శర్మ కాలక్షేపంకబుర్లు- అమీతుమీ

అమీతుమీ                                                                                   900 Post

మీతో ”అమీ తుమీ” తేల్చుకోడానికే వచ్చాను! అసలేంటీ మీ సంగతి… అంటూ వచ్చాడు మా సత్తిబాబు.
రావయ్యా! రా!!రా!!! అంటూ, ”అమ్మాయి! మీ బాబాయొచ్చాడు కాస్త కాఫీ….” అని కేకేశా.
”అదేంటీ! మా చెల్లెమ్మేదీ? ఎక్కడికెళ్ళిందేం?” అడిగాడు.
”మీ చెల్లెమ్మ ఇక్కడే ఉందిగాని, గత నెలరోజులుగా ”అమీ తుమీ” తేల్చేసుకుంటానంటో ఉంది సమవర్తితో! ప్రస్థుతానికి మంచం నేస్తోంది(మంచం నేయడమంటే, అనారోగ్యంతో పడుకుని ఉండడం)” అని చెప్పా.
”అదేం! ఏమయింది? అంత ఇబ్బంది కలిగినపుడు, ప్రమాదం ముంచుకొచ్చినపుడు, నాకు చెప్పద్దా! ఇదేమన్నమాటండీ,” అని ”చెల్లెమ్మా” అంటూ లోపలికెళ్ళి మంచానికి బల్లిలా అతుక్కుపోయిన చెల్లెమ్మని చూసి ”ఏమయిందేం? అంతలా నీరసపడిపోయింది చెల్లాయి” అన్నాడు బయటి కొచ్చాకా.
”ఏం చెప్పమంటావు, ఏమని చెప్పమంటావు? అలుక్కుపోయాం, ములుక్కుపోయామనుకో! విరేచనాలని మొదలయ్యాయి, మందులేశాం! తగ్గేయి, నాలుగు రోజుల్లో మళ్ళీ మొదలయ్యాయి, ఈ సారి డోకులు తోడయ్యాయి, హాస్పిటలు, ఇంజక్షన్లు,మందులు, సెలైన్లు ఒకటే హడావిడి. డోకులు విరేచనాలు తగ్గేకా ఇంటికొచ్చాం హాస్పిటల్ నుంచి, మరి రెండు రోజుల్లో మళ్ళీ నీరసం జ్వరం హాస్పిటల్ కి పరుగెడితే చేర్చమన్నారు, మలేరియా, వారం పాటు సెలైన్లు, మందులు అబ్బబ్బా! ఏo చెప్పమన్నావు. తగ్గి ఇంటికొచ్చిన తరవాత నీరసం రాజ్యం చేస్తోంది, నీరసం మీద మరొక బాధ, అది తగ్గి లేచి నిలబడే సమయం కోసం చూస్తున్నాం. మనసు అసలు కుదురులేదనుకో! ఇదిగో నిన్నటి నుంచి కొద్దిగా మనుషుల్లో ఉంది” అన్నా.
”బలేవారే! ఇటువంటప్పుడు, ఆపద వచ్చినపుడు, చెప్పద్దుటండీ, ఏ సమయానికి ఏం అవసరమవుతుందో ఎవరికి తెలుసు, అదీగాక ఇటువంటపుడు ధైర్యం చెప్పేవాళ్ళే ఎక్కువ అవసమండి బాబూ!” అంటూ కోడలు తెచ్చిన కాఫీ తాగుతూ కూచున్నాడు.
”ఆ సమయం లో బుర్ర పనిచెయ్యలేదనుకో! అది సరేగాని సత్తిబాబూ! అసలీ ”అమీతుమీ” అంటే ఏంటయ్యా” అనడిగా.

ప్రతి భాషలోనూ కొన్ని పరదేశీ పదాలుంటాయి, తప్పవు. భాష పారుతున్న నీటిలాటిది, పరభాషా పదాలు ఎక్కువగా చేర్చుకున్న భాష అస్థిత్వాన్ని కోల్పోతుంది. కొన్ని పరభాషా పదాలు మన భాషలోనూ చేరాయి, అవి మన తెనుగు పదాలే అనిపించేలా మనకి కనపడతాయి, కొన్ని పదాలు తెనుగులో చేరి రూపాంతరం చెంది తెనుగువాటిలా కనపడతాయి, అదీ విశేషం. తెనుగులో నువ్వా? నేనా తేల్చుకుందాం అనడం అలవాటే. ఏదో ఒకటి తేల్చి చెప్పు అనడాన్నీ అమీ తుమీ తేలచవయ్యా అనడమూ అలవాటే. అలాగే హిందీలో హమే, తుమ్హే  (हमॆ, तुम्हॆ )అనేమాటలున్నాయి. అంటే ”నేనా! నువ్వా” అని అర్ధం. హమ్ తుమ్ ఏక్ కమరేమె బంద్ హో ఔర్ చాబీ ఖో జాయ్, గుర్తొచ్చిందా?” అని ఆగాడు.
”అంటే మనమే మేలంటావా? నువ్వా? నేనా అనడం లో ఎదుటివారికే సావకాశం ముందు ఇస్తామనమాట” అన్నా! నవ్వుతూ.
”అదేం కాదండి నువ్వా అన్నదానిలో ఆకారాంతం ఆ తరవాత నేనా అన్నదానిలో ఏ కారం వస్తాయి, అలాగే హిందీ వారిలో హ లో అ కారంతో మొదట్ మాట తూ లో ఉ కారం తో మరో పదం మొదలు తప్పించి మనగొప్ప వారి తక్కువ ఏం లేదండి, అందరూ ఆ బళ్ళో చదువుకున్నవారే.

ఇహ! హమే తుమ్హే  हमॆ, तुम्हॆ అనే రెండు హిందీ పదాలు తెనుగులో ఒక మాటగా అమీ తుమీగా మారిపోయాయి,

ఇటువంటిదే మరో ప్రయోగం ”చావో! రేవో!!” అంటే చావడమో, బతకడమో అని అర్ధం. ఇక్కడ రేవో అని ఎందుకంటున్నారు? చావో! బతుకో అనచ్చుగా.

నీళ్ళలో పడినవాడికి ఈత రాకపోతే చావెలాగూ తప్పదు, ఎవరూ రక్షించకపోతే. ఇలా రక్షింపబడితే నీళ్ళలో పడినవారి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి రేవులో పడేస్తారు. అందుకే రేవో అన్నారు, అంటే అదే బతుకని అర్ధం, ఇదో శబ్దాలంకార ప్రయోగం.

ఇదండి అమీతుమీ కత, ఇంతే సంగతులు, చిత్తగించవలెను అంటూ లేచి వెళిపోయాడు మరో మాటకి సావకాశం ఇవ్వకుండా.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- అమీతుమీ

    • చిరంజీవి స్వాతి,
      ఇప్పుడు బాగుందమ్మా! చెయ్యి పట్టుకు నడిపిస్తోంటే అడుగులేస్తోంది! నెమ్మదిగా నడవండి అని సాధిస్తోంది 🙂 అదో ముచ్చటా! Art of living 🙂
      ధన్యవాదాలు.

    • జాంగిరి గారు,
      వయసైపోయిన తరవాత మరేం ముచ్చట్లుంటాయండి, ఇవ్వి తప్పించి 🙂 చచ్చి బతికితే బతికున్నామోయ్ అని చెప్పుకోడం తప్పించి
      ధన్యవాదాలు.

  1. తాతగారూ,

    నేను అర్థం చేసుకున్నది చెపుతాను.

    తెలుగు: నేను – నువ్వు
    సంస్కృతం: అహం – త్వం
    హిందీ: హం – తుం
    బెంగాలీ – అమీ – తుమీ

    నేను అమీ-తుమీ తెలుగులోకి బెంగాలీ నుండి వచ్చాయనుకుంటున్నానండి.

    -సత్తిబాబు.

    • చిరంజీవి సత్తిబాబు ఆకెళ్ళ,
      అబ్బాయ్! నువ్వు చెప్పినదే నిజమయ్యా! ఇది బెంగాలీ నుంచి దిగుమతి ఐనదే, సరి చేసినందుకు, ధన్యవాదాలు.బాలాదపి సుభాషితం.
      అన్ని భాషలకు తల్లి సంస్కృతమేగనక…….
      అమీ,తుమీ పక్కా బంగళీ మాటలు, ఒక తెనుగు మాటగా ఉన్నాయి, అదే అర్ధంతో మన తెనుగులో
      ధన్యవాదాలు.

  2. కష్టే ఫలే శర్మ వారు,
    శ్రీమతి శర్మ గారి ఆరోగ్యం కుదుట పడాలని ఆ పరంధాముని కోరుకుంటూ

    అమీ తుమీ యన నేమియోర?
    కమామీషుగ సత్తి జెప్పెర !
    హమే తుమ్హే గదర హమీ తుమీగ అమీ తుమీ !
    కమాలు గదర కథలు వీరివి
    రుమాలు వోలె చుట్టె మాచన
    సుమారు యెన్ని లోక సూక్తులు తెలుసునో మరి గద !

    జిలేబి

    • జిలేబిగారు,
      ఈ సారికి నక్కనోట్లో బెడ్డకొట్టినట్టే,బతికి బయటపడ్డట్టే, బతికి బట్ట కట్టినట్టే, గండం గడిచినట్టే అనేవి ప్రమాదం తప్పిందనడానికి సమానార్ధకాలు.
      చిరంజీవి సత్తిబాబు ఇది బెంగాలీ భాషనుంచి దొల్లుకొచ్చిన బాపతన్నారు, అదే నిజంలాగానూ ఉంది 🙂
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి