శర్మ కాలక్షేపంకబుర్లు-పిండి వడియాలు.

పిండి వడియాలు.

Photo0001

తిండిగలిగితె కండగలదోయ్
కండగలవాడె మనిషోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్!
అన్నారట పెద్దలు. గాడిద గంపెడు ఊకబొక్కినట్టు ఏదో ఒకటి తినేస్తే సరిపోతుందా? ఆ తినేది చూడ్డానికిబాగోవాలి, నోట్లో వేసుకుంటే రుచిగా ఉండాలి.. ఆ అతరవాత కదా కండ సంగతి.. ఊరికే కండలు పెంచి ఉపయోగం లేదు, దానితో పాటు బుద్ధి బలమూ పెంచుకోవాలి… దానికేంగాని ఈ వేళ పిండి వడియాలెలా పెట్టుకోవాలో చూదాం. మొన్న ఒక రోజు ఉదయమే ఎండనబడి ఇద్దరం డాబా మీద పెట్టేం కదూ!….

ఒక గ్లాసుడు కొట్టు పిండి తీసుకోండి. కొట్టు పిండంటే నానబోసిన బియ్యాన్ని మిక్సీ పట్టిన పిండి. విసురు పిండి అంటే పచ్చి బియ్యం మిక్సీ పట్టిన పిండి. ఒక గ్లాసు పిండి తీసుకోండి. తగిన కారం కోసం పచ్చి మిరపపళ్ళు ముద్దచేసుకుని ఉంచుకుని, దానిలో చిటికెడు పసుపేసి, కావలసిన ఉప్పు, కొద్దిగా జీలకర్ర చేర్చండి. ఐదు గ్లాసుల నీళ్ళు ఎసరు పెట్టండి, మరుగుతుండగా మరోగ్లాసుడు నీళ్ళలో ఈ గ్లాసుడు పిండినీ పూర్తిగా ఉండలు లేకుండా కలపండి. ఇలా కలిపిన పిండి నీళ్ళని మరుగుతున్న నీళ్ళలో పొయ్యండి. కారం,ఉప్పు వగైరా కలిపిన ముద్దని ఇందులో వేసెయ్యండి. దగ్గరే ఉండి, ఉండకట్టకుండా కలపండి. కలపడం మరిచిపోతే ఉండకట్టేస్తుంది. కొంచం గరిట జారుగా ఉండగా ముద్దవుతోందన్నపుడు దింపెయ్యండి.

ఇప్పుడు ఈ పిండిని వడియాలు పెట్టెయ్యండి. వడియాలు పెట్టుకోవడమూ ఒక కళే, అదే సాఫ్ట్ స్కిల్ ట. సన్ననిబట్టని తడపండి, నీళ్ళు ఓడకుండా ఉండేలా పిండండి, అంటే పూర్తి నీరు లేకుండా కాదు. ఎండ ఉన్న చోట ఒక సెల్లోఫోన్ పేపర్ పరచండి, నేలమీద, దానిమీద ఈ తడిపిన బట్ట వేయండి, నాలుగు పక్కలా రాళ్ళు ఎత్తు పెట్టండి, బట్ట ఎగిరిపోకుండా. దీనిపైన ఈ ఉడికిన పిండిని వరుసలలో కొద్దికొద్దిగా పెట్టుకుంటూ వెళ్ళండి. ఎండలు మండిపోతున్నాయి కదూ, సాయంత్రానికి చూస్తే వడియం మధ్యలో కొద్దిగా పచ్చి తప్పించి అంతా ఎండిపోతుంది. దానినా రాత్రికి అలాగే ఉంచి మరునాడు కూడా ఎండలో పెట్టండి. సాయంత్రానికి పూర్తిగా ఎండిపోతాయి. వీటిని తియ్యడమెలా? బట్టని వడియాలు లోపకుండేలా మడతేయండి. పైన నీళ్ళు జల్లండి. ఫర్వాలేదు, బట్ట తడిసేలా జల్లండి. ఆ తరవాత బట్టనున్న వడియాన్ని మీటండి, ఒక్కొకటే చేతిలోకొస్తుంది. ఒక పళ్ళెములో ఉంచుకోండి. మర్నాడు ఎండలో పెట్టండి. చక్కగా ఆరిపోతాయి. వీటిని డబ్బాలో జాగ్రత్త చేయండి.

ఒక్కసారే పెట్టేసుకుందామని ఎక్కువ పిండి ఉడికించేసుకోకండి, ఇబ్బంది పడిపోతారు. సగ్గు బియ్యం వడియాలూ ఇలాగే పెట్టుకోడం, కాని ఐదుగ్లాసులకి బదులు ఆరుగ్లాసులనీళ్ళూ, ఒకగ్లాసు నీటిలో సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. పిండి సరిగా ఉడకకపోతే వడియం విరిగిపోతుంది, కంగారు పడిపోకండి, వాటినీ ఇలాగే పొదుపు చేయండి, అవీ బాగానే ఉంటాయి.

వరిపిండి ఒక గ్లాసుడు, సగ్గుబియ్యం ఒక అరగ్లాసుడు తీసుకుని వీటిని రెంటినీ కలిపి కూడా వడియాలు పెట్టుకోవచ్చు. మీకీ పాటికి కొలతలు తెలిసిపోయాయి కదా!

అన్నం మిగిలిపోయిందా? తినేవాళ్ళు లేరు, ఎవరికి పెడదామన్నా పుచ్చుకునేవాళ్ళూ లేరు, పారెయ్యడానికి బాధగానూ ఉంది, ఏం చెయ్యాలి? ఇలా చేసి చూడండి.

అన్నాన్ని మిక్సీ లో వేసి మెత్తగా ముద్ద చేయండి. అబ్బే అంటు అంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపానికి అంటు ఏంటీ? పిచ్చి కాకపోతే! ఐతే శుభ్రం అవసరం సుమా! అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారని దాని పక్కమీద, మంచం మీద పెట్టుకు తినడం బాగుంటుందా?

అన్నాన్ని మిక్సీ లో వేసి ముద్దచేయండి, అందులో చిటికెడు పసుపు, తగిన ఉప్పు, కారం చేర్చండి. కొద్దిగా నీరు వేడి చెయ్యండి, ఈ ముద్దని ఆ వేడి నీటిలో కలిపి కొద్దిజారుగా చేసుకుని వడియాల్లా పెట్టేయండి. ఇక ఆ తరవాత మామూలే. రుచిగా ఉంటాయి.

చినుకులు పడుతుంటే వాటిని చూస్తూ వేయించుకున్న పిండి వడియాలు తింటూ కబుర్లాడుకుంటుంటే బలే కమ్మహా ఉంటుంది కదూ! ఇంత చాకిరీ ఎవరు చేస్తారు బాబూ! అనుకుంటే మీ ఇష్టం.

Photo0002

 

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పిండి వడియాలు.

  1. దారిన జిలేబి పడెనట!
    మారెను తీరుగ పదముల మాధురి గూడన్
    చేరెను సారము పద్దెము
    పారెను జలజల నదివలె పారుడు జెప్పెన్ !

  2. గురువు గారూ, వడియాలు మీరు పెట్టారా? అమ్మ గారితో పెట్టించారా?
    ఏమీ లేదు. అక్కడ అన్నీ గాజుల చేతులే కనపడుతుంటేను…

    • బోనగిరి గారు,

      పిండి వడియాలు పెట్టొస్తాం డాబా మీద, ఇంట్లో ఎవరూ లేరు, కంయూటర్ లో ములిగిపోయి ఇల్లు తువ్వల్ని మేపెయ్యకండి అన్నారు, ఇల్లాలు.
      డాబా మీదకి నేనూ వస్తానూ అన్నా.
      మీరెందుకూ పావుగంటలో వచ్చేస్తాం, కింద ఉండండి బాబూ! ఈ ఎండలో ఎందుకుటా అని సద్దుబాటు చేయబోయారు.
      ఫోటో లు తీసుకోవాలిగా అని మారాం చేశాను.
      నడవండని తలుపులేసుకుని గొడుగుచ్చుకుని డాబా మీదకెళ్ళి, ఇల్లాలు వడియాలు పెడుతోంటే నీడకి గొడుగేశానండి, అంతకు మించి మరేం చేయ్యలేదండీ 🙂
      ధన్యవాదాలు.

      • నడ వండని తలుపులు వే
        సి డాబుసరిగను జిలేబి చేరి పడుదలన్
        వడియాలు బెట్టె! మాచన
        సడి జేయక చిత్రములను చట్టని పట్టెన్ !

  3. ఇనప వడియాలు పాయస
    మును గుగ్గిళ్లన జిలేబి ముద్దుగ గూర్చెన్
    అనుదినపు తద్దినము చది
    విన దినములు దుర్దినములు వినరా నరుడా !

  4. జిలేబి పద్యాలు- ఇనప వడియాలు.
    జిలేబి పద్యాలు- జిల్లేడు పాల పాయసాలు.
    జిలేబి పద్యాలు- ఇనప గుగ్గిళ్ళు.

    జిలేబి పద్యాలు- బతికున్నవాళ్ళకు పెట్టే తద్దినాలు.
    జిలేబి పద్యాలు- చదివినవి దుర్దినాలు.

    • ఇనప వడియాలు పాయస
      మును గుగ్గిళ్లన జిలేబి ముద్దుగ గూర్చెన్
      అనుదినపు తద్దినము చది
      విన దినములు దుర్దినములు వినరా నరుడా !

    • అనామకం ,ANON గార్లు,
      గజ కఛ్ఛపాలలా ఈ పోట్లాటెందుకో అర్ధం కాదు.
      మీ వ్యాఖ్యకు
      ధన్యవాదాలు.

  5. ముందర జిలేబీ గారి పద్యం వచ్చేస్తే తర్వాత నా వ్యాఖ్య వ్రాద్దామని ఆగాను, వచ్చేసింది. 🙂

    తుపాను పడగ క్రింద ఉండి కూడా వీరోచితంగా పోస్ట్ వ్రాసారు మీరు. బాగుంది.
    మీరు వివరంగానే వ్రాసారు గానీ డాబాఇళ్ళల్లో నివసించే అదృష్టవంతులు ఎంతమంది శర్మ గారూ? కాలం మారిపోయి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ పెచ్చుమీరిపోయిన అపార్ట్‌మెంట్ సంస్కృతి వల్ల (ఊళ్ళని నాశనం చేస్తున్న సంస్కృతి) వడియాలారబెట్టుకోవడానికి చోటెక్కడ సారూ? అందువల్ల స్వగృహ జిందాబాద్ అని బండి లాగిస్తున్నట్లున్నారు ఎక్కువమంది.

    అన్నట్లు జిలేబీ గారు అడిగిన క్షేమేంద్రుల వారి గురించిన పోస్ట్ వస్తుందని ఎదురు చూస్తుంటే వడియాల టపా వచ్చిందే! (పురాతనకాలంలో క్షేమేంద్ర అని ఓ కాశ్మీర కవి ఉండేవాడట. మీరన్నది వారి గురించేనా?)

    • విన్నకోట నరసింహారావు గారు,
      తుఫానులో చిక్కుకున్నాం అందుకు ఆలస్యం
      ఏండకి కరంట్ ఉండదు,వానొస్తే కరంట్ ఉండదు, ఇక తుఫానొస్తే! అసలె పందుం తడిస్తే ముప్పందుం అని నానుడి. ఒక రోజంతా కరంట్ లేదు, ఆ పై మాకు బోనస్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, చావువార్త చల్లగా చెప్పి ఆ పైన మరో పన్నెండు గంటలకి కరంటిచ్చారు, గోల చెయ్యగా! సరే మా వాళ్ళూ తక్కువ తినలేదు.ఈ వ్యాఖ్య ప్రచురించే లోపు రెండు సార్లు నెట్ పోయివచ్చింది.
      తుఫాన్ పడగ నీడలో టపా అనికదా! సాధారణంగా ఒక వారానికిగాని,రెండు వారాలకి గాని టపాలు ప్రోగ్రాం చేస్తాను, అలా చేయడం మూలంగా నెట్ లోకి రాకపోయినా టపా వచ్చేస్తుంది, ఇదీ రహస్యం 🙂
      గడ్డి మేటిలో సూది వదకినట్టు జిలేబిగారి కోసం సగం రాసిన టపా వెతికి పట్టుకోడానికే సమయం పట్టింది. ఆ పైన తుఫాను. ఆ టపా చూస్తే వేయ బుద్ధికాలేదు, కొంత తీసేసి కొంతరాసి, రేపు సోమవారానికి టపా వస్తుంది.

      అపార్ట్మెంట్ సంస్కృతిలో చాలా చీడలు బయలుదేరేయి, అందులో ఇదొకటి, వీలున్నవారు పెట్టుకుంటారనీ, అసలు టపా తేలిగా తేలిపోతుందన్నదే దురాలోచన 🙂
      మీ వ్యాఖ్యకు
      ధన్యవాదాలు.

  6. పిండి వడియాలు జేతము
    రండిటు మాచన టపాన రామకముగనన్ !
    వండిరి మేలగు పిండిని
    దండిగ నెండన జిలేబి దట్టించిరి బో !

    జిలేబి

    • జిలేబిగారు గారు,
      తుఫానులో చిక్కుకున్నాం అందుకు ఆలస్యం
      మీ వ్యాఖ్యకు
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి