శర్మ కాలక్షేపంకబుర్లు-పాత కాలపు ఉపకరణాలు.

చాలా మందికి, అనగా నేటి వారికి ఇదేంటో తెలియదనే చెప్పాలి. అదేంటో చెప్పుకోండి చూద్దాం.

తిరగలి, దీనిని పిండి చేసుకోడానికి, నూక విసరడానికి, పప్పులు చేసుకోడానికి వాడేవారు, ఇప్పుడు మిక్సీ లాటిది.తిరగలితో విసరడం కబుర్లు చెప్పినంత తేలికకాదు.గింజలు పోసి కొద్దిగా పై రాయి ఎత్తి నెమ్మదిగా విసరాలి. గబ గబా విసిరితే పప్పు నూకయి ఊరుకుంటుంది. చిన్నప్పుడు అమ్మ దగ్గర విసరడం నేర్చుకున్నాఅ. ఇప్పుడు ఇల్లాలు  దగ్గరకి రానీయటం లేదు, విసరడానికి 🙂

పార, ఇది ఒక వ్యవసాయ పని ముట్టు. దీని వాడకం కూడా తగ్గిపోతూంది, పల్లెలలో కూడా.దీనితో చేసేపని ఇప్పుడు పెద్ద యంత్రాలు చేస్తున్నాయిప్పుడు, పల్లెలలో.పారతో పని చెయ్యాలంటే నడ్డి వంచి పని చెయ్యాలి అబ్బో! చాలా కష్టమండి బాబూ! దీనితో ఇప్పటికి అప్పుడప్పుడు చేస్తుంటా.

మిక్సర్ గ్రైండర్ లో ఒక భాగం. ఇది రుబ్బు రోలు ,  పైది   పొత్రం, పొడుగుగా ఉన్నదానిని పచ్చడి బండ అంటారు. రోలు, పొత్రం రాతివి, బండ మాత్రం కర్రది.కుంపటి మీద కాగిన చారు లాగా, పచ్చడి బండతో చేసిన పచ్చడి రుచే వేరు. పొత్రంతో రుబ్బిన మినప పిండితో గారెలేసుకుంటే నా రాజా! భారతం విన్నంత హాయిగానూ ఉంటుంది.

వీటిని గునపం లేదా గడ్డపార అంటారు, వివిధ సైజులలో, అవసరాన్ని బట్టి ఉపయోగిస్తారు.తవ్వడానికి ఉపయోగించే సాధనం.చిన్న గునపాలతో భయం లేదు కాని పెద్ద గునపంతో పని చేసేటపుడు సరిగా చేయకపోతే కాలు మీద పడితే హాస్పిటల్ చుట్టూ తిరగాలి బాబూ!

ఇది కత్తి పీట. పల్లెలలో వాడుతున్నారింకా. ఇందులోనే మర కత్తిపీట అని ఉంటుంది. మామిడి కాయలు ముక్కలుగా తరగడానికి.కత్తి పీట కాదండి చంద్రహాసం. అంత పదునుగా ఉంటుంది. వేసవిలో అయితే చెప్పక్కరలేదు, రోజూ మామిడి కాయలు తరిగితే, ముట్టుకుంటే తెగిపోతుంది. దీని జోలికి మాత్రం పోను.

దీనిని తవ్వుగుల్ల అంటారు. తేలికపాటి తవ్వకానికి, మొక్కల దగ్గర వాడతారు.దీనితో తరచూ పని చేస్తుంటా.

పనస కాయని పొట్టు చేసుకోవాలంటే, ఈ కత్తి అవసరం. దీనిని పనసకాయ కత్తి అంటారు. దీని ఇనప భాగంలో చిల్లు వేసి దీనిని ఒక లివరుకి తగిలించి పీటకి అమరిస్తే అదే మరకత్తి పీట.ఈ కాలమంతా ఈ కత్తితోనే పని, పనసపొట్టుకోసం. రవ్వ పులుసుతో ఆవ పెట్టి పనసపొట్టు కూర వండుకుని నెయ్యి వేసుకుతింటే, చెంబులతో నీళ్ళు తాగలిసిందే.

దీనిని అట్ల పెనం లేదా తావా రేకు అంటారు. అట్లు పోసుకోడానికి బాగుంటుంది. నాన్ స్టిక్ పాన్ లాటిదనమాట.ఇది రోజూ అవసరమైనదే! పెసరట్లు బలే చక్కగా కాల్తాయి, దీని మీద.

పెద్ద కత్తి.రాయల సీమ కత్తి కాదులెండి.

కొడవలి. కత్తి కి కొడవలికి తేడా ఉంది. కత్తిని విసురుగా వేసి నరుకుతాం. కొడవలితో కోస్తాం.కొడవలికి లోపలి భాగంలో అంటే వంపు భాగంలో పళ్ళు ఉంటాయి. నేటి కాలపు హేక్ సా వంగి ఉంటుందనమాట.దీన్నీ బాగానే వాడతాం. అరటాకులు కొయ్యడం దగ్గరనుంచి రోజూ.

దీన్ని తొల్లిక అంటారు. కలుపుతీసేందుకు ఉపయోగిస్తారు. పిడిపోయిందిలెండి.కలుపు తీయడానికి వాడతాం కదా, ఎక్కువగా, అందుకు పిడిపోయింది, వేయించాలి.

స్నానానికి వేడి నీళ్ళు కాచుకునే పొయ్యి, పైన బిందె.    నీళ్ళు కాచుకోడానికి డేగిశా అని మరొక వెడల్పైన మూతి గల వస్తువు ఉంటుంది.శీతాకాలమంతా రోజూ ఉదయమే దీనితోనే పని.చలిలో వేడి నీళ్ళపొయ్యి దగ్గర కూచుని మంట పెడుతూ, చలి కాచుకుంటే బలే ఉంటుంది లెండి.     పాతకాలపు మనుషుల గీజర్.

వీటన్నిటిని నేటికీ వాడుతున్నాం.నీటిని నిల్వ చేయడానికి రాగి బిందె వాడతాం, అందులో నీరు తాగుతాం. రాగిచెంబులో నీరు మాత్రమే తాగుతా, ఎప్పుడూ.వీటిని చూసి మేము పాత రాతి యుగం మనుషులమనుకుంటున్నారా?..   🙂

28 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పాత కాలపు ఉపకరణాలు.

  1. ఒక్క నీళ్ళ కాగు త‌ప్ప మిగ‌తా వ‌న్నీ ఇప్ప‌టికీ ఒక్కో చోట క‌నిపిస్తున్నాయండీ… నా చిన్న నాటి గుడిసెబండి, పొలాలకు నీళ్ళు తోడే పెద్ద బ‌కెట్ (దీన్ని మోట అంటారేమో తెలియ‌దు). ధాన్యం పోసె గుమ్మి (పెద్ద బుట్ట‌లాటివి) క‌న‌బ‌డ‌డం లేదండీ… పార‌, గ‌డ్డ‌పార‌, పెనం ఇవి ఇంకా కొన్ని చోట్ల చూస్తేనే ఉన్నాను.

    • వనజా రెడ్డిగారు,
      గూడు బళ్ళు ఎక్కడా కనపడటం లేదు. మాదగ్గర రెండు మూడేళ్ళ కితందాకా ఉండేవి.
      పొలాలకి నీరుతోడే దాన్ని ఏతం అనిగాని మోట అనిగాని అనడం మామూలే, ఇప్పుడవి కనపడటమే లేదు.
      ధాన్యం పోసే పెద్ద తడకబుట్టని పొణక, గాదె,గాది మాటలతో వ్యవహరించేవారు. ఇప్పుడు పల్లెలలో కూడా ఇవి కనపట్టం లేదు.
      పార,గడ్డపార, పెనం మరి కొన్ని వస్తువులనూ మేము ఇప్పటికి వాడుతున్నాం, నీళ్ళపొయ్యితో సహా.
      ధన్యవాదాలు.

  2. తాత మా తరము లో మేము ఇవన్నీ చూసాము కానీ మా తాతల కాలము లో ఉపయోగించి న వస్తువులు గురించి తెలిపే ప్రయత్నము చేయగలరు.

    ధన్యవాదాలు ! ! !

    • ప్రశాంత్ రెడ్డిగారు,
      ఈ వస్తువులే తాతలకాలం నుంచి వాడుతున్నారు. ఇప్పటి తరం వారిలో చాలామందికి వీటి గురించి తెలియదు.
      ధన్యవాదాలు.

  3. చాలా నచ్చేసింది మీ టపా తాత గారు. ఇవి అన్నీ చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ ఇంట్లో వుండేవి. ఇన్నాళ్ళకు మళ్ళీ మీరు చూపించారు. తిరగలి విసరటం, రోట్లో పిండి రుబ్బటం చాలా సరదాగా ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ కి నేను, చెల్లి హెల్పర్స్ పిండి రుబ్బేటప్పుడు పొత్రం పిడి ఊడి పోతూ ఉంటుంది మేము పచ్చడి బండతో పిడి పైన కొట్టే వాళ్ళం. ఆ రోజులు మళ్ళీ రావు.

    • @అమ్మాయి కల్యాణి,
      చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చి సంతోషంగా ఉందేం. ఆ రోజులు ఎందుకు రావమ్మా! ఇప్పటి మన పిల్లలలో మనల్ని చూసుకుంటే. పాత జ్ఞాపకాలలోకి జారుకుంటే 🙂
      ధన్యావాదాలు

  4. అమ్మ పొట్టు పొయ్యి మీద నీళ్ళు కచేవారు. పొయ్యిలో రోకలి పెట్టి పొట్టు కూరి గట్టిగా తట్టేక మెల్లగా రోకలి వెనక్కి లాగేస్తే మంట పెట్టడడానికి రంధ్రం తయారయ్యేది. చూడడానికి భలే సరదాగా ఉండేది. ఓపిగ్గా అన్నీ ఫోటోలు తీసి పెట్టారు. మా పిల్లలకు చూపించాలి.

    • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
      కుంపటి, పొట్టు పొయ్యీ ఉంది. మొన్న వీటి ఫోటో లు తీస్తూంటే మీ పిన్ని, “మీకేం చాదస్తమా! ఇవన్నీ ఎవరికి తెలియవు?” అంది. అందుకు మానేశా. మరో సారి, ఇంకా ఇటువంటివి ఉన్నాయిగా.
      ధన్యావాదాలు

  5. బొగ్గుల పొయ్యి ని మర్చిపోయారు.
    ఇవన్ని నేను వాడాను నా చేతులతో అది గర్వంగా చెప్పుకోదగ్గది. ఒకటి రెండు తప్ప.
    ఇప్పటకి వాడుతున్నాం రోలు, పొయ్యి పొత్రం , …

  6. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి , గుర్తుకొస్తున్నాయి!
    రాతి యుగం మనుష్యులు కాదండి , చేతి యుగం మనుష్యులు,
    ఇప్పుడు చేతులకు పనే లేకుండా యంత్రాలున్నాయి కదా !
    మొదటి ఫోటో, గంధపు పీటే నా ?

    • @మోహన్జీ,
      చిన్నతనం గుర్తుచేసుకోవడం అందరికి ఆనందమే.
      ఇహ ఫోటోలో వస్తువుగురించి, తెలియనివారికెలాగా తెలియదు, తెలిసినవారూ చెప్పలేదు 🙂
      మీరు కొంత దగ్గరగా ఉపయోగం చెప్పేరు. ఇది రాతితో చేసిన వస్తువు. రాయి రంగు ఎప్పుడూ బూడిద రంగులోనే ఉండే రాయి వాడతారు, ఈ రాతిలో, ఔషధ గుణాలుంటాయి . పాత కాలం లో అందరి ఇళ్ళలోనూ ఉండేది. గంధం, మందు కుప్పెలు అరగ దీసేవారు, దీని మీద. కింద పడేస్తే విరిగిపోతుంది. విరిగిపోయిన ముక్క కూడా ఉపయోగిస్తారు. దీని పేరు “సాన”
      మీరు చూసిన సానకి దగ్గరగా 250 సంవత్సరాల చరిత్ర ఉంది. మా తాతగారి తాత గారినుంచి వచ్చింది. నా దత్తత తండ్రిగారు తన తమ్ముడితో పంచుకున్నప్పుడు, ఇది వీరి వాటాకి వచ్చినట్లు కాగితాలలో చరిత్ర ఉంది. అది చూసి నవ్వుకున్నా, సాన పంచుకున్నది కూడా రాసుకోవాలా అని.
      ధన్యవాదాలు.

  7. మా సొంత ఇంట్లో వీటిలో కొన్ని ఉపయోగించే వాళ్ళము. ఇప్పుడు అంతా యంత్రం విద్యుత్తు

  8. చాలా రొజులవ్వింది ఇవన్నీ చూసి. మా కాకినాడ లొ ఇందులో ఒక రెండు తప్ప అన్నీ వాడేవే. నీళ్ళ పొయ్యి దగ్గిర కూర్చుని చలి కాగుతూ చిలకడ దుంపలు పొయ్యిలో కాల్చేవాళ్ళం. అమ్మ అందరి స్నానాలు అయ్యేక అప్పుడు నాకు తలంటి పొసేది. ఎందుకంటే పెద్ద డేగిసా వేడి నీళ్ళు పట్టే అంత పెద్ద జుట్టు నాది. మా మామ్మ గారు నాకు పెళ్ళిలో ఈ పెద్ద డేగిసా కూడా సారె ఇమ్మని మ అమ్మతొ హాస్యానికి చెప్పెవారు. మేము తప్ప ఇంకెవ్వరు వీటిని వాడరేమొ అనుకునెదాన్ని. పాత సంగతులు బాగ గుర్తు చేసేరు. సంతొషం.

    • చిలకడ దుంపే కాదండోయ్ పెద్ద వంకాయ కాల్చి వంకాయ పాల పచ్చడి చేసే వాళ్ళు, ఇక అందరి స్నానాలు అయ్యాకా ఆ నిప్పులు ఒక చట్రం మీద వేసి సాంబ్రానీ పొగ మీద తల ఆరబెట్టేకో మనేది అమ్మ. మనకేమో నిప్పంటే భయం అందుకే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా పారిపోయేవాడిని 🙂

    • @హేమ గారు,
      చిన్నతనం గుర్తొచ్చిందా! సంతసం. నీళ్ళ పొయ్యి దగ్గర ఇంకా చాలా పనులు చేసేవాళ్ళం, తిట్లూ తినేవాళ్ళం. 🙂
      ధన్యవాదాలు.

Leave a reply to ప్రశాంత్ రెడ్డి స్పందనను రద్దుచేయి