శర్మ కాలక్షేపంకబుర్లు-సమ్మె-ఒక జ్ఞాపకం

సమ్మె-ఒక జ్ఞాపకం

జీవితం లో కొన్ని సంఘటనలు జరుతూ ఉంటాయి, వాటిని ఒక్కొకప్పుడు వరంగాను, కొన్నిటిని శాపమూ అనేసుకుంటుంటాం, అవి జరిగినపుడు. కాని కాలం గడచిన తరవాత అందులో కొన్ని శాపం అనుకున్నవి వరమేనని, కొన్ని శాపమేననీ తెలుసుకుంటాం, కాని కొన్ని వరమో,శాపమో తెలియకనే జీవితం పూర్తయిపోతూ ఉంటుంది.

తంతి-తపాలా శాఖలో పని చేశాను, తంతి విభాగంలో. ఆ అతరవాత కాలంలోనే దానిని టెలికం డిపార్టుమెంట్ అన్నారు, తపాలాను విడదీస్తూ. అప్పటికి తంతి విభాగం వెనకబడి టెలికం విభాగం బలపడుతున్నరోజులు. దగ్గరగా ఏభై సంవత్సరాల కితం మాట. నాటి రోజుల్లో ఫోన్ ఉన్నవారంతా గొప్పవారూ, కలిగినవారూ, లేదా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఆఫీసులు. సామాన్యులకి ఫోన్ సౌకర్యం శూన్యం లేదా అంతంతమాత్రమే. అంటే నాడు మేము సేవ చేసింది సామాన్యులకి కాదు, మాన్యులకే 🙂

స్వతంత్రం వచ్చేకా మొదటిసారిగా వేతనాలకోసం తంతి తపాలా శాఖలో మొదటిసారిగా 1960 సంవత్సరంలో సమ్మె జరిగింది. నాటికి శాఖలో ఉన్న ఉద్యోగులు తక్కువే. నాటికి ఈ శాఖలో ఉన్న యూనియన్ ఒకటే! అది కమ్యూనిస్ట్ ల ఆధిపత్యం లో ఉండేది. అప్పటికి కొంతమంది ఉద్యోగులు మాత్రం సంఘటితంగా ప్రభుత్వానికి వంతపాడేవారు, మా పట్ల వ్యతిరేకతే దానికి కారణం, మరేం లేదు. నేటి కమ్యూనిస్ట్ లు కారు నాటివారు, కొంత నిస్వార్ధ సేవ ఉండేది. పార్టీ మెంబర్లు కానివారిని మాత్రం అంటే కార్డ్ హోల్డర్ కానివారిని మాత్రం యూనియన్ పదవుల్లోకి రానిచ్చేవారు కాదు, అది మరో సంగతనుకోండి. నాడు సమ్మెను అణచేసేందుకు ఘనతవహించి ప్రధాని నెహ్రూ గారు చేసినది అక్షరాలా ఘనకార్యమే. సమ్మె నోటిస్ ఇచ్చాకా ఈ ఉద్యోగులంతా అత్యవసర సర్వీసు వారని, ’అహర్నిశం సేవామహే’ (అంటే రాత్రి పగలు సేవ చేసేవారని) అన్నది వీరి నినాదమనీ అందుచేత సమ్మె చేయరాదని సమ్మెకు వారం ముందు ప్రకటించారు, పాపం అత్యవసర సేవలు చేసేవారి వేతనాలు ఎక్కువగానే ఉండాలన్న సంగతి మాత్రం మరచిపోయారు :). దానిగురించిన ఊసేలేదు. సమ్మె చేస్తే చర్యలూ అలాగే తీసుకున్నారు. సమ్మె జరిగిన తరవాత వేతన సవరణా జరిగింది, కాని చాలా విభేదాలుండిపోడం తోనూ మళ్ళీ 1968 వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన మరలా సమ్మె జరిగింది. సమ్మెకు ముందుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మామూలుగానే టెలికం సేవలను అత్యవసర సర్వీసులుగా గుర్తించి, సమ్మెకువారం ముందే,సమ్మె నిషేధించింది. నిషేధం ధిక్కరించి సమ్మె చేశాం.

సమ్మె జరిగింది ఒకరోజే, ఆ సమ్మె విఫలం చేయడానికి నాటి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎంత నీచంగా ఉన్నాయంటే, ఆ రోజుకుగాను ప్రతి చిన్న ఆఫీసరుకు కూడా ఒక పదోన్నతి ఇచ్చేసింది, ( ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా మర్నాడే వాళ్ళ పదోన్నతులు ఊడబీకేశారనుకోండి) సమ్మె జరగ కుండా ఉండేందుకు ఏమి చేసినా చెయ్యండి అనే చెప్పింది. ఈ పదోన్నతి వచ్చిన ఆఫీసర్లంతా సమ్మె చేసినవారిపై పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్లు ఇచ్చారు, అరస్టులు చేయించారు, సమ్మె చేసినందుకు కక్షగట్టి, ఛార్జిషీట్లిచ్చారు. అప్పటినుంచి సమ్మె చేయని ఉద్యోగులు మాపై జులుం చెయ్యడానికి ప్రయత్నించారు, అంతెందుకు మమ్మల్ని దొంగల్లా, దోపిడీ దారుల్లా చూశారంటే అతిశయోక్తి కాదు. పోలీసులు కేసులూ పెట్టారు, చిన్న ఉద్యోగుల్ని కోర్టుల చుట్టూ తిప్పారు, రెండేళ్ళు.మాలో విభేదాలు తేవడానికి సమ్మె చేసినవారిలో కొందర్ని కోర్టుల చుట్టూ తిప్పారు. డిపార్ట్మెంట్ లో అరాచకమే రాజ్యమేలింది, కొన్నాళ్ళు. నిజంగానే నాడు అప్రకటిత ఎమర్జన్సీ నడిచిందంటే, వింతమాటకాదు. నాటి మంత్రి పేరు గుర్తుంచుకోడం కూడా పాపమని మరచిపోయాను, కాని నాటి గొప్ప ప్రధాని పేరు మాత్రం గుర్తుంచుకున్నాను, ఎందుకంటే తాను ముందుకాలంలో విధించబోయే ఎమర్జన్సీని మాకు ముందే రుచి చూపినందుకు. ఉద్యోగాలు పీకేస్తామని ఆఫీసర్లు రంకెలూ వేశారు. పాపం బలం వారిదికాదు కదా వారి వెనక ఉన్న ప్రభుత్వానిది, ఆ బలం. ఇంత చిన్న ఉద్యోగులు, పిపీలకాలు వేతనం కోసం సమ్మె చేస్తారా? సమ్మె చేసి పెద్దవారికి ఇబ్బంది కలగజేస్తారా? హన్నా! ఎంత తప్పు,ఎంత తప్పు…అదీ నాటి ప్రభుత్వ పెద్ద నెహ్రూగారి, వారమ్మాయిగారి ఆలోచన, ఆ తరవాతి రోజుల్లో. యూనియన్ గుర్తింపు రద్దు చేశారు, సమ్మె చేసినరోజుకు వేతనం లేదు, సర్వీసు లెక్కలోకిరాదు, అప్పటివరకు చేసిన సర్వీసు కూడా పెన్షన్ కోసం లెక్కలోకిరాదు, ఇలా ఎన్ని ఎన్ని కొత్తకొత్త నిబంధనలంటే, నేటి రోజు వాటిని చూసి ఆహా! ఇంత గొప్ప ప్రభుత్వాలు, సభ్యత తెలిసిన మహనీయులు మనల్ని పాలించారు కదా! ఇంత గొప్ప ప్రభువులు గొప్ప ప్రజాస్వామ్యవాదులమని చెప్పుకున్నారు కదా! వీరిని చరిత్రలో చాలా గొప్పవారుగా కీర్తిస్తున్నారు కదా అని కించిత్ బాధ కలుగుతుంది.

ఇంకా ఉంది

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సమ్మె-ఒక జ్ఞాపకం

  1. నాటి సమ్మెల సమ్మెట పోటుల తాళిన మాచన !

    మాచన వర్యుల సమ్మెల
    యోచన జూచెను జిలేబి యోగ్యము గాదే !
    వీచిరి చర్నా కోలను
    గాచెను యూనియను! నెహ్రు ఘాతము నోర్వన్ !

    జిలేబి

వ్యాఖ్యానించండి