శర్మ కాలక్షేపం కబుర్లు-నీళ్ళావకాయ


నీళ్ళావకాయ

ఎండలు పెరిగాయి. అప్పుడే 40/24 వేడి ఉంటోంది వారం నుంచి. ఓ పక్క కరోనా భయం మరో పక్క ఎండభయం, కదిలేందుకులేదు,మెదిలేందుకులేదు. ఇలాటి సందర్భంలో ఫ్రిజ్ లో ఉన్న కూరలన్నీ నిండుకున్నాయి. ఏంచేయాలనేలోగా ఒక రోజు దూరం పాటిస్తూ కూరలు అమ్మకానికి పెట్టేరంటే అబ్బాయి వెళ్ళి కూరలు తెచ్చాడు. అందులో మూడు మామిడి కాయలున్నాయి. ఈ సంవత్సరం చెట్టున ఆకులేగాని పిందెలేదు, అదేమోగాని పక్కదొడ్డిలో ఉన్న మూడు వేపచెట్లూ పూయలేదు, అలా జరిగింది కొత్త సంవత్సరం. ఈ మూడుమామిడి కాయల్నీ నీళ్ళ ఆవకాయ వెయ్యమన్నా కోడలమ్మాయిని.  వింతగా చూసింది. ఇలా పెడతారని చెప్పి పెట్టించా, అవధరించండి

.ఈ ఆవకాయ మూడు లేదా నాలుగు రోజులకంటే నిలవ ఉండదు, అదీ దీని ప్రత్యేకత.పుల్లగా ఉన్న మామిడి కాయల్ని ముక్కలుగా తరగండి. ఇవి రాలిన కాయలైనా బాధ లేదు గాని ఉడుకు కాయలు మాత్రం కాకూడదు. తరిగిన ముక్కలకి సరిపడా ఉప్పు కారం,ఆవ పోసి కలపండి. నీళ్ళు కళపెళా కాచండి. కాగిన నీరు వేడిగ ఉండగానే ముక్కలతో గుచ్చెత్తిన దానిలో పోయండి, మూత పెట్టి ఉంచేయండి, నాలుగు గంటలు. ఇప్పుడు వాడండి బలే ఉంటుంది, ఆవకాయలానే

శుభమస్తు

15 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-నీళ్ళావకాయ

  1. శర్మ గారు,
    ఒక పగోజీ వ్యక్తి “పులిహోర ఆవకాయ” అనగా నా చెవిన బడింది. అది ఏమిటి, ఎలా పెడతారు వివరిస్తారా ప్లీజ్? థాంక్స్.

  2. ఏమిటో! ఉప్పెక్కువైతే కొందరికి సహించదు. కారం వేస్తే “వెటకారమా” అన్నట్లు ఒకరి చూపు. నూనెవేస్తే జారుకునేవారొకరు! ఇలా అయితే ఆవకాయ పెట్టేదెలా. పెట్టి ఉపయోగం ఏమిటంట! అందుకే మామిడి కాయని ముక్కలు తరిగి మజ్జిగన్నంతో ఇచ్చి “ఇక అఘోరించండి” అనడం తప్ప ఇంకో దారి లేదేమో.

    • // “నూనె వేస్తే జారుకునేవారొకరు!” //
      హ్హ హ్హ హ్హ, సూర్య చెప్పినది ఈనాటి జీవనసత్యం. నూనె లక్షణాన్ని నిజం చేస్తూ భలే “జారుకుంటారు” కొందరు 😁😁.
      భయం, భయం, ఆహారం దగ్గర దేన్ని చూసినా భయమే ఈ తరం వారికి. నూనె భయం, నెయ్యి భయం, నువ్వులు తెల్లవి అయినా కూడా భయం, పాల ఉత్పత్తులు భయం. దేన్నీ ఆస్వాదించలేరు. ఆహారం కాకపోయినా మరొకటంటే భయం …. అదే నలుపు రంగు. ఆన్-లైన్ కపిత్వం కొంత, సొంత పైత్యం కొంత 😁😁.

      • సూర్యగారు,విన్నకోట వారు.
        గుంటూరు మిరపకాయ కారంతో,మాడుగుల సన్నావాల పిండితో, కళ్ళ ఉప్పుతో,కొత్తపల్లి కొబ్బరి కాయతో, చేలో పండిన నల్ల నువ్వుల నూనెతో పెట్టిన ఆవకాయ ఆపుడే తీసిన తరవాణీ అన్నం లో చారెడు వాము, సరిపడిన ఉప్పు కలిపి చారెడు నూనెతో కలిపి, పుల్ల పుల్లగా కారం కారంగా ఉన్న చద్దెన్నం తినగలిగి,హరించుకోగలవారిప్పుడున్నారా అని కొచ్చను 🙂

        కొంతమందికి ఆవ పడదు,కొంతమందికి నూనెపడదు, మరికొంతమందికి కారం పదదు, అందుకే ఇటువంటి ఊరగాయలు కూడా పెట్టేవారనుకుంటా. మరి కొన్ని ఉన్నాయి, మరో సారి చెబుతా.

  3. బాగుంది. అయితే అటువంటి ఆవకాయను అన్నంలో కలుపుకుంటే అన్నమంతా నీటితడి పట్టెయ్యదా?

    “ఉడుకు కాయ” అనగా నేమి?

    • నీళ్ళు పోయడం అంటే ఎక్కువ పోసెయ్యం కదండీ! నూనె ఎంత వేస్తామో అంతే నీళ్ళు పోస్తామండి. వేడి నీళ్ళెందుకంటే ఉప్పు తక్కువ పట్టేందుకూ, ముక్కనున్న పులుపు ఊట విడిచేందుకూ

      ఉడుకు కాయ అంటే, కాయ పచ్చిగా ఉన్నా ఉడుకు, వేడి దెబ్బకు తట్టుకోలేక రాలుతుంది. ఈ కాయ చూడ్డానికి మామూలుగా ఉన్నా, అదో రకం వాసనేస్తుంది. ఆ వాసన ఆవకాయను పాడుచేస్తుందండి. అందుకు అది వద్దంటాం కదండీ.

  4. ఇదేదో నాకూ నచ్చింది శర్మ గారు, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఊరగాయ నాకు నచ్చదు. వారం తర్వాత తినను పైగా ఉప్పు కూడా ఎక్కువ వేస్తారు నిల్వ ఊరగాయలో శ్యామల రావు గారన్నట్లు.

    • ఎప్పుడూ పుల్లటి మామిడి కాయలు దొరకవు కదండీ. అసలే మీకు చలికాలం, మాకు ఎండ దంచేస్తోంది. ఇలా ఆవకాయ బాగుంటుంది కదండీ.

వ్యాఖ్యానించండి