శర్మ కాలక్షేపంకబుర్లు-వేలు విడిచిన మేనమామ

వేలు విడిచిన మేనమామ

ప్రతివారికి పుట్టుకతోనే చుట్టరికాలేర్పడతాయి. తల్లి,తండ్రి,అన్న,తమ్ముడు, అక్క,చెల్లి ఇవి మొదటి వరుసలోవి.

పైవరుసలోముత్తమ్మ, ముత్తాత; అమ్మమ్మ,తాత; మేనమామ,అత్త ( ఈవిడ మేనత్త కాదు);పిన్ని, బాబాయ్; పెదనాన్న, పెద్దమ్మ,(దొడ్డ),తల్లివైపు.

ముత్తవ్వ, ముత్తాత; మామ్మ,తాత; మేనత్త,మామ( ఈయన మేనమామకాదు);పెదనాన్న,పెద్దమ్మ; పిన్ని,బాబాయ్; తండ్రివైపు.

తన సమకాలీకులు అక్క,బావ;చెల్లి,బావ; అన్న,వదిన; తమ్ముడు, మరదలు. మేనత్తకొడుకు,మేనమామ కొడుకు బావ; మేనత్త కూతురు, మేనమామ కూతురు ఒదిన/మరదలు. భార్య అన్నదమ్ములు బావమరదులు, భార్య అప్ప, చెల్లెళ్ళు ఒదిన, మరదళ్ళు.

ఇక కిందివరుసకొస్తే కొడుకు, కోడలు; కూతురు,అల్లుడు; కోడలు, అల్లుడు తల్లితండ్రులు, వియ్యాలవారు వీరిని వియ్యంకుడు, వియ్యపురాలు అనేవారు, నేటికాలంలో అక్క,బావ అనిగాని చెల్లాయ్, బావ అనిగాని అంటున్నారు, ఇదీ బానే ఉంది. అక్క,చెల్లి కొడుకులు మేనల్లుళ్ళని,అక్క,చెల్లి కూతుళ్ళని మేనకోడళ్ళని అంటాం. ఇక అన్న,తమ్ముడు కూతుళ్ళని కూతుళ్ళని, కొడుకుల్ని కొడుకులనే అంటాం.ఇక కొడుకులు కూతుళ్ళ పిల్లల్ని మనవలు,మనవరాళ్ళు అని వారి పిల్లలని మునిమనవరాలు, మునిమనవడు అంటాం. ఇలా ఇవి ఏడు తరాలు. తమతరం కాక పైన మూడు తరాలు కింద మూడు తరాలు. ఇవి ముఖ్యంగా చెప్పే బంధుత్వాలు, ఇక మరికొన్నీ ఉంటాయి, వీటిని దూరపు చుట్టరికాలంటాం, ఈ దూరపు చుట్టరికాలని చూసుకుంటూ వెళితే ఒకప్పుడు ఒకరే రెండు వరసలలో కనపడ్డం జరుగుతూ ఉంటుంది కూడా. తెనుగునాట మేనమామను పెళ్ళి చేసుకునే ఆచారం ఉంది, అలా పెళ్ళి చేసుకుంటే అమ్మమ్మ అత్తగానూ, తాత మామగానూ మారిపోతారు 🙂 నేటి కాలంలో ఈ బాదరబందీలన్నీ లేకుండా కసిన్ బ్రదర్, కసిన్ సిస్టర్, పెద్దవాళ్ళైతే అంకుల్,ఆంటీ బస్ సమస్యలు లేవు, నేను నీకేమవుతానూ అని అడిగితే మావాడొకడు వస్తే ఎదురవుతావ్, చస్తే దయ్యమవుతావన్నాడు, అదే నిజమేమో అనిపించింది.

ఏంటీ వేలువిడిచిన మేనమామని తలకట్టు పెట్టి బంధుత్వాలు చెప్తారంటారా? వస్తున్నా! ఈ బంధుత్వాలన్నిటికి పేర్లున్నట్టే వేలువిడిచిన మేనమామ, వేలు విడిచిన మేనత్త అని రెండు వరుసలవారున్నారు, వీరెవరూ అనేదే ప్రశ్న. అమ్మమ్మ కొడుకు మేనమామ అంటే అమ్మకి అన్న,తమ్ముడు. ఈ వేలువిడిచిన మేనమామ అమ్మమ్మ యొక్క అక్క/చెల్లెలి కొడుకు. ఇక వేలు విడిచిన మేనత్త ఎవరూ? తండ్రి తండ్రి తాత, ఈ తాత కూతురు అనగా తండ్రి అక్క/చెల్లెలు మేనత్త, మరి ఈ వేలు విడిచిన మేనత్త మాత్రం తాతగారి అన్న/తమ్ముని కూతురు. ఈ సంబంధాలకి కూడా పేర్లు పెట్టేసేరు మనవారు. నిజానికి ఇవి వేలు విడిచిన మేనమామ,వేలు విడిచిన మేనత్త కాదు,వేలు విడవడం,వేలు మడవడం అసలే కాదు, అసలు పేర్లు మేనువిడిచిన మేనమామ,మేను విడిచిన మేనత్త. ఇదేంటని కదా అనుమానం, చెబుతా, మేనమామ అమ్మమ్మ కొడుకు, అంటే ఇక్కడివరకు శారీరిక సంబంధం ఉంది, కాని ఈ మేను విడిచిన మేనమామ అమ్మమ్మకి అక్క/చెల్లెలి కొడుకు అంటే సూటి సంబంధంకాదు, ఇలాగే వేలువిడిచిన మేనత్త కూడా. తెనుగునాట చాలా పదాలు అపభ్రంశం చెందాయి, అందులో ఇవి కూడా కలిసిపోయాయండీ!

Sri-Shiva-Maha-Puranamu

This book by my close friend Sri Visvanatham satyanarayana garu

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వేలు విడిచిన మేనమామ

  1. శర్మ గారు నమస్కారం,

    శ్రీ శివ మహాపురాణం లింకు పనిచేయటం లేదు సవరించగలరు

    ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ లింకు పనిచేయటం లేదు సవరించగలరు

    సంధి విగ్రహం లింక్ పనిచేస్తుంది

    మహాభారతం 9, 10,11,12,13,14,15 లింకులు పనిచేస్తున్నాయి

    సౌందర్యలహరి లింకు పనిచేస్తుంది

    మహాభారతం 1,2,3 ,4 ,5,6,7,8 లింకులు పనిచేయటం లేదు సవరించగలరు

    పోతన భాగవతం 1,2,3 ,4, 5 భాగాలూ లింకులు పనిచేస్తున్నాయి

    అత్తగారి కథలు లింకు పనిచేస్తుంది

    కన్యాశుల్కము లింకు పనిచేస్తుంది

    గూడుమారిన కొత్తరకం లింకు పనిచేస్తుంది

    శ్రీపాదవారి అనుభవాలు లింకు పనిచేస్తుంది

    ధన్యవాదాలు
    సర్వరాయుడు

    • ravipatirayudu గారు,
      శ్రమ తీసుకుని చెప్పినందుకు ధన్యవాదాలు, ఇవి సరి చేస్తాను.
      1.మహాభారతం 1,2,3 ,4 ,5,6,7,8 లింకులు పనిచేయటం లేదు సవరించగలరు
      2.ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ లింకు పనిచేయటం లేదు సవరించగలరు
      3.శ్రీ శివ మహాపురాణం లింకు పనిచేయటం లేదు సవరించగలరు
      Can anybody guide me how to share in drive?
      ధన్యవాదాలు.

  2. సినిమాల్లో ఈ వరసలు విని అర్ధం తెలిసేది కాదు తాత గారు. చక్కగా విడమరిచి చెప్పారు.

    • చి.స్వాతి,
      తల్లి తంద్రుకు ఒకరే బిడ్డ ఉంటున్న రోజులలో మేనమామలు, మేనత్తలే కరువైపోయారు, ఇక మేనవిడిచి మేనమామలెక్కడతల్లీ! సినిమాల్లో చూడాల్సిందే !
      ధన్యవాదాలు.

  3. సర్! చిన్నప్పటినుంచీ ఈ “వేలు విడిచిన” అనేది ఓ పెద్ద మిస్టరీ. 🙂 ఇప్పటికి వీడింది. కానీ చిన్న సరదా సందేహం. మేను విడిచిన అంటే మరో అర్ధం (అపార్ధం) వస్తుందని వేలు విడిచిన అని ఉంటారనిపిస్తోందండి. స్వయానా మేనమామ/మేనత్తతో ఉన్నంత దగ్గర కాదు కనక, అంటే వాళ్ళలా మేనల్లుళ్ళని/కోడళ్ళని వేలు పట్టుకుని మరీ నడిపించరు కనక – ఆ దూరం చూపించటానికి వేలు విడిచిన అని మార్చారేమో.

    • YVR’s అం’తరంగం’
      మేను విడచిన అంటే అక్కడ అపార్ధం స్ఫురించే సావకాశం ఉంది, ”మేన” విడిచిన మేమామ కావచ్చు లేదా మీరన్నట్టుగా ఈ ఇబ్బంది లేకుండా వేలు విడిచిన మేనమామ అని ఉండచ్చేమో!
      ధన్యవాదాలు.

  4. మరి తాత (అమ్మమ్మ భర్త) గారి అన్న / తమ్ముడి కొడుకు వేలువిడిచిన మేనమామ అవరా?

    • విన్నకోట నరసింహారావుగారు,

      మీరన్నట్టు తాత (అమ్మమ్మ భర్త) గారి అన్న / తమ్ముడి కొడుకు గాని, అమ్మ తోడికోడలు అన్న/తమ్ముణ్ణిగాని వేలువిడిన మేమ మామ అనరు.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి