శర్మ కాలక్షేపంకబుర్లు-అతి…

అతి…

గత నాలుగు నెలలుగా ఎండలు పేల్చేస్తున్నాయి. మొన్న జూన్ 21 ఉదయం వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం రోజు కురుస్తూనే ఉంది, పదిహేను రోజులుగా. నాలుగు రోజుల కితం ఉదయం కాలేజి వాకింగ్ ట్రేక్ మీద నడుస్తుంటే వర్షం పట్టుకుంది, ఒక్క సారిగా అందరం పక్క స్కూల్ గదిలోకి చేరేం. కొద్ది సేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది.

ఒక పెద్దాయన వాతావరణం ఒక్క సారి మారిపోయిందీ అన్నారు, జానాంతికంగా.

ఒక యువకుడు వర్షకాలం కదా!మార్పు సహజం అన్నాడు.

మార్పు నెమ్మదిగా వచ్చేది అదేంటో ఈ సంవత్సరం మార్పు ఒక్క సారి వచ్చిందే అన్నది, కొద్దిగా చలి కూడా ఉంది, మరో మధ్య వయస్కుని మాట.

ఆరోగ్యాలు జాగ్రత్త హెచ్చరించారొక పెద్దాయన.

ఈ మధ్య వాకింగ్ లో అందరూ తడుస్తున్నారు, రైన్ కోట్లు వేసుకురండని చెప్పినా వినరు, విసుక్కుందో వృద్ధ మహిళ.

గ్రహచారం ఎలా ఉందో అన్నది మరో పెద్దాయన మాట.

గ్రహాలన్నీ మాలికా యోగంలో ఉన్నాయన్నారు, మరొకరు.

అదేంటో అన్నది ఒక యువకుని ప్రశ్న.

ఇటువంటివి చెప్పి ప్రజల్ని భయపెట్టడం అన్నది మరో యువకుని మాట.

విషయం వినరాదా అన్నారు మరో విజ్ఞుడు

గ్రహాలన్ని వరసగా రాసుల్లో ఒక వైపు ఉండడాన్ని మాలికా యోగం అంటారన్నారు మరొకరు.

అలా గ్రహాలు వరసగా ఉండడం అన్నది కొత్త మాటేం కాదు, ఇటువవంటివి జరుగుతూనే ఉంటాయన్నది ఒక యువకుని మాట.

విషయమేంటో తెలుసుకోకుండా తీసిపారేస్తావేం అదిలించారు మరో పెద్దాయన.

మాలికా యోగాలు వస్తూనే ఉంటాయిగాని దీని ప్రత్యేకతేంటో చెబుదురూ అన్నాడు మరో యువకుడు.

ఇప్పుడున్న మాలికాయోగంలో గ్రహాలు వరుసగా తమ స్వస్థానాల్లో ఉండడమే ఆ ప్రత్యేక. ఎలాగంటే శనికి మకర,కుంభాలు స్వస్థానాలు. శని కుంభం లో ఉన్నారు. గురునికి ధనుర్మీనాలు స్వస్థానాలు, గురువు మీనంలో ఉన్నారు. ఆ తరవాత కుజుడు స్వస్థానాలు మేష,వృశ్చికాలు. కుజుడు మేషంలో ఉన్నాడు రాహువుతో కలిసి. శుక్రుని స్వస్థానం వృషభం, శుక్రుడు వృషభం లో ఉన్నాడు. మిథునం బుధుని స్వస్థానం, బుథుడు అక్కడే ఉన్నాడు, చంద్రుని స్వస్థానం కర్కాటకం, చంద్రుడు అక్కడే ఉన్నాడు. ఇలా గ్రహాలన్ని తమతమ స్వస్థానాల్లో వరసగా ఉండడమే ఇప్పటి మాలికా యోగం ప్రత్యేకత, అని విశదీకరించారు, మరొకరు.

దీని విశేషం ఏమో చెప్పండీ అన్నారంతా ఏక కంఠం తో…..

ప్రతీ విషయం అతి చెయ్యడమే ఈ గ్రహమాలికా ఫలితం అని తువ్వాలు దులుపుకుని పైనేసుకుని చకచకా వెళ్ళిపోయారా పెద్దాయన, కర్ర పట్టుకుని…..

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అతి…

    • గ్రహాలు అతిగా ప్రవర్తిస్తున్నట్టున్నాయి 🙂 అందుకే ప్రపంచ ప్రజల గతి తప్పినట్టుంది, మీరు చెప్పిన సామెతకి సరిపోయేలా 🙂

  1. ఏవిటి మీ ధైర్యం? అవతల ఆస్థాన జ్యోతిష్యుడు బ్లాగులో ఇటువంటివి రాయడానికి ఉండగా ఇటువంటివి రాయడానికి మీకు ఎంత ధైర్యం? ఆయన శపించాడంటే పుట్టగతులు ఉండవు. చూసుకోండి. లెంపలు వేసుకుని వెళ్ళి ఆయన కాళ్ళమీద పడండి. అప్పుడు మీరెలా పడ్డారో ఏమని అడిగారో అంతా మేము ఆయన రాసే బ్లాగు ద్వారా బొమ్మలతో సహా చూస్తాం. సర్వే జనా ఏదోఒక భవంతు. శుభం భూయాత్.

  2. గ్రహాలూ ఇంకొకరి ఇళ్ళ లోకి వెళ్ళి కెలక కుండా చక్కగా ఎవరిళ్ళల్లో వాళ్ళు విశ్రాన్తి తీసుకుంటున్నారు. అంటే మంచిదేగా!

    • ఆ పెద్దాయన చర్చలో పాల్గోలేదు. చూస్తూ కూచున్నారు. చివరగా వారు నోరుతెరిస్తే మేం నోళ్ళు మూసుకున్నాం, చెవులప్పగించి. ఆయన చాలా చెప్పేరు. వాటిలో ముఖ్యమైన వాటిని గుర్తుంచుకో లేక పోయిన పొరబాటు నాదే.మన్నించండి. సరి చేశాను చూడగలరు. కర్కాటకం చంద్రుని స్వస్థానం.

      • పొరబాటు చేసినపుడు చెబితే దిద్దుకుని మన్నింపు కోరడం మర్యాదలక్షణమని తమకు తెలియదా?

  3. అయితే ఇప్పటి టీవీ మీడియా వారికి శాశ్వత “మాలికా యోగం” పట్టిందన్నమాట ?
    😄😄

వ్యాఖ్యానించండి