శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.-1

కురుకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనలో భీమ,దుర్యోధనులు గదాయుద్ధంలో తలపడ్డారు. ప్రదర్శన శ్రుతి మించుతోంటే, ద్రోణుడు కృపుని పంపి ఆపుచేయించారు. దుర్యోధనుడు ఉడికిపోయాడు, తనది పైచేయి కాలేదని. ఈ లోగా అర్జునుని అస్త్ర ప్రదర్శన, ప్రజల చప్పట్లు దుర్యోధనునికి పుండు మీద కారం చల్లినట్లనిపించింది. ఈ లోగా కర్ణుని రాక, అర్జుని ఎదిరించడం ఎడారిలో మలయమారుతమే అయింది, దుర్యోధనునికి. అర్జునిని ధిక్కరించిన అస్త్ర ప్రదర్శన ఆనందమే అయింది, కాని కర్ణుడు, అర్జునినితో తలపడ్డాన్ని కృపుడు ఆపుచేయడంతో దుర్యోధనుని మనసు మళ్ళీ కలకబారింది. కర్ణుడు రాజయితే, అర్జునిని ఎదిరించవచ్చనే ఆలోచన అప్పటికప్పుడు దుర్యోధనుని మదిలో పుట్టి పెరిగింది. కర్ణుని అంగరాజుగా చేయాలనే తలంపు బలంగా కలిగింది, సాధించుకోడానికి తండ్రి దగ్గరకుపోలేదు, తిన్నగా భీష్ముని దగ్గరకే చేరాడు, ఎందుకంటే అప్పటికి ధృతరాష్ట్రుడు భీష్మ,విదురుల మంత్రాంగంలో రాజ్యం నడుపుతున్నాడు. కర్ణుని అంగరాజుగా చేయాలనుకుంటున్నా అన్నదానికి భీష్ముడు తలవూపారు. భీష్ముడు కర్ణుని అంగరాజుగా నియమించడాన్ని ఎందుకు ఒప్పుకున్నట్టు? భీష్మునికి కురురాజ్య క్షేమం,కురు వంశాభివృద్ది ముఖ్యం. కురు రాజ్యంలో నాటి కాలాని రాబోయే తరంలో అర్జునుడు సాటి, మేటి విలుకాడు, మరొకడు లేదు. మరొకడు కూడా అంతటివాడు రాజ్యంలో ఉండడం మంచిదే! అటువంటివాడిని వదలుకోవడం రాజ్యానికి మంచిది కాదనే ఆలోచనతో ఒప్పుకున్నాడు. విషయం ద్రోణునికి చేరింది. ఆయన ఆలోచనేమి? కర్ణుడు కూడా తన శిష్యుడే, అర్జునుడంతవాడో కాకపొయినా , తన శిష్యునికే రాజ్య పదవి కట్టబెడుతోంటే ఆనందంతో తలూపాడు. ఇక విదురుడు,ఈయనకు దుర్యోధనుని దురాలోచన తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. తను అడ్డగించినా కార్యం ఆగదనే విషయం గుర్తించి,బయట పడకపోవడమే మేలని మిన్నకున్నాడు. అప్పటికి దుర్యోధనుడు పాండవులపట్ల చేసిన దురాగతాలు తెలిసినవాడు కనక. అవి భీమునికి విషాన్నం పెట్టడం,గంగలో తోయించడం. వీటిని పెద్దల దాకా చేరకుండా అడ్డుకున్నది కుంతి.

ఇప్పుడు భీష్మ,ద్రోణ,విదురుల ఆలోచనతో తండ్రి దగ్గరకుపోయి కర్ణుని అంగరాజుగా నియమించమని కోరాడు, జరిగిన విషయం తెలుసుకున్న ధృతరాష్రుడు నియామకం చేసాడు.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.-1

  1. ఒకసారి రాజ్యం మీద తన హక్కును వదులుకున్నాక ఇక భీష్ముడు కేవలం సలహాలు ఇచ్చే ప్రభుత్వాధికారి మాత్రమే అవుతాడు.యౌవరాజ్య పట్టాభిషేకం అనేది తండ్రి బతికి ఉన్నాడు గనక రాజు కాదు గానీ రాజ్యపాలనకు కావలసిన అన్ని హక్కులూ దుర్యోధనుడికి ఉంటాయి,ఉన్నాయి.

    సర్వాధికారి అయిన రాజు ఒక నిర్ణయం తీసుకున్నాక సలహాదారులు ప్రత్యక్ష సాక్ష్యం లేని అభ్యంతరాలను వ్యక్తం చెయ్యటం మర్యాద కాదు.కాబట్టి భీష్ముడు కర్ణుడి రాజరికానికి ఒప్పుకోవటంలో రహస్యమైన కారణాలను వూహించడం అనవసరం,పైన సమంజసం కూడా కాదు.ఇలాంటి వూహల వల్లనే కర్ణుడు పుట్టుకను బట్టి అవమానాలకు గురయ్యాడనే వాదనలకి బలం చేకూరుతుంది.

    ప్రతి సన్నివేశంలోనూ ప్రతి పాత్రా కులదృష్టితోనూ జన్మకారణకౌతుకంతోనూ ప్రచర్తించిందనే సూత్రీకరణ నుంచి హిందువులు కూడా బయటపదలేకపోతున్నారా?పెద్దలు మీరే ఇంత సంకుచితంగా ఆలోచిస్తే ఎట్లా,చెప్పండి!

    • భీష్ముని హక్కు ప్రస్తావన ఈ టపాలో లేదు. దుర్యోధనుడు ఎప్పుడూ యువరాజు కాదు. ఆ తరవాత కాలంలో యువరాజుగా ఉన్నవాడు ధర్మరాజు.

      మీరన్నట్టు దుర్యోధనుడే సర్వాధికారి ఐ నిర్ణయం తీసుకుని ఉంటే భీష్ముని అనుమతి కోసం ఎందుకు అడిగాడు? ఆ తరవాత ధృతరాష్ట్రుని అనుమతి కోసం ఎందుకు వెళ్ళేడు?

      నాటి రాజ్య పాలన కట్టుబాట్లను నేటి కాలపువానితో పోల్చడం తగదనుకుంటాను. నా టపాలో కర్ణుని కుల ప్రసక్తి గాని అతనిని చిన్నబుచ్చినదిగాని తమకు ఎక్కడ కనపడిందో? లోకో భిన్నరుచిః

      భీష్ముడు మొదలైనవారంతా కర్ణునికి కులం ఆధారంగా అంగరాజుగా వ్యతిరేకిస్తే మీరన్న కుల ప్రసక్తి తప్పక వచ్చేది, కాని కులం అధారంగా నియామకం కాలేదే! వీరత్వమే కారణంగా నియామకం జరిగింది.

  2. కర్ణుడి జన్మరహస్యం భీష్ముడికి ఎప్పుడు తెలిసిందీ మనకు సమాచారం లేదు. కాబట్టి ఒకవేళ కుమారాస్త్రప్రదర్శనం నాటికి భీష్ముడికి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. కుంతి గుర్తుపట్టింది బాధపడింది. కాని ఇన్నాళ్ళుగా కురుకుమారులతో పాటుగా ద్రోణుడి శిష్యరికం చేస్తున్నా కర్ణుడి ఉదంతం ఆవిడకు తెలియదని అర్ధం అవుతూనే ఉన్నది.కర్ణుడికి తన జన్మరహస్యం చాలా మంది అనుకుటూ ఉన్నట్లుగా భారతయుధ్ధకాలంలో కాకుండా చాలా ముందుగానే (కుమారాస్త్రప్రదర్శనం తరువాత కాలంలో) తెలిసింది. ఐనా అతడు బయటపడలేదు. కుంతి కూడా యుధ్ధనివారణకు తనవంతు ప్రయత్నంగా అన్నట్లు కర్ణుడికి జన్మరహస్యం చెప్పిందే‌ కాని ఆ కర్ణుడి వలన పాండవులకు అపయం అన్న భయంతో‌కానే‌కాదు – అది నాటకాలవాళ్ళు ప్రచారం చేసినందువల్ల జనంలో వచ్చిన అపోహ మాత్రమే

    • భీష్మునికి కర్ణుని జన్మ రహస్యం ఎప్పుడు తెలుసు అన్న్దానికి మనదగ్గర ఆధారం లేదు. కాని భీష్ముని విషయం తెలిసి ఉండడంలో విశేషం లేదని నా ఊహ.

      మరోమాట.నీవు నాకుమారుడవు అని కుంతి చెప్పి వరమడిగిందని చెబుతారు. అది నిజం కాదు. నువ్వటురా రాజ్యపాలన చేయమనే అడుగుతుంది. దానికి కర్ణుడు వ్యతిరేకిస్తూ నేనిప్పుడటువస్తే పాండవులకు భయపడి వచ్చేడని లోకమనుకుంటుంది. అదీగాక దుర్యోధనుడు నన్ను నమ్ముకున్నాడు, అందుకు అటురాను అని ఖచ్చితంగానే చెప్పేడు. ఆ తరవాత అర్జునుడు తప్పించి మిగిలినవారు దొరికినా హాని చేయనని తనకు తానే చెప్పేడు. అర్జునుడు దొరికితే వదలను, వాడంటే నాకు కోపం ఉందని చెబుతాడు. ఎటైనా నీకు ఐదుగురు కొడుకులే అనీ చెబుతాడు. కాలంలో పుక్కిటి పురాణంలో చాలా మార్పులే నేడు కనపడుతున్నాయి కదండీ!

  3. కురురాజ్య సంక్షేమం ప్రధాన ఉద్దేశం కరక్టే, అయితే భీష్ముడికి కర్ణుడి జన్మరహస్యం తెలుసు కాబట్టి పట్టాభిషేకానికి ఆయన అభ్యంతర పెట్టకపోవడానికి అది కూడా ఒక ముఖ్యకారణం అయ్యుండవచ్చని నా అభిప్రాయం. దుర్యోధనుడు కాక మొత్తం వ్యవహారంలో అధికంగా సంతోషించినది కర్ణుడు, అతని తల్లిదండ్రులు, కుంతీ దేవి అయ్యుండాలి.

    • విన్నకోటవారు,

      భీష్ముడు ఆ సంగతి కూడా పరిగణలోకి తీసుకుని ఉంటారు.నేను విస్మరించాను.

      కర్ణుని అంగరాజుగా నియామకానికి సంతసించినవారిలో మొట్టమొదటివాడు దుర్యోధనుడే 🙂 …. కారణం, పాండవులపట్ల తను చేసిన ఏ ప్రయత్నమూ ఫలితాన్ని తను ఆసించనట్టు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రమే తన ఆలోచన ఫలించి, తన అహం చల్లారింది.ఆ తరవాత సంతసించినవాడే కర్ణుడు. ఆ తరవాత కర్ణుని పెంపుడు తల్లి, తండ్రి, ఆ పై భీష్ముడు,ద్రోణుడు.

      దుర్యోధనుని కుట్ర తెలుసుకున్నా ఏమీ చేయలేక మిన్నకున్నవాడు, విదురుడు.

      బాధపడినది కుంతి. దుర్యోధనునికి పాండవులపట్ల ఉన్న ద్వేషం తెలిసినది. కర్ణుని చూడగానే మాతృప్రేమ పొంగి స్త్రీ సహజమైన శరీర మార్పు కూడా కలిగిందంటారు, కవిత్రయంలో. తన కొడుకుల మధ్య దుర్యోధనుడు పగ రాజేస్తున్నాడే అని బాధపడినది కుంతి. అర్జున, కర్ణుల ప్రదర్శన సమయం లో, ఒక సమయంలో మూర్ఛపోతే విదురుడు సపర్యలు చేయించాడు. ఆ సమయంలో మిక్కుటంగా బాధపడినది కుంతి మాత్రమే. ఇది నా ఆలోచనా సరళి.

వ్యాఖ్యానించండి