కామిగాని మోక్షగామి గాడు!
కామం అంటే కోరిక. కామానికి స్త్రీ పురుష సంబంధాన్ని మాత్రమే చెబుతున్న రోజులివి, కాని నిజమైన అర్ధం కోరిక. ఈ కోరిక అనేది చతుర్విధ పురుషార్ధాలలో మూడవది. పుట్టిన ప్రతివారూ నాలుగు పురుషార్ధాలూ సాధించుకోవాలి, అందులో మూడవది కోరిక మరీ బలవత్తరమైనది.
పుట్టిన ప్రతిమానవునికి ఆరు ఊర్ములుండి తీరుతాయి, అవి ఆకలి,దప్పిక,శోకం,మోహం,జర, మరణం. వీటిని ఎవరివి వారే అనుభవించక తప్పదు. ఆహార,నిద్రా,భయ,మైధునాలు సర్వ జీవులకు సమానం అన్నారు. వీటి రూపంలో కోరిక అనుభవిస్తూ ఉంటాం.
జీవిగా తల్లి కడుపులో పడిన దగ్గరనుంచి కోరిక ప్రారంభమవుతుంది, ఆకలి రూపంలో, పుట్టేదాకా తల్లినుంచి తీసుకున్న ఆహారాన్ని ఆ తరవాత బయటనుంచి తీసుకోడంతో కోరిక మొదలు 🙂 ఇలా కోరిక వయసుతో బాటు పెరుగుతూనే ఉంటుంది. ఈ కోరికలకి కేంద్రస్థానం, పుట్ట, మనసు. ఇలా కోరికలు తీరినా తీరకపోయినా కోరికలు పుడుతూనే ఉంటాయి. వీటికి అవధి ఉండదు, అంతమూ ఉండదు. నిజానికి కోరికలేనివారిద్దరే! ఒకరు పుట్టనివారు మరొకరు చచ్చినవారు. ఐతే ఇలా కోరికలు తీరినా తీరకపోయినా పుడుతూనే ఉంటాయి, చూసిన ప్రతీదీ కావాలనుకుంటూనే ఉంటారు, వాటిని సాధించడం కోసం కాని పనులూ చేస్తుంటారు, ఇడుములబడుతుంటారు. ఈ కోరికలున్నంత కాలం మోక్షానికి దారిలేదు. అసలు మోక్షం కావాలన్నది కూడా ఒక కోరికే 🙂 మరి కోరికలకి అంతం అవధి అదే కామకోటి ఏది? అవధి అంతమూ లేదు గనుక కోరికలను అనుభవించవలసినదే! మరైతే మోక్షం ఎక్కడబాబూ!
అసలు మోక్షం అంటే? విడుదల,దేనినుంచి? కోరికలనుంచి కదా! కోరికలనుంచి విడుదలకావాలన్నదీ కోరికేగా! అందుచేత కోరికలను బలవంతంగా అణచేయద్దు,అణచేస్తే సమయం చూసి తిరగబడి స్వాధీనం చేసుకుంటాయి, మనల్ని, అదే మనసుని. వాటిని ధర్మమైన అర్ధంతో, ధర్మమైన మార్గంలో అనుభవించడమే అసలు మోక్షం. అర్ధం కాలా! నిత్యోపవాసం అంటే ఏంటీ? రోజూ రెండు పూటలా తింటూ మధ్యలో మరేమీ తీసుకోకపోడం. ఆ ( అలాగే ధర్మమైనది అనగా మన అర్హతకు తగినదైన కోరికను, ధర్మమైన అర్ధంతో, ధర్మమైన మార్గంలో అనుభవించడమే మోక్షం! మరే ఇతర కోరికనూ దరిజేరనీయకపోవడమే… అదే ”కామిగాని మోక్షకామిగాడు” అంటే కోరికలను అనుభవించనివాడు మోక్షకామిగాడు…కోరికలను అనుభవించినవారే మోక్షానికీ అర్హులవుతారు
‘అందుచేత కోరికలను బలవంతంగా అణచేయద్దు,అణచేస్తే సమయం చూసి తిరగబడి స్వాధీనం చేసుకుంటాయి,’ – నిజమే ఏమి తినకుండా ఉపవాసం చేస్తే ఒకే పూట లో నాలుగు పూటలకి సరిపడా తినేస్తాం 🙂
చంద్రిక గారు,
సహజమైన, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవలసినదే! అప్పుడే ముక్తికి మార్గం. కోరికలను బలవంతంగా అణచేస్తే, చివరికి జరిగేది…. కోరిక తప్పుకాదు, ధర్మబద్ధం కాని కోరిక వినాశం…
ధన్యవాదాలు.