ఒక కొడుకు కొడుకుకాదు, ఒక కన్ను కన్నుకాదు..
ఒక కొడుకు కొడుకుకాదు,ఒక కన్ను కన్నుకాదు అనే నానుడి చెబుతుంటారు. ఎక్కడిదిదీ? దీని కతేంటీ? చూస్తే భారతం దగ్గర తేల్చింది. చూదాం నడవండి…
శంతనుడు కురువంశపురాజు, గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో గంగ ఒక షరతు పెట్టింది. తనమాటకు ఎదురు చెప్పనంతకాలం కాపురం చేస్తాననీ, ఎదురు చెబితే విడిచి వెళిపోతాననీ. అందుకు ఒప్పుకున్నాడు శంతనుడు. పెళ్ళయింది, ఒక బిడ్డ పుట్టేడు. బిడ్డని తీసుకెళ్ళి నీళ్ళలో పారేసింది గంగ, ఓర్చుకున్నాడు బాధనిపించినా. అలా ఏడు సార్లు బిడ్డలను నీళ్ళలో పారేసింది. ఎనిమిదో సారి మళ్ళీ మగబిడ్డే పుట్టేడు. ఈ బిడ్డనూ నీళ్ళలో పారేస్తుంటే చూడలేక వద్దని వారించాడు. నేను చేసేపని వద్దని నా మాటకు ఎదురు చెప్పావు గనక నిన్ను వదిలేసి వెళుతున్నాను. ఈ బిడ్డని తీసుకెళుతున్నాను. పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి నీకు అప్పజెపుతానని తీసుకుపోయింది.
తీసుకెళ్ళిన కుర్రవాడిని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి, తీసుకొచ్చి శంతనునికి అప్పజెప్పి వెళ్ళింది,గంగ. కొడుకుకి యువరాజ పట్టాభిషేకం చేసి నాలుగు సంవత్సరాలు కాలం గడిపాడు శంతనుడు.
ఒక రోజు యమునా నదీ తీరానికి వేటకి వెళ్ళేడు. అక్కడ అపూర్వ సుగంధాన్ని ఆఘ్రాణించాడు. దాన్ని పట్టుకునిపోయి, ఒక కన్నెపిల్లని చూశాడు.
ఎవరునువ్వు? వివరాలడిగాడు.
ఆమె, తాను దాశరాజు కుమార్తె సత్యవతినని చెప్పింది.
మనం పెళ్ళిచేసుకుందామా అడిగాడు శంతనుడు.
మా నాన్నకి ఇష్టమైతే నాకూ ఇష్టమేనంది సత్యవతి.
దాశరాజు దగ్గరకెళ్ళిన శంతనుడు నీకుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేడు.
అందుకు దాశరాజు, నీలాటివాడికి పిల్లనివ్వడానికి నాకూ ఒప్పుదలేకాని ఒక షరతూ అన్నాడు.
ఇవ్వగలదైతే అభ్యంతరం లేదు, భరోసా ఇచ్చాడు శంతనుడు
నా కుమార్తెకు కలిగే సంతానానికి నీ తరవాత రాజ్యాధికారం ఇచ్చేటట్టైతే పెళ్ళి ఖాయం.
విన్న శంతనుడికి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టయి తిరిగిపోయాడు, కోటకి పోయి ముసుగుదన్ని పడుకున్నాడు, రాజ్య వ్యవహారాలు చూడక. ఇది చూసిన శంతనుని కుమారుడు దేవవ్రతుడు తండ్రి దగ్గరకుపోయి ”ఇబ్బందులేమీ లేవు, సమస్యలూ లేవు, ఎందుకిలా అనాసక్తం గా ఉన్నారని అడిగాడు.
చాలా సేపు మౌనంగా ఉన్న శంతనుడు
వినవయ్య యేకపుత్రుడు,ననపత్యుడు నొక్కరూప యని ధర్మువులన్
విని నీకు దోడు పుత్రుల ననఘా పదయంగ నిష్ట మయినది నాకున్..భా…ఆది.ప…ఆశ్వా..౪….౧౭౯
ఒక్క కొడుకుంటే బిడ్డలు లేనివానితోనే సమానం. నీకు కొంతమంది తమ్ములను కనాలని కోరికగా ఉంది.
నీ వస్త్ర శస్త్ర విద్యాకోవిడుడవు రణములందు క్రూరుడవరివి
ద్రావణసాహసికుండవు,గావున నీయునికి నమ్మగా నోప నెడన్……౧౮౧
నువ్వా అస్త్ర శస్త్రానిపుణుడవు, యుద్ధంలో క్రూరుడవు,వైరులపట్ల సాహసికుడవు, ఏమో ఏరోజెలా ఉంటుందో! నీ ఉనికి నమ్మేదిగా లేదు, తన ఉద్దేశం చెప్పేసేడు, శంతనుడు.
దేవవ్రతుడు అంతఃపురజనాలని,మంత్రులను వాకబు చేస్తే తేలినదేమంటే, శంతనుడు దాశరాజపుత్రి సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని. వెంటనే దాశరాజుదగ్గరకుపోయి, తన తండ్రి సత్యవతీ దేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడనే కోరిక చెప్పి, వివాహం చేయమన్నాడు.
దానికి దాశరాజు, వివాహానికి నాకేం అభ్యంతరంలేదుగాని ఒక షరతు, నీ తండ్రి తరవాత రాజ్యం నా కూతురు బిడ్డలకి వచ్చేలా ఐతే పెళ్ళి ఖాయం.
విషయం విన్న దేవవ్రతుడు, నా తండ్రి తరవాత రాజ్యం నాదే గనక నాకు రాజ్యం అక్కరలేదని చెప్పెసేడు.
నువ్వు సత్య సంధుడివే కాని నీ తరవాత నీ పుత్రులు రాజ్యం కోసం తగువు పెట్టరని నమ్మకమేంటని సంశయం వెలిబుచ్చాడు.
నాకు రాజ్యం అక్కరలేదు, నాకు పెళ్ళి ఐనపుడు కదా బిడ్డల సమస్య, అందుచేత నేను పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు.
దాంతో శంతన సత్యవతీ దేవిల వివాహం అయింది.
తండ్రికి పెళ్ళి చెయ్యడం కోసం తాను పెళ్ళి చేసుకోననే భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు గనక దేవవ్రతుడు ఆ తరవాతనుంచి భీష్ముడయ్యాడు.
ఒక్క కొడుకు కొడుకుగాడన్న నానుడి ఎక్కడా అని కదా సందేహం. భీష్ముడు తండ్రి నిరాసక్తతకు కారణం అడిగినపుడు చెప్పిన మాటేంటీ? ఒక్క కొడుకు కొడుకుకాదు అందుకు నీకు తమ్ముళ్ళని కనాలని ఉందని చెప్పేడు చూశారా? అది కాలక్రమేణా ఒక్కకొడుకుగాదు,గానూ, ఒకటే కన్నుంటే, ఏ ప్రమాదంలోనైనా అదిపోతే పూర్తిగుడ్డివారవుతారు కదా! అందుకు ఈ రెండిటిని కలిపి ఇలా చెప్పేరనమాట.ఒకకన్ను కన్నుగాదనే నానుడిగా……..ప్రజలలో ఉండిపోయింది.