టినది, అస్థి,మజ్జ,మాంసము,రక్తం,మూత్రం, పూరీషాలుకలిగిన ఈ శరీరమే అన్నమయ కోశం.

కర్మేంద్రియాలు ప్రాణము కలిసి ప్రాణమయ కోశం అనగా కాళ్ళు,చేతులు,నోరు,మూత్రద్వారం, పురీషద్వారం మరియు పంచప్రాణాలు ప్రాణ,అపాన,వ్యాన,ఉదాన, సమానాలు కలిగినదే ప్రాణమయ కోశం.

మనోమయ కోశం జ్ఞానేంద్రియాలు మనసు కలిగినది. జ్ఞానేంద్రియాలు కన్ను,ముక్కు, జిహ్వ,చర్మం,చెవి మరియు మనసు.

జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిసినదే విజ్ఞానమయ కోశం.

ఇదే జనన మరణాల రూపమైన ఈ సంసారానికి కారణమైనది. మనసుయొక్క మరో స్థాయి ఐన చిత్తం ఇంద్రియాలను అనుసరించడం వలన కలిగే చేతన యొక్క ప్రతిబింబ శక్తి. ఇది ప్రకృతి సంబంధమైన వికారము. అందుకే నేను జ్ఞానవంతుడను, నేను నిపుణుడను, నేను గొప్పవాడిని, నేను క్రియావంతుడను అనే అభిమానం దేహము ఇంద్రియములందు నిత్యమూ కలగజేస్తూ ఉంటుంది. నేను అనే స్వభావము కల ఈ విజ్ఞానమయ కోశమే అనాది కాలీనుడగు జీవుడు. ఈ జీవుడు లోక సంబంధమగు వ్యవహారాలన్నీ నిర్వహిస్తుంటాడు. తన పూర్వ జన్మ వాసన వలన కలిగిన అనేక పాపపుణ్యాలను చేస్తూ ఉంటాడు. జనన మరణాలు కలుగుతుంటాయి, అనేక జన్మలు ఎత్తుతుంటాడు. మెలకువ,స్వప్న అవస్థలు,సుఖ,దుఃఖాలు అనే భోగాలు, ఆశ్రమాలయొక్క ధర్మ నిర్వహణ ( ఆశ్రమాలంటే బ్రహ్మచర్య,గృహస్థ,వానప్రస్థ, సంన్యాస ఆశ్రమాలు) గుణములకు సంబంధించిన అభిమానము ( సత్వ,రజస్, తమోగుణాలు) మమకారము, అహంకారము అన్నీ విజ్ఞానమయ కోశం లో ఉంటాయి. ఇది ఆత్మకు బహు చేరువగా ఉంటుంది. అందుచేత ఇదే ఆత్మ అని భ్రాంతి చెందడం మూలంగా జనన మరణ చక్రంలో తగుల్కొంటారు.

ఆత్మకి ఉపాధితో సంబంధం లేదు.సంగరహితము నిరాకారము ఐన ఆత్మ,క్రియా రహితము ఐన ఆత్మకు పదార్ధంతో సంబంధం లేదు. విజ్ఞాన మయ కోశం గురించి శంకరులు ఇంకా చెప్పేరు, నా కింత వరకే తెలిసింది.

మనోమయ కోశంలో జ్ఞానేంద్రియాలు మనసు ఉంటాయి, విజ్ఞానమయ కోశంలో జ్ఞానేంద్రియాలు బుద్ధి ఉంటాయి.మనసనేది చంచలమైనది, సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. బుద్ధి అలాకాక వివేచన చేస్తుంది. కార్యాకార్య నిరూపణ చేస్తుంది. ఈ బుద్ధి జ్ఞానేంద్రియాల ద్వారా నిత్య వ్యవహారాలను నిర్వహిస్తూ మానవుల పుణ్య పాపగతులకు కారణమవుతుంది, అనేక జన్మలకూ కారణమవుతుంది, నేను,నేను అనే అహం కలగజేస్తుంది. ఇదే జీవుడు,సాధారణంగా ఈ కోశాన్ని ఆత్మగా భ్రమపడటం జరుగుతుంది.ఈ కోశం లో కూడా ఆత్మ లేదన్నారు.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-విజ్ఞానమయ కోశం

  1. సార్. ఆత్మ ఇక్కడ లేదు ఆడ లేదు అంటారు. ఎక్కడ ఉంది సార్. బుచికిమయ కోశం లో ఉంటుందేమో

వ్యాఖ్యానించండి