శర్మ కాలక్షేపంకబుర్లు- బుర్ర రామకీర్తన పాడిస్తా!

బుర్ర రామకీర్తన పాడిస్తా!

”బుర్ర రామకీర్తన పాడిస్తా! ఏంటనుకుంటున్నావో!!” అనడం మన తెనుగునాట బాగా అలవాటు. బుర్ర రామకీర్తన పాడించడమేంటో …….

కంచర్ల గోపన్నగారు భద్రాచలం తాసిల్దారుగానూ, రామదాసుగానూ ప్రసిద్ధి. ఈయన ప్రజలనుంచి వసూలు చేసిన సొమ్ముతో రామాలయం కట్టించేరు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ముతో గుడి కట్టిస్తావా? సొమ్ము దుర్వినియోగం చేశావనే ఆరోపణతో తానీషా గోపన్నగారిని గోలుకొండ కోటలో కైదు చేశాడు. నాటిరోజుల్లో కైదు చేయడమంటే లోపల పారేసి ఊరుకోడం కాదు, నేటి రోజుల్లో లాగా కావలసినవన్నీ సమకూర్చడమూ కాదు,కాళ్ళకి సంకెళ్ళు వేశారు, రోజూ విడతల వారీగా కొట్టేవారు. ఇలా కొడుతోంటో బాధలు చాలా కాలం భరించాడు, ఇక భరించలేక ఒకసారి ఇలా రాముణ్ణి పట్టుకు తిట్టేడు. ఏమయ్యా రామా! ఈ సొమ్మంతా నీకోసం కదయ్యా ఖర్చుపెట్టేను, అది కూడా వివరం చెబుతానని,

కాంభోజి – ఆది (- త్రిపుట)

పల్లవి:

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ..

చరణము(లు):

చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా …..II.ఇక్ష్వాకు కులతిలక.II
గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను
క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా..II.ఇక్ష్వాకు కులతిలక.II
భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా
ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా….II.ఇక్ష్వాకు కులతిలక.II
శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా …..II.ఇక్ష్వాకు కులతిలక.II
లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా …II.ఇక్ష్వాకు కులతిలక.II
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా…II.ఇక్ష్వాకు కులతిలక.II
వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా….II.ఇక్ష్వాకు కులతిలక.II
కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా….II.ఇక్ష్వాకు కులతిలక.II
మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా…II.ఇక్ష్వాకు కులతిలక.II
అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా…II.ఇక్ష్వాకు కులతిలక.II
దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా….II.ఇక్ష్వాకు కులతిలక.II
ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా
నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా….II.ఇక్ష్వాకు కులతిలక.II
కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా…II.ఇక్ష్వాకు కులతిలక.II
భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా…II.ఇక్ష్వాకు కులతిలక.II

Courtesy: http://www.andhrabharati.com

గుడి ఎలాకట్టించాడో, ఎవరెవరికి ఏమేం వస్తువులు చేయించాడో, రాముడికే ఏం చేయించాడో, వాటి విలువలెంతో వైనవైనాలుగా చెప్పి ”నీకేమో కలికి తురాయి చేయించాను,మీ ఆవిడకి చింతాకు పతకం చేయించాను, పోనీ అవేనా చిన్నవీ చితకవీనా? పదివేల వరహాలొకొకదానికి అయిందన్నాడు”. వరహా అంటే నాలుగురూపాయలు. అంటే నలభై వేల రూపాయలు…నాటి రోజుల్లోనే. ( ఈ నగలన్నీ అద్దాల బీరువాల్లో ప్రదర్శనకి పెట్టేరు, ఏభయేళ్ళ కితం చూశా, మరిప్పుడేం జరుతోందో తెలీదు, అసలున్నాయో లేదో కూడా తెలీదు. )”ఇవన్నీ పుచ్చుకున్నావు, మాటాడవు, వీళ్ళు నన్ను కొడుతున్నారయ్యా! నీ బాబిచ్చాడా? మీ మావగారిచ్చాడా? కోటలాటి గుడి కట్టించుకున్నవు, వస్తువులు పెట్టుకుని వాహనాల మీద ఊరేగుతున్నావు, ఇది బాగుందా?” అని తిట్టేడు. వెంఠనే తెలివి తెచ్చుకుని వీళ్ళు కొడుతున్నారయ్యా! అందుకు తిట్టేనయ్యా! భరించలేకపోయానయ్యా బాధలు, కావవయ్యా అని వేడు కున్నాడు.

దెబ్బలు కొడితే రామదాసు రామకీర్తన పాడేడు అందుకు ఆనాటినుంచి కొడతానని చెప్పడానికి బుర్రరామకీర్తన పాడిస్తాననడం అలవాటయింది.

 

 

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- బుర్ర రామకీర్తన పాడిస్తా!

  1. రామదాసు పాడె రాగము కాంభోజి
    రామ రామ యనుచు రవళి గూడ
    కోప ముగనె దాసు కొంతయు, బుర్రన
    రామ కీర్త నవినె రానిట గురు

    • జిలేబిగారు,

      మీరు మామూలుగా వచనంలో తెనుగులో మాటాడితేనే అర్ధం చేసుకోలేము… అసలే పందుం తడిస్తే ముప్పందుం అని పద్యం లో చెబితే ఇంతే సంగతులు 🙂
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి