శర్మ కాలక్షేపం కబుర్లు-ఇంటి గుట్టు లంక చేటని

ఇంటి గుట్టు లంక చేటని

శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః.

గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును,
మానమును సంగమంబవమానము మరి
దానమును, మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.

భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము , అవమానము – ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను

Coutesy:-Sri.Chinta Ramakrishna Rao gaaru. andhraamrutam blogspot.com


ఇంటి గుట్టు లంకచేటు అనేది సామెత. ఏది ఇంటి గుట్టు? ఇది రామాయణానికి సంబంధించిన సామెత.ఏంటో చూదాం.

రాముడు కపిసేనతో సముద్రపు ఒడ్డున విడిచి ఉన్నకాలం. సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నకాలం. శరణు! శరణు!! అంటూ పరివారంతో ఆకాశంలో కనపడ్డాడో రాక్షసుడు. తన ప్రవరా చెప్పుకున్నాడు,దాచుకోకుండా, తాను విభీషణుడిననీ,రావణుని తమ్ముడిననీ.. చాలా తర్జనభర్జన తరవాత రాముడు చివరిగా రావణుని కైనా అభయమిస్తాను,శరణు వేడితే అనడంతో విభీషణుడు నేలకి దిగుతాడు. అప్పుడు జరిగిన సమావేశంలో లంక గుట్టు గురించి అడుగుతారు. విభీషణుడు చెబుతాడు, ఇంతలో ఒకరు ఇవన్నీ హనుమ చెప్పినవే,తెలిసినవీ, ఇవి కాక మరేమైనా చెప్పమంటారు. విభీషణుడు మౌనం వహిస్తాడు. ఇది చూసిన రాముడు, లక్ష్మణా మన మిత్రుని లంకాధిపతిగా చూడాలని ఉంది సముద్రజలాలు తెప్పించి అభిషేకించమంటాడు. ( అంత తొందరగా లంకాధిపతిగా విభీషణుని పట్టాభిషేకం ఎందుకు జరిపించాడు రాముడు, మరో టపాలో ) లక్ష్మణుడు విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషేకం చేస్తాడు. ఇప్పుడు కూడా విభీషణుడేం చెప్పడు. అందరూ ఆ విషయం వదిలేస్తారు, రాముడు తరచి అడగకపోవడంతో.

యుద్ధం జరుగుతూ ఉంటుంది. విభీషణుడు ఎవరితోనూ యుద్ధం చెయ్యలేదు. రావణుని పరివారం అంతా మడసింది, మిగిలినవాడు మేఘనాథుడు ఒక్కడే, అతని మీదనే రావణుని ఆశమిగిలింది.ఇటువంటి సమయంలో మేఘనాథుడు నికుంభిలాదేవిని అర్చించడానికి బయలుదేరతాడు. ఈ వార్త తెలిసిన విభీషణుడు కంగారు పడతాడు, రాముని దగ్గరకు చేరి, ”రామా! మేఘనాథుడు నికుంభిలా దేవిని ప్రసన్నం చేసుకోడానికి వెళుతున్నాడు. ఆమెను అర్చించి నల్ల మేకపోతును బలి ఇచ్చి ఆ పని పూర్తి చేస్తే ఆమె కరుణిస్తుంది. ఇక ఆ పైన అతనిని జయించగలవాడు ఉండడు. అందుచేత లక్ష్మణుని పంపి  అతనిని మట్టుపెట్టాలని చెబుతాడు” ఇదీ అసలు రహస్యం. ఇదే ఇంటిగుట్టు, అవసరం వచ్చినప్పుడు చెప్పి రాముని జయానికి దోవచేసినవాడు విభీషణుడు. అందుకే ”ఇంటి గుట్టు లంక చేటని” సామెత.



4 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-ఇంటి గుట్టు లంక చేటని

  1. ప్రశస్తమైన సామెత గురించి చెప్పారు.
    అయితే, ఇంద్రజిత్తు తలపెట్టిన అర్చన గురించి కాదు గానీ …. రావణుడిని సంహరించే కిటుకు విభీషణుడు రాముడికి చెప్పడం అన్నది ఈ సామెత వెనకనున్న కథ …. అని నేను విన్నది.

    రావణుడి తలలు ఎన్నిసార్లు పడగొట్టినా ప్రయోజనం లేదని, రావణుడి కడుపులో అమృతభాండం ఉందనీ, దాన్ని పగలగొడితే గానీ రావణుడు మరణించడనీ రాముడికి విభీషణుడు చెప్పడం వలన రాముడు అలాగే చేసి రావణుడిని సంహరించాడు కదా? కరక్టే కదా?

    • విన్నకోటవారు,
      మీరు చెప్పిన కథనం జన సామాన్యం లో ఉన్నది కాని వాల్మీకి రామాయణం లో లేదండి. ఈ మేఘనాథుని నికుంభిలా సంఘటనలో సంభాషణలో ”ఇంత నీచానికి దిగాజారిపోయావా” అనిఅడుగుతాడు మేఘనాథుడు విభీషణుని. దానికి విభీషణుడు ”నీ తండ్రితో ధర్మం గురించి ఏకీభావం నాకు ఎప్పుడూ” లేదంటాడు.

      • “శరములెన్ని వేసిననూ శిరములుద్భవింపక మానవు” అన్న డైలాగ్ వాల్మీకి రాయలేదంటారు. సరే.
        అయినా నల్ల మేకపోతునో కడక్ నాథ్ కోడినో బలి ఇచ్చి బలపడినవాడిని ఓడించలేమని విభీషణుడు అనుకోవచ్చుగాక, కానీ సర్వ శక్తిమంతుడైన జగదభిరాముడు ఈ నమ్మకాలని పట్టించుకుంటాడంటారా?!

      • సూర్యగారు,
        ఆయ్! అవునండి అది వాల్మీకి రాసిన డయలాగ్ కాదటండి. 🙂
        రాముడు నేను సామాన్యమానవుడిని మొర్రో అని చెప్పేడని వాల్మీకి గారి మాటండి. ఆ సామాన్యమానవుడు విభీషణుడు చెప్పిన మాట నమ్మేసి హనుమని కూడా ఇచ్చి మేఘనాధుని పైకి యుద్ధానికి పంపేడటండి. ఆ యుద్ధంలో హనుమ భుజం మీదెక్కి లక్ష్మణుడు ఐంద్రాస్త్రం తో మేఘనాధుడిని కూల్చాడటండి. ఇది వాల్మీకి మాటేనండి.
        ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి