శర్మ కాలక్షేపంకబుర్లు-భూమి గుండ్రముగానున్నది.

భూమి గుండరంగానే ఉందయ్యా! మాకు చాలా కాలం నుంచే తెలుసు.

బల్లపరుపుగా లేదంటారా? చిత్తం కాని నేటికీ బల్లపరుపుగా ఉందనే సంఘాలు పశ్చిమదేశాల్లో ఉన్నాయష.

దానికేంగాని, పూర్వం భారతదేశంలో వేశ్యలు ఉండేవారు.వారికి సమాజంలో గౌరవమూ ఉండేది,వారు సర్వతంత్ర స్వతంత్రులు కూడా. ఎవరితో లైంగిక సంబంధం ఉంచుకోవడం , తెంచుకోవడం వారిష్టం, బలవంతం లేదు. వారు కొన్ని చోట్ల ప్రభుత్వాలలో కూడా ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. వేశ్యా జీవితాన్ని ఒక వృత్తిగా నాటి సమాజం గుర్తించింది. ఒకే ఇంట్లో ఒకరు వేశ్యగా ఉంటే మరొకరు సంసారిగా ఉన్న సంఘటనలూ ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చిన తరవాత వేశ్యావృత్తి అనేది నీచం అని ఒక చట్టం చేసి నిషేధించారు. ఆ కాలానికి వేశ్యల ఇళ్ళు తెలిసి ఉండేవి, వీరిని భోగ స్త్రిలనీ పిలిచేవారు. . భోగం మేళాలనీ ఉండేవి. వీటినీ నిషేధించారు. బాగు! బాగు!! ఏంజరిగిందీ? ప్రభుత్వంలో ఉన్నవారి అంతేవాసులు వేశ్యలను పోగుచేసి, కొందరిని బలవంతంగా ఆ వృత్తిలోకి దింపి కంపెనీలు మొదలెట్టేరు. ఒక స్త్రీ పరపురుషునితో లైంగిక సంబంధం పెట్టుకుంటే పోలీసులు కేస్ రాసి కోర్టుకి తీసుకుపోయేవారు. అంతేవాసుల కంపెనీల మీద దాడి చేస్తే వూరుకుంటారా? పోలీసులకి ఆదాయ వనరు ఏర్పడింది.మామూళ్ళతో కాలం గడిచింది, ఒక్క పోలీస్ కేనా ఆదాయం, మరి ప్రభుత్వాలలో పెద్దలకీ చేరింది, సొమ్ము.

కాలం గడచింది, వేశ్యలకీ సహనం నశించింది, కోర్టు గడప తొక్కేరు. చివరికి కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ మధ్యనే ఒక తీర్పిస్తూ సుప్రీం కోర్ట్ ఇలా చెప్పింది.

మేజర్లయిన స్త్రీ పురుషులు ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకోవడంలో పోలీస్ జోక్యం అనవసరం. వేశ్యగా జీవించడం ఒక వృత్తి. ఐతే బలవంతంగా వేశ్యా వృత్తి చేయించడం నేరం. వేశ్యా గృహాలు నడపడం నేరం.

చక్రం తిరిగి కిందకొచ్చింది. భూమి గుండ్రముగా ఉన్నది.

చెప్పుకుంటే చాలా ఉన్నాయి మరో ముచ్చట మరో సారి.

వ్యాఖ్యానించండి