నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతువది మేలు తత్క్రతుశతంబుకంటె సుతుండు మేలు త
త్సుతశతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు చూడగన్.
శ్రీమదాంధ్ర మహాభారతము. అరణ్యపర్వం.ఆశ్వాసం-౪-౯౩
నిజంమాటాడటమే వ్రతంగా కలవాడా! వంద మంచినీళ్ళ నూతులకంటే ఒక బావి మేలు. అటువంటి వంద బావులకంటే ఒక మంచి క్రతువు మేలు. అటువంటి వంద క్రతువులకంటే ఒక కొడుకు మేలు. అటువంటి వంద మంది కొడుకులకంటే ఒక్క నిజమైన మాట మేలు.
ఇది భారతంలోని పద్యం.
మన పెద్ద పెద్దమామ్మ చెప్పిందీ మాట ఎవరితో? పెద్ద పెద్దతాతతో ఏం సందర్భం? మన పెద్దమామ్మ శకుంతల పెంచిన తండ్రి కణ్వునకు చెప్పకుండా, తండ్రి ఆశ్రమంలో లేనప్పుడు వచ్చిన రాజు దుష్యంతుని గాంధర్వ వివాహం చేసుకుంది. పెళ్ళి చేసుకుని, ఆమె గర్భవతి కాగానే నేను రాజ్యానికి వెళ్ళి నిన్ను రాజ్యానికి తీసుకెళ్ళడానికి మనుషుల్ని పంపిస్తానూ అని వాగ్దానం చేసి వెళిపోయాడు. నమ్మేసింది. ఆయనేమో వెళిపోయాడు. తండ్రి వచ్చాకా విషయం తెలుసుకున్నాడు, గొడవ చెయ్యలేదు, చూదామని కూతుర్ని ఆశీర్వదించి ఊరుకున్నాడు. శకుంతలకి కొడుకు పుట్టేడు. ఆ కుఱ్ఱాడికి భరతుడు అని పేరు పెట్టేరు, మరీ కుఱ్ఱాడికి ఆ ఆశ్రమం చుట్టు పక్కల ఋషులు సర్వదమనుడు అని బిరుదిచ్చేసేరు, సింహాలు,పులలను తీసుకొచ్చి వాటిని ఆశ్రమం చుట్టూ ఉన్న చెట్లకి కట్టేసేవాడట. కాలం గడుస్తోంది. దుష్యంతుని నుంచి కబురు లేదు. తనే బయలు దేరింది, ఈ సారి తండ్రితో చెప్పి. తండ్రి శిష్యులను తోడిచ్చి పంపేడు. రాజ సభకి వచ్చింది. ఇడుగో వీడు నీకొడుకు అని పరిచయం చేసింది,సభలో. దుష్యంతుడు కంగుతిన్నాడు. దారేపోయేవాడెవడినో తీసుకొచ్చి వీడు నీ కొడుకంటావా? అసలు నువ్వెవరో నాకు తెలీదు, చాలు చాలు ఇటువంటి మాటలు కట్టిపెట్టు అన్నాడు. రాజు అబద్ధం ఆడుతున్నట్లు తెలిసిపోయింది శకుంతలకు. అప్పుడు అన్నమాటిది. దీని అంతరార్ధం ఏంటీ?
వందమంచినీళ్ళ నూతులు కంటె ఒక బావి మేలు, వందబావులకంటే ఒక క్రతువు మేలు. వంద క్రతువులకంటే ఒక మంచి కొడుకు, వంద మంది మంచి కొడుకులకంటే ఒక నిజమైన మాట మేలు. ఒకదానికంటే ఒకటి నూరు రెట్లు మేలు అని లెక్కలు చెప్పింది.
అదెంత?
(ఇక్కడో మాట అసందర్భమే! నుయ్యి అంటే కొద్దిలోతుండేది,కొద్దిమందికే నీరిచ్చేది. బావి అంటే చాలా లోతైనదీ తోడిన కొద్దీ నీరిచ్చేది, వ్యవసాయానికీ నీటి వసతి. ఇదీ నూతికి బావికి తేడా.)
వంద నూతులు= ఒక బావి 10 square
వందబావులు =ఒక క్రతువు 10 square
వంద క్రతువులు= ఒక కొడుకు 10 square
వంద మంది కొడుకులు = ఒక నిజమైన మాట 10 square
Total 10 square X 10 square X 10 square X 10 square = 10 to the power 8
అనగా
10,00,00,000
పది కోటి రెట్లు మేలని చెప్పడానికి ఇంత చెప్పింది చూడండి.
అదీ ఎవరితో చెప్పిందీ నువ్వెవరో నాకు తెలీదు పొమ్మన్న మొగుడుతో. అబద్ధమనే సముద్రంలో ములిగిపోయిన తాతతో
Great మామ్మా you are great.
బొమ్మకి టపాకి లింకేంటీ? వస్తున్నా! బొమ్మలోదేంటో తెలుసా దాన్ని గేలం అంటేరు. అదే ఏంకర్. నూతుల్లోంచి బావుల్లోంచి నీరు తోడుకునేందుకు బొక్కెనలు వాడేవారు. వీటిని చేదలు అని కూడా అనేవారు.
ఇవి తాటాకుతో తయారు చేయబడేవి, కాలంలో ఇనుప బొక్కెనలొచ్చాయి. అవి నూతిలో పడిపోతే వెతికి తీసుకునే సాధనమే ఈ గేలం. అబద్ధమనే సముద్రంలో ములిగిపోయిన తాతని నిజమనే గేలం వేసి పట్టుకుంది మన మామ్మ.
అంతా జిలేబి మయము మాయగా వుందే 🙂
జిలేబి
చిన్న అశ్రద్ధ! ”నుతజలపూరితంబులగు” పద్యం నెట్ నుంచి తీసుకున్నా! అందరికి తెలిసినదేకదా అని. చాలా పొరబాట్లే ఉన్నాయి చిన్నచిన్నవే ఐనా. తప్పు తప్పేకదా! మిత్రులొకరు సరి చేశారు. ఈ సారి మహాభారతం పుస్తకం నుంచి చూచి సరి చేశాను.
మిత్రులకు ధన్యవాదాలు.
అంతా రాసే సి అనే సి చిన్న అశ్రద్ధ అంటారేమండి ? వెంటనే పబ్లిక్ గా క్షమార్పణ అడగండి . ఆయ్.
ఎంతమాటెంతమాట! అటులటులే జిలేబీ
వందనాలు