శర్మ కాలక్షేపంకబుర్లు-మింగమెతుకు లేదుగాని మీసాలికి……..

మింగమెతుకు లేదుగాని మీసాలికి……..

మింగ మెతుకులేదు మీసాలకి సంపెంగ నూనె అని ఒక నానుడి చెబుతారు,తెనుగునాట. ఇదేంటీ?

సామాన్యార్ధంలో ”తినడానికి తిండి బతకడానికి సంపాదన, ఆదాయం, సావకాశాలు లేనివారు డాబులు పోతున్నారూ” అని హేళన చేస్తారు. ఒక చిన్న కత చెప్పుకుందాం.

ఆయనో రాజుగారు, పూర్వీకులు రాజ్యాలేలేరు. ఆ తరవాతవారు జమీలు ఏలేరు. ”చాప చిరిగితే చదరంతని” ఒక నానుడి, రాజ్యాలుపోయినా, జమీలు పోయినా ఎంతో కొంత భూవసతి మిగిలింది. ఆ తరవాత తరాలవారి దగ్గరకొచ్చేటప్పటికి ఇదీ తరిగిపోయింది. మిగిలినది రాజఠీవి, వంశపరంపరగా వచ్చిన పరిపాలనానుభవం, హోదా . మరి వీరి తరం దగ్గర కొచ్చేటప్పటికి దాని అవసరమూ లేకపోయింది. పాతబడి పడిపోతున్న ఇల్లు మిగిలింది. ఇంట్లో కుండలు డింకీలు కొడుతున్నాయి, అంటే పాత్రలు ఖాళీగా ఉండి శబ్దాలు చేస్తున్నాయి. ఇంట్లో తినడానికేంలేదు, కాదు పొయ్యిలో పిల్లి లేవలేదు, అంటే పొయ్యిలో నిప్పే వెయ్యలేదని,వంట ప్రయత్నమే లేదనమాట. . పాపం ఈ రాజుగారు మాత్రం సుష్టుగా భోజనం చేసినట్లు త్రేనుస్తూ, పెద్దగా ”పొట్టేలు తల కూర మహాబాగా చేసేవోయ్!” అని అంటూ, ”మీసాలబువ్వ”తో బయటికొచ్చేవాడు. మీసాల బువ్వేంటని కదా తమరి అనుమానం. పూర్వకాలంలో మగవాడంటే మీసం ఉండేది, కత్తిరి మీసాలుకాదు, కోరమీసాలూ కాదు, బారు మీసాలే ఉండేవి. ఇప్పుడు మీసాలు మగాళ్ళకి మాత్రమే ఉండటం లేదనుకోండి, అది వేరు సంగతి. మీసాలున్నవారు భోజనం చేసి చివరగా పెరుగూ అన్నం లేదా మజ్జిగా అన్నం లేదా గంజీ అన్నం కంచం ఎత్తుకుని తాగితే చివరి మెతుకులు కొన్ని మీసాలలో చిక్కుకునేవి. ఒక్కొకప్పుడు ఇవి అలా మీసాలలో ఉండిపోయేవి బయటికొచ్చేదాకా కూడా. అలా కనిపిస్తే వారు భోజనం చేసినట్టు గుర్తు, ఆ రోజులలో. అందుకుగాను ఈ రాజుగారు భోజనం చెయ్యకపోయినా చేసినట్టు భ్రమింపచేయడానికి గాను ఇలా రెండు మెతుకులు మీసాల్లో పెట్టుకుని బయటికొచ్చేవారనమాట,పొట్టేలు తలకాయ కూర గురించి చెబుతూ, దీన్నే మీసాల బువ్వ అంటారు, అంటే తినడానికి లేకపోయినా పౌరుషం తగ్గని విషయమనమాట.

ఇంతలేమిలో ఉన్నా వీరు సంపెంగ నూనె మాత్రం కొనేవారు. ఎందుకనీ ఈ సంపెంగ నూనె మీసాలకి రాయడం దర్పాని చిహ్నం, అది తరతరాలుగా వస్తున్నదీ! ఆ ఆచారం నిలబెట్టడానికి, తమ స్థాయి తగ్గలేదని చెప్పడానికి చేసే ప్రయత్నమే సంపెంగ నూనె కొని మీసాలకి రాయడం, తమ లేమిని దాచే ప్రయత్నం.

క్షుత్షామోఽపి జరాకృశోఽపి శిధిలప్రాయోఽపి కష్టాం దశా
మాపన్నోఽపి విపన్న దీధితిరసి ప్రాణేషు నశ్యత్స్వపి
మత్తేభేన్ద్ర విభిన్న కుమ్భపిశితగ్రాసైకబద్ధస్పృహః
కిం జీర్ణం తృణమత్తి మానమహతామగ్రేసరః కేసరీ……… భర్తృహరి

గ్రాసము లేక స్రుక్కిల జరాకృశమైన విశర్ణ మైన సా
యాసమునైన నష్టరుచి యైనను బ్రాణభయార్తమైన ని
స్త్రానమదేభకుంభపిశిత గ్రహలాలనశీలసాగ్రహా
గ్రేసరభాసమాన మగు కేసరి జీర్ణతృణంబు మేయునే ? ….. లక్ష్మణ కవి

శూరాగ్రణియైన సింగము ఆకలిచే డస్సినను,ముదిమిచే జిక్కినను,కష్టస్థితిని బొందినను, కాంతి హీనమైనను,ప్రాణములు పోవుచున్నను మదించిన ఏనుగు యొక్క కుంభస్థలమును పగులగొట్టి యందలి మాంసమును భుజించునేగాని ఎండుగడ్డి తినునా?

చనిపోవడానికైనా సిద్ధపడుతుందిగాని సింహం ఎండు గడ్డి తిననట్లు, పౌరుషవంతులు లేమిలో కూడా ఇతరులవద్ద చెయిచాచరు, కాని వారిని లోకం ఇలా మింగమెతుకులేకున్నా మీసాలకి సంపెంగ నూనె అని హేళన చేస్తూనే ఉంటుంది.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మింగమెతుకు లేదుగాని మీసాలికి……..

  1. “మీసాల బువ్వ” అనేది ఒకటుందని ఇప్పుడే తెలిసింది. మీరు చెప్పే కథలు బావుంటాయండీ 🙂

    ~లలిత

  2. ప్రస్తుతానికి దినాలట్లే ఉన్నట్టున్నాయ్ జిలేబి కి 🙂

    వ్రాసెను నానుడి కథలన్
    కాసుల దినముల జిలేబి కాలము బోవన్
    మీసాలకు రాసిరిగద
    సీసా సంపెంగి నూనె సీకటి రోజున్ !

    చీర్స్
    జిలేబి

  3. ప్రస్తుతానికి దినాలట్లే ఉన్నట్లున్నాయ్ జిలేబి కి 🙂

    వ్రాసెను నానుడి కథలన్
    కాసుల దినముల జిలేబి కాలము బోవన్
    మీసాలకు రాసిరిగద
    సీసా సంపెంగి నూనె సీకటి రోజున్ !

    చీర్స్
    జిలేబి

  4. 🙂 చాలా మంది కళ్ళ ముందు మెదిలారు. బావుంది మాస్టారూ ! ఎండలు తగ్గాయి. ఇక మీరు బాగా వ్రాయవచ్చు. కాస్త ఓపిక చేసుకోండి. ఈ బోషానంలో మరిన్ని ఆసక్తి కల్గించే విషయాల్ని భద్రం చేయండి.

    • వనజగారు,
      ఎండలు తగ్గాయి 🙂 వేడి తగ్గలేదు,ఉక్కపోత పోలేదు మీరన్నట్టు ఆసక్తి కలిగించేవిరాయాలనే ప్రయత్నం.
      ధన్యవాదాలు.

  5. “మీసాల బువ్వ” అనేది ఒకటుందని ఇప్పుడే తెలిసింది. మీరు చెప్పే కథలు బావుంటాయండీ 🙂

    ~లలిత

వ్యాఖ్యానించండి