శర్మ కాలక్షేపంకబుర్లు-నాస్తి జాగరతో భయం.

నాస్తి జాగరతో భయం.

కృషితోనాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం.

వ్యవసాయం/పరిశ్రమ/ప్రయత్నం చేస్తే కరువుండదు. తపస్సు చేస్తే పాపం ఉండదు. మౌనంగా ఉంటే కలహం లేదు. జాగ్రత్తగా ఉంటే భయం లేదు.

నాస్తి జాగరతో భయం, భయం దేనినుంచి? ప్రమాదం నుంచి. ప్రమాదం అంటేనే చెప్పివచ్చేది కాదు,హఠాత్తుగా మీద పడేది. పెను కష్టం హఠాత్తుగా మీదకురికితే ఎంతటి వారైనా బిత్తరపోతారు, తత్తర పడతారు. కొన్ని ప్రమాదాలు చెప్పీ వస్తాయి. అలా తత్తరపాటుకు గురికాకుండాలంటే, భయానికి గురికాకుండాలంటే జాగ్రత అవసరం. జాగ్రత అంటే, ఎఱుక కలిగి ఉండడం, హెచ్చరికగా ఉండడం వగైరా చెప్పుకోవచ్చు. ఇలా కాదుగాని ఉదాహరణ చెబుతా!

మా ఊరు అఖండగోదావరి పక్క ఉంది. అక్కడ గోదావరి వెడల్పు ఐదుకిలో మీటర్ల పైమాటేనేమో! ప్రతి సంవత్సరం వరదొచ్చేది. వరదకి ముందు పోతగట్ల వెంట నదివైపు ముఖ్యంగానూ,ఊరివైపూ, ఊళ్ళో ఉన్న పిల్లలమంతా, పందికొక్కు కన్నాలు గుర్తించి, గుర్తుగా పొడుగాటి వెదురు కర్ర ముక్క గుచ్చి ఉంచేవాళ్ళం, మా వెనక పెద్దవాళ్ళు రాళ్ళు వగైరా పుచ్చుకొచ్చి ఆ కన్నాలు పూడ్చుకుంటూ పోయేవారు, దగ్గరగా రెండు కిలో మీటర్ల దూరం. వరద, గట్టు దగ్గరకి వస్తోందనగా ఊళ్ళో ఉన్న పిల్లా మేకాతో సహా అందరూ గోదావరి గట్టు కాపలాకి వెళ్ళేవాళ్ళం,రాత్రి పగలు కూడా. ఐదుగురొక జట్టు, ఒక టార్చి లైటు, ఇద్దరు పెద్దవాళ్ళు, ముగ్గురు పిల్లలు, ఇలా కాపాలా కి గస్తీ తిరిగేవాళ్ళం. ఇంటి దగ్గర, ఇంటికొకరిని కాపాలాకి ఉంచేసేవారు, అలా ఇంటి దగ్గరెవరూ లేనపుడు, పొరుగూరివాళ్ళు వెనకనుంచి వచ్చి దోచుకుపోయిన సంఘటనలూ ఉన్నాయి. గట్లకి కాపలా ఎందుకు? గట్ల వెంట కాపలా కాసి గట్టుకి దగ్గరలోకి, పడవలో గాని,తెప్పమీదగాని వచ్చిన వాళ్ళని పట్టుకుని పెద్దవాళ్ళకి అప్పజెప్పేవాళ్ళం. వీళ్ళెవరూ? పక్క పై ఊరివాళ్ళు, లేదా ఎదురుగట్టు ఊరివాళ్ళు. వీళ్ళనెందుకుపట్టుకోడం అని కదా అనుమానం. వరదవచ్చి గోదావరి తమ వైపుగట్టు తెగితే తమ ఆస్థిపాస్థులు పోతాయని ఎదురు గట్టుకి చిన్న చిల్లు చేసిపోతే,చూడకపోతే గండి పడిపోయినట్టే,వరద మా వైపుపోతే తమరు రక్షింబడాలని కోరిక. అందుకు కాపలా కాసుకునేవాళ్ళం. ప్రమాదం నుంచి రక్షించుకోడానికి చర్య తీసుకునేవాళ్ళం, ఎప్పుడూ మా ఊరు దగ్గర గండి పడలేదు,నేనెరిగి.

మరోమాట
అదో పల్లెటూరు. ఒక మాస్టారు ఆ ఊళ్ళో పుట్టి,పెరిగి,చదువుకుని టీచరై ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కలా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. పూర్వీకులిచ్చిన ఇంట్లో ఉంటూ. చాలా మంది శిష్య గణం చేరింది, పరిచయాలూ పెరిగాయి. ముగ్గురు కొడుకులు కలిగారు. పెద్ద కొడుకు ఊళ్ళో ఉంటే మిగిలినవారు దేశాలు, రాష్ట్రాలు పట్టిపోయారు, బతుకు తెరువు కోసం. భార్య గతించింది, ఒంటివాడైపోయి, పెద్ద కొడుకు దగ్గరే ఉండిపోయాడు, కాలం చేసాడు.

కొడుకులు,కోడళ్ళు, మనవలు,మనవరాళ్ళు, కావలసిన వాళ్ళంతా వచ్చారు, రోజులెళ్ళిపోయాయి. సంవత్సరం గిర్రున తిరిగొచ్చింది, మళ్ళీ అంతా చేరారు, కార్య క్రమాలు చేసారు, చివరిరోజు ఊళ్ళో అందరిని పిలిచి, రాత్రి భోజనాలెట్టేరు. ఊరి పంక్తి అయి తమ భోజనాలు పూర్తయ్యేసరికి రాత్రి మూడయింది, కొడుకులు,కోడళ్ళు, మనవలు,మనవరాళ్ళు అంతా భోజనాలు,వడ్డింపులు కార్యక్రమాల్లో అలసి ఎక్కడివాళ్ళక్కడే నిద్రపోయారు. తెల్లారింది శనివారం ఒక్కళ్ళూ లేవలేదు, మధ్యాహ్నమయింది, ఎవరూ లేవలేదు,నిద్రపోతూనే ఉన్నారు, నాలుగు రోజులనుంచి అలసి ఉన్నారు కదా! సాయంత్రం నాలుగ్గంటల వేళ ఒక్కొకరూ లేచి దంతధావనం కానిచ్చారు.

”మధ్యాహ్నం భోజనాలు లేవు, రాత్రికైనా…” అని ఒక కోడలంటే మరొక కోడలు, ”అబ్బా! నా వల్ల కాదే! ఏం వద్దే బాబూ” అంది. పెద్దకోడలు ”అదేం మాట ఏదో ఒకటి తినకపోతే ఎలా? మళ్ళీ రేపు ప్రయాణాలాయే” అంటే బుల్లి కోడలు, ”ఎలాగా శనివారమేగా ఏదో టిఫిన్ చేసుకు తినేద్దాం లెద్దురూ” అనడం, మొగాళ్ళు, ”ఏదో ఒకటి చెయ్యండర్రా” అనడంతో టిఫిన్ చెయ్యాలని నిర్ణయానికొచ్చేరు. ఏం చెయ్యాలీ అని చూస్తే ఒక అరటి కాయల గెల కనపడింది, ఒక శనగపిండి పేకట్ కనపడింది, కితంరోజు వాడి దింపిన కాగునూనె, బూరెల మూకుట్లో కనపడింది. బజ్జీలేసుకుందామే అన్నారొకరు. సరేనన్నారు. ఒకరు అరటి కాయలు తరిగేరు, మరొకరు శనగపిండి కలిపేరు, మరొకరు కాగు నూనె స్టవ్ మీదెక్కించి సిద్దం చేసేరు. మరొకరు బజ్జీలేసేరు. చట్నీ ఎదో చేసిందుంటే కానిచ్చేసేరు.అమ్మయ్య! తిన్నవాళ్ళకి తిన్నన్ని బజ్జీలు పెట్టేసి తోడికోడళ్ళు ముగ్గురూ కూచుని కబుర్లు చెప్పుకుంటూ బజ్జీలు తిన్నారు. ఇందులో పెద్దకోడలికి తినే వస్తువు ప్రతీది నోట్లోకి ఎగరేసుకోవడం అలవాటు. బజ్జీలు అలాగే తిన్నది. రాత్రికి అంతా మళ్ళీ నిద్రకి పడ్డారు.

రాత్రి గొంతులో ఎదో ఉన్నట్టనిపిస్తే రెండు సార్లు మంచినీళ్ళుతాగి, పుక్కిలించి ఉమ్మేసి, గొంతు గరగలాడించి ఏదో చేసి గడిపేసింది, ఆదివారం తెల్లారింది. సాయంత్రం ప్రయాణం, అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు, ఫ్లైట్ ఎక్కవలసినవాళ్ళు,రైళ్ళు మారవలసినవాళ్ళు, సద్దుకుంటున్నారు. పెద్దకోడలికి గొంతు వాచింది, గొంతులో ఏదో ఉన్నట్టే ఉంది, ఎవరికి చెప్పలేదు, మధ్యాహ్నం భోజనాల దగ్గర చూసేరంతా! ”ఏమయిందంటే,ఏమయిందన్నారు”, ”ఏమో తెలియటం లేద”ంది. భోజలయ్యాకా పక్కనే ఉన్న చిన్న టవున్ కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి నిర్ణయం చేసారు. అదృష్టంగా ఒక కొడుకు తెచ్చిన కారుంటే అందులో తీసుకెళ్ళేరు. ఆ చిన్న పట్టణంలో డాక్టర్లు ఉన్నారుగాని ఆరోజెవరూ లేరు, ఆదివారం అందునా సాయంత్రం. ఏం చెయ్యాలని అనుకుంటూ ఉండగా ఒక ముసలి డాక్టర్ గారు పని లేక,తోచక హాస్పిటల్లో కూచునుంటే ఆయన దగ్గరికి తీసుకుపోయారు. ఆయన వివరాలడిగి చూసి, ఏదో గొంతులో పెట్టి చూసి గొంతులో ఏదో ఉన్నట్టుందని చెప్పి, వైద్యానికి ఉపక్రమించి, వాంతికి మందు తాగించారు. వాంతిని జాగ్రత్తగా పట్టమన్నారు, బేసిన్ లో. రెండు సార్లు వాంతి చేయించిన తరవాత చూస్తే గొంతులో ఏమీ ఉన్నట్టు కనపడటం లేదు, ఇప్పుడు వాంతిలో వెతకమన్నారు.

వాంతిని క్షుణ్ణంగా వెతికేసేరు, నర్స్ అరిచింది ”ఆ దొరికింద”ని, ఏంటబ్బా అని చూసారంతా! అదే ఒక పక్క దగ్గరికి నొక్కుకుపోయి అందులో చిన్న బజ్జీ ముక్క చిక్కుకుని రెండవ పక్క సగం పైగా లేచి ఉన్న ”స్టాప్లర్ పిన్”. డాక్టర్ గారికి ఫీసిచ్చి, నమస్కారం పెట్టి. అయ్యయ్యో! ఎంత పని జరిగింది, చిన్న జాగ్రత తీసుకోకపోవడం, విచారించారు. ఎలా వచ్చి ఉంటుంది బజ్జీలోకి ఆలోచించారు,మరెలాగా బజ్జీలోకి వచ్చే సావకాశం లేదు, శనగపిండి పేకెట్ కున్న స్టాప్లర్ పిన్ కలిపిన పిండిలో పడి ఉంటుందని తీర్మానించేరు. శనగపిండి కలిపినవారు, ”పేకట్ విప్పివుందో, విప్పానో గుర్తులేదు. పేకెట్ కి ఉన్న పిన్ ఒకటి పిండిలో పడిపోయిందనమాట” అన్నది అంతా అవుననుకున్నారు.

మధ్యాహ్నం మొదలైన ఈ హడావుడి పూర్తయ్యేటప్పటి సాయంత్రం ఆరు గంటలైంది. ఈ లోగా అందరిలోనూ ఆతృత,ఏమయింది? ఏమవుతుంది, తమ ప్రయాణాలు సాగేనా, ఈవిణ్ణి ఒకత్తిని ఇలా వదిలేసి పోతే..ఎలా..? ఇలా ఆలోచనలు సాగిపోయి, అందరూ వ్యసన పడ్డారు.

చిన్న జాగ్రత్త, పిండి అలాగే పేకెట్ నుంచి పోసి కలిపెయ్యక, ఒక్క సారి జల్లించుకునుంటే….ఇలా జరిగేదా? నాస్తి జాగరతో భయం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతోనే ఉంటాయంటారా! అస్తు!! మీమాట నేనెందు కాదనాలి?

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నాస్తి జాగరతో భయం.

  1. ఏమండీ చిర్రావూరి భాస్కరశర్మ అనబడు
    మాచన వారు కుశలమేనా ?

    ఇవ్వాళెందుకో హఠాత్తుగ మీరు గుర్తుకొచ్చేరు

    అందుకని ఈ వ్యాఖ్య !

    జిలేబి

వ్యాఖ్యానించండి