శర్మ కాలక్షేపంకబుర్లు-అరిసెలు/అప్పాలు.

అరిసెలు/అప్పాలు.

“మెయిల్లో ఇప్పుడే వస్తాను తాతా!” అన్న మనవరాలు మళ్ళీ కనపడకపోయేటప్పటికి భయమూ వేసింది, అనుమానమూ వచ్చింది. ఈ రోజు ఉదయం మెయిలిచ్చా! పలికింది. “తాతా! ఫోన్, నా కూతురు కింద పడేసింది, చెడిపోయింది, అందుకు జవాబివ్వడం కుదరలేదు, నీకో శుభవార్త నా కూతురు అడుగులేస్తోంది” అంది గారంగా, అదేదో నా “కూతురు ఎవరెస్ట్ ఎక్కిందీ”, అన్నంత సంబరంగా. అవును ఎవరి కూతురు మొదటిసారిగా అడుగులేస్తే వాళ్ళకి అంత సంబరం సహజంకదా! “అది సరేగాని, నాకు అరిసెలెప్పుడు పెడతావు, నే వస్తున్నా” అన్నా! “తాతా వచ్చెయ్యి! నీకు ప్లేన్ టిక్కట్టు పంపుతానూ” అంటూ “అరిసెలెందుకూ?” అంది. “అయ్యో అడుగులేస్తే అరిసెలు పంచాలమ్మా!” అంటే “నాకు అరిసెలెయ్యడం రాదూ” అని “ఎలా చెయ్యాలో చెప్పవా” అంది… అందుకే ఈ టపా. మనవరాలు అరిసెలేసిన తరవాత చెబితే సింగపూర్ వెళ్ళాలి తినడానికి 🙂

మూడు చిన్న గ్లాసుల బియ్యం నాన బోసుకోవాలి,నానిన బియ్యం “వాడ”వేసుకుని పిండి కొట్టుకోవాలి, అంటే నీడనే ఆరబెట్టుకుని పిండి దంచుకోడమన్నమాట, అదే మిక్సీలో వెయ్యడం, రోళ్ళూ రోకళ్ళూ లేవుగా,పిండి జల్లించుకోవాలి, బెల్లం కోరుకోవాలి. కోరుకోవడమంటే బెల్లపచ్చును కత్తిపీటన తరగడం.కోరుకున్న బెల్లం ఒక గ్లాసుడు కావాలి. గ్లాసుడు నీళ్ళు ఎసరెట్టాలి. మరుగుతున్న నీళ్ళలో ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి ముద్ద పాకం వచ్చే దాకా. ముద్దపాకమంటే, మరుగుతున్న బెల్లం కొద్దిగా తీసి కొద్దిగా నీటి తడితో రెండు వేళ్ళ మధ్య పట్టుకుని వేళ్ళు విడతీస్తే తీగలా వస్తే అది తీగపాకం, మరికొంత సేపు మరిగిన తరవాత తీసి కొద్దిగా చల్లని నీళ్ళలో వేస్తే ముద్దయితే అది ముద్ద పాకం. మరుగుతున్న ముద్దపాకపు బెల్లంలో ఈ కొట్టుపిండి పోయాలి. ముద్దవగానే దింపుకోవాలి. ఇదే చలిమిడి. చలిమిడి, చిమ్మిలి తెలియని ఆడకూతురుంటుందంటే తెనుగునాట, అనుమానమే. పుట్టింటినుంచి ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఆడపడుచు పసుపు,కుంకుమలూ;చలిమిడీ తప్పక తెచ్చుకుంటుంది.

ఇప్పుడీ చలిమిడి ముద్దని చిన్న చిన్న ఉండలు చేస్తూ అరటాకు ముక్కకి, దొరకదు కదూ, (చేతి మీద చేసెయ్యచ్చు), కొద్దిగా నూనెరాసి చలిమిడి ముద్దను అరటాకు ముక్క మీద పల్చగా వత్తుకుంటూ, అలా వత్తిన దానిని కాగుతున్న నూనెలో వేసుకుని బంగారం రంగులోకి రాగానే తీసుకోవచ్చు, లేదా మరి కొంచం వేపూ రానివ్వచ్చు. కొంతమంది నూపప్పుతో అరిసెలేసుకుంటారు, బాగుంటాయి. పల్చనచేసిన చలిమిడిని నూనెలో వేసేముందు నువు పప్పులో పొలిపి నూనెలో వేయిస్తే, అవే నువ్వుల అరిసెలు. నూనెలోంచి తీస్తూ రెండు చట్రాల మధ్యను నొక్కాలి,గట్టిగా నూనె పోయేందుకు. లేకపోతే చాలా నూనె అరిసెతో వచ్చేస్తుంది, అరిసె బాగోదు. అలా తీసిన అరిసెను కాగితం మీద వేసుకుంటే మిగిలిన నూనె ఓడిపోయి అరిసె బాగుంటుంది. భార్యాభర్తలలో భర్త నల్లగానూ, భార్య ఎర్రగానూ ఉంటే అరిసీ గారీలా ఉన్నారనడం రివాజు 🙂 అరిసి తింటే ఆరునెల్ల రోగం తిరగబెడుతుందంటారు. అరిసె బలుహారం.

అప్పాలు ఆంజనేయునికి ప్రీతి. స్వామికి అప్పాలు నివేదన చేయడం అలవాటు. అప్పాలు చేసుకోవాలంటే బియ్యపు పిండి విసురు బియ్యపు పిండి కావాలి. విసురు పిండి అంటే పచ్చి బియ్యాన్ని విసురుకోగా వచ్చినది (అదేలెండి మిక్సీ పట్టినది,ఆడించినది) అరిసెలకైతే కొట్టుపిండి వాడతాం (కొట్టు పిండి అంటే నానబోసిన బియ్యం మిక్సీ పట్టినది) ఇదొకటే తేడా గాని అరిసెలు చేసుకోడానికి అప్పాలు చేసుకోడానికి తేడా లేదు.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అరిసెలు/అప్పాలు.

  1. ఎల్లరకు ఒక విన్నపం,
    అరిసెల పిండి వంట తేలికైనదేం కాదు. ఈ వంటకం లో కష్టమంతా బెల్లం పాకం పట్టడం లోనే ఉంది. అది పట్టుబడటం కష్టం. పాకం సరిగా ఉండకపోతే అరిసెలు రావు, విడిపోతాయి. ఈ సామెత విన్నారా!

    ”అరిసెలపాకం పదునూ, అత్త పదునూ తెలుసుకోడం కష్టం”

    ఎవరేనా అరిసెల కోసం ప్రయత్నం చేసి విఫలమైతే మన్నించండి
    ధన్యవాదాలు.

    • చిరంజీవిYVR’

      నమ్మి నానబోసుకుంటే పులిసి బూరెలయ్యాయని నానుడి! నిన్నననగా బియ్యం నానబోసిందిట,చెప్పింది, పిండి చెయ్యడమే కుదరలేదట. 🙂 తను అరిసెలయ్యడమెప్పటికయ్యేనో… 🙂
      ధన్యవాదాలు

వ్యాఖ్యానించండి