శర్మ కాలక్షేపంకబుర్లు-ఆడదోమలే రక్తం ఎందుకు తాగుతాయి?-చొప్పదంటు ప్రశ్న.

ఆడదోమలే రక్తం ఎందుకు తాగుతాయి?-చొప్పదంటు ప్రశ్న.

ఈ మధ్య శ్రీ విన్నకోట నరసింహారావుగారు ఒక కామెంట్ రాస్తూ చొప్పదంటు ప్రశ్న మీద టపా రాయండీ అన్నారు. ఇప్పటికే మొదలెట్టి సగంరాశానూ, మీకు టెలిపతీ ఉందండీ అన్నా! సగంరాసినది ఎందుకో నచ్చలేదు. పూర్తి చెయ్యాలని మళ్ళీ మొదలెట్టా.

సగంరాసి వదిలేసిన టపా
“చొప్పదంటు ప్రశ్న.

చొప్పదంటు ప్రశ్నలెయ్యకూ! అని విసుక్కుంటుంటారు పెద్దాళ్ళు. అసలీ చొప్పంటే ఏంటీ? పై ఫోటో లో ఉన్నది మొక్కజొన్న, మొక్కజొన్న కర్రలా పెరుగుతాయి. కణుపు కణుపుకి ఒక ఆకుంటుంది. మొక్కజొన్న కంకులు, జొన్నకంకులు కోసుకున్న తరవాత మిగిలిపోయిన దానిని కోసేస్తారు, ఎండపెడతారు, దీనినే చొప్ప అని అంటాం. పచ్చిగా ఉన్నపుడు తింటే కొంచం తీపిగా ఉంటుంది. ఎలా తెలుసూ? చొ.ద.ప్రశ్న 🙂 ఈ జొన్న,మొక్కజొన్న మొక్కలు కణుపులుగా కర్రలా ఉంటాయనుకున్నాం కదా! విరిస్తే కణుపు దగ్గరకే విరుగుతుంది కాని మిగిలినచోటైతే విరుగుతుందిగాని ముక్క కాదు,సాగుతుంది. ఎండబెట్టిన దానిని చొప్పని అంటారనుకున్నం కదా! దీనిని వరిగడ్డితో పాటు కలిపి మేటిగా వేస్తారు. ఈ చొప్పతో పాటు జనప కట్టలను కూడా వరిలో వేసారు, వీటిని చాలా ఇష్టంగా పశువులు తింటాయి. మరో దారి పట్టేసేం కదూ.

చొప్పంటే తెలిసింది చొప్పదంటు ప్రశ్న అంటే ఏంటీ? గొప్ప ప్రశ్న కదా! వేసిన ప్రశ్న చొప్పదంటులా తేలిగ్గానైనా ఉండచ్చు, సమాధానం చెప్పవలసినంత ప్రశ్న కాకపోవచ్చు, అంటే సాధారణ జ్ఞానం ఉన్నవాళ్ళెవరికైనా ఆ ప్రశ్నకి సమాధానం తెలిసే ఉండచ్చూ, సమాధానం తెలియకాపోవచ్చు, అన్నదే ఆ విసుక్కోడం లో అర్ధం. మరోటేమంటే ఈ ప్రశ్నమీద అవునూ అని శతాబ్దాల తరబడి వాదించచ్చు, కాదనీ సహస్రాబ్దాలూ వాదించచ్చు. దేవుడున్నాడా? దేవుడున్నాడని చర్చించచ్చా? ఈ ప్రశ్నలకి సమాధానంగా ఏ రకంగానైనా వాదించచ్చు. మానవ జాతి పుట్టినప్పటినుంచి ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఉన్నాడన్నవారికీ కనపడలేదు, లేడన్నవారికీ కనపడలేదు. ఉన్నాడన్నవారికీ కావలసినన్ని ఆధారాలు, లేడన్నవారి కోకొల్లల ఆధారాలు. పని లేకపోతే ఇలా వాదించుకోవచ్చు. దీనినే చొప్పదంటు ప్రశ్న అంటారు.”

ఇలా రాశానుగాని ప్చ్ నచ్చలేదు. చొప్పదంటు ప్రశ్న అంటే సమాధానం చెప్పలేని, సమాధానం తెలియని లేదా బాగా తేలికైన, ఇలా రకరకాల భావాలతో ఉన్నవే చొప్పదంటు ప్రశ్నలనుకుంటా…..చాలావాటికి సమాధానాలూ ఉండచ్చు, మనకు తెలియకాపోవచ్చు, తెలిసి చెప్పలేకపోవచ్చు. 🙂 ఏంటో ఎంతకీ ఈ టపాముందుకెళటం లేదు, గానుగెద్దులా అక్కడికక్కడే తిరుగుతోంది. ఇలా అనుకుంటుండగా మా సుబ్బరాజు, సత్తిబాబూ వచ్చారు. ఏంటి సంగతంటే చెప్పాను. దానికి మా సత్తిబాబు, సుబ్బరాజూ నేను కొన్ని ప్రశ్నలేస్తా! సమాధానం చెప్పూ అన్నాడు. చొ.ద. ప్రశ్నలెయ్యకు అని చెప్పేశాడు, మా సుబ్బరాజు. సత్తిబాబిలా మొదలెట్టాడు.

స:-దోమలే కుడతాయా?
సు:-దోమలేకాదు, నల్లులూ కుడతాయి.
స:-కుట్టే దోమలు ఆడవా? మగవా?
సు:-కుట్టే దోమలన్నీ ఆడవే.
స:-ఆడవే కుడతాయంటే మగవి కుట్టవా?
సు:-అవును మగదోమలు కుట్టవు.
స:-ఆడదోమలే ఎందుకు కుడతాయి?
సు:-రక్తం తాగడానికి.
స:-అదే ఆడదోమలే రక్తమెందుకు తాగుతాయి.
సు:-అది తెలియాలంటే ఇలాటి వంద చొ.ద.ప్రశ్నలకి (Click and you can down load the book from link given at the end of the post) డా. మహీధర నళినీ మోహన్  గారు సమాధానాలిచ్చారు చదువు.
మరో చివరి ప్రశ్న, ప్రపంచంలో ఆడజాతి అంతా ఇంతేనా? సత్తిబాబు ప్రశ్న సంధించాడు.
ఓరినాయనో! నాకొంపముంచేలా ఉన్నావుగదా! అని పారిపోయాడు మా సుబ్బరాజు.
పంతులుగారు  ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అన్నాడు, మా మేధావి సత్తిబాబు, ఎరక్కపోయివచ్చాను, ఇరుక్కుపోయానన్నట్టు ఏడుపుమొహంతో తలూపాను.
1. ఒకరు కనపడితే దుర్దినం, మరొకరు కనపడకపోతే దుర్దినం, వాళ్ళెవరు చెప్పండి అన్నాడు.

2. ఒక మోటార్ సైకిల్ చక్రాల మధ్య దూరం రెండు మీటర్లు, రెండు కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసేటప్పటికి ముందు చక్రం వెనక చక్రం కంటే ఎంత దూరమెక్కువ ప్రయాణిస్తుంది? అడిగాడు

నాకు తెలియదన్నా! ఐతే కనుక్కు చెప్పండని వెళిపోయాడు. కొంచం సాయం చెయ్యండీ! 

చొప్పదంటు ప్రశ్నలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆడదోమలే రక్తం ఎందుకు తాగుతాయి?-చొప్పదంటు ప్రశ్న.

  1. Theoretically the wheel applied with less brakes travels more distance
    when we draw zero back wheel travels more distance but the distance between start and end is zero.
    Ultimately no wheel travelled

    • గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు ,
      1.Yes, it is a fact. that the the wheel, which was applied with less breaks travels more distance , but it is not the question here 🙂
      2. No wheel, either front or back will travel more distance than the other and your answer is correct.
      Tanks 4 ur reply

  2. ఆడ దోమలే ఎందుకు అసలు కుట్టు ?
    ఆడు వారికి కుట్టుట అన్న దసలు
    వెన్న తో బెట్టినటువంటి విద్య గాద,
    మాచనకి తెల్వని విషయమా జిలేబి 🙂

    జిలేబి

    • జులాయిగారు,
      జిలేబిగారు, మీమ్మల్ని జులాయి,పోకిరి,డింగిరి వగైరా పేర్లతో పిలవడం నాకైతే ఇష్టం లేదు. ఇటువంటి పేర్లతో కామెంట్ రాసేవారికి జవాబివ్వడం లేదు.
      మీరెవరైనా.ఏమన్నా, నా స్నేహితులు గత ఐదేళ్ళుగా.
      మీరు స్థాన భ్రంశం చెందినట్టుగా,దేశంలో కొచ్చినట్టుగా నా సిక్థ్ సెన్స్ చెబుతోంది, కుశలమేనా? హీస్పిటల్ లో ఉన్నారా? నిజం చెప్పండి…గత పదేను రోజులుగా మీలో చురుకు లేదు….

      ఆడవారికి కుట్టడం అన్నది వెన్నతో పెట్టిన విద్య.. అనుమానమా? 🙂
      ధన్యవాదాలు

  3. ఇంతకూ ఆడ దోమలే ఎందుకు రక్తం తాగుతవో తెలుసుకున్నారా శర్మ గారు,వాస్తవానికి ఇది చొప్పదంటు ప్రశ్న కానే కాదు,దీనికి శాస్త్రీయమైన వివరణ ఉన్నదీ..

    • challa.jayadev vara గారు,
      జీవులన్నిటికి తమ వంశం కొనసాగాలనేది ప్రముఖంగా ఉంటుందిటండి. దోమలలో అది మరి కాస్త ఎక్కువేమో! 🙂 పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేసి తరవాతి తరాన్ని తయారు చేసుకోడానికే దోమ రక్తం తాగుతుంది ట. మగదోమలకీ బాధ లేదు ట అందుకవి రక్తం తాగవు. నిజంగానే నాకిది తెలియదండి, ఇదిగో ఇలా డాక్టర్ మహీధర వారి పుస్తకం చదివి….
      ధన్యవాదాలు

  4. థాంక్స్ శర్మ గారూ. టపా బాగుంది.
    ఇటువంటివి శర్మ గారే ఎక్కువ రాస్తారేం ? (చొ.ద) 🙂 🙂.

    • విన్నకోట నరసింహారావు గారు,
      మేధావులు మాత్రమే చొప్పదంటు ప్రశ్న లేస్తారుటండి, అదొగో అటువంటి వాటిని ఏరుకొచ్చి ఇలా రాస్తుంటానంతే,మా సత్తిబాబు ప్రశ్నలకెవరూ సమాధానాలివ్వలేదండి…నాకు సాయం చెయ్యలేదండి….అందరూ దోమల మీదే పడిపోయారండి… ఆయ్
      మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి