శర్మ కాలక్షేపంకబుర్లు-కంచి గరుడ సేవ

కంచి గరుడ సేవ

”ఇంతకీ కంచి గరుడసేవని ఎందుకంటారూ? చెప్పండి” అని ప్రశ్నించారు, అనామకంగారు,

కంచి గొప్ప పుణ్యక్షేత్రం, ఇది రెండుగా ఉంటుందిట. నేనెప్పుడూ కంచికి పోలేదు, ”కంచికిపోయావా కృష్ణమ్మా! ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా!! అందుచేత అన్నీ ట,ట లే సుమా!” కంచి అనగానే ముందు గుర్తొచ్చేది అమ్మవారు,కామాక్షీ దేవి  మాత్రమే, ఒక చిన్న సంభాషణా జరుగుతూ ఉంటుంది, పెళ్ళి సందర్భంగా, పెళ్ళిళ్ళ పేరయ్యతో. ”బాబూ శాస్త్రిగారూ! సంబంధం బాగానే ఉంది కాని, ఇంతకీ వియ్యాలవారిల్లు ”కంచా, చిదంబరమా?” అని అడుగుతూ ఉండటం అలవాటే. బహుశః ఈ కాలంలో అడగడం లేదేమో కూడా! అదేంటో మీ ప్రశ్నే అర్ధం కాలేదంటారా? చిత్తగించండి. కంచిలో అమ్మవారిదే వెలుగు,ప్రభ. మరి చిదంబరంలో అయ్యవారిదే వెలుగు,ప్రభానూ.

అమ్మయ్య! ప్రశ్న అర్ధమయిందా? అయ్యో! వివరిస్తానండీ! కంచి అంటే ఇంట్లో పెత్తనమంతా అమ్మవారిదేననీ, ఆడపెత్తనమనీ,ఇంటాయన నోరెత్తడనీ, చిదంబరమంటే, అయ్యవారి పెత్తనం తప్పించి అమ్మవారి మాట చెల్లదనీ, మగపెత్తనమనీ అర్ధం! చెప్పేశానండీబాబూ! ”అసలు విషయం వదిలేశారు, నసపెడుతున్నారంటారా!”

శివకంచిలో అమ్మవారి ఊరేగింపులు ఆర్భాటంగా జరుగుతాయి, అలాగే విష్ణుకంచిలో శ్రీవారి ఊరేగింపులూ అలాగే జరుగుతాయి(ట). అన్న చెల్లిళ్ళకి సేవలు అద్భుతంగా జరుగుతాయి, ఈ సందర్భంగా స్వామివారికి గరుడసేవ కూడా జరుగుతుంది. స్వామివారు చాలా వాహనాలమీద ఊరేగుతారుగాని గరుడుని మీద, పక్కన అమ్మవారిని కూచోబెట్టుకుని, ఊరేగడం అంటే, అబ్బో! ఎంతిష్టమో!! మరింకేం అంటారా!!! అదేమరి. ఈ గరుడసేవకి ఒకచిక్కు. కంచిలో గరుడ వాహనం చాలా పెద్దది, ఊరేగింపుచేయాలంటే, వీధులలో తిరగాలంటే కొంచం ఇబ్బంది ఉంటుంది, కొన్ని వీధులలో తిరగదు కూడా. అలాగని అయ్యవారికి ఇష్టమైన సేవ చేయకా ఉండలేరు, అందుకేం చేస్తారంటే గరుడ వాహనాన్ని మాత్రం ఏ క్షణం లో నైనా ఊరేగింపుకు బయలుదేరేలా తయారు చేసి ఉంచుతారు, గరుడవాహనం పెద్దది కనక అలంకారానికీ సమయమే పడుతుంది. ఎప్పుడో తప్పించి, అనగా పండగలు పబ్బాలకి తప్పించి ఉపయోగించరు. కాని తయారుగా మాత్రం ఉంచుతారు. పాపం ఈ గరుడుడు స్వామివారిని ఎక్కించుకుని ఊరేగింపుకు తీసుకెళ్ళడం కోసం ఇలా వేచి ఉంటాడు, ఉపయోగించకపోయినా….వ్యర్ధంగా వేచి ఉండడాన్ని కంచి గరుడసేవని అంటారు.ఇదీ కంచి గరుడసేవంటే 🙂

జీవితం అనుభవాల పుట్ట. ఎన్ని సార్లు పడిపోయానో అన్ని సార్లూ లేచి పరుగుపెట్టాను. ఒక అనుభవం చెబితే ఈ కంచి గరుడ సేవ ఎలా ఉంటుందో తెలియడానికి సావకాశం ఉంది. 🙂

ఇది పాతిక సంవత్సరాల వయసులో మాట, అంటే దగ్గరగా ఏభై సంవత్సరాల మాట. ”అందరూ కావలసినవారే, ధర్మం నాలుగుపాదాలా నడుస్తోంది, సత్యానికి కాలము” ఇలా ఏదో ఏదో అనుకునే ఊహించుకునే కాలం. తప్పు కాలానిదికాదు, వయసుది. 🙂

జీవితం లో ఒక కష్టం వచ్చింది. దానికి నిష్కృతి లేదు కాని దాని నుంచి తప్పించుకోడానికి మానవ ప్రయత్నం చేయాలి, చేయచ్చు. దానికోసమని ఒక పెద్దవారిని ఆశ్రయించాను. ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. గుళ్ళో దేవుడు అందరికి తెలిసే ఉంటాడు, కాని దేవుడికి ఎంతమంది తెలుసు అన్నదే ముఖ్యం. ఇక్కడ ఆ పెద్దాయనకు కూడా నేను పరిచయమే, అంటే పేరుపెట్టి పిలిచేటంత.

ఇంతకీ కోరికేంటీ? ఒక ఊరినుంచి మరొక ఊరు ట్రాన్స్ఫర్, అప్పటికే ఎక్కువకాలం పని చేసి ఉన్న ఊరునుంచి, అదీ ప్రభుత్వానికి ఖర్చులేకుండా. కోరిక అధర్మంకాదు,అన్యాయమూ కాదు,లోక విరుద్ధమైనదీ కాదు. అందుకు పెద్దాయన దగ్గరకి పోయాను,కాగితం పెట్టుకున్నాను, కలిసి బాధ చెప్పుకుని పని చేయించుకోవాలని. ఐదు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి, ఉదయం తొమ్మిదికి ఆఫీస్ కి పోయాను, రాలేదు, చిత్ర గుప్తుడు, పి.ఎ మహానుభావుడు వచ్చాడు,నమస్కారం పెట్టి వివరాలన్నీ చెప్పుకున్నాను. యముడు తెలుసనీ చెప్పేను. ‘వస్తారు కూచోండి’ అన్నాడు. చేసేపని లేదు, కూచున్నా, కూచున్నా, దగ్గరగా పదకొండున్నరకి యమధర్మరాజు దిగేడు. బయట కాపు కాసి ఉన్నాను కదా! ఒక నమస్కారం పెట్టేను, చూశాడో చూడలేదో ఆఫీస్ లోకి వెళిపోయాడు. ‘చీటీ పట్టుకెళ్ళు నాయనాలోపలికి’ అని బతిమాలి చిత్రగుప్తుణ్ణి లోపలికి చీటితో పంపేను. చీటి లోపలికి పట్టుకెళ్ళిన చిత్రగుప్తుడు పావుగంట తరవాత బయటికొస్తే అడిగాను, ”చీటి చూశారు, పేపర్ వెయిట్ కింద పెట్టేరు” అన్నాడు. గంటయింది, ఒంటి గంటా అయింది, లోపలినుంచి పిలుపులేదు. చిత్రగుప్తుణ్ణి అడిగా ”బాబూ ఏంటీ పిలుపురాలేదని”, ”కంగారు పడితే ఎలా” అన్నట్టు చూశాడు. ”ఆయన చూశారుగా పిలుస్తారు కూచోండి” అన్నాడు. ”వారికి చాలా వ్యాపకాలుంటాయి, నన్ను గుర్తుపట్టేరో లేదో! బాబువు కదా ఒక సారి లోపలికెళ్ళి చూడు నాయనా” అని ప్రాధేయపడ్డాను. ”వారు సాధారణంగా లంచ్ టైమ్ లోనే మీలాటి వారిని పిలుస్తారూ” అని ఒక మాటన్నాడు. కడుపులో కాలుతోంది, ఉదయం ఎనిమిదికి తిన్న రెండు ఇడ్లీ. గుండెల్లోనూ మండుతోంది, ట్రాన్స్ఫర్ చేస్తే చేస్తానని చెప్పచ్చు, లేదా కుదరదనీ చెప్పచ్చు, అసలు దర్శనమే లేకపోతే అన్నదే గుండెల్లో మంట. ఏమో పిలుస్తాడేమో బయటికెళితే, కడుపు కాలుతున్నా అలాగే కూచున్నా. భయం, పిలిచినపుడు లేకపోతామేమోనని. పళ్ళ బిగువున ఉండిపోయాను. చిత్రగుప్తుడు తెచ్చుకున్నది మెక్కేడు. గడియారం ముళ్ళు తిరగటం లేదు. కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది. చచ్చి రెండయింది. ”చూడుబాబూ” అని మళ్ళీ ప్రాధేయ పడ్డాను. మొత్తానికి మూడు గంటల ప్రాంతంలో మళ్ళీ లోపలికెళ్ళేడు. తిరిగొచ్చేడో పావుగంటలో. ఆతృతగా ఎదురు చూస్తున్నా చిత్రగుప్తుడి నోటి మాట కోసం. ”చీటి మళ్ళీ చూశారు, పేపర్ వైట్ కింద పెట్టేరు” అన్నాడు. అప్పటికే నా బాధంతా ఆయన్కి చెప్పేసుకున్నట్టు, ఆయన నా వేదనంతా విని అభయమిచ్చేసినట్టూ ఆనంద పడిపోయాను. గంట గడిచింది,పిలుపులేదు. పిలిస్తే ఎంతమాట, మూడు నిమిషాల కాలం చాలు. పిలుపురాదే! కడుపు మండిపోతోంది, టీ చుక్కలు కూడా లేవు తాగుదామంటే. నాలుగుదాటింది, ఆరూదాటింది. నెమ్మదిగా సద్దుకుంటున్నాడు చిత్ర గుప్తుడు, ”ఏమయ్యా! నామాట, నక్షత్రకునిలా తగులుకున్నా”. ”అన్నట్టు చెప్పడం మరచాను. తరవాత కలవమని చెప్పి వెళ్ళిపోయారు, పావుగంట ముందే” అన్నాడు చల్లగా. ఇంకా ఆశ పీకుతో ఉంది లోపలున్నాడేమోనని. ”ఇలా వెళ్ళలేదు కదా” అన్నాను. ”మరో దారుంది బయటికి” అని చావు కబురు చల్లగా చెప్పేడు. ఆ క్షణంలో చిత్ర గుప్తుణ్ణి హత్య చెయ్యాలన్నంత కోపమొచ్చింది, తమాయించుకున్నా. ”ఐదు వందల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి వెళితే దర్శనమే ఇవ్వనివాడు, నీ పనేం చేస్తాడని వివేకం హెచ్చరించింది….” మరేం చేసేను? అది వేరు సంగతి….. ఆ వేళ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరుదాకా నిరాహారంగా, నేను చేసినదే కంచి గరుడ సేవ….. 😦

కంచి గరుడసేవ గురించి చెబుతానని వాగ్దానం చేశాను అందుకు నెరవేర్చాల్సివచ్చి బ్లాగులో కొచ్చాను.

_/\_

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కంచి గరుడ సేవ

  1. చిరంజీవులు ధాత్రి,స్వాతి,జ్యోతి.
    దీపావళి శుభకామనలు.
    ఈ బ్లాగు మూసెయ్యాలనుకున్నాను. అదే చేసేను సెప్టెంబర్ ఐదున. అప్పటికే అనారోగ్యం చేసింది, ఆ తరవాత కొనసాగింది. శరీరం మీద పొడిచినచోట పొడవకుండా ఇంజక్షన్ సూదులతో పొడుస్తూనే ఉన్నారు. నాలుగు రోజులకితం మానేశారు. కూచోడమూ కష్టమే అయిపోయింది. జబ్బలు చెప్పక్కరలేనంత సలుపు. అందుకు ఈ బ్లాగుకి ఉద్వాసన చెప్పేశాను.
    మరోబ్లాగులో చిత్రాలేవో పెడుతూ కాలం గడుపుతున్నాను .http://kasthephali.blogspot.in/
    మీరేమో ఒకరి తరవాత మరొకరు నా గురించి ఇబ్బంది పడిపోతుంటే,ఏం చెయ్యను? కొంచం బాగున్నా కదా నాలుగురోజులనుంచి రాదామనుకుంటే ……అలవాటు తప్పి బద్ధకంతో వాయిదాలేస్తూ వచ్చాను. ఇక ఇప్పుడు తప్పదు. తొందరలోనే ఈ బ్లాగులో కనపడతాను. అందరికి ఆశీస్సులు.
    ధాత్రి: ఆరోగ్యం జాగ్రత.నీ మాటే నెగ్గిందోయ్ 🙂

    ధన్యవాదాలు.

  2. సర్! నమస్కారం. విష్ణుకంచి విషయం తెలియక గరుత్మంతుడిని డెప్యుటేషన్ మీద కంచికి పంపితే నేను వైష్ణవుడనయ్యుండి ఈ శైవక్షేత్రంలో పని చెయ్యడమేమిటని ఆయన నసుగుతూ ఇష్టంలేకుండా పని చేస్తుంటే ఈ నానుడి వచ్చిందనుకున్నాను. ఇప్పుడసలు కదా అర్ధమైంది.

  3. శర్మ గారు, మీ బ్లాగును అను నిత్యం చదువుతా. బద్ధకంతోనో పని ఒత్తిడితోనో కామెంటలేదు ఇంతవరకు. కానీ ఈ రోజు కంచి గరుడ సేవ గురించి కామెంటాలనిపించింది.. నేను ఆ సామెత గురించి సహస్రావధాని గరికిపాటి వారు మరొలా చెప్పడం గుర్తు. వారి ప్రకారం .. గరుడ సేవ సంవత్సరంలో ఒక్కమారే వుంటుందట. అది పెద్ద ప్రమాణంలో వున్న ఇత్తడి విగ్రహం. ఆలయ అర్చకులు వుత్సవాల రెండ్నాళ్ళ ముందర నుంచే చింతపడుతో శుభ్రం చెయ్యడం మొడలెడతారట. అయితే గియ్తే వరమిచ్చే పెద్ద అయ్యవారి సేవ విడిచిపెట్టి ఈ గరుడ సేవ మనకెందిరా అనే ఆలోచన నుంది వచ్చింది ఈ సామెత అని వారు చెప్పగా విన్నాను. మీరు రాసింది కూడా చాలా దగ్గరగానే వుంది.

    namaskaram

    • nimmagadda chandra sekharగారు,

      గరికపాటివారు చెప్పినది మానవ నైజానికి దగ్గరగా ఉందనుకుంటాను, ఇది నాకు తెలియదు. కొత్త సంగతి తెలుసుకున్నా! మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి