శర్మ కాలక్షేపంకబుర్లు-సింహావలోకనం.

సింహావలోకనం.

సింహానికి ఒక అలవాటు, తను నడచి వచ్చిన దూరాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటుంది, అదేసింహావలోకనం అంటే. మానవులకీ ఈ అలవాటుంది, తాము గడచి వచ్చిన కాలాన్ని నెమరు వేసుకోడం. ఇప్పుడిదెందుకొచ్చిందని కదా అనుమానం.

సరిగా నాలుగేళ్ళ కితం Sep22 వ తేదీన బ్లాగు ప్రారంభించాలని, దశమి పూటా మధ్యాహ్నం రెండు గంటలకి మొదలెట్టా,అనుకోకుండా ముహుర్తం అలా కుదిరిపోయింది.. అసలెందుకు మొదలెట్టాల్సివచ్చిందీ చాలా సార్లు చెప్పేను, అందుకు ఇప్పుడు చెప్పను, ”పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరీ” అని నానుడి కదా 🙂

బ్లాగు మొదలెడదామనుకున్నాం, ”బానే ఉంది కాని”, బ్లాగు మొదలెట్టిన రోజుల్లో ”బాగానే ఉందికాని” అనేవాణ్ణి, ఇప్పుడు ”బానే ఉందంటు”న్నా మార్పండీ, మార్పు, గొప్పగాలేదూ, ఇదే కదా అభివృద్ది, చదువుకోనపుడు కాకరకాయన్నవాళ్ళు చదువుకున్నాకా కీకరకాయనకపోతే అభివృద్ది చెందినట్టా? 🙂 అది అభివృద్ధి అవుతుందా?

వర్డ్ ప్రెస్ లో మొదలెట్టాలి. అప్పటికి వర్డ్ ప్రెస్, గూగుల్ తేడా తెలీదు. గురువుగారు ఇందులోనో అందులోనో మొదలెట్టండీ! అన్నారు, అందుకు వర్డ్ ప్రెస్ లో మొదలెట్టాలని బయలుదేరా. పేరేం పెట్టాలి? ఇది మొదటి సమస్య. ఏవో పేర్లు చూస్తే, పోచుకోలు కబుర్లు, బ్లాగుంది; ఊకదంపుడు, బ్లాగుంది;కబుర్లపోగు బ్లాగుంది, ఆ పేర్లతో అప్పటికే బ్లాగులున్నాయి. ఏ పేరు కొట్టినా అప్పటికే బ్లాగుంది అని చెబుతోంది. ఛ! పేరు పెట్టడం ఇంత కష్టమా? అనుకున్నా, ”కష్టే ఫలే” అన్నారు కదా అని గుర్తొచ్చి, అదే పెట్టేద్దామనుకున్నా. దానికీ కష్టమొచ్చింది. ”ఇదీ ఉందోయ్ పేరూ!” అంది. హా! హతవిధీ!! అనుకుని, సెర్చ్ లో చూస్తే, కొంత మార్పు చేస్తే ఇది పెట్టచ్చూ అనిపించి, దాన్నే ఖాయం చేశాను. ఆ తరవాత, టాగ్ లైన్, అంటే అదేంటో తెలీదు, ఏదైతేనేం గాని మనం కావాలనుకునేది, నిత్యం చెప్పుకునేమాట ”సర్వే జనాః సుఖినో భవంతు” అనేశా, అదీ బానే ఉందనిపించింది. ప్రతి టపాకి పేరెడతాం, బానే ఉంది, ఈ టపా మనదని ఎలా తెలిసేది? అప్పుడు మూడో టపానుంచి ”శర్మ కాలక్షేపం కబుర్లు” అని చేర్చాను తలకట్టులో, అలా బ్లాగు నాలుగు క్లిక్కులు, మూడు టిక్కులతో మొదలైపోయింది, నేననుకున్న దానికి కొద్ది తేడాలో. ఒక మెసేజ్ కూడా వచ్చింది మైల్ కి, వర్డ్ ప్రెస్ నుంచి. ఆ మెసేజ్ నేటికీ ఉంచుకున్నా.

ఏం రాయాలి? తెలీదు, ఏం రాయచ్చు? తెలీదు, ఏం రాస్తారు? తెలీదు. ”ఇదొక మహా సముద్రం మీకు కొంత ఈతొచ్చుననుకుంటున్నాను, జాగ్రత” అన్నారు గురువుగారు, సముద్రం అంటే తెలుసా? తెలీదు, ఇక్కడ మత్స్యన్యాయం ఉంటుంది, చిన చేపను, పెద చేప, పెదచేపను తిమిగలం, తిమింగలాన్ని తిమింగిల గిలం, ఇలా మింగుతూ ఉంటాయి తెలుసా? తెలీదు. ఇక్కడెవరుంటారు? తెలీదు, మేధావులు, మహామేధావులు, అతి మేధావులు అందరూ చదువుకున్నవారుంటారు, నీలాటి మిక్చర్ బండి వాడికి స్థానం ఉండదు తెలుసా? తెలీదు. అరె! ఏమడిగినా తెలీదంటావు, నీకేం తెలుసంటే, ఏం తెలీదని తెలుసు, తెలివి లేనివాడినని తెలుసు. అప్పుడు గుర్తొచ్చిందీ పద్యం

భర్తృహరి అంటారూ, తెలివిలేనప్పుడు ఏనుగులాగా మదించి సర్వమూ నాకే తెలుసని విఱ్ఱవీగాను, ఇప్పుడు గొప్పవారైన పండితుల దగ్గర జేరి కొద్దిగా తెలుసుకుని, ఏమీ తెలియనివాడిననే మాట తెలుసుకున్నానన్నారు.

అసలు ఏమీ తెలీదని తెలుసుకోడమే గొప్ప సంగతన్నారు. ఈ గోలంతా మనకెందుకుగాని ‘అబద్ధంవా సుబద్ధంవా కుంతీ పుత్రా వినాయకా’ ( అబద్ధం కావచ్చు, నిజమూ కావచ్చు, ”కుంతి కొడుకు వినాయకుడు” అను పదిమంది చూస్తారు కదా! అసంబద్ధంగా మాటాడితే నలుగురూ వింతగా చూస్తారు కదా!) అని ఎదో ఒకటి రాసిపారేస్తే మనప్రఖ్యాతి తెచ్చుకోలేమా అనుకున్నా! తెలియని సంగతులే రాస్తూ వచ్చాను, చాలా మంది కలిశారు, మిత్రులయ్యారు, బంధువులయ్యారు,కొత్తగా గుప్త శత్రువులూ తయారయ్యారు,కొంతమంది మాటాడక మూతులు బిడాయించుకున్నారు. అభివృద్ది, అభివృద్ధండీ బాబూ! ఎందుచేత? మాట చేత.

పుల్ల విరుపుగా మాటాడతారెందుకు? మీరు మాటాడితే తేలు కుట్టినంత సంబరంగా ఉంటుంది తెలుసా? అంటుంది, ఇల్లాలు. (సంతోషమొస్తే గంతులేస్తారు సంబరంతో, తేలుకుట్టినా గంతులేస్తారు…) తెలీదు. నిజమే ‘నైజగుణానికి లొట్ట కంటికి మందులేదని’ నానుడి. ఇల్లాలు చాలా ప్రయత్నం మీద ఆ నైజ గుణాన్ని చాలా మార్చింది, చాలా మారేను, ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదని నానుడి’, అప్పుడపుడు ఇది బయటికొస్తూనే ఉంటుంది. బ్లాగు టపాలలో అటువంటి వ్యంగ్య టపాలు బహు కొద్దిగా ఉంటాయి. వ్యగ్యం మాటాడితే, రాస్తే, తేలు కుట్టినంత సంబరంగానూ ఉంటుంది. ఆ సమయాలలో కూడా సంయమనం సాధారణంగా కోల్పోను. నాకెంతమంది ఆప్తులుంటారో, ఉన్నారో అందరు శత్రువులూ ఉంటారు.  అది జాతక లగ్న ప్రభావం, నేనేం చెయ్యను చెప్పండి. దీనంతకీ కారణం? మాట.

‘సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్ న బ్రూయాత్ సత్యమప్రియం’. అందుకు అప్రియ సత్యం చెప్పను, కాని కావలసినవాళ్ళనుకున్నవాళ్ళకి చెప్పేస్తాను, అదుగో వాళ్ళే నా శత్రువులైపోతారు. ఎప్పుడూ ఒకరిని బాధించాలని అనుకోను, ఎవరినయినా ఒక మాటంటే అది వారి బాగుకోసమే తప్పించి, తప్పు పట్టాలనికాని, ఎగతాళీ చెయ్యాలనిగాని అనుకోను. అన్నమాట నిరూపించుకోడానికి తగు సాక్ష్యాలూ ఉంచుకుంటా, అది నా అలవాటూ. కొన్ని కొన్ని సందర్భాలలో నా తప్పులేకపోయినా తప్పేనని ఒప్పుకుంటా, ఎందుకంటే, నిజం చెపితే ఎదిటివారి పరువుపోతుంది, సాక్ష్యం చూపినపుడు. నిజంగా తప్పుచేస్తే నిర్భయంగానే ఒప్పుకుంటా, సిగ్గు పడను, వాదించను.

చాలా అనుభవాలొస్తాయి జాగ్రత్త అన్నారు గురువుగారు, అప్పుడు తెలియలేదు,’మెరిసేదంతా బంగారం కాదు’ ఇదో నానుడి,ఇది తెలుసుకునేటప్పటికి చేతులు కాలాయి, ‘చేతులు కాలాకా ఆకులు పట్టుకుని ఉపయోగం లేదని’ నానుడి. జరగవలసిన వేట సముద్రం లో జరిగిపోయింది.

సింహం వేట చూశారా? అది చూడ్డానికి గుండె ధైర్యం కావాలి, పోనీ సాలె పురుగు వేట చూశారా? ఇది చూడ్డానికి ఓపిక కావాలి. సింహం పరుగెట్టి, పరుగు పెట్టించి చంపి తింటుంది, గుండెను, ఇదే సింహభాగమంటే.. ఆడ సింహం తరుముతుంది మగ సింహం వేటాడుతుంది. ఆడ సింహాలే తరుముతూ ఉంటాయెప్పుడూ…. 🙂

ఇక సాలె పురుగు చాలా చక్కని కళాత్మకమైన గూడు అల్లుతుంది. అల్లినదారాలు ఉఫ్ మంటే ఎగిరిపోయేలా ఉంటాయి కాని వందల కిలో మీటర్ల వేగంతో గాలి వీచినా తెగవు, అదీ చిత్రం. మగవారి చుట్టూ ఆడవారు, ఈ మాటలనే దారాలు అల్లేస్తారు, ఇక అందులో పడిన జీవి కొట్టుకుంటూ ఉంటుంది, జీవితాంతం, ఇంతే సంగతులు 🙂 ఆ మాటలు సాలెపురుగు దారమంత సన్నగా బలహీనంగా కనపడతాయంతే, కాని అవి మాత్రం తెగవు, బాధపెడుతూనే ఉంటాయి. 🙂 చక్కగా అల్లిన సాలెపట్టులో మధ్యలో కూచుని ఉంటుంది, సాలె పురుగు. ఈగ అందులో చిక్కుకుంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, ఎగిరిపోవాలని, గింజుకున్నకొద్దీ అందులోకి కూరుకుపోతుంది. ఈ లోగా సాలెపురుగు వచ్చేస్తుంది, రెండు కాట్లు వేస్తుంది, ఈగ కొట్టుకుని కొట్టుకుని చచ్చేలోగా దాని చుట్టూ దారాలల్లేస్తుంది, చచ్చినా బతికినా ఈగ తప్పించుకోలేదు. నెమ్మదిగా ఈగను గూడు మధ్యకి లాక్కునిపోతుంది, అక్కడపెట్టుకుని నెమ్మదిగా ఆరగిస్తుంది.

నాలుగేళ్ళ తరవాత జ్ఞానోదయమయింది, కష్టపడి ఆలోచించి రాసి, ఎవరూ మాటాడలేదని, ఎవరో టపాలెత్తుకుపోయారనీ ఇలా అవస్థలు పడేకంటే, ఎక్కడో ఒకచోట ఒక మాటనేసిపోతే చాలదా అని.ఒక మాటనిపోయేవారికే విలువెక్కువట కదా 🙂

ఏంటీ ఇలా ఉంది మీటపా ఇవేళా అన్నారా? కారణం లేని కార్యం లేదు, ‘హేతువులేనిది తీతువు కుయ్యదు’, ఇదేంటో తెలీదా? చెప్పడానికి ఓపికలేదు. కొన్ని కొన్నిటికి కార్యకారణ సంబంధాలుండవు….అదంతే. ఒకప్పుడు తపా రాయకపోతే ఏదోలా ఉండేది, ఇప్పుడు టపా రాయాలంటే చికాగ్గా ఉంది….కాలోయం దురతిక్రమణీయః

రేపేంటి?
నందో రాజా భవిష్యతి
శలవు.
స్వస్తి

 

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సింహావలోకనం.

 1. నాలుగు బ్లాగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు.

  మీరు ఇలాగే మరెన్నో పోస్టులు రాస్తూ మాకు తెలియని ఎన్నో విషయాలు పంచుకోవాలని కోరుకుంటూ …

  శుభ కామనలతో,

  లలిత

  • చిరంజీవి లలిత,
   బ్లాగు మొదలుపెట్టి నాలుగున్నర సంవత్సరాలయింది, ఓపికా నిండుకుంది 🙂
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 2. తాతగారూ! మీ బ్లాగులో ఆణిముత్యాల్లాంటి విషయాలు ఎన్నో. ‘సింహావలోకనం’ అన్న టైటిల్ ను జస్టిఫై చేస్తూ మీ నుంచి ఇలాంటి పోస్టులు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.

 3. నాలుగు వసంతాలు పూర్తీ చేసుకున్న మీ బ్లాగ్ కి శుభాకాంక్షలు మాస్టారూ ! మీ ఓపికకి, మీ విద్వత్తుకి నమస్సులు . _/\_

 4. చాలా రోజులుగా నిశ్శబ్దం. ఎలా ఉన్నారు శర్మ గారూ? కుశలమా?
  “శ్రీరాముని” దయచేతను మీ సమస్య పరిష్కారం అయ్యిందా?

  • విన్నకోట నరసింహారావు గారు,
   మీ మరియు జిలేబిగారి సలహాలతో రావలసినవన్నీ వచ్చేశాయి, పదిహేను రోజుల కితమే! పళ్ళు కితం నెలాఖరుకొచ్చాయి, మొదటి పదేను రోజులు కష్టపడ్డాను, అలవాటు పడుతున్నా! మీ అభిమానానికి, ధన్యవాదాలు

   వందనాలు.

 5. పెద్ద పెద్ద విషయాలు మట్లాడే అనుభవం వయసు నాకు లేవు కానీ తాతగారు మంచిని పంచాలనుకున్నారు పెంచాలనుకున్నారు.తాతగారు మీరు మాలాటివాళ్ళకి కావాలి

 6. శర్మ గారికి !

  నాలుగు వసంతాలు ‘ బ్లాగులో ‘ పూర్తి చేసుకుని , సింహావలోకనం చేసుకుంటున్న మీ విజ్ఞత , అనేక తరాలవారికి స్ఫూర్తి దాయకం !
  కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ , మీ అనుభవాలు కూడా చెబుతూ ఉన్న మీ బ్లాగు, ( వినే ) యువ తరానికి మార్గ దర్శకం !
  మీ టపాలు , ( మెదడు ఉన్న ) , అవినీతి పరుల గుండెల్లో , శివ ఢమరుకం !
  మీరు ‘ ఊసు’ పోక రాసిన టపాలు కూడా ‘ కోసు ‘ గా ఉంటాయి !
  కొనసాగించండి , మీ బ్లాగు యాత్ర , మీ చైతన్య జీవన యాత్రతో పాటుగా !
  ఇంకా అనేక వసంతాలు , మీరు ఆరోగ్యం గా ‘ మీ బ్లాగు ద్వారా ‘ అందరికీ కనిపిస్తారని ఆశిస్తున్నాను !

  అభినందలు !

 7. శర్మగారూ,మీ బ్లాగు నాలుగు వసంతాలు పూర్తి ఐన సందర్భంలో నా శుభాకాంక్షలు.అభినందనలు.మీ బ్లాగు బాగా పాపులర్ ఐనది.ఇంకా రాస్తుండండి.విమర్శలు కూడా వస్తూనే ఉంటాయి.వాటికి జవాబులు చెప్పాలి.ఒక విషయం రాయదలుచుకొన్నాను.మనపురాణాలు బ్రాహ్మణాధిక్యాన్ని,అగ్రకుల ఆధిపత్యాన్ని సమర్థించాయి.పూర్వం బ్రాహ్మణులు నిష్ఠగా ఉండేవారు.అందువల్ల ఇతరులకి వారంటే గౌరవం ఉండేది,ఇప్పుడు అసలు ఎవరి కులవృత్తి వాళ్ళు అనుసరించడం లేదు కదా.మీరు రాసేవి కొన్ని,పురాణాల్లోవి కొన్ని, ఇప్పుడు వర్తించవు. కాని అందరికి వర్తించేవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి రాస్తూ ఉండండి .

 8. నీహారిక గారు తన పై వ్యాఖ్యలో అన్నారు –
  < "సత్యాన్ని పలికేవాడే బ్రాహ్మణుడన్నారు కదా ? "

  నేను:- అని ఎవరన్నారట? సత్యం పలకడానికి బ్రాహ్మణుడేమిటి, బ్రాహ్మణేతరుడేమిటి? సత్యం పలకమనడం మానవాళికంతటికీ వర్తిస్తుంది కదా.

  "వారిజాక్షులందు, వైవాహికములందు …….." అనే పద్యం కూడా ఉంది మరి. దీనికి కూడా కులభేదం లేదు కదా.

  నీహారిక గారి వ్యాఖ్యల్లో తరచూ బ్రాహ్మణుల మీద విసుర్లు కనపడుతూనే ఉంటాయి. మచ్చుకి కొన్ని ఇక్కడ :-
  ————–
  (1). < "మోదీ కి బ్రాహ్మణులకూ తప్పవు తిప్పలు !"
  Her comment dt.16-09-2015 in blog post dt.WEDNESDAY, SEPTEMBER 16, 2015
  నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను – చూడ గలను – జిలేబి భవిష్యపురాణం 🙂
  http://varudhini.blogspot.in/2015/09/blog-post_16.html
  నేను (ఇప్పుడు) :- ఇక్కడ బ్రాహ్మణుల ప్రస్తావన అవసరమేమున్నది?
  ————–
  (2). మరో చోట వ్యాఖ్యానిస్తూ ఓ సినీరచయిత గురించి ప్రస్తావించి ఆయనా బ్రాహ్మణుడే అన్నారు ఈవిడ (అక్కడ చర్చ కులాల గురించి కాకపోయినా).
  నేను (ఇప్పుడు) :- అయితే ఏమిటట? పేరొందిన సినీ రచయితల్లో కొసరాజు, నరసరాజు గారి లాంటి బ్రాహ్మణేతరులు కూడా ఉండినారనే సంగతి తెలుసు కదా?
  ————–
  (3). ఇంకో చోట వ్యాఖ్యానిస్తూ బ్రాహ్మణులు చెబితే మేం వినాలి కదా అన్నారు.
  నేను (ఇప్పుడు) :- మంచి ఎవరు చెప్పినా వినచ్చు. "వినదగునెవ్వరు చెప్పిన …….."
  ————–

  Final గా నేను:- ఈవిడకి ఈ బ్రాహ్మిణ్ obsession / fixation ఏమిటి? ఎందుకంత ద్వేషం?
  (ఈవిడ కామెంట్ల మీద కామెంట్ వ్రాయద్దనే అనుకునేవాడిని గానీ తరచూ ఇటువంటి విసుర్లు చూసిన తర్వాత నా అభిప్రాయం వ్రాయాలనిపించింది.)

 9. కొన్ని కొన్ని సందర్భాలలో నా తప్పులేకపోయినా తప్పేనని ఒప్పుకుంటా, ఎందుకంటే, నిజం చెపితే ఎదిటివారి పరువుపోతుంది, సాక్ష్యం చూపినపుడు. నిజంగా తప్పుచేస్తే నిర్భయంగానే ఒప్పుకుంటా, సిగ్గు పడను, వాదించను.

  నిజం చెప్పలేదంటే అబద్దం చెప్పినట్లే కదా ? సత్యాన్ని పలికేవాడే బ్రాహ్మణుడన్నారు కదా ? మీరు త్రేతాయుగపు కబుర్లు ఇపుడు చెపితే ఎవరికి తోచినవిధంగా వారు ప్రశ్నిస్తారు. ఒక పోస్టు వ్రాసి ప్రజలమీదకి వదిలేస్తే మీ పని అయిపోయిందని అనుకోకూడదు.ఆ సబ్జెక్ట్ మీద పాఠకులకు వచ్చిన సందేహాలు కూడా తీర్చగలగాలి.వాల్మీకినే అలా ఎందుకు వ్రాసారా అని ప్రశ్నిస్తుంటే మీరిలా బాధపడిపోయి భయపడితే ఎలా ? హిందూ ధర్మాన్ని నిలబెట్టటానికి ఊపిరున్నంతవరకూ వ్రాయాల్సిందే !

  భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
  భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
  భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాక్
  భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

  केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः ।
  न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः ॥
  वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते ।
  क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥

  Happy and healthy blogging !

 10. సార్! మీ అంత సున్నితం మంచితనం ఉంటే కష్టం సార్. హింసావలోకనం అవసరమే. బ్లాగ్ వ్రాయటం అంటె ఒక విచిత్రమైన వ్యాపకం. దానికంటా వాకింగ్ చేసుకోవటం ఉత్తమం.

 11. మీ బ్లాగు నాలుగు వసంతాలు పూర్తిచేసుకున్నందుకు అభినందనలు.
  మీ టపాలు కాలక్షేపం కబుర్లు కాదు. అవి చదివిన వాళ్ళు ఎంతో కొంత లోకజ్ఞానం సంపాదించుకునే ఉంటారు.
  ఓపికున్నంతవరకూ వ్రాస్తూనే ఉండండి. మీకంటూ కొంతమంది పాఠకులు ఉన్నారు మరి.

 12. < "ఇక సాలె పురుగు చాలా చక్కని కళాత్మకమైన గూడు అల్లుతుంది …… ….. నెమ్మదిగా ఈగను గూడు మధ్యకి లాక్కునిపోతుంది, అక్కడపెట్టుకుని నెమ్మదిగా ఆరగిస్తుంది."

  జీవిత సత్యాలు చెప్పారు శర్మ గారూ 🙂 🙂

 13. నాల్గవ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు. ఇలాగే మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని మా ఆకాంక్ష.

 14. నమస్తే శర్మగారూ! మీ సింహావలోకనం ఆలోచింపజేసింది . నవరసాలు పండించిన మీ బ్లాగు నాలుగేళ్ళు పూర్తిచేసుకున్న శుభ సందర్భం ఇది . కానీ బ్లాగు ద్వారా మీరు చెపుతున్న విషయాలు అనేక తరాలపాటు నిలిచి ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. మీరన్నట్లు “మాటనిపోయేవారికే విలువెక్కువ” .
  శుభాకాంక్షలు ..మరిన్ని మంచి టపాలు మీ నుండి రావాలని కోరుకుంటున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s