శర్మ కాలక్షేపంకబుర్లు-…….చింతాసక్తః

…….చింతాసక్తః

”వృద్ధస్తావత్ చింతాసక్తః” అన్నారు శంకరులు. వయసు మీదపడితే మిగిలేది చింతే, ఇదే శోకం. దీనినుంచి తప్పించుకోవాలంటే… వయసు అరవై పైబడుతోంటే….

ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా! ఇప్పటికి పిల్లలూ మనం చేసినపెళ్ళిళ్ళో, వాళ్ళు చేసుకున్నపెళ్ళిళ్ళతోనో జీవితం లో స్థిరపడుతూ ఉంటారు. సాధారణంగా నేటి రోజుల్లో పిల్లలు దగ్గరే ఉండటం లేదు, ఎక్కడుంటున్నారు?, దేశం లో కూడా కాదు సప్త సముద్రాలవతల ఉంటున్నారు, బహు అరుదుగా దేశంలో ఉంటున్నారు, అతి అరుదుగా తల్లితండ్రుల దగ్గరుంటున్నారు. .ఇది మనం కావాలనుకున్నదే. పిల్లలెక్కడున్నా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. నాకు తోచినవి చెబుతా. అరవైలొచ్చాయి, ఇక ఓపిక తగ్గుతోంది, బతికినంత కాలం ఇక బతకబోము, పిల్లలది వచ్చేకాలం, మనది పోయేకాలం. ఇది ముందు గుర్తించాలి. ఇప్పటికి జీవితం లో సంపాదించవలసినది, చేయవలసినది చేసి ఉంటాం, ఇక ముందు చేసేదీ లేదు, చేయగలదీ లేదు. ఇక ముందు కాలం ఆలోచించాలి, జీవితం సాఫీగా చింతలు లేకుండా గడవాలంటే…. సంపాదించిన స్థిరాస్థులను పిల్లలికిచ్చెయ్యండి, ఇది వీలునామా రాసో, మరోలాగానో, మీ వీలునుబట్టి పిల్లల అభిరుచిని బట్టీ, వారినే అనుభవించనివ్వండి. ఇప్పుడే ఆస్థులిస్తే చూడరేమో! చూడాలని ఉన్నవాళ్ళకి అస్థులిచ్చినా చూస్తారు లేకున్నా చూస్తారు. చూడాలని లేనివారికి అస్థులిచ్చినా చూడరు, లేకున్నా చూడరు. ఆస్థులకోసం చూస్తారనుకోడం భ్రమ. పిల్లలు చూడరేమో అని అస్థులు దగ్గరుంచుకున్నవారు, అందులోంచి చిల్లిగవ్వ కూడా దానం చేయరు, పిల్లలు చూడకపోయినా సరే…ఇంకా సంపాదించి దాచిపెడతారు. అంతెందుకు ఎండలో మనల్ని రిక్షాలో, చెమటలు కక్కుకుంటూ తీసుకొచ్చిన వాడికి మరొక రూపాయి ఇవ్వం. చిల్లర లేదంటే తెచ్చి ఆ రూపాయి తగ్గించుకునిగాని ఇవ్వం, ఇదెవరినో తప్పుబట్టడం కాదు. సాధారణంగా నాలాటివారి మనస్తత్వం ఇంతే…. ఓపిక తగ్గుతోంది కనక స్థిరాస్థులు చూసుకోలేం, దానం చెయ్యం, అనుభవించనూలేం, కూడబెట్టి కూడా పట్టుకునీపోలేం, పోయిన తరవాత ఆ పిల్లలే పంచుకుంటారు. ఈ మాత్రం దానికి మన దగ్గరెందుకు? అందుకే పిల్లలికి తెలిసేలా వీలునామా రాయండి, లేదా పంపకపు పారీకత్తులు రాయండి, స్థిరాస్థిని పిల్లలకిచ్చేయండి, వాటి వ్యవహారాలు వారినే చూచుకోమనండి. వారడిగితే అవసరమైతే సలహా ఇవ్వండి, తప్పు కాదు. ఇల్లు మాత్రం భార్యా/భర్తల తదనంతరమే ఎవరో ఒకరికే ఇవ్వండి. ఒక ఇల్లు ఇద్దరికిచ్చి, ఇద్దరికి తగువు మాత్రం పెట్టకండి. ఒక ఇల్లు ఇద్దరికి వాటాలుగా వేసి ఇచ్చినా తగువులు తప్పవు అని గ్రహించడం మంచిది…

చరాస్థులన్నీ ఆడవారి అధీనంలోవి, వీటిని వారేం చెయ్యాలి అన్నది వారేచెప్పాలి, అదీ తదనంతరమే. అసలు ఈ వెండి బంగారాలు కూడా కొంత మటుకు పిల్లలకి ఇచ్చి వాళ్ళని పెట్టుకోమనడం, అనుభవించమనడం లోనే మనకి ఆనందం ఉందంటుంది నా ఇల్లాలు. ఆమెతో నేను ఏకీభవిస్తాను కూడా.ఆమెంటారూ! బంగారం పెట్టుకుంటే ఎప్పుడు, ఎవడు పీకనొక్కుతాడో తెలియని రోజులు, మనకా ఓపిక తగ్గింది, బలమూ తగ్గింది, మెడలో ఉన్న వస్తువు తెంపుకుపోతుంటే, అరచే ఓపిక లేని వయసయింది, పిల్లలికిస్తే… వాళ్ళు వీలుంటే పెట్టుకుంటారు లేదా ‘మా అమ్మ ఇచ్చింది’, ‘మా అత్తగారిచ్చింది’ అని చెప్పుకుంటారు, సంతోషిస్తారు, దాచుకుంటారు. అన్నీ ఇచ్చెయ్యక్కరలేదు. కొంత ఉంచుకోవాలి. ఇక సొమ్ము రూపంలో ఉన్నది కూడా భార్య/భర్తలకి వారి అవసరాలకి తగినంత ఉంచుకుని మిగిలినది పిల్లలకి ఇచ్చెయ్యడమే మంచిది. కొంతమంది, కుటుంబంలోని వ్యక్తులకు కూడా, అసలు ఆర్ధిక విషయాలు చెప్పక దాచిపెట్టిన సంఘటనలూ ఎరుగుదును. అలా చేయడం వల్ల ఒక్కొకప్పుడు అనవసరపు ఇబ్బందులు తలెత్తే సావకాసం ఉంది కదా!…..పాతికేళ్ళకితం మాట, ఆరోజులలో ఒక మిత్రుడిని రిటయిర్ చేశాను. నాటి రోజులకి పెద్ద సొమ్మే వచ్చింది, ఏం చేస్తావన్నా…మాటాడలేదు. పిల్లలకి ఇచ్చెయ్యవయ్యా! కొంత ఉంచుకో అన్నా! సరేనన్నాడు. కొంత కాలం తరవాత కలిస్తే అడిగా, ఏం చేసేవని..దానికామిత్రుడు ‘శర్మగారూ! జీవితంలో ఎప్పుడూ ఇంత సొమ్ము చూడలేదు, కాగితం మీద కూడా, నాది అన్నది. చూస్తూ, చూస్తూ ఇవ్వలేకపోయా’నన్నాడు. ఇలాగే ఉంటుంది మనసు సంగతి… ఉన్నవారి సంగతి చెప్పేరు, మరి లేనివారి సంగతో అంటే, లేనివారిది ఒకటే తగువు, లేదన్నదే! సాధారణంగా వీరి పిల్లలు బుద్ధిమంతులై ఉంటారు…లేక ఇటువంటి తల్లి తండ్రులు స్వతంత్రంగా ఉండటమో లేదా కొడుకులు కోడళ్ళ దగ్గర వారు చెప్పినట్టు వింటూ ఉండటమో చేయక తప్పదు.  Every rule has got an exception

ఇప్పటిదాకా ఆర్ధికం అయ్యింది, ఇక అసలుది హార్ధికం. మనం చూసి తెచ్చి కట్టబెట్టినమ్మాయి కాని అబ్బాయే చూసుకుని చేసుకున్న అమ్మాయిగాని, ఇప్పుడు మన కుటుంబంలో మనిషి అయింది కదా! ఇష్టం ఉన్నా లేకున్నా తప్పదు. అటువంటప్పుడు అయిష్టం ఎందుకు? కొడుకు సుఖంగా జీవితం గడపాలనేదే కదా మన కోరిక కూడా. కోడలుగా వచ్చినమ్మాయిని కుటుంబంలో చేర్చండి. ‘నూరు శిఖలయినా ఇముడుతాయికాని, మూడు కొప్పులు ఇమడవని’ ఒక నానుడి. ఇలా కొత్తగా వచ్చిన కోడలు ఇంటిలో మనిషిగా కావాలంటే, ముందు చొరవ చూపవలసినవారు ఆ ఇంటి సీనియర్ కోడలు, అదే ఇప్పటి అత్తగారనమాట. ఆవిడా ఒకప్పుడు ఆ ఇంటికి కోడలుగా వచ్చినదేగా! ’మా అబ్బాయి బాగానే ఉంటాడు, కోడలు కొరివే…’ అనే అత్తగారు తన కూతురు మాటకు మాత్రం అల్లుడు ఎదురు చెప్పనందుకు మెచ్చుకుంటుంది. అలా కాకుండా కోడలిని కూతురు కంటే బాగా చూసుకుంటే, కోడలు అత్తగారిని తల్లి కంటే ఎక్కువాగానే చూస్తుంది. అప్పుడు ఆ ఇల్లు స్వర్గమే లేకపోతే నరకమే, రోజూ ఏదో ఒక తగువే! అందరు అత్తగార్లూ, కోడళ్ళూ అలా ఉండరు, నిజానికి అత్తా కోడళ్ళు సఖ్యంగా ఉన్న ఇళ్ళు చాలానే ఉంటాయి. ఇలా ఉంటే పిల్లలు చూడటం లేదనే సమస్య ఎలా ఉత్పన్నమవుతుంది? అలా ఉండటం లేదంటే, మనలోనే ముందు మార్పు రావాలి, అందునా స్త్రీలలోనే సుమా. Every rule has got an exception. Let us try to be in the rule, but not in exception…

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-…….చింతాసక్తః

  1. ఆస్తులు ఇవ్వడం అటుంచండి ,వున్నవి ఏమిటో చెప్పక చేసుకున్న
    స్వయం క్రుతాపరాధం ఇది . మీ విలువైన సమయం కేటాయించినందుకు
    కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను , వందనాలు ..

    • అంజలితనూజ గారు,
      ఇందిరా వికాస పత్రాలు గుర్తున్నాయా! ఆ రోజులలో ఒకాయన ఈ ఇందిరా వికాస పత్రాలు అదే పనిగా కొన్నాడు. ఉన్నకాలంలో వాటిని సమయం అవగానే మార్చుకుని మళ్ళీ కొనేవాడు. ఇది ఆయనకి ఒక వ్యసనం లా అయిపోయింది. ఈ పత్రాల పై పేరుండేది కాదు, ఎవరి దగ్గరుంటే వారిదే, ఆరేళ్ళకి రెట్టింపు ఇచ్చేవారు, పోస్టాఫీసులొ దొరికేవి.
      ఇలా కొన్నవాడు వాటిని తను చదువుకునే రామాయణ, భారత,భాగవతాల్లో పేజీకి ఒక పత్రం చొప్పున దాచాడు. తన గదిలో ఎక్కడపడితే అక్కడ దాచాడు, ఆఖరి మాట తలులుపుల సందుల్లో జాగ్రత్ చేశాడు. పెళ్ళాని కూడా చెప్పలేదు, ఇలా కొంటున్నాడని మాత్రం గమనించారు. మడి పేరుతో ఆయన గదిలోకి భార్య కూడా పోయేది కాదు. ఏమో ఎన్ని కొన్నడో!
      చివరికి ఒక రోజు కాలం చేశాడు, ఎఅవరికి ఏమీ చెప్పలేదు. శవాన్ని తీసుకెళ్ళకుండానే కొడుకులు, కోడళ్ళు, చివరికి భార్య ఆయనగదిలో ఒకరికి తెలియకుండా మరొకరు వెతుక్కుని ఎవరికి దొరికినవి వారు స్వంతం చేసుకున్నారు. చిత్రమనిపించింది.కూడా ఏం పట్టుకుపోయాడు?రామాయణాది గ్రంధాలు చదివాడు కాని వానిలో సారం గుర్తించలేకపోయాడు.
      ధన్యవాదాలు.

  2. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

    చక్కటి మాటలు చెప్పారు. నేనూ అదే పనిలో వున్నాను. వున్నది కొంచెమైనా, పంచివ్వటంలో ఆనందం వుంటుంది.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    • మిత్రులు మాధవరావు గారు,
      మనకున్నదే, ఎంతుంటే అంతే! ఇచ్చుటలో ఉన్న హాయి మరి ఎచ్చటనూ లేదని… కదా కవి మాట. మాట నచ్చినందుకు
      ధన్యవాదాలు.

  3. ఎంతబాగా సెలవిచ్చారో.ఇలా చేయకుండా చనిపోయెదాకా తాత్సారం చేసి ఎవరికీ రాయకుండానో,లేక ఓ నోటి మాటో చెప్పో కొందరు పెద్దలు మిగిలిఉన్న కుటుంబాలమద్య తెలియకుండానో,తెలిసో చిచ్చు పెడుతున్నారు.అది దావానలంలా పాకి బంధాలనుకూడా కాల్చేస్తుంది.అసలే విలువలు లేని కాలం.రక్తసంబంధాలకు కూడా విలువలేకుండా చేస్తున్నాయ్ ఈ ఆస్తులు.మీరన్నట్లు లేనివాడిది ఒకటే బాద లేదు అనేది.చాలా బాగుంది శర్మగారు.ధన్యవాదాలు.

    • స్వరాజ్య లక్ష్మి గారు,
      పిల్లలని అలా తయారు చేసుకున్నవాళ్ళమూ అమనమే, అలా తయారయ్యారనుకుంటున్నవాళ్ళమూ మనమే! చిత్రం కదా!
      ఎవరికి చెప్పక దాచుకోవడం పిచ్చి తనం, తెలిసి తగువులు పెట్టడమే! ముందు కామెంట్లో ఒక అనుభవం చెబుతా!
      ధన్యవాదాలు.

    • సుధాకర్ జీ,
      స్వానుభవాన్ని మించిన పాఠం, గురువు లేరు కదా! స్వానుభవమున చాటు నా సందేశమిదే…..
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి