శర్మ కాలక్షేపంకబుర్లు-వడ్డాణం

వడ్డాణం

అబ్బా! ఎంతబావుందో!! అంటూ నడుము తడుముకుంటూ వచ్చింది ఇల్లాలు.

ఏంటీ? అని అడిగేలోగానే,

చిన్నతనంలో పెళ్ళి చంద్రహారాలు చేయించారు, ఇప్పటికీ ఉంది, ఎంత బాగుంటుందో! వయసు వరదగోదారి, అంతాముద్దే, ముచ్చటే,మురిపమే, అదేం మాటో మరేమైనా తోస్తేనా? తోచనిస్తేనా?

పదేళ్ళు నడిస్తే కన్నీళ్ళు, కష్టాలు పలకరిస్తే, అదే జీవితమనుకుంటే, మరో వస్తువు వాహనం చేయించుకోవాలనే ఆలోచనే పుట్టలేదు. నలుగురు బుజ్జి కూనలు తయారైతే అదేలోకం, మరోటి తెలిస్తేనా? వయసు శాంత గోదారి.

పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అదో లోకం, అప్పుడు చేయించిన పలకసర్లు గొలుసు చూడముచ్చటగా ఉంది, ఇప్పటికీ…

పిల్లల పెళ్ళిళ్ళూ అయ్యాయి, మనవలు,మనవరాళ్ళు, ముని మనవలు, ఇదో లోకం, మూడో,నాలుగో తరం, ముచ్చటా, అసలు కంటే వడ్డీ ముద్దని, కూతురికి వస్తువు చేయించలేదు, కోడలికి గాజులు చేయించలేదు, అయ్యో! అడగ కుండానే అందరికి అన్నీ చేయించారుగా! వయసు ప్రశాంత గోదారి, ఇంతలోనూ గోవర్ధనం గొలుసు, ఇష్టపడి చేయించుకున్నది కదూ!

వయసు వృద్ధ గోదావరిలో పడింది,అప్పుడప్పుడూ పెట్టుకోడమేగాని ఏదీ నిత్యమూ పెట్టుకోడానికే భయం, ఎవడు పీకనొక్కి చంపుతాడో అని. మన మిత్రుల రాణీ కాసులపేరు, ఎంతకాలం? ఒకటా రెండా ఇరవై సంవత్సరాలు,మన దగ్గర దాచి ఉంచి, బాబోయ్! దీన్ని ఇక మేము కాపాడలేమని బతిమాలి వారి వస్తువు వారికి అప్పజెప్పేం, ఇంట్లో ఉన్నపుడైనా, ఎంటో ఒక్క సారీ మెళ్ళో వేసుకోవాలనే అనిపించలేదు సుమా!ఎప్పుడేనా అనిపించేది వడ్డాణం చేయించుకుంటేనో అని! రోజులు చెల్లిపోయాయి.

డెబ్బయి ఏళ్ళు పైబడ్డ తరవాత నడుముకి ఇది మాత్రం బాగా అమరింది కదూ, వడ్డాణం లాగానూ, బాగా నొక్కి పట్టింది, నెప్పీ తగ్గినట్టుందండీ అంది ఇల్లాలు, నవ్వుతూ..

వడ్డాణం చేయించలేకపోయినందుకు సిగ్గు పడ్డానో, నడుముకి బెల్ట్ వేసుకోవలసివచ్చినదాన్ని కూడా ఇంత తేలిగ్గా, సరసంగా చెప్పిన ఇల్లాలిని మెచ్చుకోవాలో, అభినందించాలో, వడ్డాణం చేయించలేకపోయినా నడుముకి, నెప్పికి బెల్ట్ వేయించినందుకు బాధ పడాలో, తెలియలేదు, ఆవిడ దగ్గర బుర్ర వంచుకున్నా, తప్పు చేసినవాడిలా.

ఏం? ఏమయిందీ అలా వున్నారు, ఇప్పుడు కావలసింది, వడ్డాణం కంటే ఎక్కువది, నడుం నొప్పి తగ్గించే బెల్ట్, చాలా చక్కగా అమిరింది, సుఖంగా ఉంది, ఎందుకు బాధ, అందరికి అన్నీ చేయించడమే సరిపోయింది, మీ జీవితంలో మీరేం చేయించుకున్నారనిగాని, చేయించుకోమనిగాని అడిగామా? కనీసం ఉంగరం కూడా లేదే!

ఏం మాటాడాలో తెలియలేదు.

23 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వడ్డాణం

    • లలిత జీ,
      మందులు పని చేశాయి, బెల్ట్ పెట్టుకోవడం తో కొంత ఉపశమనం కలిగింది.
      మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

  1. శర్మ గారు, దేశ విభజన లో బ్రాహ్మణుల పాత్రల పై ఇక్కడ రాసిన వ్యాఖ్యలలొ ఎమైనా దోషాలు ఉంటే ఎత్తి చూపగలరు. మీరు వయసులో పెద్దవారు గనుక ఆ కాలం నాటి పరిస్థితితులపై అవగాహన ఉంట్టుందని అడుగుతున్నాను.

    http://harikaalam.blogspot.in/2016/01/blog-post_19.html

  2. నేను చెప్పగలవాడిని కాదేమో, కానీ వీపుకి / నడుముకి ఆపరేషన్ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి, ఇద్దరు ముగ్గురు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిదేమోనని నా అభిప్రాయం – ఆవిడ వయసు దృష్ట్యా కూడా. ఎంతయినా వెన్నెముక కదండీ.

    • విన్నకోట నరసింహారావు గారు,
      అవసరం లో ఉన్నవాళ్ళకి మాట సాయం, సలహా చెప్పాలి, ఉపయోగించుకోడం మానడం వారిష్టం కదా! ఇప్పటికే మరో సలహాకోసం వెళ్ళడం జరిగింది, ఫలితం కోసం ఎదురు చూస్తున్నాం…కంగారు పడి నిర్ణయం తీసుకోము, మీ సలహాకి అభిమానానికి
      ధన్యవాదాలు.

    • అమ్మాయ్ నాగరాణి,
      ”మీరే ఆమెకు వంద వడ్డాణాల విలువ బాబాయి గారూ! అవునో కాదో , ఆమెని అడిగి చూడండి”.
      నీవన్న మాట నిజమే కావచ్చునేమో గాని, ఆమెనామాట అడగడానికి సిగ్గేసింది.
      వయసులో ముచ్చట తీర్చలేకపోయాను, తనెప్పుడూ నోరు తెరిచి అడగలేదనుకో!
      వడ్డాణం చేయించలేక బెల్ట్ వేయించానా అని ఒక బాధ మాత్రం మనసులో ఉండిపోయింది.

      ధన్యవాదాలు.

  3. మీరే ఆమెకు వంద వడ్డాణాల విలువ బాబాయి గారూ! అవునో కాదో , ఆమెని అడిగి చూడండి.

  4. వడ్డాణపు కథ, మాచన
    గిడ్డంగుల మేలు రీతి గింగిరు లెత్తెన్ !
    విడ్డూరముగా నడిపెను
    గడ్డగు కాలము, జిలేబి గమ్మత్తు సుమీ !

    చీర్స్
    జిలేబి

    • జిలేబిగారు,
      ‘గడ్డగు కాలము’
      ఇది మాత్రం నిజం. టెస్టులు,రిపోర్టులు అయ్యాయి. డాక్టర్ ఆపరేషన్ అంటున్నాడు. మరో అభిప్రాయం కోసం వేచి ఉన్నాం.
      ధన్యవాదాలు.

  5. ఎందుకో తెలీదు తాతగారు..కళ్ళళ్ళో నీళ్ళు మాత్రం గిర్రున తిరిగాయి.. 😦
    ముచ్చటైన మిధునం..సదా ఆదర్శప్రాయం..

    • అమ్మాయి ధాత్రి,
      ఒక్క సారి బాధపడాలి, కన్నీళ్ళొస్తాయి, తప్పదు, ఆ తరవాత, మళ్ళీ కర్తవ్యం లో పడిపోడమే, అదే జీవితం…
      మా గురించి నీ కంట ఉబికిన కన్నీరు….మాటలలో చెప్పలేను… ఈ అభిమానమే మమ్మల్ని ఇంకా…..
      ధన్యవాదాలు.

    • చిరంజీవి YVR
      కష్ట సమయాలలోనే మానవుల ప్రవృత్తి బయట పడుతూ ఉంటుంది…మా అనుభవాలు కొద్దిగానైనా ఉపయోగపడితే ఆనందమే…
      మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

  6. కొసమెరుపు భలే ఉంది. ఈ ‘వడ్డాణం’ తో మామ్మగారికి కొంచెం ఊరట కలిగితే
    చాలు.

    • చిరంజీవి శ్రీ,
      బెల్ట్ వేసుకుంటే నడవడం కొంత సౌకర్యంగా ఉందని ఆనందపడిపోయిందమ్మా
      ధన్యవాదాలు.

  7. సంసార జీవితంలో తీరే కోరికలు, తీరని కోరికలు, ఒడిదుడుకులు. సమానంగా తీసుకోగలిగేవారు స్థితప్రజ్ఞులు – మీ దంపతుల లాంటి వారు.

    • విన్నకోట నరసింహారావుగారు,
      కష్టం వచ్చినపుడు బాధపడటం, దానిని తప్పించుకోడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ జీవన స్రవంతిలో చేరిపోడం అలవాటయిపోయిందండి. ‘భగవంతుడు అన్ని దారులూ మూసెయ్యడు, ఒక దారి తెరిచి ఉంటుంది, మనం కనుక్కోవాలంతే, అది కనుక్కునేదాకా ఆరాటం తప్పదు,’ అంటుంది ఇల్లాలు, మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

  8. ఆ తరం ఆడవారే వేరులెండి ..సముద్రమంత విశాలం,ఆకాశమంత ఉన్నతం వారి మనసులు..మహా దొడ్డ ఇల్లాలిని పొందిన మీకు అభినందనలు..వడ్డానం గురించి అంత చమత్కారంగా చెప్పిన మా అమ్మ గారికి పాదాలకులకి నమస్కారములు..ఆది దంపతులైన మీ ఇద్దరికీ మరో సారి నమస్కారమండి.వీలుంటే అ పలకసర్ల గొలుసు,గోవర్ధనం గొలుసు,చంద్రహారం,రాణికాసుల పేరు ల చిత్రాలు వచ్చే పోస్ట్ లో మాకు చూపగలరు..అమ్మమ గారిని బరువైన వస్తువులు ఏత్హవద్దని నా మాటగా చెప్పగలరు..జాగ్రత్హ తీసుకోకుంటే ఈ నొప్పి డిస్క్ ప్రోలాప్స్ కి దారి తీస్తుంది కనుక కొంచం జగ్రత్హాలు పాటించాలి మాష్టారూ..

    • jayadev గారు,
      వాళ్ళు పెద్ద మనసు చేసుకోబట్టే రోజులు నడుస్తున్నాయండి. వీలువెంబడి ఫోటో లు పెడతాను, రాణీ కాసులపేరు గురించి చెప్పాల్సిందే, వారి వస్తువును ఇరవై సంవత్సరాలు జాగ్రత్త పెట్టి, మొన్ననీ మధనే ఇచ్చేశాం, ఫోటో కూడా తీసుకోలేదు 🙂

      స్కేన్లు,రిపోర్టులు అయ్యాయి.మందులు వాడుతున్నాం, బెల్ట్ వేశాం, జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి