శర్మ కాలక్షేపంకబుర్లు- బెల్లపు ఆవకాయ!

బెల్లపు ఆవకాయ!

బెల్లము+ఆవకాయ అనాలా?
బెల్లపు+ఆవకాయ అనాలా?

సరే
ఏదోలా అన్నామే సరి చూడండి, సంధి చేస్తే ఏమనాలి?
బెల్లపావకాయ సవర్ణదీర్ఘ సంధియా?
బెల్లపుటావకాయ అనాలా? టుకారసంధియా?

సరే
ఇదేం సమాసం. సమాసం తెలియాలంటే విగ్రహవాక్యం చెప్పుకోవాలట కదూ? 

బెల్లంతో ఆవకాయ తోన్,తోడన్ తృతీయా విభక్తియా?
బెల్లం కలిసిన ఆవకాయా? అందు,న సప్తమీ విభక్తియా?

ఐతే సమాసం విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసమా?అమ్మో! అమ్మో!! నాకూ తెనుగొచ్చేస్తోందండోయ్!

మిత్రులొకరు వాటస్ ఆప్ లో ఇది

పుంప్వాదేశ సంధి అని
విగ్రహ వాక్యం బెల్లం యొక్క ఆవకాయ కనక
షష్టీ తత్పురుష సమాసమని చెప్పేరు.
ధన్యవాదాలు.

ఎందుకింత గందరగోళం, తెల్లోడు చూడండి ఎంగిలిపీస్ లో జాగరీ పికిల్ అనేసేడు, చక్కహా లేదూ

ఏంటో గందరగోళం. తెనుగులో బెల్లపావకాయ, పుల్ల పుల్లగా, కారం కారంగా, తియ్య తియ్యగా ఉండేది తినడానికి ఇన్ని తెలిసుండాలా? ఇవేవీ తెలియకపోతే బెల్లపావకాయ ముద్ద గొంతు దిగనంటుందా?

ఏంటీ? ఆవకాయలో బెల్లమా? మతుండే మాటాడుతున్నారా?

అవును బాబూ! అవును!!

ఆవకాయలో బెల్లం వేస్తారు! దాన్ని బెల్లపు ఆవకాయంటారు, మహా ప్రీతిగా తింటారు. అదెలాగో చూదాం, రుచిగానూ ఉంటుంది .

పుల్లటి మామిడి కాయలు తీసుకోవాలి. బెల్లపు ఆవకాయకి పుల్లటి కాయలెందుకని కదా అనుమానం! పుల్లటికాయలైతేనే రుచిమరి. ఆ తరవాత మీ ఇష్టం. కారం,ఆవ సరి సమానంగా తీసుకోండి. ఆవ తయారు చేసుకునేటపుడు, ఆవాలకి కొద్దిగా మజ్జిగ రాయండి. ఆరనివ్వండి, మిక్సీలో వేయండి. వెంఠనే కొద్దిగా పసుపేసి,ఉప్పేసి కలిపెయ్యండి.పిండి ఐన వెంటనే పొట్టు చెరిగెయ్యండి, ఇలా తొందర తొందరగా చేస్తే ఆవ కనరెక్కదు, లేకపోతే కనరెక్కిపోయి ఆవకాయ బాగోదు. ఇప్పుడు ఆవ,కారమూ గుచ్చెత్తండి, వెంఠనే కాయ దొరక్క పెట్టుకోలేకపోతే! ఉప్పు మాత్రం కలపకండి. ఉప్పు ఎప్పుడూ ఆవకాయ గుచ్చెత్తేటపుడు మాత్రమే కలుపుకోవాలి.ఉప్పు కారం,ఆవ అన్నీ సమాన పాళ్ళు ఉండాలి.

మామిడి కాయలు ముక్కలుగా తరగండి, పెచ్చుని డొక్క ఉండాలి. కారము,ఆవ కలిపిన గుండను వెడల్పైన పళ్ళెం లోకి తీసుకోండి. ఇప్పుడు ఉప్పు కలపండి, ఆపై ముక్కలేయండి, నూని వేయండి, ముక్కల్ని గుండలో పొలపండి, ఆవకాయని తడిలేని జాడీలో పెట్టండి, పైన కొద్దిగా నూని వేయండి, మూత గట్టిగా పెట్టి నిలవుంచండి.

ఇదేంటీ బెల్లపావకాయ చెబుతానని…..

అలా పెట్టిన ఆవకాయని మూడురోజుల తరవాత తీయండి, ఊటవచ్చి ఆవకాయ జారుగా అవుతుంది, ఇందులో మెంతులేయండి, పచ్చివే. ఆపైన నూనెపోయండి. కలపండి పైనా కిందా! వేరే బేసిన్ లోకి తీసుకునీ కలపచ్చు. దీనిని జాగ్రత్త పెట్టండి. తగినంత బెల్లం తీసుకోండి, పాకం పట్టండి, మరీ లేతపాకం బాగోదు, నిలవుండదు, మరీ ముదురు పాకం కాక తీగ పాకం వచ్చేదాకా మరిగించండి. కొద్ది చలారనివ్వండి. అప్పుడు జాడీలో ఊరగాయను ఒక బేసిన్ లో తీసుకుని అందులో ఈ బెల్లం పాకం పోసి కలపండి, ఒక్క రోజు నిలవుంచండి. మర్నాడు పెచ్చులతో సహా ఎండలో పెట్టండి. గట్టి ఎండ తగిలిన తరవాత, మర్నాడు పెచ్చులని ఉన్న పిండి ఊడ్చెయ్యండి, పెచ్చులు పిండి విడి విడిగా ఎండలో పెట్టండి, రెండు గట్టి ఎండలు తగిలిన తరవాత పెచ్చులు పిండి కలిపేయండి. బెల్లపు ఆవకాయ రెడీ. నీరు తగలనివ్వక జాడీలో నిలవ చేయండి. బెల్లపు ఆవకాయ రెడీ!

ఆవకాయ పుల్లపుల్లగా,తియ్యతియ్యగా,కారంకారంగా బలే ఉంటుంది.

47 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- బెల్లపు ఆవకాయ!

 1. నాకేదో భయమేస్తోం
  దోకేనా హితులు స్వీటు ? ఒక్కటి కూడా
  గీకిన చాయలు లేవే
  ప్రాకటములు గావు కందపద్యపు జాడల్ .

  • అనామకం on 08:57 వద్ద నవంబర్ 20, 2019

   భయం నాస్తి భయం నాస్తి
   మీస్వీటూ కేంగాదు నిక్కము వినుడీ
   జిలేబీ గీకినకందాల్ కనబడలేదా
   బ్లాగులనిండనవియేగాదా!

   ఓం శ్రీ భవానీయైనమః

   • ఎట్టెట్టా మీరే మన
    నట్టట్టేను! తలయూపి నమ్మకమునకున్
    పెట్టని కోటయగుచు ఊ
    కొట్టెడు కవి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్ 🙂

   • జిలేబి బామ్మగారూ!

    కొట్టేడు కవి సుజనుడనుచు కోమలి పలికెన్ ????
    అర్ధం కాలా 🙂

    శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయైనమః

   • రాజారావుగారు,

    ఇంద్రముఖియో చంద్రముఖియొ
    గిరగిరా గీకుటమొదలాయె
    కాదనగలవారెవ్వరు?
    అన్ననూ వినువారెవ్వరు సార్ 🙂

    శ్రీ స్వాధీనవల్లభాయైనమః

 2. మూడు నాలుగు రోజుల నుండీ “జిలేబి” గారు లాపతా. కారణమేమయ్యుంటుందంటారు శర్మ గారూ?

  • విన్నకోటవారు,

   పేలాల అమ్మవారు పూనితే వందఒకటి కంద పద్యాలు చెప్పేరుకదా ఇరవైనాలుగ్గంటలలో, తిండీ నీళ్ళూ,నిద్రా మానేసి. అప్పుడే నీరసమూ వచ్చింది, వద్దూ అన్నా వింటేనా తిక్కమేళం. ఆ తర్వాత పాలూ మిరియాలూ బెల్లంతో తాగమన్నా, మాలోకం, జూస్ కావాలంటే ఏమిచ్చారు శాకరిన్ రంగునీళ్ళు, నీరసమొచ్చి పలుకు లేదు. అలవాటు పడ్డ ప్రాణం కదా నిన్న అజ్ఞాతగా ఒక పద్యం చెప్పి పడుకున్నారు. పొద్దుటస్ లేచినట్టు లేదు, ఇహనో ఇప్పుడో కబురు రావాలి.

   ఓం శ్రీ మాత్రేనమః

   • హ్హ హ్హ హ్హ, శర్మ గారూ. “జిలేబి” గారిది కాస్త పెంకెతనం అని తెలుస్తూనే ఉంటుంది బ్లాగుల్లో.

    అవునూ, ఇంటి వైద్యం గురించి మీకు తెలిసినంత నాకు తెలియదు గానీ పాలూ మిరియాలూ గళసౌలభ్యం కోసం కదా, నీరసం తగ్గడానికి ఆ మిశ్రమాన్ని పుచ్చుకోమని అంటున్నారే మీరు?

    తిండీ తిప్పలు మానేసి శతకం వ్రాసేసుంటారు “జిలేబి” గారు, దాంతో నీరసం కమ్ముకొచ్చుంటుంది. ఓ పసందైన స్వీటు నోట్లో వేసుకుని మాంఛి మసాలాదోశ తింటే సరి, ఝాంమని లేచి పరుగెడతారు 😃.

   • విన్నకోటవారు,
    స్వీటుగారి మాట, దానిని తిక్క అనియే అందురు. 🙂

    సందర్భం: ఇరవైనాలుగు గంటలు మాడిన కడుపు, ఘన పదార్ధం ఆహారంగా ఇవ్వడం మంచిది కాదంటారు. వెంఠనే శక్తి చేరాలంటే పాలు సమీకృత ఆహారం, బెల్లం ఇనుము చేర్చుతాయి, నీరసం తగ్గుతుంది. ఇక మిరియం, సమతుల్యం చెడిన ఆరోగ్యాన్ని సమతుల్యతకు తేవడానికి అవసరం. ఇది గాత్ర సౌలభ్యానికే కాదు 🙂

    మీరన్నట్టు శాకరిన్ జూస్ నీళ్ళు తాగి నీరసం తెచ్చుకున్నట్టే వుంది. రేపటికి మళ్ళీ కనపడతారని ఆశ. 🙂

    ఓం శ్రీ లలితాయైనమః

   • జిలేబి బామ్మగారూ!

    హ హ హ

    శ్రీసుమేరు మధ్య శృంగస్థాయైనమః
    దీనికి మరో పాఠం కూడా ఉందిలా
    శ్రీ సుమేరుశృంగమధ్యస్థాయైనమః

  • రాజారావు గారు,

   స్వీటు చెహరా అలాగే ఉందండీ. చిదంబర రహస్యం విడిపోలేదు.
   గాలికిపోయేవైనా నూరు కంద పద్యాలు ఏకబిగిని చెప్పడం…గొప్పే కదండీ. ఇరవైనాలుగ్గంటలు కూడూ నీళ్ళూ తీసుకోక ఏకబిగిని పద్యాలు చెప్పే తిక్క ఎవరికుంటుందంటారు, మనకి కాక 🙂

   ఇరవైనాలుగు గంటలుగా కనపడలేదు, ఎలా ఉందో ఆరోగ్యం తెలీదండి.

   ఓం శ్రీ విద్యాయైనమః

 3. “సామాన్యులకి వ్యాకరణ శృంఖలాలుండవు, వారు చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడానికి అవసరమైనదే భాష. ఈ వ్యాకరణం తెలిసి ఉండక్కర లేదు/ అక్కర లేదు కూడా.వారు భాషకి సర్వాధికారులు, నియంతలు”

  భాష స్వభావాన్ని, అలాగే దాని ప్రభావాన్ని క్లుప్తంగా తెలియచెప్పడం అమోఘం. Excellent summation!

  పండితులు భాషను పుట్టించలేరు, వారి పరిధి కేవలం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం మట్టుకే. పండితులు భాష అనే మహోన్నత విషయాన్ని శాసించాలనుకోవడం దేవుడు తనను కొలవాలని పూజారి అన్నట్టే.

 4. శర్మ గారు,
  అమలాపురంలో మా తెలుగు మాస్టారు శ్రీ కొంపెల్ల భాస్కర శాస్త్రి గారు. బహు సరదాగా పాఠాలు చెప్పేవారు. ఆ తరం టీచర్ల పద్ధతే వేరండి 🙏.

  • విన్నకోటవారు,

   నాటి కాలంలో పిల్లలమీద అభిమానం హెచ్చుగా ఉండేదనుకుంటానండి. గట్టిగా ఓ దెబ్బ వేసినా పిల్లలూ బాధ పడేవారంకాదు,పిల్లలికి అర్ధమైనదో లేదోనని రకరకాల ప్రయోగాలు చేసేవారనుకుంటా. మరినేడలా కాదుగా!

   థర్డ్ ఫారంలో ఉండగా తణుకులో ఉన్న సుగర్ ఫేకటరీని చూపించడానికి తీసుకెళ్ళేరు మా డ్రిల్ మాస్టారు శ్రీ వర్రే అప్పలరాజు గారు. ఎవడో గొడవ చేసేడు. నేను దొరికిపోయాను. బేటన్ తో కాలి మీద కొట్టేరు. అది కాస్తా కాలి మోకాలి కీలు వెనక తగిలింది. క్షణాల్లో వాచి పోయింది. పాపం ఆయన అవస్థ ఏం చెప్పను? కాలు కింద పెట్టలేకపోయాను, వాచిపోయింది. దాంతో ఆ రోజంతా నన్ను ఎత్తుకు తిప్పేరు, మందేసి.పెద్ద దెబ్బ కొట్టేసేనురా అని ఎంత బాధ పడిపోయారో ఆయన. అదీ అభిమానం కాదంటారా?

   ఓం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిన్యై నమః

  • YVR, గారు,

   ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధి నిత్యము అన్నారు తెనుగు మాస్టారు క్లాసులో. ఉత్తేంటో తెలియలేదు అచ్చేంటో తెలియలేదు, వెఱ్ఱిమొహంతో నిలబడ్డా! ఏరా అర్ధమయిందా అడిగారు, లేదని తలూపా! దగ్గరికిరా అని చెంపమీద ఒక్కటుచ్చుకున్నారు. కంటి వెంట నీళ్ళొచ్చాయి. ఇప్పుడు చెప్పు అన్నారు. అర్ధమయిందండి, చెంప ఉత్తు, పరంకావడం చెంపకి తగిలిన దెబ్బ. కంటిని కలిగిన నీరు సంధి జరిగిన తరవాత నిత్యంగా కలిగేదీ అన్నా! ఫో! ఇంక నీకు తిరుగులేదు. తెలుగు గ్రామర్ వచ్చి తీరుతుందన్నారండి.

   ఇప్పుడు చెప్పండి బెల్లపావకాయ ని సంధి విగ్రహవాక్యం చెబుతానంటే ఎవరు వింటారు సార్, దాన్ని ఆవకాయతో కలిపి ఊరేసి, జిలేబీ గారు ఉరేస్తే, ఊరిస్తే సైన్స్ బయట పడింది. ఆయ్! అదండి సంగతి. మీకు నచ్చినందుకు

   ఓం సర్వజ్ఞాయైనమః

   • చిన్నతనంలో మాకూ చెప్పారండి …. చెంపకు చేయి ఆదేశంబైనపుడు కంటికి నీరు పరంబగును …. అని😃😃.

   • హేవిటో ఈ చాందస్తుల మాటలు హచ్చులు హల్లులు‌ వత్తులు ఒత్తులు కత్తులు, సంధులు సమాసాలు సమోసాలు, యడాగమాల నుగాగ మాలు, అర సున్నలు, రలు,బండి రలు, విభక్తులు ప్రత్యయాలు,

    అబ్బబ్బ ! తెలుగంటేనే వెయ్యామడ దూరం పారి పోయేట్లా చేసేస్తుండ్రి .

   • విన్నకోటవారు,

    మా తెనుగు మాస్టారు శ్రీ శింఘావఝుల సోమయాజులు గారు సరదా సరదాగా వ్యాకరణం నేర్పేసేరు. ఇక భాష ప్రయోగాలు,పలుకుబడి పల్లెటూరి స్త్రీలను విని నేర్చుకున్నదే. ఈ మాట నా అభిమాన రచయిత శ్రీపాదవారి మాట, నాది కూడా! ఇక అమ్మలిద్దరు ఏం చెప్పేది? కన్నమ్మ మాటాడితే ఒక వాక్యంలో మూడు సామెతలు చెప్పేది.ఆ సామెతఎలా పుట్టిందో కత చెప్పేది, అది వరద గోదారి, తాగిన వారికి తాగినంత.అమ్మతో మాటాడితేనే తెనుగు క్లాసు. ఇలా మాటాడకూడదు, ఇలా పలకాలి, ఇక్కడ దీర్ఘం తియ్యాలి, ఇక్కడ ఒత్తి పలకాలి, అదీ వైభవం. ఇక పెంచుకున్నమ్మ శాంత గోదావరి అబ్బో! అనుభవించా భాషా వైభవం. అమ్మ ఏం చదువుకుంది? తెనుగు రాయగలదు అంతే. మాటాడితే ఎన్నెన్ని ప్రయోగాలో, ఎన్నెన్ని సామెతలో. చిన్నప్పటి నుంచి మాటాడిన దానిలో తప్పు, పొరబాటు ఉంటే, పెద్దలు ఎవరైనా సరిదిద్దేవారు. భాష అలా సామాన్యుల నాలుకలపై నాట్యమాడితే నేర్చుకున్నా. ఎక్కువ చెప్పేనా? మన్నించండి.

    ఓం తాటంక యుగళీభూత తపనోడుప మండలాయై నమః
    (తపన+ఉడుప= తపనోడుప మండల సూర్య చంద్రులు)

   • జిలేబి బామ్మగారూ

    సామాన్యుల నాలుకలపై నాట్యమాడిన తెనుగుకు వ్యాకరణం అనేదానిని తయారు చేసినవారు పండితులు. అచ్చులు,హల్లులు,పొల్లులు,దృతం. అరసున్నలు,సంధులు,సమాసాలు …ఇవన్నీ మాటాడే సామాన్యులకు తెలుసా? తెలియదు, అవసరం లేదు కూడా! భాష ఎప్పుడూ సజీవం, ఎన్ని పరభాషా పదాలొచ్చినా అవసరమైనవే ఉంటాయి, మిగిలినపొల్లు గాలికి క్రమంగా ఎగిరి.పోతుంది ఒక పరభాషా పదం మన భాషలో నిలబడాలంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు. నేడు జరుగుతున్నది ఒక పొంగు, ఒక జ్వరం, ముమ్మరం మూడు రోజులనేది ఇల్లాలు.

    భాషా ప్రయోగాలెప్పుడూ సామాన్యులనుండే మొదలవుతాయి. అవి కూడా కాలంతో నిలదొక్కుకోడమూ కష్టమే. ఒక మాట చెబుతా. శ్రీపాదవారు వరంగల్ వెళ్ళేరట. స్టేషన్ లో రిక్షా అతనిని ఎక్కడికో తీసుకెళడానికి ఏమివ్వమంటావంటే ”ముబ్బేడ” ఇమ్మన్నాడట. ఆ భాషా ప్రయోగానికి ఆయన ఆనంద పులకితులై తన అనుభవాలూ-జ్ఞాపకాలున్నూ లో ప్రత్యేకం చెప్పేరు కూడా. ఒక సామాన్య రిక్షా అతను చేసిన భాషా ప్రయోగం ఎంత అందంగా ఉంది? భాషకి ఏదో ఐపోతోందని గగ్గోలు పెట్టడం అనవసరమని నా ఆలోచన. ఏం కాదు, ఎవరూ భాషను పాడు చేయలేరు.

    మరొక్క మాట, సామాన్యులకి వ్యాకరణ శృంఖలాలుండవు, వారు చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడానికి అవసరమైనదే భాష. ఈ వ్యాకరణం తెలిసి ఉండక్కర లేదు/ అక్కర లేదు కూడా.వారు భాషకి సర్వాధికారులు, నియంతలు. భాషని నేర్చుకోవలసిన వారు తప్పక వ్యాకరణం నేర్చుకోవాలి. ఈ వ్యాకరణాన్ని సామాన్యుల భాషకి శృంఖలాలుగా చేయద్దు, వారి నెత్తిన రుద్దద్దు.

    చాలా మాటాడేసేను. పొరబాట్లు మన్నించండి.

    శ్రీ రసజ్ఞాయైనమః

   • ఓ యబ్బో!

    ఏదీ అమ్మలతో నేర్చిన సామెత కతల్ని రోజు కొక్కటో రెండో రాయ రాదూ ?

    అబ్బబ్బా హేవిటో పెద్దాయన గొప్పలు పోవడం తప్పించిన్ను ….

   • జిలేబి పాటీ,

    కోయిల కూయాలంటే ఆమని రావాలి,మామిడి పూయాలి 🙂
    ఇప్పటికే చాలా కతలు చెప్పేను. అవసరాన్ని బట్టి సామెత ఉరుకుతుంది, ఉరికితే ఆపలేం 🙂 ”కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆపలేం”
    గొప్ప చెప్పుకోవలసిన అవసరం లేదు 🙂

    ఓం వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయైనమః

 5. ఏమి కష్టమైన పని రా బాబూ 🙂
  ప్రియా పచ్చళ్ళలో వుంటే చెప్పండి
  వెంఠనే కొనేస్కుని నోట్లో వేసేస్కొంఠాం 🙂

  హేవిటో ఈ చాదస్తపు వంటకాల్ గొడవల్స్ అదిన్నూ తాతల్స్ నుంచి .

  చంద్రయాన్ పోదామని ఆండోళ్ళు మంగళ్యాన్ అంఠోంఠే మరీ రాజారామ్ ముందటి కాలానికి లాక్కు పోతారేమిటి ఈ ఆసామి ?

  జిలేబి

  • చంద్రయాన్, మంగళ్యాన్ కు వెళ్ళే ఆడవాళ్ళు మాత్రం లొట్టలేసుకుంటూ ఊరగాయలు తినరా ఏమిటి, “జిలేబి” గారూ?

   అయినా మీరెందుకు ఆపసోపాలు పడుతున్నారు? వంటింటి పనంతా మీరు మీ వారికి అంటగట్టేశారట గదా? ఇకనేం?

   వంటకాల గురించి చెప్పగలిగే / చెప్పే
   “తాతల్స్” చెప్పినప్పుడే విని నేర్చుకుంటే మంచిది. రాబోవు కాలంలో చెప్పగలిగేవారు కూడా ఉండకపోవచ్చు.

   • విన్నకోటవారు,
    భూమి గుండ్రముగా ఉన్నది. మళ్ళీ కనిపెట్ట బడుతుందండీ 🙂

    బెల్లపావకాయ మంచిదని మళ్ళీ కనిపెట్టబడుతుందండి.

    ఓం!చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచాయైనమః

   • జిలేబి గారు

    నమః పార్వతీ పతే హరహర మహాదేవ

    ఓం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతాయైనమః

   • మిత్రులు రాజారావుగారు,

    పాతంతా రోతకాదు, కొత్తంతా వింతాకాదు. పతలో మంచి వాటిని తెలిసి ఎంచుకోవడంలోనే మన విజ్ఞత బయటపడుతుంది కదా!

    పెట్టుకోడానికి పెద్ద కష్టమేమో! 🙂

    ఓం. శ్రీ మహారాజ్ఞీయైనమః

  • జిలేబీ బామ్మగారూ!
   భారతీయ స్త్రీలు,పిల్లలు ఎక్కువ మంది రక్త హీనతతో బాధపడుతున్నవారే!
   బెల్లపావకాయలో బెల్లంలో ఉన్నది ఇనుము, నువ్వుల నూనెలో ఉన్నదీ ఇనుము,కాల్షియం. ఇక మామిడి ఊట జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలి పుట్టిస్తుది.పుల్ల పుల్లగా కారం కారంగా తియ్యతియ్యగా మంచి మందు, బెల్లపావకాయ కావాలా? 🙂

   చంద్రయాన్ ఐనా మంగళయాన్ వారైనా తినేది బువ్వే. లక్షాధికారయిన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడు. బెల్లపావకాయ తినడమే పురోగమనం, తినకపోవడం తిరోగమనం. తమకేది కావాలో ఎంచుకోరాదూ!

   నిన్న పేలాలమ్మవారు దిగిపోయేప్పుడు పాలలో మిరియాలు,బెల్లం వేసివ్వండీ అన్నా! తమరు జూస్ కావాలన్నారు. ఏమిచ్చారో తెలుసా! 🙂 శాకరిన్ వేసిన రంగునీళ్ళు. పాలు,బెల్లం మిర్యాలేసిస్తే ఏమయ్యేది, తమరే చెప్పండి 🙂

   శ్రీ మాత్రేనమః

   • జిలేబి గారు

    మరో చిన్నమాట చెప్పడం మరచా! వెల్లుల్లి మంచి ఏంటీ బయోటిక్ కదా!

    నమశ్శంభవేచ మయోభవేచ నమః శ్శంకరాయచ మయస్కరాయచ, నమః శ్శివాయచ శివ తరాయచ.

    శ్రీమాత్రేనమః

  • రాజారావుగారు,

   పేరే కాదండి
   బెల్లం కలిసిన ఆవకాయ. పుల్లపుల్లగా,కారంకారంగా, తియ్యతియ్యగా. దేశవాళీ, అసలు సిసలు కోనసీమ తయారీ అండీ. బలే బాగుంటుందండి. ఇందులో వెల్లుల్లి కూడా వేస్తారండి.
   నల్లబెల్లమైతే నిలవుండదని భయం.
   ధన్యవాదాలు.

 6. మిత్రులొకరు వాటస్ ఆప్ లో ఇది

  పుంప్వాదేశ సంధి అని
  విగ్రహ వాక్యం బెల్లం యొక్క ఆవకాయ కనక
  షష్టీ తత్పురుష సమాసమని చెప్పేరు.
  ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s